ఉత్తరకుమారుడి హయాంలో కాంగ్రెస్ హరీ!

428

వరస పరాజయ యాత్రలు
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

తెలంగాణ పీసీసీ చీఫ్ కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. కెప్టెన్ అంటే నడిపించే నాయకుడు. కానీ ఈ ఉత్తముడు కూడా కెప్టెనే. కానీ పార్టీని పరాజయాల బాటలో నడిపిస్తున్నారు. ఒకటి కాదు. రెండు కాదు. వరస వెంట వరస పరాజయాలు. ఆరేళ్లలో అన్ని రికార్డులు బద్దలుకొట్టేశారు మరి! ప్రస్తుతం ఆయన సృష్టించిన రికార్డులు, అందుకోవడం ఎవరి తరం కాదు. అయినా పార్టీకి ఆయన నాయకత్వమే దిక్కు. అంత సమర్ధులు మరెవరూ లేక, అఖిల భారత సోనియమ్మ ఆయననే కొనసాగిస్తున్నట్లున్నారు. ఇదీ తెలంగాణ కాంగ్రెస్ దుస్థితి.

కొద్దికాలం క్రితం తన సొంత నియోజకవర్గం, ఆ తర్వాత ఇప్పుడు దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలు. అంతకుముందు జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలు. ఇలా ఏ ఎన్నికయినా ఉత్తముడిది పరాజయ సారథ్యమే. సహజంగా తమ నాయకత్వాల్లో జరిగే ఎన్నికల పరాజయాలకు ఆయా పార్టీల అధ్యక్షులు నైతిక బాధ్యత వహిస్తూ, రాజీనామా చేస్తుంటారు. కానీ తెలంగాణ ఉత్తముడికి మాత్రం పిచ్చి సెంటిమెట్లు, భావావేశాలు ఉండవు. అందుకే నిర్భయంగా ఇంకా ఆ పదవిలో కొనసాగుతున్నారు.

ఇటీవలి దుబ్బాక ఉప ఎన్నికలో ఉత్తముడి ప్రకటనలు, గంభీర ప్రకటనలు చూస్తే.. ఉత్తరకుమారుడే గుర్తుకొచ్చారన్నది, ఆ పార్టీలో వినిపిస్తున్న టాక్. కాంగ్రెస్ విజయం-టీఆర్‌ఎస్ పతనం దుబ్బాక నుంచే ప్రారంభం కానుందని, ఆయన తన ప్రచారంలో ప్రకటించారు. ఉత్తముడు చెప్పింది నిజమే. కాకపోతే కొద్దిగా రివర్స్. దుబ్బాక నుంచి కూడా కొనసాగింది కాంగ్రెస్ పరాజయ యాత్రయితే, బీజేపీది మొదలయింది మాత్రం విజయయాత్ర! తెలంగాణ టీడీపీకి ఎల్.రమణ, కాంగ్రెస్‌కు ఉత్తమ్ తప్ప, మరో గతి లేని దుస్థితి ఏర్పడిందన్న వ్యంగ్యాస్ర్తాలు, ఆయా పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. ధ రావతు కూడా దక్కని దయనీయ పరిస్థితి నుంచి, కాంగ్రెస్‌ను రక్షించే కొత్త దేవుడి కోసం కార్యకర్తలు ఎదురుచూస్తున్నారట.

అయినా.. కాంగ్రెస్ కార్యకర్తల అమాయకత్వం కాకపోతే, అసలు ఏఐసిసి అధ్యక్షుడెవరిని నియమించాలన్న దానిపైనే, ఇంతవరకూ దిక్కూ మొక్కూ లేదు. ఇక ఆఫ్టరాల్ ఒక రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి గురించి ఆలోచించే.. తీరిక-ఓపిక సోనియామాతకు ఎక్కడుంటుంది? అప్పటికీ రాహులబ్బాయిని బ్రతిమిలాడి, వేడుకున్నా ఆ వీరుడు మాత్రం.. ‘నేను నాయకుడిని కాదు. నన్ను ఒగ్గేయండని’ తప్పించుకు తిరుగుతున్నారు. ఇహ ఎలాగూ ఎవరికి తప్పినా తప్పకపోయినా, సోనియమ్మను తప్పదు కదా? అదీ సంగతి!

ఇప్పటికిప్పుడు అధ్యక్షుడిని మార్చితే.. వాళ్లొచ్చి పార్టీని ఉద్ధరించేదేమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో, పార్టీ నిలువెత్తు గోతిలో ఉంది. దాన్ని పైకి లేపాలంటే చాలా కష్టం. రేవంత్‌రెడ్డి లాంటి ఫైర్‌బ్రాండ్లు ఒక మెట్టెక్కితే, పదిమంది ఆయన కాళ్లు గుంజేయడానికి ఎవ‘రెడీ’గా ఉంటారు. అదేమని ప్రశ్నిస్తే.. రేవంత్ సొంత ఇమేజ్ మాత్రమే చూసుకుంటారని వాదిస్తారు. మరి కాంగ్రెస్‌లో అంతా ముదురుసంఘాలే. ఎవరూ ఎవరి మాట వినరు.

పెద్దాయన జానారెడ్డి ఒక్కడే కాస్త అన్ని గ్రూపులతో సఖ్యతగా ఉంటారు. ఆయనొక్కరినే అన్ని గ్రూపులూ గౌరవిస్తాయి. చెప్పింది వినే ప్రయత్నం చేస్తాయి. ఎప్పుడో దక్కాల్సిన పీసీసీ చీఫ్ పదవిని..పార్టీ నాయకత్వం ఉత్తమ్ వంటి సమర్ధులకు ఇచ్చింది. బహుశా ఆయన సామర్థ్యం-ప్రతిభకు అడ్డురావడం ఎందుకని, జానారెడ్డి మౌనంగా ఉన్నారేమో? ప్రస్తుతం ఆయన కూడా ఇంటిపట్టునే ఉంటూ పుస్తకాలతో కాలక్షేపం చేస్తున్నారు. వచ్చిన వారికి సలహాలిస్తున్నారట.

పదవీ వియోగం అనుభవిస్తున్న కాంగ్రెస్ నుదుట, కల్యాణతిలకం పెట్టే మొనగాడి కోసం కార్యకర్తలు ఆశగా ఎదురుచూస్తున్నారట. రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా.. ఉత్తముడి సారథ్యమే కొనసాగితే, పార్టీకి 100 సీట్లు ఖాయమన్న వ్యంగ్యోక్తులు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దుబ్బాకలో దెబ్బతిన్న వెంటనే, వరంగల్‌లో కాంగ్రెస్ నేతలు.. అప్పుడే ఉత్తమ్ రాజీనామా డిమాండ్ లేవనెత్తారు. దేశం కోసం పోరాడిన ఓ కెప్టెన్‌ను, అంతేసి మాటలనడం తప్పు కదూ?!

అయినా, ఒక్క వరంగల్ నేతల లొల్లికే ఉత్తమ్ భయపడితే.. అసలు మాకీ అధ్యక్షుడే వద్దుపొమ్మని, యావత్ టీటీడీ నేతలంతా సంతగించి బాబుగారికిచ్చినా, అదే పదవిలో కొనసాగుతున్న తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ ధైర్యం గురించి ఏమనుకోవాలి? అయినా రాజకీయాల్లో కొనసాగేవారు అభిమానం-నైతిక విలువలు-ఆత్మగౌరవం గురించి పెద్దగా ఆలోచించకూడదు. కదా…?