కోడిగుడ్డు.. వెరీ‘గుడ్డు’..అందులో అవినీతి గాడిద గుడ్డేనట!

523

బీజేపీ అధ్యక్షుడి ఆరోపణలపై గాలి తీసిన శుక్లా
ఒక్క ఫిర్యాదూ రాలేదని వెల్లడి
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

రాష్ట్రంలో సరఫరా చేస్తున్న కోడిగుడ్ల సరఫరాలో.. 700 కోట్ల అవినీతి జరుగుతోందన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపణలో,  ఏమాత్రం  పస లేదని ఐఏఎస్ అధికారి గాలి తీసిన వైనమిది. పైగా.. రాష్ట్రంలో కోడిగుడ్ల సరఫరా అద్భుతమని ,స్వయంగా కేంద్రమంత్రి ఇచ్చిన కితాబును గుర్తు చేయడం ద్వారా.. సదరు బీజేపీ నేత ఆరోపణలో పసలేదని జగన్ సర్కారు చెప్పకనే చెప్పినట్లయింది. ఏమిటీ కోడిగుడ్ల లొల్లి అనుకుని తల గోక్కుంటున్నారా?..  అయితే ఓసారి అలా ఆ కోడిగుడ్డు కథలోకి వెళ్లొద్దాం రండి.  ఇది కూడా చదవండి… కమలం-కోడిగుడ్డు కథ!.

రాష్ట్రంలో జరుగుతున్న కోడిగుడ్ల సరఫరాలో అవినీతి జరుగుతోందని, దాదాపు 700 కోట్ల రూపాయల మేర జరిగిన అవినీతిపై,  విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు,  ఇటీవల రాజమండ్రిలో ఏర్పాటుచేసిన విలేక రుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఆయన దానిపై మాట్లాడిన వెంటనే, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరక్టర్ కృతికా శుక్లా తెర పైకొచ్చారు. 15 వేల మంది లబ్ధిదారులను సంప్రదించగా, ఏ ఒక్కరూ కోడిగుడ్ల నాణ్యతపై ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కూడా ప్రశసించారని గుర్తు చేశారు. అసలు బడ్జెట్ మొత్తమే  423.43కోట్ల రూపాయలని తే ల్చడం ద్వారా, సోమును ఆత్మరక్షణలో నెట్టేసినట్టయింది.

కేంద్రం ఇటీవల నిర్వహించిన పోషణాభియాన్ సర్వేలో కూడా.. రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలు,   నూటికి నూరు శాతం బాగా పనిచేస్తున్నాయన్న వాస్తవం వెల్లడయిందని శుక్లా చెప్పారు. గుడ్ల సరఫరాలో మహిళా శిశు సంక్షేమ శాఖ పాత్ర లేదని, వాటిని పాఠశాల విద్యశాఖనే ఖరారు చేస్తోందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, గుడ్లు తీసుకునే ముందు వాటి బరువు తనిఖీ చేసి, తక్కువ బరువున్న గుడ్లను వెనక్కి పంపుతారన్నారు.
కరోనా వల్ల..  గుడ్లను లబ్థిదారుల ఇళ్లకే పంపుతున్నామని, ఆ సందర్భంగా ఏ ఒక్కరూ ఇప్పటిదాకా వాటిపై ఫిర్యాదు చేయలేదన్నారు. దీనికోసం తాము టోల్‌ఫ్రీ నెంబర్  1148 ఏర్పాటుచేసి, ప్రతి 15 రోజులకోసారి లబ్థిదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నామని శుక్లా వివరించారు. పోషకాహారంగా అందిస్తున్న గుడ్ల కోసం 423.43 కోట్లు వార్షిక బడ్టెట్‌గా వాడుతున్నామని చెప్పారు. అందులో భాగంగా 92.40 కోట్ల గుడ్లు..  30.50 లక్షల మంది లబ్ధిదారులకు చేరుతున్నాయని వెల్లడించారు. కానీ సోము మాత్రం ఇటీవలి రాజమండ్రి విలేకరుల సమావేశంలో..  ఇందులో 700 కోట్ల అవినీతి జరిగిందని,  ఆరోపించడం ప్రస్తావనార్హం.

అంటే.. కృతికా శుక్లా వివరణ ప్రకారం.. బీజేపీ దళపతి సోము,  కోడిగుడ్లపై గత కొంతకాలం నుంచి చేస్తున్న ఆరోపణల్లో పసలేదని స్పష్టం చేసినట్లయింది. ఆయన తన పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా,  కోడిగడ్ల అవివీతిని ప్రస్తావించడం విశేషం. పైగా స్వయంగా కేంద్ర మానవ వనురుల శాఖ మంత్రి,  పోషణాభియాన్ సర్వేలో కూడా కోడిగుడ్ల సరఫరా, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై రాష్ట్ర పనితీరును ప్రశంచారని,  శుక్లా గుర్తు చేయడం మరో విశేషం. అంటే.. సోము వీర్రాజు వాదన ప్రకారం..  కేంద్రమంత్రికి గానీ, పోషణాభియాన్‌పై సర్వే చేసిన సంస్థలకు గానీ ఏమీ తెలియదని చెప్పకనే చెప్పినట్టయింది.

ఇప్పటిదాకా ఒక్కరు కూడా, కోడిగుడ్ల నాణ్యతపై ఫిర్యాదు చేయలేదన్న శుక్లా వివరణ కూడా, సోము వీర్రాజు ఆరోపణలను గాలి తీసినట్టయింది. మరి సోము ఏ లక్ష్యంతో,  ఈ ఆరోపణలు చేస్తున్నారో అర్ధం కావడం లేదని బీజేపీ సీనియర్ నేత ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి ప్రశంసించిన పథకంలో కూడా..  రాష్ట్ర అధ్యక్షుడు రంధ్రాన్వేషణ చేయడమే వింతగా ఉందని, దీనివల్ల కేంద్రమంత్రికి ఏమీ తెలియదన్న భావన ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు.

1 COMMENT