వ్యవసాయరంగంపై కుహనా మేధావుల మాయా యుద్ధం

693

వ్యవసాయం, రైతు ఈ రెండు మాటలు గుర్తుకురాగానే మాటల్లో, పాటల్లో, కవితల్లో న్యూస్ పేపర్లలో, పుస్తకాల్లో, టీవీల్లో, మేధావుల దగ్గర నుండి నిరక్షరాస్యుల వరకూ, ధనవంతుల నుంచి పేదవారికి వరకూ అందరికీ గుర్తొచ్చేలా, భూమండలంపై అందరూ అయ్యో పాపం అనేలా… సోషలిస్టు మేధావులు, కమ్యూనిస్టు స్నేహితులు కలిసి రైతు అనే భావానికి అత్యంత దయనీయమైన ఓ రూపాన్ని సృష్టిస్తే వారసత్వ ప్రభుత్వాలు అంతులేని ప్రచారం చేశాయి. అదెలా అంటే వారు చెప్పిన నిర్వచనం ప్రకారం…..

రైతు అంటే ఒక నిత్య దరిద్రుడు, అప్పులకోరు. కుటుంబాన్ని పోషించలేక, వేరే గత్యంతరం లేక గారెంటీగా ఆత్మహత్య చేసుకునే ఒక అసమర్థుడు. రైతు భార్య చిరిగిన జాకెట్, మాసిన చీర కట్టుకుని, అప్పుల వాళ్ళు తిడుతుంటే కన్నీటిని బిగపట్టుకుని గుమ్మంలో నిలబడి భర్త తెచ్చే అరకేజీ నూకల కోసం ఎదురు చూసే కష్టాలకు కేరాఫ్ అడ్రస్. ఇక రైతుల పిల్లలు అయితే కట్టుకోడానికి బట్టలుండవ్. ఎదురింటి పిల్లాడు ఐస్ తింటుంటే వీళ్ళు నాలికతో పెదాలు తడుపుకుంటూ, ఆకలితో చూస్తారు. పక్కింటి పిల్లలు పుస్తకాల బాగ్ తో, నవ్వుతూ అమ్మకి టాటా చెబుతూ స్కూల్ బస్ ఎక్కుతారు. పాపం ఫార్మర్ గారి పిల్లలు మాసిపోయిన చెడ్డీతో పలకపట్టుకుని ఫీజ్ కట్టనందుకు స్కూల్ బయటనిలబడతారు.

సినిమాల్లో, సీరియల్స్ లో ఆఖరికి ఎడ్వర్టైజ్మెంట్లో కూడా ఇప్పటి వరకూ మన స్వయం ప్రకటిత మేధావి సమాజం, రైతు అనే పేరు వినగానే మనందరికీ గుర్తుకువచ్చేలా ఏర్పాటు చేసిన ముఖచిత్రం ఇలా ఉంటుంది. 73 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో సుమారు 63 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు అన్నీ ఈ ముఖచిత్రాన్ని ఆసరాగా చేసుకునే పీఠం ఎక్కడానికి మొసలికన్నీరు కారుస్తూ ఉద్యమాలు చేశాయి. నిజంగా ఈ ప్రచారం రైతులపై ప్రేమతో జరిగిందా? అంటే అదీ లేదు. నిజానికి ఇది భారతీయ సమాజంలో రైతు అనే మానసికతను విచ్ఛిన్నం చేయడానికి ఎంచుకున్న దారి. దేశీయ వ్యవసాయాన్ని స్వాభిమానం లేని రంగంగా మార్చే ప్రయత్నం.

వ్యవసాయదారుల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు మన దేశంలో కుహనా రైతు ప్రేమికులందరు కలిసి వ్యవసాయరంగాన్ని నష్టం అనే పదానికి పర్యాయ పదంగా మార్చేశారు. ఈ మాట నిజం కాకుంటే…… ఇప్పటి వరకూ ఎప్పుడైనా వ్యవసాయం లాభదాయకరంగం అని చూపించారా ? వ్యవసాయంలో తరతరాలుగా ఆనందంగా జీవిస్తున్న కుటుంబాలని మనకి పరిచయం చేశారా ? ఏ పేపర్లో అయినా రైతు గురించి గొప్పగా వ్రాశారా ? ఒకవేళ వ్రాసినా అందులో కూడా  రైతు బీదరికం ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని మరీ కనబడుతుంది. కొద్దిగా భారతీయులెవరైనా బుర్రపెట్టి ఆలోచించినా ఇందులోని మర్మం ఖచ్చితంగా అర్ధమవుతుంది.

నిజానికి సాఫ్ట్ వేర్ దగ్గర నుంచి సినిమారంగం వరకూ ఏ రంగంలో నష్టాలు లేవు?, రాష్ట్రపతి నుంచి రోజు కూలి వరకూ ఎవరి జీవితాల్లో కష్టాలు లేవు? ఎన్నో కారణాలతో జీవితాలు ముందుకు సాగించలేక ఎంత మంది ఆత్మహత్యలు చేసుకోవడం లేదు? అంబానీ నుంచి అంగన్వాడీ టీచర్ వరకూ అందరూ అప్పులు చేయడం లేదా? బాధలు పడటం లేదా? అసలు ప్రపంచంలో కష్టం, నష్టం లేని రంగముందా? ప్రపంచంలో పేదరికం లేని సమాజముందా? భూమిపై ఎక్కడన్నా బాధలు లేకుండా మనిషి జీవితముందా? మరెందుకు రైతుల మరణాలపై కపట ప్రేమ? ఒక్క వ్యవసాయరంగంపైనే ఎందుకు మొసలి కన్నీరు? అంటే…. దృతరాష్ట్ర కౌగిలితో ఓదారుస్తూ వేటకొడవలితో వ్యవసాయ రంగం కుత్తుక కోయడానికి. మన గురించి జాలిగా మాట్లాడుతూ మన మీద మనకే అసహ్యం వేసేలా చేయడానికి. భవిష్యత్ తరాలు వ్యవసాయం చేయాలంటే భయపడేలా, చీదరించుకునేలా మార్చడానికి. ఒక విషప్రచారాన్ని సృష్టించి పెంచి పోషిస్తున్నారు. ఇది ఖచ్చితంగా నూటికి నూరు శాతం పక్కా ప్రణాళికతో, యోజనాబద్ధంగా దేశ ద్రోహులు ఉద్దేశ్యపూర్వకంగా వ్యవసాయ రంగంపై చేస్తోన్న కుట్ర. అనుభవజ్ఞులు ఈ కోణంలో లోతుగా విశ్లేషిస్తే వాస్తవాలు మరిన్ని బయటికొస్తాయి.

ఒక మనిషి సాధారణంగా రెండిటి కోసం కలలు కంటాడు. వాటి కోసమే 99.9% మంది ఏదో ఒక రంగాన్ని ఎంచుకుంటారు. ఒకటి డబ్బు, రెండోది వివాహం.  అటువంటిది సమాజంలో యువతకు చెబుతున్నది ఏంటి ? వ్యవసాయంలో డబ్బురాదు అని. ఇక డబ్బులేని వాడిని ఏ అమ్మాయీ పెళ్లి చేసుకోదు. కనుక ఈ రంగంలో ఉన్నవాడికి భుక్తి లేదు, పెళ్లి కాదు అనే భయం. అటువంటప్పుడు  ఈ రంగాన్ని ఎవరు మాత్రం ఎంచుకుంటారు? ఇటువంటి నష్టాల, కష్టాల దారిలో ఎవరు మాత్రం ముందుకు నడవాలనుకుంటారు ? సరిగ్గా ఈ ఆలోచననే అందరిలో కలగచేయాలి. ఈ విధమైన మానసికతనే దేశ యువతలో నిర్మాణం చేయాలి అనేది వారి పక్కా ప్రణాళిక. ఇదొక మానసిక మాయాయుద్ధం.

భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని బలంగా దెబ్బకొట్టి, రైతుగా ఏ ఒక్కరూ మారకుండా చేయాలి. తద్వారా భారతదేశ మనుగడలో ప్రధాన భూమికను పోషించే వ్యవసాయ రంగాన్ని నామరూపాల్లేకుండా చేయాలి. ఇదే వారి రహస్య ఎజెండా. మనుషులను వ్యవసాయానికి దూరం చేయడానికి జాలి పడుతున్నట్లు నటిస్తూ ఈ దుష్ప్రచారం చేస్తున్నారు. భూమిని పంటకు దూరం చేయడానికి అధిక దిగుబడి ఆశ చూపెడుతూ “రసాయనాలు” అంటూ విషపు దారిలో నడిపిస్తున్నారు. నిజానికి రైతుకు నష్టాన్ని, కష్టాన్ని తెస్తున్నది వ్యవసాయం కాదు. అతని మనసులో పెంచుకున్న అధిక దిగుబడి అనే అత్యాశ.

దీనర్థం దేశంలో రైతుకు అన్యాయం జరగటం లేదు, రైతులకు సమస్యలే లేవని  కాదు. సమస్యల సాకుతో భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి ఎవరు రాకుండా యువతరంలో భయాన్ని సృష్టించకూడదు అని. రైతుల్లో పేదవారే లేరని చెప్పమని కాదు. ఆడపిల్లలు రైతుతో పెళ్లి అంటే పారిపోయేంతగా జరుగుతున్న ప్రచారం ప్రమాదకరం అని. ఆత్మహత్యలు సాధారణం అని చూపమని కాదు. రైతుల ఆత్మహత్యలను రాజకీయనాయకుల ఎన్నికల లబ్ధి కోసం రావణకాష్టంలా చూపొద్దని. ఇక నుంచి అయినా మనం వ్యవసాయ రంగాన్ని, రైతుని చూసే దృష్టి కోణం మార్చుకోవాలి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంత గొప్పగా చూడబడతాడో అలాగే రైతును కూడా ప్రొఫెషనల్ గా చూడగలిగే రోజులు సృష్టించేలా మన ఆలోచన, అలాగే రైతుల ప్రవర్తన రెండూ మారాలి.

రైతులు తమ వ్యవసాయ ఖర్చును, రసాయనాల చిచ్చును తగ్గించుకోవాలి. అలాగే  రైతు పండించిన పంటను దేశ వ్యాప్తంగా మార్కెట్లో ఎక్కడ, ఎవరు ఎక్కువ ధరను చెల్లించగలరో వాళ్లకు స్వేచ్ఛగా అమ్ముకునే మార్గాన్ని రైతుకు అందించగలగాలి. అనుకోని విధంగా నష్టం వాటిల్లినా తదనుగుణంగా ఆత్మవిశ్వాసాన్ని, ఆర్ధిక స్వావలంబనను పెంచే విధంగా ప్రణాళికలు రావాలి. అదృష్టం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఈ దిశలో అడుగులేస్తున్నట్టు కనపడుతోంది. వ్యవసాయ రంగం దశమారే అవకాశం ఉన్నట్టు అనిపిస్తోంది.

కానీ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ప్రభుత్వం తెచ్చే సంస్కరణలు మాత్రమే సమస్యలను దూరం చేయలేవు.  సంస్కరణలు సమాజంలో అమలు చేసే వ్యవస్థ, ఆ వ్యవస్థలో వుండే వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క ఆలోచన , ప్రవర్తన రైతు పట్ల, వ్యవసాయ రంగం పట్ల ఎలా ఉంది అనేది ముఖ్యం. ఒక రైతు చేసే వ్యవసాయం కేవలం అతని సంపాదన కోసం మాత్రమే కాదు. భవిష్యత్ తరాల శ్రేయస్సు, భారతదేశం యొక్క భవిష్యత్తు కోసం అని ఆలోచించగలిగినప్పుడు. ఆ దిశలో మేధావి సమాజం రైతన్నకు మార్గదర్శనం చేయగలిగినపుడు, రైతు ఆ మార్గంలో నడిచినపుడు, ప్రభుత్వం ఆ మార్గాన్ని ప్రోత్సహించినపుడు ఖచ్చితంగా భారతదేశానికి గత వైభవాన్ని అందించడంలో రైతు కీలక పాత్ర పోషిస్తాడు. రైతు ఎప్పటికీ రాజే…..మన దేశంలో ధర్మరాజే.

-అక్షరజ్వాల

1 COMMENT

  1. Please let me know if you’re looking for a author for your site. You have some really good posts and I feel I would be a good asset. If you ever want to take some of the load off, I’d really like to write some material for your blog in exchange for a link back to mine. Please send me an e-mail if interested. Thank you!