శహభాష్…సీఎం!

89

పోలీసులకు బెయిల్‌పై ఎస్పీ అపీలు
చట్టం ప్రకారమే వెళతామన్న డీజీపీ సవాంగ్
రాష్ట్ర పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఎవరయినా తన ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు అనుకూలంగా తీర్పు, లేదా నిర్ణయం వెలువడితే పాలకులు సంతోషిస్తారు. ఆ శాఖాధిపతులు ఊరట పొందుతారు. కానీ ఏపీ సీఎం జగన్ దీనికి భిన్నం. మైనారిటీ కుటుంబ ఆత్మహత్య అంశంలో అరెస్టయి.. జైలుకెళ్లిన ఓ సీఐ, మరో హెడ్‌కానిస్టేబుళ్లకు మంజూరయిన బెయిల్‌ను సవాల్ చేస్తూ,పైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పైగా.. ఆరోపణలు ఎందుర్కొని అరెస్టయింది, రెడ్డి వర్గానికి చెందిన ఓ అధికారి. అదీ ఆశ్చర్యం!

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నంద్యాల మైనారిటీ వ్యక్తి ఆత్మహత్య కేసు జగన్ సర్కారుకు అప్రతిష్ట తెచ్చింది. దీనిపై టీడీపీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తోంది. పత్రికా ప్రకటనలతో జగన్ సర్కారుపై విరుచుకుపడుతోంది. తమ ఆత్మహత్యకు నంద్యాల సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ కారణమంటూ, ఆ మైనారిటీ కుటుంబం తీసిన సెల్ఫీ వీడి యోవైరల్ అయింది. దీనితో అప్రమత్తమయిన సర్కారు, సీఐ-హెడ్‌కానిస్టేబుల్‌ను అరెస్టు చేసి, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్టు చేసి, వెంటనే జైలుకు పంపింది.

అయితే, స్థానిక కోర్టు వారిద్దరికీ బెయిలివ్వడం జగన్ సర్కారుకు షాక్‌నిచ్చింది. నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టినా బెయిల్ రావటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన, సీఎం జగన్ కర్నూలు జిల్లా ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. బెయిల్ రద్దు కోరుతూ పైకోర్టులో పిటిషన్ వేయాలని ఆదేశించారు. దానితో రంగంలోకి దిగిన ఎస్పీ, వారిద్దరి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. వారే నిందితులంటూ తమ వద్ద ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. తన కింద స్ధాయి అధికారులకు, కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని.. ఓ ఎస్పీ కోరిన ఘటన బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. సొంత శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరటం కూడా రాష్ట్ర పోలీసు చరిత్రలో ఇదే ప్రథమం.

మైనారిటీ కుటుంబ ఆత్మహత్యకు కారకులని భావిస్తున్న, ఇద్దరు పోలీసులపై చర్య తీసుకోకుండా.. ప్రభుత్వం-పోలీసు శాఖ ఉపేక్షించవచ్చు. దానిపై విచారణ పేరిట కాలయాపన చేయవచ్చు. కానీ నంద్యాలలో మాత్రమే కాదు. కర్నూలు-ఇతర జిల్లాలలో ఎక్కువగా ఉన్న, మైనారిటీల మనోభావాలు దృష్టిలో ఉంచుకున్న జగన్ శరవేగంగా స్పందించారు. నిందితులుగా భావిస్తున్న సీఐ, రెడ్డి సామాజికవర్గానికి చెందిన అధికారి. ఒకవేళ ఆయనపై చర్య తీసుకోకపోతే, రెడ్డి కాబట్టే ఆయనను వదిలేశారన్న విమర్శ ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పటికే రెడ్ల పెత్తనం ఎక్కువయిందన్న ఆరోపణలు ఉండనే ఉన్నాయి. దానికి ఈ ఘటన అదనపు శిరోభారమవుతుంది. అది మైనారిటీలను దూరం చేసుకోవడమే అవుతుంది.

అందుకే జగన్ ఈ వ్యవహారంలో వాయువేగంతో స్పందించినట్లు కనిపిస్తోంది. అందుకే పోలీసులకు ఇచ్చిన బెయిల్ రద్దు కోసం.. పైకోర్టుకు అపీలుకు వెళ్లడం ద్వారా, తమ నిజాయితీ నిరూపించుకునేందుకే, సీఎం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. పైగా ఇది రాష్ట్రంలో అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తున్న, కొందరు కింది స్థాయి పోలీసులకు, ఒక హెచ్చరిక సంకేతంగా పంపించినట్టయింది. నిజానికి ఇటీవలి కాలంలో స్థానిక ఎమ్మెల్యేలు, వైసీపీ నేతల అండతో కొందరు కిందిస్థాయి పోలీసులు రెచ్చిపోతున్నారు. వారి అత్యుత్సాహంతో పోలీసు శాఖ అప్రతిష్ఠపాలవుతోంది. శిరోముండనం వంటి ఘటనలు, జగన్ సర్కారుకు మచ్చగా మారాయి.

కాగా తాజా నంద్యాల సామూహిక ఆత్మహత్యల ఘటనపై అటు డీజీపీ సవాంగ్ సైతం, వ్యక్తిగతంగా కేసును ఆరా తీశారు. వారి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై వాకబు చేశారు. ఆ తర్వాత సీఐ-హెడ్‌కానిస్టేబుల్ సస్పెన్షన్-అరెస్టుపై ఆదేశాలిచ్చారు. ఈ విషయంలో డీజీపీ శరవేగంగానే చర్యలు తీసుకున్నారన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అరెస్టయిన పోలీసులకు కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు కోరకపోతే, పోలీసు శాఖ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చేది. తన శాఖ అధికారులను రక్షించుకునేందుకే, పైకోర్టులో అపీలుకు వెళ్లలేదన్న అపప్రదను మూటకట్టుకునే ప్రమాదం ఉండేది. బహుశా ఆ ప్రమాదాన్ని గ్రహించిన తర్వాతనే, సవాంగ్.. కర్నూలు ఎస్పీని అప్రమత్తం చేసినట్లు కనిపిస్తోంది. ఫలితంగానే ఆ ఇద్దరి బెయిల్‌పై అపీలుకు వెళ్లాలని ఎస్పీ నిర్ణయించారు.

‘ నంద్యాల ఘటనపై మా శాఖ చట్టపరంగానే వ్యవహరిస్తుంది. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టం. తప్పు ఎవరు చేసినా తప్పే. మా శాఖలో పనిచేసే వారు తప్పు చేసినా వారిపై చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా వ్యవహరించాలని చెబుతున్నాం. కొందరు చేసే తప్పులకు మొత్తం పోలీసు వ్యవస్థను నిందించడం, కొందరిని బాధ్యులను చేయటం సరైనది కాదు. తప్పు చేసిన వారిని మేం ఎక్కడ కాపాడామో చెప్పండి? నంద్యాల ఘటనలో ఎస్పీ న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నారు. మీరు ఎలాగూ మా తప్పుల గురించి రాస్తున్నారు. మంచి చేసినప్పుడు కూడా మీరు అభిన ందించాలి. పోలీసులు ఎవరినీ సమర్ధించరు. ఎవరికీ వ్యతిరేకంగా ఉండరు. మేం ఉన్నది ప్రజల కోసమే’నని డీజీపీ సవాంగ్ ‘సూర్య’ ప్రతినిధికి చెప్పారు.

అయితే ఉమ్మడి రాష్ట్రంలో పోలీసులకు.. రిట్రీట్ నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తూ, రాష్ట్రం విడిపోయిన తర్వాత.. ఏపీలో ఇప్పటివరకూ దానిని నిర్వహించలేదని ‘సూర్య’ డీజీపీకి గుర్తు చేసింది. అందుకు స్పందించిన సవాంగ్.. త్వరలోనే రిట్రీట్ నిర్వహిస్తామని చెప్పారు. మానవ హక్కులు కాలరాస్తూ, హృదయవిదారక ఘటనలకు కారకులవుతున్న అధికారులపై.. ఇలాంటి చర్యలు వేగంగా తీసుకుంటే, ఎవరు మాత్రం జగన్ ప్రభుత్వాన్ని అభినందించరు? సర్కారు అధికారులకిచ్చిన బెయిల్‌ను, రద్దు చేయాలని ఆదేశించే ధైర్యం ఎంతమందికి ఉంటుంది? అందుకే.. శహభాష్ జగన్!

 

1 COMMENT