పెర్సెప్షన్…పట్టించుకోకపోతే కొంపలు ముంచుతుంది!

233

విజయవాడ: మన ఇళ్ల ల్లో వెన్నపూస కాచిన; కాస్తుంటే చూసిన అనుభవం చాలామందికి ఉండే ఉంటుంది. వెన్న పూస కాచినప్పుడు…ఘుమ ఘుమ లాడే నెయ్యి వస్తుంది. కానీ, వెన్నపూస కాచిన పాత్ర అడుగున – వెన్నలోని సారం అంతా దిగి,గడ్డ కట్టి ఉంటుంది. ఆంధ్ర ప్రాంతం లో దానిని -‘కాటు’ అంటారు. నెయ్యి కంటే- భిన్నమైన రుచిలో ఉంటుంది.
ప్రజలు ఎన్నుకున్న పాలక పక్షమైనా..ప్రభుత్వ పాలకులైనా…అధికార యంత్రాంగమైనా…రాజకీయ పక్షమైనా…వారు చేసే రోజువారీ ప్రకటనలు, వ్యవహార శైలి, నిర్ణయాలు, మాట తీరు, నడవడిక, విధానాల అమలు తీరు- అన్నీ – ఓటర్ దృష్టి లో వెన్నపూస లాగా నిత్యం మరుగుతుంటాయి. ఇవన్నీ- ఓటర్ మనస్సులో మరిగి,మరిగి – ఒక అంచనా ఏర్పడుతుంది. ఆ అంచనా అనేది- ఎవరికి అనుకూలం…,ఎవరికి అనుకూలం అనేది కనిపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు.సందర్భం వచ్చినప్పుడే(పోలింగ్ లో) నిశ్శబ్దంగా బయట పడుతుంది. తెలంగాణ లోని దుబ్బాక నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఫలితమే- ఈ పెరసెప్షన్ -ఎంత ప్రమాదకరమో అన్నదానికి ఒక సజీవ ఉదాహరణ.

ఈ ఎన్నికలో టీఆర్ఎస్ కు ఏం తక్కువని ఓడిపోయింది?
రంగ రంగ వైభవం గా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి ఉన్నారు. ప్రజలు, సమస్యలతో మమేకమై తిరుగుతున్న కే టీ ఆర్ ఉన్నారు. ప్రజల తలలో నాలుక లా నడుచుకునే హరీష్ రావు- దుబ్బాక నియోజకవర్గం లో కాలికి బలపం కట్టుకు తిరిగారు. చేతిలో అధికారం ఉంది. అంగబలం ఉంది. అర్ధబలం ఉంది. బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయి.
చేతిలో న్యూస్ ఛానెల్ ఉంది, పత్రికలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా… దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోయింది.
గెలిచిన బీజేపీకి – టీఆర్ఎస్ కు ఉన్నవాటిలో 90 శాతం లేవు. అయినా…గెలిచింది.
దీనికి ప్రధాన కారణం- పబ్లిక్ పెర్సెప్షన్.
దీనిని పట్టించుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవాల్సిన అవసరాన్ని దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం గుర్తు చేస్తున్నది.
అధికార, ప్రతి పక్ష రోజువారీ వ్యవహార శైలి, నిర్ణయాలు…అమలు తీరు, ఆయా పార్టీ పెద్దల కట్టు- బొట్టు, మాట తీరు, పాలక పక్షం నడవడిక- ప్రతిదీ- ఓటర్లు గమనిస్తారు. ఆ గమనిక ఆధారంగా వారి మనస్సులో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అదే పెర్సెప్షన్.
ప్రతి పార్టీ కి చిన్నదో…పెద్దదో ఒక కమిటెడ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. వీరికి -పెర్సెప్షన్ తో పెద్దగా పనిలేదు. వీరు- తమ అభిమాన పార్టీతోనే అంట కాగుతారు.
ఎటొచ్చి , ఎటూ మొగ్గని తటస్థ ఓటర్ల తోనే- ప్రమాదం.
ఏ న్యూస్ ఛానెలూ, దిన పత్రికా నిష్పక్షపాతం గా లేదని ఓటర్ కు తెలుసు. తనకు జవాబుదారీగా ఉండాల్సిన మీడియా, తన యజమానికే జవాబుదారీ గా బతుకు వెళ్లదీస్తున్నదని ఓటర్ కు తెలుసు. అందువల్ల- అవి ప్రసారం, ప్రచారం చేసే కధనాలలోని గింజను మాత్రమే తీసుకుని; పొల్లును వదిలేస్తున్నారు. (సోషల్ మీడియా పోస్టింగ్ లు కూడా- పూటకు సరదాగా ఎంజాయ్ చేయడానికే తప్ప; పబ్లిక్ పెర్సెప్షన్ ను ప్రభావితం చేయలేవు.)
ఆ గింజ ను బట్టి, తన అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాడు. ఆ అభిప్రాయానికి అనుగుణంగా ఓట్ వేస్తున్నాడు.
ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ పార్టీ గెలుపుకు- తెలుగు దేశం వాళ్ళు ఆరోపిస్తున్నట్టు – డబ్బు,మద్యం పంపిణీ మాత్రమే కారణం కాదు. అదే నిజమైతే- మిగిలిన 23 నియోజక వర్గాలలోనూ వైసీపీ అభ్యర్థులు విజయం సాధించాలి కదా!
చంద్రబాబు నాయుడు వ్యవహారశైలి, ఆర్భాటపు ప్రకటనలు, ఆయా నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల నడవడిక, వ్యవహార శైలి మొదలైన సవాలక్ష కారణాలు- ఓటర్ మనసులో ‘కాటు’ లాగా మరిగి,మరిగి- కాటు వేశాయి. అవి ఏమిటో- చంద్రబాబు నాయుడు ఆత్మ విమర్శ చేసుకున్న భావన ఇప్పటికీ కలగడం లేదు.
ఈ ‘పెర్సెప్షన్’ గండం నుంచి – వైసీపీ పాలక పక్షం తప్పించుకోలేదు.
ఒక నియోజక వర్గం లో ఆ పార్టీ ఎం.ఎల్.ఏ నే ప్రభుత్వం. అక్కడ ఉండే పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసరే ప్రభుత్వం. అక్కడ జనానికి కనపడే ఎం.ఆర్.ఓ నే ప్రభుత్వం. గ్రామం లో కనపడే వాలంటీరే ప్రభుత్వం. అక్కడ కనపడే కలెక్టరే ప్రభుత్వం.
అందుకే…నంద్యాల లో ఓ కుటుంబం ఆత్మహత్య కు- అక్కడి పోలీస్ సీ. ఐ ప్రమేయం ఉన్నదన్న భావనతో, ఆయనను నిముషాల్లో అరెస్ట్ చేశారు.
ప్రభుత్వం అనే ‘ఫ్యాన్’ లో మోటారు, రెక్కలు, రెక్కలకు ఉండే బోల్ట్ లు, పైకప్పు కు వేలాడే రాడ్డూ, దానిని నిలబెట్టే హోల్డర్, ‘రెగ్యులేటర్, హోల్డర్ లో వైరు, స్విచ్ నుంచి ఫ్యాన్ కు ‘అంతర్గతగా’ ఉండే వైరు, స్విచ్, స్విచ్ బోర్డు కరెక్ట్ గా ఉండి; విద్యుత్ ప్రసారం కూడా శుభ్రంగా ఉంటేనే…ఫ్యాన్ తిరిగేది. వీటిల్లో- ఎక్కడ ఏ లోపం ఉన్నా… ఫ్యాన్ -తిరగవలసిన విధంగా తిరగదు.
సైకిల్ అయినా అంతే. అన్నీ బాగుండి, టైర్ లలో ‘గాలి పోయినా’ అంతే!
ఎన్నో శ్రమలు పడి, రక్తం ధారపోసి, ఎండనక…వాననక… వేలాది కిలోమీటర్ లు నడిచి, అనేక వాగ్దానాలు చేసి – చరిత్ర సృష్టించిన రీతిలో – 175 లో153 స్థానాల లో విజయకేతనం ఎగురవేసిన వై. ఎస్. జగన్మోహన రెడ్డి- ఈ ‘పెర్సెప్షన్’ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలనే ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

-భోగాది వెంకట రాయుడు

1 COMMENT