సంబరాలు..సమావేశాలు..పాజిటివ్ ట్వీట్లు…మరి కరోనా పోయినట్లేనా?

278

సుద్దులు చెప్పే నేతలకు సిగ్గుందా?
బాధ్యత లేని సమాజం పడుతున్న బాధలు
కరోనా గుప్పిట తెరిచేసిన పాలకులు
జాగ్రత్తలు చెప్పిన చిరంజీవికి కరోనా
                     ( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

తాంబూలాలిచ్చాం. తన్నుకుచావండి. తమాషా చూస్తాం. ఇదీ మొన్నటి వరకూ టీవీ తెరల ముందు గంభీర వదనాలతో, కరోనా జాగ్రత్తలపై భారీ పదజాలు వినిపించిన పాలకుల ఇప్పటి చేతులెత్తేసిన తీరు. అటు పాలకులు, వైద్యులు ఎన్ని హెచ్చరికలు చేసినా, వాటిని గాలికొదిలి కరోనా కోరలకు చిక్కుతున్న పాలితుల బేఖాతరిజం. సుద్దులు చెబుతూ, జనాలకు ఆదర్శంగా ఉండాల్సిన మంత్రులు, నాయకులే.. నిస్సిగ్గుగా జనంతో జాతర్లు చేస్తున్న నిర్లజ్జనం. కలసివెరసి.. కరోనా మహమ్మారి మరోమారు ఆవహిస్తున్న విషాదం.

అవును. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తే, కరోనా పోయినట్లే కనిపిస్తోంది. బస్సులు, బార్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, వైన్‌షాపులు, షేరింగ్ ఆటోల్లో ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. ఎవరికీ కరోనా చావులపై భయం లేదు. ఏ ఒక్కరికీ సామాజిక దూరం పాటించాలన్న స్పృహ లేదు. ఏ ఒక్కరికీ మాస్కు పెట్టుకోవాలన్న కనీస-ఇంగిత జ్ఞానం లేదు. ఎందుకంటే మాస్కులు వారికోసం కాదు. ఎదుటివారి రక్షణ కోసం కాబట్టి!

కేంద్రమంత్రుల నుంచి రాష్ట్ర మంత్రుల వరకూ, ఎమ్మెల్యేల నుంచి లోకల్  లీడర్ల వరకూ..  ఎవరూ సామాజికదూరం పాటిస్తున్న ఫొటోలు ఎక్కడా కనిపించవు. పల్లెల్లో మాస్కులు పెట్టుకున్న వారు, భూతద్దం పెట్టి వె తికినా కనిపించరు. మాస్కులు పెట్టుకోకుండా, సామాజిక దూరం పాటించకుండా, పదిమంది గుమిగూడితే మరి.. కరోనా రాక,  కత్రినా కైఫ్ వస్తుందా?

లేటెస్టుగా మాజీ మెగాస్టార్ చిరంజీవి,  తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ట్వీట్ చేశారు. తనను కలుసుకున్నవాళ్లంతా టెస్టులు చేయించుకోమని సూచించారు. ఆయన రెండురోజుల క్రితమే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను,  నాగార్జునతో కలిశారు. ఆ సందర్భంలో చిరంజీవి మాత్రమే కాదు. కేసీఆర్ కూడా మాస్కు పెట్టుకున్నట్లు ఫొటోలో కనిపించలేదు. చిరంజీవి-నాగార్జున సినిమాల్లో కనిపించినట్లు,  ఇరవై ఐదేళ్ల కుర్రాళ్లేమీ కాదు. మనుమలు, మనుమరాళ్లున్న  60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు. మరి కరోనా హెచ్చరికల ప్రకారం, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలి కదా? పైగా.. ఇటీవల తీసిన ఒక యాడ్‌లో,  మాస్కు పెట్టుకోని ఓ తారకు, చిరంజీవి క్లాసు ఇస్తూ నటించారు. ఇప్పుడేమో ఆయనే కరోనా బారిన పడ్డారు. ఓ పక్క షూటింగుల వల్లే ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి మహా శిఖరమే కూలింది. రాజశేఖర్ వంటి హీరోలూ కరోనా బారిన పడ్డారు.  అయినా సినిమా వాళ్లకు సంపాదనే ముఖ్యం. అందుకే షూటింగులూ మొదలెట్టేశారు.  ఇవన్నీ దేనికి సంకేతాలు?ఇక ఏపీలో సీఎం జగనన్న పాదయాత్రకు.. మూడేళ్ల సందర్భంగా వైసీపీ శ్రేణులంతా, ‘ ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’ పేరుతో ప్రచారంం ప్రారంభించారు.మంత్రులు-ఎమ్మెల్యేలు-నేతలు సహా,  కట్టకట్టుకుని రోడ్డునపడ్డారు. కొన్ని చోట్ల మాస్కులు పెట్టుకుంటే, మరికొన్ని చోట్ల మాస్కులు లేకుండానే కనిపించారు. చుట్టూ డజన్లు, వందల మంది కార్యకర్తలను వెంటేసుకుని ఇచ్చిన ఫొటో ఫోజులు చూస్తే,  వారికి అసలు బాధ్యత ఉందా? అన్న ప్రశ్న బుద్ధి ఉన్న ఎవరికయినా వస్తుంది. కొద్దిరోజుల క్రితమే, బీసీ కార్పొరేషన్లు ప్రకటించినందుకు కృతజ్ఞతగా,  వైసీపీ నేతలంతా పోటీలు పడి మరీ, ఆయన ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. అక్కడా ఎవరికీ మాస్కులు లేవు. సామాజిక దూరం అసలే లేదు. మరి కరోనా రాక,  కత్తి యుద్ధం కాంతారావు వస్తారా?

ఇక స్వయంగా సీఎం జగన్ కూడా,  తన సమీక్షా సమావేశాల్లో ఎక్కడా మాస్కు పెట్టుకున్నట్లు కనిపించడం లేదు. పాలకులను బట్టే పాలితులు. అందుకే జనం కూడా మాస్కులు పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడాన్ని గాలికొదిలేశారు. అసలు కరోనా పోయిందన్నట్లు తిరుగుతున్నారు. మరి ఇక్కడ తప్పెవరిది? శిక్ష మాత్రం.. మాస్కులు పెట్టుకోని సామాన్యులపై పోలీసుల చలాన్లు. ఆ నిబంధనలు గాలికొదిలిన ప్రజాప్రతినిధులపై,  ఆ చలాన్లు విధించే దమ్ము పోలీసులకు ఉందా మరి?

కరోనా నిబంధనలు పాటించడం లేదంటూ..  మొన్నటి వరకూ వైసీపీపై తెగ విరుచుకుపడ్డ టీడీపీ కూడా, ఇప్పుడు కరోనా నిబంధనలు గాలికొదిలేసింది. ‘నా ఇల్లు-నా సొంతం’ పేరుతో టీడీపీ తమ్ముళ్లు కూడా రోడ్డునపడ్డారు. గుంపులు గుంపులుగా చేరి, ఫొటోలకు ఫోజులిస్తున్నారు. మొన్నామధ్య, వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్ చుట్టూ అవే దృశ్యాలు. ఇప్పుడు ఇళ్ల ఆందోళన లోనూ అవే దృశ్యాలు. పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెట్టే,  ఈ రాజకీయాలను చూసి రోత పుట్టడం లేదూ?

తెలంగాణ రాష్ట్రం దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో కూడా, కరోనా నిబంధనలు గాలికెగిరిపోయాయి. ర్యాలీలు, మీటింగులలో ఎక్కడా సామాజిక దూరం కనిపించలేదు. మాస్కులు పెట్టుకున్న మారాజులు బహు తక్కువ. అదే కరోనా మహమ్మారితో ఒక ఎమ్మెల్యే మృతి చెందారన్న కనీస భయం కూడా ఎవరిలోనూ కనిపించకపోవడమే ఆశ్చర్యం. వరద బాధితులకు పదివేల చొప్పున పంపిణీ చేసిన సమయంలో ఏ ఒక్కరూ సామాజికదూరం పాటించిన దాఖలాలు లేవు.

తమ రాష్ట్రంలో కరోనాకు మెరుగైన చికిత్స జరుగుతోందని,  గొప్పలకు పోతున్న ఏపీ పాలకులకు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు.. అదే మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌కు పోవడం సిగ్గుచేటు. అంటే, దాన్ని బట్టి ఏపీలో వైద్యాన్ని పాలకులే నమ్మకం లేదన్నమాట. తమ వైద్యుల పనితనంపై తమకే నమ్మకం లేదన్నమాట.  పాపం అప్పటికీ.. కరోనా చికిత్సకు ఎవరూ ఇతర రాష్ట్రాలకు వెళ్లవద్దని, మంత్రి ఆళ్ల నాని చెప్పినా పట్టించుకునేవాడు లేరు. ప్రాణాలంటే అంత తీపి మరి! ఇక తెలంగాణలో ప్రజాప్రతినిధులకు కరోనా వస్తే, ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స చేయించుకుంటారని, సీఎం కేసీఆర్ సగర్వంగా ప్రకటించారు. కానీ, కరోనా వచ్చిన ఎమ్మెల్యేలంతా.. యశోదా, అపోలో తప్ప మరెక్కడా కనిపించలేదు. మరి చెప్పడానికేనా నీతులు?

1 COMMENT

  1. Hiya! I know this is kinda off topic but I’d figured I’d ask. Would you be interested in exchanging links or maybe guest authoring a blog article or vice-versa? My website goes over a lot of the same topics as yours and I believe we could greatly benefit from each other. If you are interested feel free to shoot me an e-mail. I look forward to hearing from you! Terrific blog by the way!