కాంగ్రెస్‌పై కోపం కమలానికి కలసివస్తోందా?
ఇది కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదమేనా?
టీఆర్ఎస్లో సీనియర్ల అంత్మథనం
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)
పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు.. తెలంగాణలో టీఆర్ఎస్-కాంగ్రెస్ పోరులో, బీజేపీ లబ్ధిపొందేందుకు కారణమవుతోందన్న అంతర్మథనం, టీఆర్ఎస్ సీనియర్లలో వినిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఎదగనీయకుండా.. సీఎం కేసీఆర్ పన్నుతున్న వ్యూహం, పరోక్షంగా బీజేపీకి రాజకీయ ఎదుగుదలకు దోహదపడుతోందన్న వ్యాఖ్యలు, టీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇది నిస్సందేహంగా తమ నాయకత్వ వ్యూహాత్మక తప్పిదమేనని, సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.
దుబ్బాక ఉప ఎన్నిక తొలి దశ నుంచి.. తుది దశ ప్రచారాన్ని పరిశీలిస్తే, తమ నాయకత్వం అనుసరించిన వ్యూహం, బీజేపీని రెండవ స్థానంలో నిలిపేలా చేసిందని టీఆర్ఎస్ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. తొలి దశలో వేగంగా దూసుకువెళ్లిన కాంగ్రెస్ ప్రభావాన్ని తగ్గించేందుకు, బీజేపీ చేసిన హడావిడికి అనవసర ప్రాధాన్యం ఇచ్చిందంటున్నారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బీజేపీ.. పోలింగ్ సమయానికి, ఉప ఎన్నికలో ‘బీజేపీ కూడా గెలిచే అవకాశాలు లేకపోలేదన్న’ అంచనాల స్థాయికి వెళ్లిందని విశ్లేషిస్తున్నారు.
స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించిన మంత్రి హరీష్‌రావు కూడా.. బీజేపీనే తమ ప్రత్యర్ధి అన్నట్లు చేసిన ‘కారు మోటారు కావాలా? కరెంటు మోటారు కావాలా’ అన్న ప్రచారం, బీజేపీ ప్రాధాన్యం పెంచింది. ఆ తర్వాత ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్ కూడా, కేంద్రంలోని బీజేపీ సర్కారుపైనే విమర్శించడం ద్వారా.. పోటీ అంతా, టీఆర్ఎస్-బీజేపీ మధ్యనే అన్న సంకేతాలిచ్చినట్టయిందని, టీఆర్ఎస్ నేతలు విశ్లేషిస్తున్నారు.
నిజానికి ఉప ఎన్నికలో మూడవ స్థానంలో ఉండాల్సిన బీజేపీ.. తమ పార్టీ వ్యూహాత్మక తప్పిదం వల్ల, రెండో స్థాయికి చేరిందన్న భావన ఏర్పడిందని చెబుతున్నారు. బీజేపీ పోల్ మేనేజ్మెంట్ కంటే, ఉద్రిక్త వాతావరణం సృష్టించే హడావిడికే ప్రాధాన్యమిచ్చింది. సహజంగానే అది, మీడియాను విపరీతంగా ఆకర్షించింది. ఫలితంగా, ఓటర్లు కూడా సహజంగా పోటీని, టీఆర్ఎస్-బీజేపీకే పరిమితం చేశారని విశ్లేషిస్తున్నారు. ఈవిషయంలో బీజేపీ మైండ్ గేమ్ సక్సెస్ అయిందంటున్నారు. తమ పార్టీ అగ్రనేతలు కూడా.. ప్రచారంలో కాంగ్రెస్‌కు బదులు, బీజేపీనే ప్రధాన ప్రత్యర్ధి అన్నట్లు సాగించిన ప్రచారం, పరోక్షంగా బీజేపీ బలపడేందుకు కారణమయిందని స్పష్టం చేస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్‌ను ఎదగనీయకూడదన్న లక్ష్యంతో వేసిన, తమ నాయకత్వ ఎత్తుగడగానే నిపిస్తోందంటున్నారు.
అయితే, తమ నాయకత్వ వ్యూహాత్మక తప్పిదం వల్ల, భవిష్యత్తులో భారీ మూల్యం తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీజేపీ బలపడిన రాష్ట్రాల్లో ఆ పార్టీ అనుసరించిన వ్యూహం, ఆ తర్వాత ఏకంగా ఆయా రాష్ట్రాల్లోనే పాగా వేసిన వైనాన్ని, కేసీఆర్ ఎలా విస్మరించారో అర్ధం కావడం లేదన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నిజానికి అనేక వర్గాలు-ముఠాలున్న కాంగ్రెస్‌ను ఎదుర్కోవడం చాలా సులభం.
కానీ మూలాలు బలంగా ఉన్న బీజేపీకి ఒకసారి అవకాశం కల్పిస్తే.. ఇక అక్కడ విపక్షాలు మళ్లీ పైకి లేవడం చాలా కష్టమన్న అనుభవాలు, కళ్లెదుటే ఉన్నాయని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. చిన్న పామునయినా పెద్ద కర్రతో కొట్టాలనుకునే కేసీఆర్ సిద్ధాంతం, ఈ విషయంలో ఎలా తప్పిందో అర్ధం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
‘ఒకవేళ మా సార్ భయపడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీనే బలపడిందనుకున్నాం. అయితే ఏమవుతుంది? కాంగ్రెస్‌ది బహు నాయకత్వం. తప్పులు దాని జన్మలక్షణం. దానితో ఎంత వేగంగా బలపడుతుంతో అంతే వేగంగా బలహీనపడుతుంది. కానీ బీజేపీ అలా కాదు. దానికి బలమైన నాయకత్వం ఉంది. మూలాలున్నాయి. ఒకసారి బలపడిందంటే, ఇక దాన్ని బలహీనపరచడం చాలా కష్టం. ఒకవేళ బలహీనపడినా, మళ్లీ బలపడేందుకు దానికి పెద్దగా సమయం అవసరం లేదు. ఈ లాజిక్కును మా సార్ ఎలా మిస్సయ్యారో మాకూ ఆశ్చర్యంగా ఉంద’ని ఓ సీనియర్ టీఆర్ఎస్ నేత వ్యాఖ్యానించారు.
కాగా ఇప్పటికే.. టీఆర్ఎస్-బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నాయని.. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి వంటి నేతలు ఆరోపిస్తున్నారు. అటు రాజకీయ విశ్లేషకులు సైతం.. కాంగ్రెస్‌ను అణచివేయడంలో, కేసీఆర్ సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు. కాబట్టి ఇప్పట్లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని, బీజేపీ కూడా భావిస్తోంది. కేసీఆర్ కాంగ్రెస్‌ను పూర్తిగా బలహీన పరిచిన తర్వాత, ఆ స్థానాన్ని భర్తీ చేయాలన్నది కూడా, బీజేపీ వ్యూహంగా అర్ధమవుతోందని చెబుతున్నారు. ఏపీలో కూడా బీజేపీ ఇదే వ్యూహం అనుసరిస్తున్నందుకే, వైసీపీ సర్కారుకు బీజేపీ పరోక్షంగా సహకారమిస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో చాలాకాలం నుంచీ జరుగుతోంది.
అయితే.. కాంగ్రెస్‌ని నిర్వీర్యం చేసే ఉత్సాహంలో.. బీజేపీ బలాన్ని పెంచుతున్నామన్న నిజాన్ని, తమ నాయకత్వం గ్రహించకపోవడమే వింతగా ఉందని, టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు నిజామాబాద్‌లో.. మామూలు రాజకీయ పరిస్థితిలో అయితే, ఓడిన కవిత మళ్లీ ఎంపీ కావడం పెద్ద సమస్య కాదు. ఒకవేళ అక్కడ కాంగ్రెస్ నేత మధుయాష్కీ గెలిచినా, మళ్లీ కవిత గెలవడం పెద్ద కష్టం కాదు. కానీ ఇప్పుడు అక్కడ బీజేపీ గెలిచినందున, మళ్లీ ఆ స్థానం టీఆర్ఎస్ దక్కించుకోవడం.. చాలా కష్టమవుతుందని విశ్లేషిస్తున్నారు.
Hello there, just became aware of your blog through Google, and found that it’s truly informative. I am gonna watch out for brussels. I’ll be grateful if you continue this in future. Many people will be benefited from your writing. Cheers!