కొందరు కర్మయోగం గొప్పదని, కొందరు భక్తియోగం గొప్పదని, కొందరు జ్ఞానయోగం గొప్పదని కొందరు ధ్యానయోగం గొప్పదని పిడివాదాలు చేస్తూ ఉంటారు. నిజంగా ఈ యోగాలు దేనికది ప్రత్యేకమైనది కాదు. ఒకదాని కొకటి సమన్వయం చేసుకుంటూ అన్నింటిని ఆచరించవలసిందే. భగవద్గీత అన్ని యోగాలకు తగిన స్థానమిచ్చి ఆదరించింది. సాధారణంగా మనం చేసే పనులలో, అన్ని లౌకిక కార్యాలలో కూడా ఈ 4 యోగాలు కలసి ఉండాల్సిందే. అలాంటిది పరమపురుషార్థమైన మోక్షప్రాప్తికి వీటన్నింటి అవసరం లేకుండా ఎలా ఉంటుంది?
ఉదాహరణకు వంట విషయాన్నే తీసుకోండి, వంట అనేది మీరు ప్రతిరోజూ చేసే ముఖ్యమైన పని. ఈ పనిలో కూడా 4 యోగాలు కలిసే ఉండాలి. ఏ యోగం లోపించినా వంట చెడిపోతుంది.
(i) వంట చేయాలంటే బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు అన్నీ సమకూర్చుకోవాలి. కూరగాయలు తరిగి ఉంచుకోవాలి. పొయ్యి వెలిగించాలి. పాత్రలు శుభ్రం చేసుకోవాలి. ఇదంతా కర్మయోగం.
(ii) బియ్యానికి తగినన్ని నీళ్ళు, పప్పుకు తగినంత ఉప్పు, వంటకు తగినంత మంట, వంట చేసే విధానము – ఈ పరిజ్ఞానం ఉండాలి. ఇదంతా జ్ఞానయోగం.
(iii) పాత్రను పొయ్యి మీద పడేసి వీధిలో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే; పాలు పొయ్యి మీద పెట్టి బయట కూరగాయల బేరం చేస్తుంటే – వంటంతా చెడిపోతుంది, స్టౌ ఆరిపోతుంది. కనుక చేసే పనిమీద నిఘా ఉంచాలి. ధ్యాస ఉండాలి. ఇదే ధ్యానయోగం.
(iv) తిట్టుకుంటూ తిమ్ముకుంటూ, లోకులను ఆడిపోసుకుంటూ చేసిన వంట తిన్నవారికి వంటబట్టదు. అది విషంగా మారిపోతుంది. అందువల్ల ఎంతో ప్రీతితో, ఇష్టంతో వంట చెయ్యాలి. తాను చేసిన వంటను ఇంటిలోని వారందరూ ఆరగించి ఆనందించాలి, తృప్తి చెందాలి అని భావిస్తూ, భగవంతుని స్మరిస్తూ, పవిత్రమైన ఆలోచనలతో వంట చెయ్యాలి. ఇదే భక్తియోగం.
ఈ నాలుగు యోగాలూ వంటచేసే వారికే అవసరమవుతుంటే పరమాత్మ ప్రాప్తికై చేసే సాధనలో ఈ నాలుగు యోగాల అవసరం లేకుండా ఎలా ఉంటుంది? 4 యోగాలూ అవసరమే.
(i) కర్మయోగం:- నిష్కామంగా, ఫలాసక్తి లేకుండా కర్మలు చేస్తుంటే మనస్సు కోరికలనే కల్మషాలు అంటక నిర్మలము, శుద్ధము అవుతుంది. మనస్సు నిర్మలము, శుద్ధము అయితేనే భగవంతునిపై నిలపటానికి ఆ మనస్సుకు అర్హత కలుగుతుంది.
(ii) భక్తియోగం:- మనస్సు భగవంతునిపై నిలిస్తే నిరంతరము భగవంతుని స్మరించటము, భగవంతుని మహిమను తెలుసుకోవటము; నిజంగా భగవంతుడు మనకు చేస్తున్న మేలును తెలుసుకొని కృతజ్ఞతా పూర్వకమైన భక్తిని కలిగి ఉండటము జరుగుతుంది.
(iii) జ్ఞానయోగం:- ఇలా భక్తి భావన వృద్ధి అయ్యేకొద్దీ అసలు భగవంతుని తత్త్వం ఏమిటి? భగవంతుడంటే ఎవరు? నేను ఎవరిని? భగవంతునికి నాకు మధ్యనున్న సంబంధమేమిటి? అసలు ఈ జన్మకు సార్థకత ఏమిటి? ఆ భగవంతుని చేరుకొని ఆయనతో ఐక్యత నెలా సాధించాలి? అనే జ్ఞానాన్ని – ఆత్మజ్ఞానాన్ని పొందటం జరుగుతుంది.
(iv) ధ్యానయోగం:- ఆత్మజ్ఞానాన్ని పొందిన తరువాత ఆ జ్ఞానాన్ని అనుభవంలోనికి తెచ్చుకొనుటకు ధ్యానమగ్నులై, విచారణా శీలురై, ఈ దేహేంద్రియ మనోబుద్ధుల కన్న వేరుగా ఉండి, జడమైన వీటికి చైతన్యాన్ని ప్రసాదించే ఆత్మనైన నేను సర్వత్రా ఉన్న సచ్చిదానంద స్వరూప పరమాత్మనే అనే అనుభూతిని పొంది పరమాత్మగా ఉండిపోవాలి. ఇదే ధ్యానయోగం. ఇదే జీవ బ్రహ్మైక్యత; ఇదే జీవన్ముక్తి; ఇదే మోక్షం.
సేకరణ : : శ్రీమద్భగవద్గీత :12 వ అధ్యాయం : భక్తియోగం
✍ వ్యాఖ్యాత : *శ్రీమద్భగవద్గీతపై పూజ్య గురుదేవులు శ్రీ చలపతిరావుగారు చేసిన ప్రవచనములు .
You are a very capable individual!