శారదా పీఠం విశేషాలేంటి?

731

సుమారు రెండు దశాబ్దాలుగా భారత్ దౌత్య ప్రయత్నాల ఫలితంగా సిక్కుల గురువు గురు నానక్ 18 ఏళ్లు గడిపిన పాకిస్థాన్ లోని కర్తార్‌పూర్‌ వద్ద గల గురుద్వారా సందర్శించుకొనే మార్గం సుగమమవుతోంది. ఇప్పుడు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని సనాతన శారదా పీఠం సందర్శనకు ఆటంకాలు తొలగిపోతున్నాయి. శారదా పీఠం కారిడార్ ప్రారంభించేందుకు పాక్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

భారత్ – పాక్ వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని శార్ది అనే చిన్ని గ్రామంలో ఈ పురాతన ఆలయం ఉంది. ఇది కశ్మీర్ లోని కుప్వారాకు సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శారదా పీఠం హిందువుల 5 వేల ఏళ్ల పురాతన ధార్మిక ప్రదేశం. దీనిని మహారాజ్ అశోకుడు క్రీ.పూ.237లో నిర్మించాడు.

శ్రీనగర్ నుంచి 130 కి.మీల దూరంలో ఉన్న శారదా పీఠం అమ్మవారి 18 శక్తిపీఠాలలో ఒకటి. హిందూ పురాణగాథల ప్రకారం ఇక్కడ సతీదేవి కుడి చేయి పడింది. ఈ మందిరాన్ని కశ్యప మహాముని పేరిట కశ్యపపురం అని కూడా పిలుస్తుంటారు. శారదాపీఠంలో సరస్వతీ దేవిని పూజిస్తారు. వైదిక కాలం నుంచి ఇది ఒక విద్యా కేంద్రంగా పేరొందింది. ఋషి పాణిని ఇక్కడ తన అష్టాధ్యాయిని రచించారని ప్రతీతి. ఇది శ్రీవిద్య సాధనకు మహత్వపూర్ణ కేంద్రంగా భాసిల్లింది. శైవ సంప్రదాయాన్ని ప్రారంభించిన ఆదిశంకరాచార్యులు , వైష్ణవ సంప్రదాయాన్ని ప్రచారం చేసిన రామానుజార్యులవారు ఇక్కడ ఎన్నో ఘనతలను సాధించారు. శంకరులు ఇక్కడి సర్వజ్ఞపీఠం పై కూర్చుంటే రామానుజులు ఇక్కడే బ్రహ్మ సూత్రాలపై తన సమీక్ష రాశారు.

శారదా పీఠం ఆలయం అత్యంత పురాతనమైన సరస్వతి దేవాలయం. ఈ ప్రాచీన హిందూ దేవాలయం ప్రక్కనే శిధిలావస్థలో ఉన్న శారదా విశ్వవిద్యాలయం కూడా ఉంది. ముజఫరాబాద్ కు 160 కి.మీల దూరంలో నీలం లోయలో శార్ది గ్రామం నెలకొంది. ఇప్పటికీ ఆనాటి శారదా విశ్వవిద్యాలయం తాలుకు శిథిలాల ఆనవాళ్లు కనిపిస్తాయి. శార్ది గ్రామం నుంచే నీలం నది ( కిషన్‌గంగ) ప్రవహిస్తోంది. శార్ది లేదా సర్ది దగ్గర నీలం నది మధుమతి , సర్గున్ పాయలతో కలుస్తుంది. కాశ్మీర్ లో నెలకొన్న ప్రముఖమైన మూడు తీర్ధాలలో ఇదొక్కటి. మొదటి రెండు మార్తాండ్ సూర్య దేవాలయం , అమరనాథ్ దేవాలయం. ఇక దేశంలోని 18 ప్రసిద్ధ మహా శక్తిపీఠాలలో ఇదొక్కటి.

ప్రాచీన కాలంలో ముఖ్యంగా 6 నుంచి 12వ శతాబ్దం వరకు ప్రముఖ విజ్ఞాన కేంద్రంగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. కల్హణ , ఆదిశంకరాచార్య , వైరొత్సన కుమారారాజివ్ , తొంమి సమ్భోట వంటి ప్రసిద్ధులు ఇక్కడ అధ్యయనం చేసి , ప్రామాణిక గ్రంధాలను వ్రాసారు. పాణిని , హేమచంద్ర ఇక్కడనే సంస్కృత వ్యాకరణాన్ని తయారు చేశారని చెబుతూ ఉంటారు. ఇది హిందువులకు , బౌద్దులకు కూడా ప్రముఖ పుణ్యక్షేత్రం.

ఈ మందిర సందర్శనకి అనుమతించాలని కశ్మీరీ పండిట్లు చాలాకాలంగా కోరుతున్నారు. దేశ విభజన నాటి నుంచి వారు ఈ ఆలయాన్ని సందర్శించలేక పోతున్నారు. 2007 నుంచి వాస్తవాధీన రేఖ దాటడానికి అనుమతి ఇస్తున్నారు. జమ్మూకశ్మీర్‌కు చెందినవారు తమ బంధువులను కలవడానికి అనుమతిస్తున్నారు తప్ప ఆలయ సందర్శనకు అనుమతించడం లేదు. చివరిసారిగా 2007లో కాశ్మీర్ కు చెందిన స్కాలర్ , భారత సాంస్కృతిక సంబంధాల మండలి జమ్మూ – కశ్మీర్ డైరెక్టర్ ప్రొఫెసర్ అయాజ్ రసూల్ నజకి సందర్శించి , ఈ దేవాలయం శిథిలమవుతున్న ఫోటోలు బయటపెట్టారు.

1 COMMENT