ట్రంపు-బైడెన్..మధ్యలో టీడీపీ!

409

చిన బాబును ఆడేసుకుంటున్న విజయసాయి
సోషల్‌మీడియాలో నాటి లోకేష్ ప్రకటనలు
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

అసలు ఇది రాసిన వాడికి బుద్ధి-బుర్ర ఏమైనా ఉందా? ఎక్కడో జరుగుతున్న అమెరికా ఎన్నికలకు.. ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీకీ సంబంధం ఏమిటి? బోడిగుండుకూ-మోకాలికి ముడ్డిపెట్టడం కాకపోతే! ట్రంపు-బైడెన్ పోటీ చేస్తే, మధ్యలో టీడీపీ ఏం చేస్తుంది? అసలు అమెరికాలో ఉన్న ట్రంపు-బైడెన్ హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు సలహా ఎందుకు తీసుకుంటారు?.. ఇలాంటి ప్రశ్నలే కదా మీరు అడిగేది?

ఆగండాగండి. మరీ అంత ఆవేశపడకండి. ఇదంతా..అప్పుడెప్పుడో మన చిన బాబు.. అదేనండీ మన తెలుగుదేశం యువకిశోరం లోకేష్‌బాబు అమెరికా వెళ్లినప్పుడు, ఉత్సాహంతో చేసిన వ్యాఖ్యల ప్రభావమే.. ఇప్పుడీ సోషల్‌మీడియాలో కుండపోతగా కురుస్తున్న సెటైర్ల వర్షం! సోషల్‌మీడియాలో చురుకుగా వ్యహరించే వైసీపీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి.. అప్పటి లోకేష్‌బాబు ప్రటకనను ఇప్పుడు గుర్తు చేసి, చినబాబును ఆడేసుకుంటున్న వైనం నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది.

అమెరికా ఎన్నికల ఫలితాలపై.. ఒకవైపు అంతా యమా టెన్షన్‌తో ఉంటే, మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం.. ఆ టెన్షన్‌ను తగ్గించే కామెడీ ట్రాక్ నడిపించి, అందరినీ నవ్విస్తున్నారు. తాజాగా విజయసాయిరెడ్డి, అమెరికా ఎన్నికలకు సంబంధించి ఒక ట్వీట్ చేశారు. ‘‘బేకింగ్ న్యూస్: చంద్రబాబుకు పోటాపోటీగా ట్రంప్, బైడెన్ ఫోన్లు. తమ ఎన్నికల కమిషన్‌ను, సుప్రీంకోర్టును ఎలా మేనేజ్ చేయాలనే అంశాలపై సంప్రదింపులు’’ అని ముందు ఒక ట్వీట్ చేశారు.

ఆ తర్వాత.. లోకేష్ గతంలో ఇచ్చిన ప్రకటనను ట్యాగ్ చేస్తూ.. ‘‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 538 సీట్లకు, టీడీపీకి 503 సీట్లు డెమాక్రాట్లకు 20, రిపబ్లికన్స్‌కు 15 సీట్లు వచ్చే అవకాశం-లగడపాటి సర్వే’’ అని చేసిన ట్వీట్లు, నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. అది చాలదన్నట్లు.. వైసీపీ సోషల్ మీడియా వీరులు చేస్తున్న కామెంట్లు, అదనపు వినోదంగా మారాయి.

అంటే చంద్రబాబు నాయుడు ఈసీ, ఎస్‌సీని మేనేజ్‌చేయడంలో సమర్ధుడన్నది విజయసాయి కవిహృదయంగా కనిపించింది. ట్రంపు సుప్రీంకోర్టుకు వెళతానన్న ప్రకటన నేపథ్యమే, విజయసాయి తొలిట్వీట్ తాత్పర్యంలా అర్ధం చేసుకోవాలి. ఇక గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందన్న.. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేను కూడా ప్రస్తావించడం ద్వారా, విజయసాయి ఆయననూ వదిలిపెట్టలేదు. మరి దీనితో ఎలాంటి సంబంధం లేని లోకేష్‌ను.. విజయసాయి ఎందుకు ఎంటర్ చేశారన్నదే కదా అందరి సందేహం? ఉంది. దానికీ లాజిక్కు లేకపోలేదు.

అప్పుడెప్పుడో మన చినబాబు, అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో లోకేష్‌కు స్వాగతం చెప్పేందుకు, ప్రవాసాంధ్రులు.. ముఖ్యంగా తెలుగు‘జాతి’వారు పోటీలు పడ్డారు. న్యూజెర్సీలో చేసిన ఆ హడావిడిని చూసి, ఉత్సాహం ఆపుకోలేని లోకేష్.. ‘‘ మీ ఉత్సాహం చూస్తుంటే అమెరికాలోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనిపిస్తుంద’’ని మనసులోమాట బయటపెట్టారు. అమెరికాలో ఎప్పుడో చినబాబు చేసిన ఆ వ్యాఖ్యను, ఈ అమెరికా ఎన్నికలఫలితాల సమయంలో, విజయసాయి బయటపెట్టారు. ఇంత ఉత్కంఠ సమయంలో కూడా విజయసాయి చేసిన వెటకారం, సోషల్‌మీడియా ‘తమ్ముళ’్లను ఇరుకునపెట్టింది. విజయసాయి తన ట్వీట్‌లో, నాటి లోకేష్ వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్పింగును ట్యాగ్ చేశారు. అదీ సంగతి!