స్వరూపానందులకు..సేవానందలహరి!

185

టీటీడీ అధికారుల సేవ చూడతరమా?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఆయన జగద్గురువే కాదు. ‘జగన్గు’రువు కూడా. ఆ రెండేకాదు. లోకరక్షకుడు. అంతకంటే ముందు విశాఖ రక్షకుడు కూడా! ఆ స్వామివారు అక్కడ నడయాడుతున్నందుకే, విశాఖ శత్రుదుర్భేద్యంగా మారింది. నేను ఉన్నాను-నేను విన్నాను అని జగనన్న మాదిరిగా చెప్పకపోయినా.. ఆయన ఉన్నారన్న భరోసాతోనే అక్కడ నౌకాదళం ఏర్పాటుచేశారన్నది ఓ ప్రతీతి. స్వామివారు విశాఖలో లేకపోతే ఎగసిపడే సాగర కెరటాలు, ఆయన వచ్చాకనే శాంతిస్తాయన్నది ఓ నానుడి. ఆయన దగ్గరికి సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు.. సాధారణ రేషన్‌డీలర్ల సంఘం నాయకులు కూడా వచ్చి, తమ ఈతిబాధలు వెళ్లబోసుకుంటారు. అంత ‘పవర్’ఫుల్ స్వామి ఆయన! ఇద్దరు స్వాములు సెలవిచ్చారుగా..ఇక జగన్ హిందువే!

ఆ స్వాములోరే స్వయంగా.. క్రైస్తవుడిగా ఉన్న జగన్‌బాబును, గంగలో మూడు మునకలేయించి, ‘కరుడుగట్టిన హిందూవాది’గా మార్చారని, మన నందమూరి లక్ష్మీపార్వతమ్మ తాదాత్మ్యంతో ధృవీకరించారు. అలాంటి ‘అభినవ ఆదిశంకరాచార్య’ కరుణా కటాక్షాలు, కఠోర తపస్సుతోనే మన జగనన్న.. దేశం మెచ్చిన నలుగురు ఉత్తమ ముఖ్యమంత్రుల్లో ఒకరు కాగలిగారు. అంటే స్వామివారు ఒక ఉత్తమ ముఖ్యమంత్రిని దేశానికి అందించారన్నమాట! స్వాములోరు.. మాట్లాడారోచ్!

ఆ తపస్వి- రాజర్షి-మహర్షుల వారి చల్లని చూపులు ప్రసరిస్తున్నందుకే.. ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి, అన్ని రంగాల్లో పంచకల్యాణి గుర్రం కూడా ఈర్ష్యపడే స్థాయిలో, పరుగులు తీస్తోంది. మరి అలాంటి భగవంతుడి అవతారమయిన స్వామివారు.. ఎయిర్‌పోర్టుకు వస్తే, టీటీడీ అధికారులు ఆయనకు ఎదురేగి స్వాగత సత్కారాలివ్వడం కూడా తప్పేనా? కలికాలం కాకపోతే.. అసలు అది కూడా ఒక వార్తనా? ఇవీ.. నడిచే దేవుడయిన, విశాఖ పీఠాథిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివారి భక్తకోటి.. ఆవేదన-ఆర్తి-ఆగ్రహం కలగలిపి కారుస్తూ, సంధిస్తున్న ‘భక్తకన్నీటి’ ప్రశ్నలు.

లేటెస్టుగా విశాఖ స్వాములోరు, తిరుమల దర్శనానికి వెళ్లారు. సరే.. ఆ పిచ్చికాలంలో అంటే శంకరాచార్యుల వారంటే.. ఫ్లెక్సీ స్వాగతాలు, పేపర్ యాడ్స్, పోలీసు కాన్వాయ్, వీవీఐపీలు పక్కన లేకుండానే దేశమంతా పాదయాత్ర చేశారు. మరి ఇప్పుడూ అలాగే చేయాలంటే ఎలా? ఎంచక్కా విమానాలు, బెంజికార్లు ఉన్న ఈ కాలంలో కూడా.. పాతకాలపు శంకరాచార్యుల మాదిరి నడిస్తే, పెద్ద ఇమేజ్-మీడియా కవరేజీ ఏముంటుంది? అందుకే విశాఖ స్వాములోరు, సరదాగా విమానంలో వచ్చారు. దానిపై కూడా విమర్శలు! హేమిటో? హెందుకో అర్ధం కాదు.

మరి అంతలావు సర్కారీ స్వాములోరు ఎయిర్‌పోర్టుకు వస్తే, ఆయనకు బాజా భజంత్రీలతో కాకపోయినా, కనీసం శాలువ-జగన్ననమాల.. సారీ.. గజమాలతో వెళ్లయినా స్వాగతించాలి కదా? మన టీటీడీ చైర్మన్ సహిత అధికారులు, ఎయిర్‌పోర్టుకు ఎదురేగి.. అలాగే స్వామివారిని స్వాగతించారు. ఒక రాజర్షికి చేసిన ఈ సాదాసీదా సన్మానం-గౌరవానికే సోషల్ మీడియా, గిట్టని రాజకీయ పార్టీలు గావుకేకలు పెట్టి.. గాయిగత్తర చేయడం స్వామివారి, అనంతకోటి భక్తులకు సుతరామూ నచ్చడం లేదట. వారి సున్నిత హృదయాలు గాయపడ్డాయట.

అసలు స్వామివారి మహత్తు- త్యాగం ముందు.. ఈ గజమాల సన్మానాలు ఏ మూలకు పనికివస్తాయన్నది వారి ప్రశ్న. మరి స్వామి వారు తిరుమలకు వెళ్లినప్పుడు, శ్రీ వేంకటేశ్వరుడు కొండ దిగి, ఆయనకు స్వాగతం పలికే వీలు లేదు కదా? ఇప్పటికయితే వారికి ఆ ప్రొటోకాల్ ఇంకా కల్పించలేదు. కాబట్టి, ఆ ప్రకారం.. శ్రీవారి ప్రతినిధులుగా టీటీడీ అధికారులు, చైర్మన్ వస్తే తప్పేంటి? ఆయనకేమీ మణులు మాణిక్యాలు ఇవ్వలేదు కదా? జస్ట్. ఎయిర్‌పోర్టుకు వెళితే తప్పేంటన్నది స్వామివారి భక్తుల ప్రశ్న. అవును మరి. వారి వేదనా వినదగ్గదే!

నిజమే.. నిజానికి స్వామి వారు వచ్చినప్పుడు శ్రీవారే స్వయంగా వచ్చి స్వాగతించాలి. అలాంటి ప్రొటోకాల్ పాటించటం.. ఈ యుగంలో విగ్రహరూపంలో ఉన్న, ఆ యుగం శ్రీవారికి తెలియదు. కాబట్టే తన ప్రతినిధులుగా అధికారులను పంపారని సరిపెట్టుకోక, ఈ యాగీ ఏమిటి? అందుకే కదా గతంలో కూడా, రాజర్షుల వారిని మూలవర్లకు అలంకరించే ఆకుతో చేసిన రామచిలకను, తిరుమల నుంచి అలిపిరికి తెచ్చిన.. ‘ధర్మాత్ముడైన ధర్మాధికారి’, మన ధర్మారెడ్డిని భక్తులు తెగ మెచ్చుకుంది? గోశాలను-అందులోని గోవుల జన్మను, ధన్యం చేసేందుకు వచ్చిన మహర్షుల వారిని.. డాలర్‌శేషాద్రి వంటి సంఘసేవక స్వామి సహా, అధికారులు వచ్చి, మేళతాళాలు-బాజా భజంత్రీలతో స్వాగతించి, భక్తుల మెప్పు పొందింది కూడా అందుకే కదా?

ఇవన్నీ తెలియని పిచ్చి వాళ్లు, మతిలేని గతితప్పిన వాళ్లంతా.. స్వామివారిని ఆడిపోసుకోవడం మహాపచారమే కదా? అయినా మన పిచ్చి గానీ.. ‘పైవాడి’ ఆజ్ఞలేకపోతే.. స్వామి వారికి ఇంత భోగం పడుతుందా చెప్పండి? ఆ ‘పైవాడి’ ఆజ్ఞలేక, ఆగ్రహంతోనే కదా.. తమిళనాడులో కంచిస్వామివారు చెరసాలపాలయింది! హేమిటో.. ఈ జనం హెప్పుడు మారతారో హేమో?! విశాఖకు… ‘విశాఖ స్వామి’ వారి ఆశీస్సులు లేవా?