నిరీక్షణ

కన్నతల్లి తలను నరికిన కధను పురాణాలలో విన్నాం….

అది పితృవాక్య పాలనా అంటూ సరిపుచ్చుకున్నాం….!

తండ్రి ఇచ్చిన వరంతో ఆ కొడుకే నరకబడిన తల్లిని..

బ్రతికించుకున్న వైనాన్ని విని ఆహో..ఓహో…అనుకున్నాం… ! !

తన తల్లిని చంపడమే కాకుండా గుండెనే కోసి పట్టుకెళ్ళాడు ఓ ప్రభుద్ధుడు…

అట్లాంటి కసాయి కొడుకు కాళ్ళకి ముళ్లు గ్రుచ్చుకుంటే తల్లి గుండె విలవిలలాడిందట…!

ఇట్లాంటి ఓ ఆభాగ్యపు తల్లి యొక్క అమ్మతనపు మమకారాన్ని పురాణాలలో చదివాం..!!!

పండుటాకు మాదిరి వయస్సు మీరిన తల్లితండ్రులను

కారడవులలో వదిలి వేయబడిన వైనాన్ని ఇతిహాసలలో చదివాం… !

తమను వదిలిన అనంతరం కారడవులలో

కొడుకు దారి తప్పకుండా గుర్తులను వదిలిన ఆ తల్లితండ్రుల

వైనాన్ని తలచుకుని విలవిలలాడేం…. ! !

పక్షవాతంతో అచేతనురాలైన కన్నతల్లిని

మేడ మెట్లమీద నుండి త్రోసి చంపేసిన “పూనా” నగరంలోని

ఓ ప్రబుద్ఢుడి నిర్వాకాన్ని చూసి నిస్తేజులం అయిపోయాం… ! !

యుగం, కాలం ఏదైనప్పటికీ జరిగిన అయా సంఘటనల సారాంశం ఒక్కటే…! పండుటాకు వయస్సులో  నిస్సహాయత కాలనా అమ్మతనం మమకారం మోసపోతోంది.!!…నాన్న తనపు అనురాగం నెవ్వెర పోతోందని.. ! !

మనుషులలోని ఈ కర్కశత్వపు దృక్పధం మారటం లేదు…సంఘటనల తాలుకు రూపం మాత్రమే మారుతోంది. ఇటువంటి కర్కశత్వానికి తరతరాలుగా బలవుతున్న కొందరి ఆవేదనకు అద్ధం పట్టే ప్రయత్నమే  ”నిరీక్షణ” అనే ఈ కధానిక….. ! !

*

అది రామపురం ర్తేల్వే స్టేషన్….

రాత్రి సమయం…..

ఆకాశం మంచును కురిపిస్తూ భూమిని పలకరిస్తోందా అన్నట్టు ఉంది. స్టేషన్ లోని దీపాలు కొన ఊపిరితో వెలుగుతూ..ఆరుతూ ఉన్నాయి…ఆ స్టేషన్ లోని సిమెంట్ బెంచీపై అసహానంగా రాఘవయ్య పడుకుని ఉన్నాడు… అతనికి తోడు అన్నట్టుగా చూట్టూ ఆవరించి ఉన్న చీకటి..

చంద్రుడు దేని కోసమో వెతుకుతూన్నట్టుగా ఆకాశంలో ఆరాటంగా పరుగులు తీస్తూ ఉన్నాడు…ఆ నడుమే రాఘవయ్య చూపులు కూడ రైలు బండి వచ్చే దిశలో ఆశగా దేనికోసమో ఎదురు చూస్తున్నాయి… ఒక్క క్షణంపాటు రాఘవయ్య ఆలోచనలు గతంలోకి పరిగెట్టాయి…

*

“అయ్యో…రోజు వచ్చే నా పెద్ద కొడుకు ఈ రోజు ఇంకా రాలేదు..ఏమైందో ఏమో అంటూ…నాగమణి ఏడుపు లంకించుకుంటోది..”….ఆమెను ఊరడింపు చేస్తున్నట్టుగా ఆ ఓల్డ్ ఏజ్ హోం లోని మిగిలిన వారు చుట్టూ గుమికూడారు…

ఏమ్మా..వర్షం వస్తోంది కదా..!….తడవకుండా ఏ మూలనో నక్కి ఉంటాడు…ఆ మాత్రం దానికి ఎందుకు ఇంతగా బాధ పడటం..??….అయినా సాయంత్రం సమయానికి ని చిన్న కొడుకు చంద్రం ఎట్లాగో వస్తాడు కదా అతని అడిగి తెలుసుకుందాల సూర్యం ఈ రోజు ఎందుకు రాలేదో అని..??…అంటూ నాగమణిని  రాఘవయ్య అతని భార్య అనసూయ్యమ్మ ఓదారుస్తున్నారు.

ఇంతలో…..

“అమ్మ నీకు మనియార్డరు వచ్చింది…వచ్చితీసుకో…” అమ్మ అంటూ  పోస్ట్ మేన్ కేక పెట్డాడు…వచ్చేవా నాయనా…నీ కోసమే ఎదురు చూస్తున్నాను అంటూ పరుపరుగున నాగమణి అతని దగ్గరికి అత్రుతగా అడుగులు వేసింది….

ఏమిటండీ ఈ మధ్యన నాగమణి దోరణి ఏమి అర్ధం కావటం లేదు…ప్రతి దానికి తాను భయబడుతూ మనల్ని కూడ కంగారు పెడుతోంది అని అనసూయ్య రాఘవయ్య తో అంటోంది.

మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు… తనకి బాధ కలిగితే అమ్మా అని విలపించడమే తప్ప, తనని అమ్మ అని పిలుపించుకునే అదృష్టానికి  నోచుకోలేదు.. ఎందుకంటే నాగమణి కి పిల్లలు లేరు..భర్త ఎప్పుడో పోయాడు… ఆమె బాధ్యత తమకు ఎక్కడ అంటుకుంటుందో అని కొందరు బంధువులు మోహం చాటేశారు.. మరికొందరు తలో కొంత మెత్తాన్ని ఈమెకు పంపిస్తున్నారు… ఆ డబ్బులే ఆమెకు ఆధారం..!!… తాను ఒంటరిని అనే బాధని మర్చిపోడానికే పరిసరాల్నే తన కుటుంబం అని అనుకుంటూ ఉంటోంది….అందుకే ఉదయించే సూర్యుడిని పెద్ద కొడుకు అని,, చల్ల పడ్డాక వచ్చే చంద్రున్ని తనని జోల కొట్టించే చిన్న కొడుకు అని భావిస్తూ బ్రతుకుతోంది….మనియార్డర్ రూపంలో తనకు సొమ్మును తీసుకొచ్చే పోస్ట్ మాన్ ని తోబుట్టువు అనుకుంటుంది…అని రాఘవయ్య మాష్టారు అనసూయమ్మతో అంటున్నాడు…

ఈలోపుగా పోస్ట్ మాన్ దగ్గర సొమ్ము తీసుకున్న నాగమణి రాఘవయ్య దంపతుల వద్దకు వచ్చింది… “నా తమ్ముడు కి బిడియం ఎక్కువ…ఓరే తమ్ముడు పెన్షన్ సొమ్ముని తీసుకుని వచ్చేవు కదా.. ఏమైనా ఖర్చులకు ఉంటాయి ఈ వంద రూపాయలు ఉంచుకోరా ..” అంటూ ఏంత చెప్పినా ఆ పోస్ట్ మాన్ వినడం లేదు…అంటూ చేతిలోని సొమ్మును తన ట్రంకు పెట్టిలో దాచుకోడానికి తన గదిలోకి వెళ్ళింది…..కపటత్వం ఎరుగని ఆమె అమయాకత్వాన్ని చూసిన రాఘవయ్య కంటతడి పెట్టాడు ఆ క్షణంలో..!

“మన పరిస్ధితి మాత్రం ఏమి గొప్పగా ఉందని.??…. రెక్కలొచ్చాక సంపాదన యావతో మనల్ని   పిల్లలు భారంగా భావించారు…దెబ్బతో ఇక్కడకి వచ్చి పడ్డాం…నా అన్నవాళ్ళు లేక నాగమణి మరియు మనలాంటి వాళ్ళు ఎందరో ఇట్లాంటి ఓల్డ్ ఏజ్ హోంలలో మగ్గిపోతున్నారు…మొత్తం మీద ఓ గూటి పక్షులందరం ఒకచోట గుమికూడాం అని అనసూయ నిఘ్ఠరంగా బాధతో అంటోంది…భుజం తడుతూ ఆమెను ఓదారుస్తున్నాడు రాఘవయ్య.

రాఘవయ్యకి ఇట్లాంటి సంఘటనలు నిత్య కృత్యమే…తాను ఉంటున్న ఓల్డ్ ఏజ్ హోం లోని వారిని ఎవరిని కదిపినా ఇటువంటి హృదయ వేదనలే వినిపిస్తూ ఉంటాయి.. అటువంటి వేదనతో బాధపడేవారిని..రాఘవయ్య, అనసూయ లు ఊరడిస్తూ ఉండటం రివాజై పోయింది….!!

సరిగ్గా అదే సమయంలో వంట పూర్తయ్యింది…అందరు రండి అంటూ సిగ్నల్ బెల్ ను నిర్వాహకులు వినిపించడంతో హోంలో ఉన్నవారందరు భోజనశాల కి చేరుకుంటున్నారు….

భోజనం చేస్తున్నంతసేపు అలోచనల్లో మునిగిపోయింది రాఘవయ్య భార్య…

ఇది తాతయ్య ముద్ద…ఇది నింగిలోని చందమామ ముద్ద…అంటూ పసితనపు పాలబుగ్గలను నిమురుతూ తమ పిల్లలకు అన్నం తినిపిస్తున్న సందర్భం రాఘవయ్య భార్య కండ్ల ముందు కదలాడింది., తామిద్దరూ తమ పసివారిని  తమ గుండెలపై నడిపించుకుంటూ నడక నేర్పిస్తూ ఆనంద పడిన  సందర్భాలు కండ్ల ముందు తచ్చాడాయి రాఘవయ్య భార్య…కి..!!… అంతటి ప్రేమాభిమానాలు చూపిన తమర్ని ఈ రోజు భారమైపోయాం అని పిల్లలు భావిస్తున్నారు అని అనుకుంటూ అంటూ బాధతో భర్త రాఘవయ్య మొహం కేసి చూసింది..

ఆమె భావం అర్ధం అయ్యినట్టుగా జాలీగా చూస్తున్నాడు రాఘవయ్య…”వారికి నడకను నేర్పాం…భవిష్యతను నిర్మించి ఇచ్చేం…కాని మంచి నడతను ఇవ్వలేకపోయాం………కాస్తంత నీడ…ఓ గుప్పెడు ప్రేమ అనురాగాలు, అప్యాయతను ఆశించే ఈ పండుటాకు వయస్సులో మనల్ని భారంగా చూస్తున్నారు..రోజులు అట్లా తయారయ్యాయి..

అయినా మన నుదిటిరాత ఆ విధంగా రాసి ఉంటే మనం మాత్రం ఏమి చేస్తాం…ఇది మన ఒక్కరి సమస్యే కాదు ఈ రోజుల్లో…..అయినా మనకి ఏమి తక్కువని ఇప్పుడు…నాకు నువ్వు..నీకు నేను తోడు ఉన్నాం కదా…అంటూ తన భార్య కండ్లలోంచి వస్తున్న కన్నీరును తుడుస్తున్నాడు రాఘవయ్య….!!

భోజనాలు ఆనంతరము ఓల్డ్ ఏజ్ హోం లోని వారందరూ నిద్రకి ఉపక్రమిస్తున్నారు… కండ్లు మూసుకుందన్న మాటే కాని రాఘవయ్య భార్యకి నిద్ర రావడం లేదు..!!….లోలోపల మదన పడుతూనే ఉంది…!!..  అవిరైపోతున్న మమతానురాగాలు…పండుటాకు వయస్సులో నిస్సహయతగా మారుతున్న తమలాంటి వారి జీవితాలు గురించి దీర్ఘలోచనలో పడింది రాఘవయ్య భార్య……ఇది ఏమి పట్టనట్టుగా నిద్రపోతున్న తన భర్త వైపుకు చూసి..మీరెంత అదృష్టవంతులండి ఇట్లాంటి దుస్ధితి విధి రాత అని సరిపుచ్చుకుని నిద్రపోతున్నారు..అంటూ పైట కొంగుతో తన కళ్ళని తుడుచుకుంటూ నిద్రపోయే ప్రయాత్నాలను చేస్తోంది అనసూయ్య..

కాని ఆమె ఆవస్ధని చూసిచుడనట్లుగా ఓరకంటితో గమనిస్తూనే ఉన్నాడు రాఘవయ్య…ఆమె నిద్రపోతుందన్న నిర్ధారణకు వచ్చి ఆమెకు దుప్పటి కప్పుకప్పి తానుకూడ నిద్రలోకి జారుకునే ప్రయత్నం చేస్తున్నాడు రాఘవయ్య… !!

·         * *

తెల్లవారింది….తొలిపొద్దు పొడుపులను ప్రసరిస్తూ భానుడు ఉదయిస్తున్నాడు…. పక్షలు గూడులను వదిలి రెక్కలరాని తమ పిల్లల కోసం ఆహార వేటకే బయలు దేరుతున్నాయి…

సమయం 6 గంటలు దాటుతోంది…రాఘవయ్య బద్ధకంగా ఆవలిస్తూ ఆదమరిచిన నిద్రలోఉన్న తనభార్య మోహంవైపు చూస్తున్నాడు…ఈ పాటికే నిద్రలేచి ఉండేది…భారమైన ఆలోచనలతో మనస్సు బరువెక్కి ఉంటుంది. అందుకే మంచి నిద్రలో ఉన్నట్టుంది పాపం అనుకుంటూ రాఘవయ్య అనుకుంటున్నాడు…

రాఘవయ్య చూపులు ఓల్డ్ ఏజ్ హోం దగ్గరలోని మార్కెట్ వైపుకు పరిగెట్టాయి. బజారు అంతా కోలహాలంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు వినాయక చవితి.. మార్కెట్ కి వచ్చే పోయే వాళ్ళతో సందడి పెరుగుతోంది….

రాఘవయ్య కి ఒక్కసారి గుర్తుకొచ్చింది…వినాయక చవితినాడు ఉదయానే తన పిల్లల్ని సైకిలుపై కూర్చోపెట్టుకుని మట్టి వినాయకుని కోనడం కోసం బజార్ల వెంట పరుగెట్టడం…అంతేనా ..అక్కడ బజార్లలో అమ్మబడుతున్న మిఠాయిలను, మొక్కజొన్న కండెలను…యాపిల్ పండ్లను కొనమని పిల్లలు మారం చేయడం..వంటి సంఘటనలు గుర్తుకొచ్చాయి రాఘవయ్యకి. తన ప్రయత్నం లేకుండానే ఆ సమయంలో తన పెదవులనుండి చిరునవ్పు తొణికసలాడింది రాఘవయ్యకి…అట్లా ఎంతో ప్రేమతో పెంచిన పిల్లలకు నేడు భారమైపోయాం అనకుంటూ నిద్రపోతున్న భార్యకేసి మరోమారు చూసాడు రాఘవయ్య.

ఈ రోజు ఇంకా అనసూయ్య నిద్రలేవలేదు ఏమిటి అనుకుంటున్నాడు రాఘవయ్య… మరో పక్క చల్లటి చిరు గాలులు వేస్తున్నాయి…ఆ గాలికి నిద్రపోతున్న అనసూయకి తల ముంగురులు మోహం మీద పడుతున్నాయి…అయ్యో ఆమెకి ఎక్కడ నిద్రభంగం అవుతుందో అని ఆనుకుంటున్నాడు రాఘవయ్య…నెమ్మదిగా ఆ ముంగురులను మోహంపై నుండి తీసే ప్రయత్నం చేస్తున్నాడు రాఘవయ్య…ఎందుకో ఆమె శరీరం చల్లగా తగిలినట్టు అనిపించింది రాఘవయ్యకి…అనుమానం వచ్చి భార్య చెయ్యిపట్టుకుని చూసాడు…

ఆ క్షణంలో తనకు వచ్చిన అనుమానం నిజం కాకపోతే బాగుండును అనుకుంటున్నాడు……కాని విధి వక్రికరించింది… భారమెక్కిన గుండెలతో తనభార్య ఆదమరిచి  పడుకున్నది శాశ్వత నిద్రలో అని.  …తన గుండె కొద్ది కొద్దిగా వేగంగా కొట్టుకోవడం ప్రారంభం అయ్యింది రాఘవయ్యకి……బాధతో కంట్లో నుండి కన్నీళ్లు రావడం ప్రారంభం అయ్యాయి…ఆక్షణంలో ఏమి జరుగుతోందో అర్ధం కాలేదు రాఘవయ్యకి…

అయ్యో.. “ఈ దంపతులు ఇద్దరు అందరికి తలలో నాలుకలో ఉండేవారు…మన ఎవరికి ఏ మాత్రం బాధ కలిగినా పెద్ద రికంతోను, మంచి మాటలతోను మనల్ని ఊరడించేవారు..రాఘవయ్యని ఒంటరి వాడిని చేసేసి తాను వెళ్ళిపోయింది…పాపం ఈ వయస్సులో రాఘవయ్యకి ఎంత కష్టం…” అని చుట్టు మూగిన మిగిలిన పండుటాకులు విలపించాయి…

“వ్యవధి లేనందున రాలేక పోతున్నాం….అమ్మ పేరన ఇక్కడే మేము కార్యక్రమాలను చేసేస్తాం. డబ్బు పంపిస్తున్నాం మిగిలిన కార్యక్రమాల్ని అక్కడే మీరు చేసేయండి…మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి నాన్నగారు…” అంటూ విదేశాలలో ఉన్న పిల్లలు కబురు చేశారు. ఆ  విషయాన్ని సదరు హాస్టల్ నిర్వాహకుడు రాఘవయ్యకి చెప్పాడు…ఆ వార్త మరింతగా క్రుంగి తీసింది రాఘవయ్యని….!!!

·         * *

గతాన్ని తలచుకుని అలసిపోయిన రాఘవయ్య మనస్సు ఒక్కసారిగా వర్తమానంలోకి వచ్చింది.

ఆ క్షణంలో చుట్టూ ఉన్న ప్రకృతి కూడ తనలాంటి స్ధితిలోనే ఉన్నట్లుగా రాఘవయ్యకి తోచింది….అందని ఆకాశం కేసి చూస్తున్న కొండలు…చెప్పుకోలేని రాఘవయ్య యొక్క బాధల లోతువలె వాటి మధ్య ఆగాధం.. బాధతో విడిస్తున్న తన కనీళ్ళవలె వాటి గుండేల్లోంచి ప్రవహించే చిన్న చిన్న వాగులు….

సరిగ్గా ఆసమయంలోనే రైలుబండి వస్తున్న శబ్ధం వినిపించడంతో రాఘవయ్య ఆలోచనలకు తెరపడింది..వచ్చే రైలుబండిలో తనవారంటూ వస్తారేమో అని రోజులాగే రాఘవయ్య చూపులు రైలు వచ్చే వైపుకు పరిగెడుతున్నాయి….

తాను ఆశ నిరాశే అయ్యింది ప్రతిసారి లాగే…. ! !

ఆ క్షణంలో రాఘవయ్యకి అనిపించింది…చివరి రోజులలో భార్య జ్ఞాపకాల నడుమ తన శేష జీవితాన్ని ఓల్డ్ ఏజ్ హోంలోనే గడిపియాలి అనుకున్నాడు…అక్కడున్న తనలాంటి నిస్సహాయ పండుటాకుల్నే తనవారని అనుకోవాలి అంటూ….

“తనకు కలిగిన ఈ దుస్ధితి మరెవరకు రాకుడదు…ఈ వ్యవస్ధ మార్పుచేందే విధంగా మనుషుల దృక్పదంలోను మార్పు రావాలి…అట్లాంటి రోజు కోసం నేను ఉండాలి..ఆలాంటి రోజు  వస్తే నేను చూడాలి అనుకుంటూ భుజం మీద ఉన్న తుండు గుడ్డను దులుపుకుంటూ ఓల్డ్ హోం ఏజ్ హోం కేసి భారంగా అడుగులు వేస్తున్నాడు రాఘవయ్య….!!!

రాఘవయ్య లాంటి మరెందరో “నిరీక్షిస్తున్న” అట్లాంటి రోజు వస్తుందని అశిద్దాం…!!!

శ్రీపాద శ్రీనివాస్

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
Close Bitnami banner
Bitnami