అద్వానీజీ ఒక సజీవ ప్రేరణ–ప్రధాని మోడీ

537

భాజపా కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అడ్వాణీకి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజానీకానికి, భాజపా శ్రేణులకు అడ్వాణీ ఓ సజీవ ప్రేరణ అని ప్రధాని కొనియాడారు. 93వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటున్న ఆయన.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో హోం మంత్రి బాధ్యతలు నిర్వర్తించి కీలకంగా నిలిచారని అన్నారు. దేశాభివృద్ధితోపాటు పార్టీని విజయతీరాలకు చేర్చడంలో అడ్వాణీ కృషి నిరుపమానమన్నారు.

” దేశాభివృద్ధికి, పార్టీ ఎదుగుదలకు విశేష సేవలందించిన ఎల్‌కే అడ్వాణీకి జన్మదిన శుభాకాంక్షలు. ఎంతో మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలకు ఆయన ఆదర్శప్రాయుడు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.” అంటూ హిందీలో ట్వీట్‌ చేశారు. ఎల్‌కే అడ్వాణీ 1927 నవంబరు 8న కరాచీలో జన్మించారు. భారత్‌ విభజన తర్వాత అడ్వాణీ కుటుంబం భారత్‌లో స్థిరపడింది.

భాజపా వ్యవస్థాపక సభ్యుల్లో అటల్‌ బిహారీ వాజ్‌పేయీతోపాటు ఈయన కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఎక్కువ సార్లు భాజపా జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఈయనే. జాతీయ రాజకీయాల్లో పార్టీ ఎదుగుదలకు అడ్వాణీ చాలా కృషి చేశారు.