సేవా వటవృక్షం ఆనంద ధామం

155

జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నా, తమవారనేవారు దగ్గర లేకపోయినా ఆ వృద్ధులలో బెంగ, నిరాశ ఎక్కడా కనిపించవు. కళ్ళలో జీవితాను భవం, ముఖంలో ఎప్పుడు చెదరని చిరునవ్వు దర్శనమిస్తాయి. మధ్యప్రదేశ్‌ ‌రాజధాని భోపాల్‌లో సేవభారతి నిర్వహిస్తున్న ‘ఆనంద ధామమ్‌’ ‌వృద్ధులకు నిజంగా ఆనందాశ్రమమే. ఇక్కడ అనేకమంది వృద్ధులు ఆనందంగా, ఒక కుటుంబంలా కలిసి గడుపుతారు.

సమాజంలో ప్రస్తుత పరిస్థితులు, అందులో వృద్ధుల స్థితిని దృష్టిలో పెట్టుకుని సేవభారతి ఈ ఆశ్రమాన్ని ప్రారంభించింది. తులసి రామాయణంలోని అద్భుత విషయాలను అలవోకగా వివరించగలిగే శ్రీ రాజేంద్ర ప్రసాద్‌ ‌గుప్త వంటివారు 15 ఏళ్లుగా ఇక్కడ నిశ్చింతగా జీవిస్తున్నారు. ఒక ప్రైవేటు విద్యాసంస్థలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన గుప్తా తన కవితలతో అందరినీ ఆనందపరుస్తూ ఉంటారు. పేద పిల్లలకు పాఠాలు చెపుతారు.

ఆనంద ధామమ్‌ 2005 ‌డిసెంబర్‌ 18‌న ప్రారంభమయింది. ఇక్కడ 15మంది మహిళలు, 14మంది పురుషులు ఉంటున్నారు. ఆనంద ధామమ్‌ ‌తోపాటు సేవభారతి ఆధ్వర్యంలో ఇక్కడ యోగా కేంద్రం, ఫిజియోథెరపీ, న్యూరోథెరపి సెంటర్‌, ‌వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కేంద్రం, ఉచిత న్యాయసలహ కేంద్రం కూడా నడుస్తున్నాయి. ఇక్కడి హోమియో చికిత్సా కేంద్రంలో ప్రతి నెల కనీసం 500 మందికి పైగా ఉచితంగా మందులు పొందుతున్నారు.

ఆనంద ధామంలో ఉదయం యోగా నుంచి సాయంత్రం భజన వరకు దైనందిన చర్య సాగుతుంది. ప్రతి రోజు సాయంత్రం 4 నుండి 6 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అనేకమంది సేవాభావం కలిగిన వ్యక్తులు ఇక్కడికి వచ్చి వృద్ధులతో గడుపుతుంటారు. కొందరు తమ పిల్లల పుట్టినరోజు ఉత్సవాలు, ఇతర పండుగలను ఇక్కడే జరుపుతారు.

ఈ ఆనంద ధామమ్‌లో మహిళలు, పురుషులకు వేరువేరుగా నివాసభావనాలు, ఆరోగ్య కేంద్రం, ధ్యాన కేంద్రం, దేవాలయం, ఉద్యానవనం, భోజనశాలతోపాటు గ్రంధాలయం కూడా ఉంది. అత్యవసర వైద్య సదుపాయం అందించడం కోసం ఒక అంబులెన్స్ ‌కూడా ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో కధ ఉంది. గాయత్రి గారు జీవితాంతం కుటుంబ బాధ్యతలు నిర్వహించారు. వివాహం కూడా చేసుకోలేదు. చివరికి వృద్ధాప్యంలో ఉన్న ఒక్క ఇల్లు దానం చేసి నలుగురితో కలిసి ఉండడం కోసం ఆనంద ధామమ్‌లో చేరారు. ప్రతి రోజు సాయంత్రం భజన సమయంలో అందరికీ కుంకుమ అందించి, చివర ప్రసాదం ఇచ్చే పని నందకిశోర్‌ ‌శర్మ గారి పని. ఆ పని ఆయన ఎంతో ఆనందంగా చేస్తారు. తన సూట్‌ ‌కేసుల వ్యాపారానికి స్వస్తి పలికి కూతురు, అల్లుడితో ఉండే అవకాశం ఉన్న ఆయన అందరితోపాటే ఇక్కడే ఉంటారు.

ఆనంద ధామమ్‌ ‌తో వీరికి ఎంత అనుబంధం ఏర్పడిందంటే కొత్తగా చేపట్టిన భవన నిర్మాణానికి ప్రేమ గారు తన పెన్షన్‌ ‌డబ్బు నుంచి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ‘ఇక్కడ మేము నెలనెలా ఏమి ఇవ్వకపోయినా మాకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. వాటితోపాటు స్నేహం, ఆదరణ, 24 గంటలూ సంరక్షణ కూడా లభిస్తున్నాయి. మా సొంత ఇళ్ళలో కూడా ఇవన్నీ ఉంటాయో, లేదో’ అని అంటారు ప్రేమ.

ఈ వృద్ధాశ్రమంలో 60 ఏళ్ళు ఆపైన వయస్సు ఉన్న వారినే చేర్చుకుంటామని ఆనంద ధామమ్‌ ‌వ్యవస్థాపక కార్యకర్త, ఒకప్పటి క్షేత్ర సేవ ప్రముఖ్‌ ‌గోరేలాల్‌ ‌జీ చెప్పారు. అలాగే చేర్చుకునెప్పుడు వారి కుటుంబ వివరాలు కూడా తీసుకుంటారు. నచ్చచెప్పి వారిని వారి ఇళ్లకు పంపాలనే ప్రయత్నం జరుగు తుంది. ఆశ్రమంలో ఉండేవారిని కలవడానికి నిర్ధారిత సమయంలోనే అనుమతిస్తారు. ఆనంధ ధామమ్‌ ‌నిర్వహణ సమితి ప్రయత్నాల మూలంగా అనేకమందిని వారి కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి తీసుకువెళ్ళారని సేవభారతి పూర్తిసమయ కార్యకర్త కైలాష్‌ ‌కుశ్వహ్‌ ‌చెప్పారు. ఆయన స్వర్గీయ ముక్తా సెహగల్‌ను గుర్తు చేసుకుంటూ ఆమె గురించి చెప్పారు. సన్నిహిత కుటుంబ సభ్యులెవరూ లేని ముక్తా కింద పడిపోవడం వల్ల కాలు దెబ్బతిని నడవలేకపోయే వారు. అప్పటి నుంచి స్వర్గస్తులయ్యే వరకు ఆమెకు సేవభారతి సేవ చేసిందని ఆయన చెపుతారు. చనిపోయే ముందు ముక్తా తనకున్న ఇంటిని సేవభారతి అధ్వర్యంలో నడిచే పేద బాలికల హాస్టల్‌ ‌కోసం దానం చేశారు. ఆనంద ధామమే తమ ఇల్లని ఇక్కడివారంతా భావిస్తారు. ఎలాంటి ప్రభుత్వ ఆర్ధిక సహాయం లేకుండా, సమాజపు సహాయసహకారాలతోనే ఆనంద ధామ్‌ 15 ఏళ్లుగా నడుస్తోందని క్షేత్ర సేవభారతి కార్యదర్శి రామేంద్ర తెలిపారు.

– మణి చతుర్వేది శర్మ