అభి‘మతం’ మారితే..ఇక అవస్థలే!

1005

5 వేలు తీసుకున్న  పాస్టర్లకు కేంద్రం షాక్
ఆ 5 వేలు కక్కిస్తారా? చర్యలు తీసుకుంటారా?
వారి ఎస్సీ. ఓబీసీ సర్టిఫికెట్లకూ ఎసరు
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

కరోనా కాలంలో ఏపీ సీఎం జగనన్న సర్కారు చర్చి పాస్టర్లకు ప్రేమతో ఇచ్చిన 5 వేల నజరానా…  ఇప్పుడు మతం మారిన పాస్టర్ల మెడకు ఉచ్చులా మారనుంది. అదే సమయంలో జగన్ సర్కారుకూ పితలాటకంగా పరిణమించింది.  హిందూ మాల-హిందూ మాదిగకు చెందిన వారు ఎస్సీలు- ఓబీసీ సర్టిఫికెట్లు తీసుకుంటూనే,  సర్కారు నుంచి ఈ సాయం పొందడంతో కేంద్రం రంగంలోకి దిగింది.
లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం చాలాకాలం నుంచి, దీనిని వ్యతిరేకిస్తూ  చేస్తున్న పోరాటంపై,  కేంద్రం ఎట్టకేలకూ స్పందించింది. దీనితో ఎస్సీ-ఓబీసీ సర్టిఫికెట్లు ఉండి,  మతం మారిన పాస్టర్లు చిక్కుల్లో పడక తప్పని పరిస్థితి ఏర్పడింది. వారితోపాటు, మతం మారిన ఎస్సీ-ఓబీసీలు కూడా సమస్యలు ఎదుర్కోక తప్పని ఆందోళనకర పరిస్థితి నెలకొంది. కేంద్రం ఆదేశాల ప్రకారం వారి సర్టిఫికెట్లకూ ఎసరు తప్పదంటున్నారు.

ఏపీలో శాతం 70మంది పాస్టర్లకు, ఇప్పటికీ  హిందూ ఎస్సీ-ఓబీసీ సర్టిఫికెట్లు ఉన్నాయి. అయితే క్రైస్తవ మతంలో మారిన వారంతా..  ఇప్పటికీ ఎస్సీ-ఓబీసీ ఫలాలు అనుభవిస్తున్న వైనంపై,  చాలాకాలం నుంచి వివాదం కొనసాగుతోంది. క్రైస్తవంలోకి మారిన వారికి ఆ ఫలాలు అందివ్వడం వల్ల, నిజమైన హిందూ మాల-హిందూ మాదిగ వర్గాలకు ఆ ఫలాలు అందకుండా పోతున్నాయని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం చాలాకాలం నుంచి పోరాడుతోంది.

ఆ మేరకు ఆ సంస్ధ కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ వస్తోంది. గత కొంతకాలం క్రితమే దీనిపై స్పందించిన రాష్ట్రపతి, ఆ వివరాలేమిటో పరిశీలించి తగిన చర్యలు  తీసుకోవాలని, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. అయినా దానిపై జగన్ సర్కారు నుంచి స్పందన కనిపించలేదు. ప్రధానంగా కరోనా కాలంలో పాస్టర్లకు 5 వేలు ఇచ్చిన వైనం వివాదాస్పదయింది. నిజమైన క్రైస్తల పాస్టర్లకు అవి ఇవ్వడం బదులు, హిందూ మతం నుంచి ్రైకె స్తవంలోకి వెళ్లిన పాస్టర్లకు ఇవ్వడాన్ని  లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం చేసింది.

అయితే, తాజాగా కేంద్ర సామాజికన్యాయ శాఖ దీనిపై కొరడా ఝళిపించింది. క్రైస్తవులుగా మారి, ఎస్సీ-ఓబీసీ ఫలాలు అనుభవిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 వేలు పొందిన పాస్టర్లపై చర్యలు తీసుకోవాలని జగన్  ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనితో కరోనా కాలంలో 5 వేలు పొందిన మతం మారిన పాస్టర్లు చిక్కుల్లో పడే ప్రమాదం ఏర్పడింది. నిజానికి అవి మతం మారకుండా, నిజమైన క్రైస్తవులకే దక్కాల్సి ఉంది.

నిజానికి 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం, ఎస్సీలు ఇస్లాం-క్రైస్త్రవంలోకి మారితే వారి ఎస్సీ హోదా పోతుంది. కానీ 1977లో, ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు..  341 నెంబరుతో తీసుకువచ్చిన ఉత్తర్వు..  ఎస్సీ నుంచి క్రైస్తవం లోకి మారినప్పటికీ, రాజ్యాంగం కల్పించిన అన్ని వెసులుబాట్లూ కల్పించింది. విద్య, ఉద్యోగం, ఉపాథితోపాటు ఎన్నికల్లో అవకాశంపై ప్రాధాన్యత మినహాయించి, ఎస్సీలకు అందే అన్ని సౌకర్యాలుకూడా,  మతం మారిన క్రైస్తవులకు అందేలా ఈ జీఓ ఇచ్చారు. దీనిని రద్దు చేయాలని, దీనివల్ల నిజమైన హిందూ ఎస్సీలు తమ రిజర్వేషన్ సౌకర్యంతోపాటు, ఇతర వెసులుబాటు కోల్పోతున్నారంటూ  లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కొన్నేళ్ల నుంచీ కేంద్రంపై పోరాడుతోంది.

ప్రధానంగా ఎస్సీలకు దక్కాల్సిన ఉచిత ఇళ్లు, ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాల వంటి రాయితీలను, క్రైస్తవంలోకి మారిన వారు అడ్డదారిలో అనుభవిస్తున్నారంటూ ఫోరం ఉద్యమం కొనసాగిస్తోంది. ఇలాంటి విధానం-వెసులుబాటు, దేశంలోని మరే రాష్ట్రాల్లోనూ అమలుకాకపోవడం విశేషం. కేవలం ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లోనే అమలవుతున్న ఈ విధానాన్ని తొలగించి, నిజమైన ఎస్సీలకు న్యాయం చేయాలని ఫోరం కేంద్రం తలుపుతట్టింది.

2019-20 ఆర్ధిక సంవత్సరంలో ఏపీ సర్కారు ఎస్సీల సంక్షేమం కోసం 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. అంటే హిందూ మాల-హిందూ మాదిగ కులాల సంక్షేమం కోసమే, ఆ నిధులు కేటాయించారన్న మాట! అయితే, వాటిని మతం మారిన 80 శాతం మంది క్రైస్తవులు,  ఎస్సీ-ఓబీసీ సర్టిఫికెట్లతోనే ఆ నిధులు అనుభవిస్తుండటాన్ని,   లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తప్పుపడుతూ వస్తోంది.

నిజమైన ఎస్సీలు అనుభవించాల్సిన 15 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను,  మతం మారిన క్రైస్తవులు కొల్లగొడుతున్నారంటూ ఫోరం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్రపతి,  ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లింది. ఫోరం ఫిర్యాదుపైనే రాష్ట్రపతి స్పందించి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఇప్పుడు  కేంద్రం కూడా రంగంలోకి దిగడంతో, ఎస్సీ-ఓబీసీ సర్టిఫికెట్లు ఉన్నా, మతం మారిన పాస్టర్లు-ఇతరులు చిక్కుల్లో పడినట్టయింది. మరి దీనిపై జగన్ సర్కారు ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి.