వెంకయ్యకు ప్రేమతో…

547

మా నెల్లూరు పెద్దాయనా…ఏమైంది మీకు????????

మహారాజశ్రీ వెంకయ్యనాయుడు గారికి, నమస్కారాలతో, ఒకప్పటి మీ అనుచరుడు, ఎప్పటికి మీ అభిమాని, వ్రాయు విన్నపం-

ఆంధ్ర కు ఎప్పుడు అన్యాయం జరిగినా, ఆ అన్యాయాన్ని ఎదుర్కుని పోరాడిన మహా ఉద్యమ కారులు మీరు.

జై ఆంధ్ర ఉద్యమంలోనూ, తరువాత, ఇందిరాగాంధీ NTR ని ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపి నాదెండ్ల భాస్కర రావు గారిని పీఠం ఎక్కించినప్పుడూ, మీరు చేసిన పోరాటాలలో.
ఉద్యమాలలో
మీ నాయకత్వంలో పనిచేసిన మీ అనుచరుడుగా నేను ఈ ఉత్తరం రాస్తున్నాను.

ఈ పోరాటాలలో మీరు చూపిన తెగువ, నాయకత్వాలక్షణాలకు ఆకర్షితులైన అనేక మంది ఆంధ్రులలో నేను కుడా ఒకడిని. మీ వేల లక్షల మీ అభిమానులలో నేను ఒకడిని.

మీరు మొదటినుంచి చివరివరకు ఒకే పార్టీని (బీజేపీ) ని నమ్ముకుని అదే పార్టీలో కొనసాగిన మీ నిజాయితీ నచ్చి మెచ్చినవాడిని – ఇప్పుడు మోడీబీజేపీ అంటే నాకు ఇష్టం లేకపోయినా.
ఆ చనువుతోనే నేను మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. తప్పు రాయటం లేదు, కాదు కాబట్టి క్షమార్పణ కోరను.

2013 లో ఆంధ్రప్రదేశ్ ను, నిట్టనిలువుగా అన్యాయంగా చీల్చినప్పుడు ఆ వేర్పాటును మీ పార్టీ సమర్ధించినపుడు మీ మీద కోపం వచ్చినా, మీ మీద అభిమానం వొదులుకులేదు నేను.

ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మీరు రాజ్యసభ లో పోరాడిన తీరు చూసి మీరు ఆంధ్రప్రదేశ్ రక్షకుడిగా భావించాను.

రాజ్యసభలో మీ పక్కన కూచున్న దివంగత అరుణ్ జైట్లీ గారి అఇష్టత, అసహనాన్ని కూడా లెక్కచేయక, మీరు అనేక ప్రయోజనాలను విభజిత ఆంధ్రప్రదేశ్ కు విభజన బిల్లు లో చేర్పించిన తీరు అమోఘం.

2014 లో చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత, కేంద్ర పట్టణాభిశాఖ మంత్రిగా మీరు (ప్రధానమంత్రి గారికి ఇష్టం లేకపోయినా) ఆంధ్రకు చేసిన మేళ్లు ప్రయజనాలు అనేకం.

ముఖ్యంగా తెలంగాణా లోని కొన్ని మండలాలను పోలవరం ప్రాజెక్ట్ కోసం ఏపీ లో కలిపిన మీ పనితనం శ్రమ ఏ ఆంధ్రుడు మర్చిపోడు.

విభజన చట్టం లో పెట్టిన అనేక ప్రయోజనలను మోడీ బీజేపీ వారు ఏపీకి ఇవ్వకుండా ఎగకొట్టినపుడు, బీజేపీ పార్టీ సభ్యుడిగా, పార్టీని ఎదిరించలేక మీరు పడ్డ క్షోభ మాకు తెలుసు.

మిమ్మల్ని దూరం చేసుకునేందుకు భయపడి, మిమ్మల్ని రాజకీయాలకు, బీజేపీకి దూరంచేసేందుకు, మిమ్మల్ని భారత ఉపరాష్ట్రపతిని చేశారు మోడీగారు అనేకమంది నమ్మారు.

ఉపరాష్ట్రపతిగా ఉండగా, ఒక రాజకీయ పార్టీ సభ్యుడిగా ఉండకూడదు అనే నీతిని పాటించి మీరు బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసే సమయంలో కంటతడి పెట్టిన విషయం మేము మర్చిపోము.

మీరు భారత దేశ ఉప రాష్ట్రపతి గా ఎన్నిక అయినందుకు ప్రతి ఆంధ్రుడు ఎంతో సంతోషించారు, గర్వపడ్డారు,

మీ ద్వారా ఏపీ కి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆశించారు.

కానీ మా ఆశలు నిరాశగా మిగిలాయి.

ఆంధ్రకు మోడీ బీజేపీ చేసే ఘోరాన్యాయాలు, మీరు చేష్ఠలుడిగి చూస్తో ఉండటం ఎంతో బాధ కలిగింది.

ఏపీ విభజన చట్టంలో పెట్టిన ఏ ప్రయోజనం మోడీ బీజేపీ వారు ఏపీకి దక్కనివ్వలేదు. అన్నీ ఎగకోట్టారు.

2014 ఎన్నికల సభలలో మోడీగారు చేసిన శుష్క వాగ్దానాలను నమ్మి మీరు తెలుగులో తర్జుమా చేశారు. ఆశలు కలిపించారు.

మోడీబీజేపీ ఆంధ్రకు ఎంత ద్రోహం చేసిందో సాధారణ ఆంధ్రుడికంటే మీకు బాగాతెలుసు.

అన్నీ తెలిసిన మీరు ఎందుకు మాటాడరు, ఏమైంది మీకు.

మీరు ఇప్పుడు బీజేపీ సభ్యులు కాదు.
పార్టీ క్రమశిక్షణ మీకు వర్తించదు.

ఆంధ్రకు మోడీబీజేపీ, ఉత్తరభారత లాబీ అన్యాయం చేస్తుంటే మీరు ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.

“ఉపరాష్ట్రపతి పదవీ వ్యామోహంతో ఇలా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు మీరు” అనుకునేంత నీచులు కారు ఆంధ్ర ప్రజలు.

మీకు దక్కని గౌరవం ఏముంది, మీకుదక్కిన పదవులముందు ఈ ఉపరాష్ట్రపతి పదవి చాలా చిన్నది.

ఏమిటి కారణం, ఎందుకు మౌనంగా వుంటున్నారు.

ఏపీ విషయంలో,ఎందుకు మోడీబీజేపీ ఆరాచకాలను సహిస్తున్నారు.

మాకు నమ్మకం-
మీరు నిద్రలో కూడా ఏపీ అభివృద్ధిని మాత్రమే కోరుకుంటారని.

మరి ఎందుకు ఈ మౌనముని అవతారం.

సార్,
రండి సార్,
ఆంధ్ర జనంలోకి రండి,
మీ మాతృభూమికి జరిగే అన్యాయాన్ని అడ్డుకోండి.
అమరావతిని రక్షించండి.
ఆంధ్రప్రదేశ్ పోలవరం కల నిజం
చేయండి.

ఆంద్రుల్ని కాపాడండి.
ఆంధ్రప్రదేశ్ ని రక్షించండి.
ఆంధ్ర ద్రోహుల పనిపడదాం రండి.

ఆంధ్రప్రదేశ్ ని మించిన నేలలేదు మీకు.
మీరు రంగంలోకి దిగితే, ఐదుకోట్ల మంది ఆంధ్రులు, విదేశాలలో వుండే మరో కోటిమంది తెలుగువారు మీ వెనకే వుంటారు.

మౌనం వీడండి సార్.

అనేకానేక నమస్కారాలతో,

భవదీయుడు,
తుర్లపాటి శ్రీరామ చంద్ర మూర్తి.