ఆశయాన్ని చంపే క్షిపణి ఎన్నటికీ పుట్టదు

502

అమెరికన్ ఏజెంట్ జాన్ పెర్కిన్స్ రాసిన confessions of an economic hitman పుస్తకం మీద 2006 ఏప్రిల్ లో నేను రాసిన సమీక్ష ఇది. ఆంధ్ర జ్యోతి ఆదివారం సంచిక లో పబ్లిష్ అయింది. మరో సారి… మీకోసం…

In the midst of death, life persists
In the midst of untruth, truth persists
In the midst of darkness, light persists

గాంధీజీ అన్న ఈ మాటలు – జాన్ పెర్కిన్స్ పుస్తకం చదవడం పూర్తి చేయగానే నా కన్నీటి తడిలో మెరిశాయి. వేదనా? విజయమా? విభ్రమమా? వైరాగ్యమా? – ఏదీకాదు.

ఇన్నాళ్లూ, ఇన్ని దశాబ్దాలూ చదివిందీ, నమ్మిందీ, అనుమానించిందీ, కోపంతో రగిలిపోయిందీ అంతా నిజమేనని అమెరికా వాడే చెబుతున్నాడు. స్వార్థంతో కాదు. ఎత్తుగడా కాదు. పశ్చాత్తాపంతో.

పెర్కిన్స్ రాసిన పుస్తకం నన్నయితే కుదిపేసింది.
హంతకుడూ వాడే. పోలీసూ వాడే.
శవాన్ని కోస్తున్నదీ వాడే,
పోస్టుమార్టం రిపోర్టు రాస్తున్నదీ వాడే!
ఒక్క అమెరికా మాత్రమే చేయగల పని ఇది.
ఒక అమెరికన్ మాత్రమే రాయగల పుస్తకమిది.

ఇంత కిరాతకానికి ఒడిగడుతున్నది అమెరికాయేనని ఇంకెవరన్నా ఎన్ని రుజువుల్తో రాసినా వాడు కమ్యూనిస్టనో, నక్సలైటనో, టెర్రరిస్టనో కొట్టిపారేసేవారు. పెర్కిన్స్ అమెరికన్ మాత్రమే కాదు, చొక్కా ప్యాంటు వేసుకుని చిరునవ్వుతో మనల్ని పలకరించే, మనతో టీ తాగే అమెరికన్ ఏజెంట్. బాగా చదువుకున్న, బాగా తెలివిమీరిన సీక్రెట్ సీరియల్ కిల్లర్. జాక్ ది రిప్పర్ పెద్దన్న. అయితే కొద్దిమంది మనుషుల్ని చంపడం ఇతని పనికాదు. అది చాలా చవకబారు యవ్వారం. దేశాలకు దేశాల్నే కుక్కల్ని చేసి అమెరికా పాదాలు నాకేలా చేయగల అసామాన్యుడు పెర్కిన్స్. మేరియో పూజోకి మాఫియా మాత్రమే తెలుసు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ కి సస్పెన్స్ సినిమా తీయడం మాత్రమే వచ్చు.
జేమ్స్ బాండ్ ది ఒట్టి వెండితెర బడాయే.
పెర్కిన్స్ అలా కాదు. అతను కత్తి దూయడు.
తుపాకీ పేల్చడు. ప్రేమతో నిన్నూ , నీ దేశాన్నీ కావలించుకుంటాడు. అందమైన అభివృద్ధి ముసుగులో నిన్ను నిలువెల్లా ఆక్రమిస్తాడు.
అతను డాలర్ డ్రాక్యులా. రక్తపింజరి.

పనామా నుంచో, ఈక్వడార్ నుంచో అమెరికాకి పైప్ లైన్లు వేస్తాడు. నీ ఎర్రని రక్తాన్ని మాతృదేశానికి కానుకగా పంపిస్తాడు.
పైగా అది పెట్రోలని వాళ్ళని నమ్మిస్తాడు.
చివరికి నీ దేశాన్నే అమెరికాకి అమ్మిస్తాడు.
ఇంత చేసిన వాడికీ మనసుంటుందా? మనిషేగా!
ఇంత కిరాతకుడికీ కరుణ ఉంటుందా?
ఉంటుందనే కదా రుజువయ్యింది ఈ గొప్ప పుస్తకంలో.

*** *** ***

” 2001, సెప్టెంబర్ 11న ఆ రెండు టవర్లు కూలిపోయాయి. నేను గ్రౌండ్ జీరో లోకి వెళ్లాను. అక్కడ నిలబడితే, కాలిపోయిన మానవ మాంసం వాసన.పొగ ఇంకా లేస్తూనే ఉంది. అప్పటిదాకా నేను ఈ పుస్తకం రాయడాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాను. ఇప్పుడిక రాయాలని నిర్ణయించుకున్నాను. గతంలో చేసిన పనులకు బాధ్యత వహించాలని నాకు తెలుసు. గ్లోబల్ సామ్రాజ్య నిర్మాణం కోసం నేనూ, నాతోటి ఎకనమిక్ హిట్మెన్లు చేసినదానికి ప్రత్యక్ష ప్రతిఫలమే సెప్టెంబర్ 11 దాడులు. అది ఒక సామూహిక హత్యాకాండ. చేసినవాడు క్రూరమైన హంతకుడు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా మీద పేరుకుపోయిన ఆగ్రహానికి ఈ దాడి ప్రాతినిధ్యం వహిస్తోంది. దురదృష్టవశాత్తూ ఒక్క పశ్చిమాసియాలోనే కాకుండా, లాటిన్ అమెరికా, ఇతర అనేక దేశాల్లో ఒసామా బిన్ లాడెన్ హీరో అయిపోయాడు. లాడెన్ ఈ స్థితిలో ఉండకూడదు. అసలు కథని అమెరికన్ ప్రజలకు చెప్పాల్సి ఉందని నాకు అర్థమయింది. కార్పొరేట్ స్వామ్యం అంటే ఏమిటో అమెరికన్లకు తెలియజెప్పడానికి నిజాలు బయటపెట్టాలని అనుకున్నాను. అమెరికా విధానాల పట్ల అంత శత్రుత్వం ఎందుకుందో తెలియజేయాలనుకుంటున్నాను. మనం గనక దిశమార్చుకోకపోతే రాబోయే తరాల భవిష్యత్ అంధకారమవుతుంది. అసలేం జరుగుతుందో మనకు అర్థం అయినప్పుడు మాత్రమే దాన్ని మనం మార్చగలగుతాం” అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు జాన్ పెర్కిన్స్.

ఈ పుస్తకాన్ని తెలుగులో ‘ఒక దళారీ పశ్చాత్తాపం’ పేరుతో కొణతం దిలీప్ అద్భుతంగా అనువదించారు.

పెర్కిన్స్ పుస్తకంలో ఒక అధ్యాయాన్ని ఇలా ముగిస్తాడు: …
” లాటిన్ అమెరికా చరిత్ర నిండా ఒరిగిపోయిన సాహసవీరులే. నాకు పనామా లో దిగగానే కనపడిన హోర్డింగ్ పై అక్షరాలు గుర్తొచ్చాయి. స్వేచ్ఛ ఒమర్ టోరిజోస్ ఆశయం. ఆశయాన్ని చంపే క్షిపణి ఇంకా కనిపెట్టబడలేదు.
ఆలోచనలు మరణించవు సరే – వాటి వెనక నిలబడ్డ మనుషుల మాటేమిటి? చేగువేరా, ఆర్బెన్జ్, అలెండీ – ఏమైంది వీళ్ళందరికీ?”

పెర్కిన్స్ వచనం ఫ్లాట్ గా ఉన్నట్టే అనిపిస్తుంది. మలుపులూ, మెలికలూ లేకుండా సాదాసీదాగా కథ చెబుతున్నట్టే ఉంటుంది. సంఘటనలు, సమాచారం, ప్రవర్తన, మాటలు వీటిని ఒక క్రమపద్ధతిలో పాఠకుడి ముందుంచిన తీరులో గొప్ప నైపుణ్యం ప్రదర్శించారాయన.

పుస్తకం చదివిన కొందరు మిత్రులు మరిన్ని వివరాలు ఉంటే బాగుండేదనీ, ఆర్థిక నిపుణుడి ముసుగులో ఆయన వేసిన దొంగ లెక్కల వివరాలుంటే మరింత అర్థవంతంగా ఉండేదని, అక్కడక్కడా డిస్ కనెక్టెడ్ గా ఉందనీ అన్నారు. నిజమే. బోలెడన్ని వివరాలు లేనిమాట వాస్తవమే. పెర్కిన్స్ కి ఒక స్పష్టమైన లెక్క ఉంది. అమెరికా చేసిన కిరాతకాల జాబితా కూడికలూ, తీసివేతలతో సహా రాయగలడు. అయితే ఈ పుస్తకాన్ని ఒక సిద్ధాంత వ్యాసంగానో, ఆర్థిక గణాంకాల విశ్లేషణా పత్రంగానో ఆయన మార్చదలుచుకోలేదు. ఎక్కువ మంది ఈ పుస్తకాన్ని చదవాలి. తాను బయటపెట్టిన చేదునిజాలు ఈ భూమ్మీద అన్ని ప్రాంతాల వారికీ తెలియాలి. అమెరికా అకృత్యాల మీద ఏళ్ల తరబడి పేరుకుపోయిన కసి ఒకేసారి బాంబుషెల్ లా పేలాలి – అనే స్కీంతో ఈ సూపర్ హిట్ మాన్ పుస్తకాన్ని థ్రిల్లర్ లా రాయాలని ప్లాన్ చేశాడు. అతను గురి తప్పలేదు. సూటిగా మాతృభూమి గుండెల్లోనే ఈ ‘బుక్ షెల్’ పేలింది.

నక్సలైట్లనీ, టెర్రరిస్టుల్నీ తయారు చేస్తున్నది నా దేశం అమెరికాయేనని ప్రకటించాడు పెర్కిన్స్. ఫ్రెంచ్ రచయిత జా జియానో 1954లో రాసిన ప్రపంచ ప్రసిద్ధ కథ ‘చెట్లు నాటిన మనిషి’లో మొదటి పేరా ఇలా ఉంటుంది : ” మానవ ప్రవర్తన యొక్క అరుదైన సుగుణాలు వెల్లడి కావాలంటే దాని పనితీరును అనేక ఏళ్లపాటు పరిశీలించే అదృష్టం ఉండాలి. ఈ పనితీరు ఏమాత్రం అహంకారం లేనిదయినట్టయితే, దీనికి ప్రేరణ అసమానమైన ఔదార్యం అయినట్టయితే, ఇది ప్రతిఫలాపేక్ష లేనిదని ధ్రువపడినట్టయితే, వీటన్నిటికీ తోడు ఇది ఈ భూమి మీద తన ప్రత్యక్ష ముద్ర వేసినట్టయితే అప్పుడు పొరపాటనేది ఉండజాలదు.”

ఈ పుస్తకం రాయడంలో అహంకారం లేదు. అసమానమైన ఔదార్యమే ఉంది. ప్రతిఫలాపేక్ష మాత్రం తప్పకుండా ఉంది. అమెరికా ఈ దుర్మార్గ విధానాలు మానుకోవాలి. ప్రజలు కన్జ్యూమరిజం తుఫాన్ లో పడి కొట్టుకుపోకూడదు. భావితరాల కోసం మన సతత హరితారణ్యాల్నీ, పిట్టల్నీ, పులుల్నీ, కొండజాతుల్నీ, వాళ్ల అరుదైన సంస్కృతినీ, పురాతన భాషల్నీ కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మన బిడ్డలకు మంచి ప్రపంచాన్ని ప్రసాదించడం కోసం మనం చేయగలిగేదేమన్నా చేయాలి – ఇదే పెర్కిన్స్ కోరుతున్న ప్రతిఫలం. ఈ అరుదైన పుస్తకంతో భూమ్మీద తన ప్రత్యక్ష ముద్ర కూడా వేయగలిగాడు.

అమెరికా కోసం పేద దేశాల్లో వేటాడి వేటాడి అలిసిపోయిన జాన్ పెర్కిన్స్ అనే వేటగాడు – ఇప్పుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. (ఆటంబాంబు కనిపెట్టిన శాస్త్రవేత్త చివరి సంవత్సరాలలో భరించలేని వేదనతో, పశ్చాత్తాపంతో చావుకు దగ్గరయ్యాడు).

” ఈ కాలం మనది. యుద్ధరేఖపై కాలిడి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ఘడియలివి. కార్యరంగంలోకి దూకాల్సిన క్షణాలివి” అంటున్నాడు పెర్కిన్స్ …. and In the Midst of America, Perkins Persists.

*** *** ***

ఇది అమెరికాని కుదిపేసిన పుస్తకం

‘ కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ ఎకనమిక్ హిట్ మాన్ ‘ 2004 నవంబర్లో విడుదలైన కొన్ని వారాల్లోనే అమెరికాని ఒక కుదుపు కుదిపింది. జనం ఎగబడి కొన్నారు. నా దేశం ఇన్ని దుర్మార్గాలు చేస్తోందా? అని అమెరికన్లు విస్తుపోయారు. ‘ న్యూయార్క్ టైమ్స్ ‘ నాన్ ఫిక్షన్ విభాగంలో ఏడు వారాల పాటు ఈ పుస్తకం ‘ బెస్ట్ సెల్లర్ ‘గా ఉంది. అన్ని ప్రముఖ అమెరికన్ పత్రికల ‘ బెస్ట్ సెల్లర్ ‘ జాబితాలో ఉంది. పత్రికలూ, టీవీ ఛానళ్లూ రచయిత జాన్ పెర్కిన్స్ ను పదేపదే ఇంటర్వ్యూలు చేశాయి. చర్చలు జరిపాయి. ” సంచలనాత్మకమైన ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదవాల”ని సమీక్షించిన ప్రముఖులందరూ రికమండ్ చేశారు.

అప్పటికే 20 భాషల్లో..

జాన్ పెర్కిన్స్ పుస్తకం అప్పటికే ఇరవై భాషల్లోకి తర్జుమా అయింది. ఉత్తేజకరంగా, చాచి లెంపకాయ కొట్టినట్టుగా, గుండెలవిసే సస్పెన్స్ లో ఫస్ట్ పర్సన్ లో రాయడం; ఆధునికత, అభివృద్ధి అనేవి వర్ధమాన దేశాల్లో పేదలు, అడవిపుత్రులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయన్న అంశాలపై న్యాయమైన ప్రశ్నలు లేవనెత్తడం ఈ పుస్తకం పాపులారిటీకి కారణం. మార్కెట్లోకి వచ్చిన 5 వారాల్లోనే ఐదుసార్లు రీప్రింట్ చేయాల్సి వచ్చిన పుస్తకమిది. ఖరీదైన ఈ గట్టి బైండ్ పుస్తకం వేడి మిర్చిబజ్జీల్లా అమ్ముడు పోవడం చూసి పెంగ్విన్ పబ్లిషర్లు అర్జెంటుగా పేపర్ బ్యాక్ ఎడిషన్ తెచ్చేశారు.

– TAADI PRAKASH 9704541559