పంచె పోయి.. ఫ్యాంటు వచ్చె!

134

మెట్రోరైల్‌లో పవన్
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

పవన్ కల్యాణ్ తెలుసుకదా?.. బారెడు నల్లగడ్డం.. తెల్లచొక్కా, రెడీమేడ్ పంచెతో కనిపించే కల్యాణ్‌బాబు.. సడన్‌గా పంచె తీసేసి, ఫ్యాంటు, కోటుతో ప్రత్యక్షమయ్యారు. అదేమిటబ్బా.. ఎప్పుడూ తెల్ల చొక్కా, పంచె, గడ్డంతో ఏ పుస్తకం చదువుకుంటూనో, ఏ ఆవులకు గడ్డివేస్తూనో ఫొటోల్లో కనిపించే పవనన్నయ్య.. ఇలా హటాత్తుగా గెటప్ మార్చి, కొత్త లుక్‌తో ఎంట్రీ ఇచ్చేశారేమిటని ఫ్యాన్స్ తెగ ఆశ్చర్యపోతున్నారు. అవును మరి. జనసేనాధిపతి పవన్.. తాజాగా పాత కాస్ట్యూమ్స్ స్థానంలో, కొత్త లుక్‌తో దర్శనమివ్వడం అభిమానులను అలరించింది.

పవన్ సరదాగా తన పటాలంతో, హైదరాబాద్‌లో మెట్రో రైలెక్కారు. ‘వకీల్‌సాబ్’ మెట్రో ఎక్కడంతో, ప్రయాణికులు కూడా సంబరపడ్డారట. మన హీరో సహజమైన అలవాటు ప్రకారం.. ప్రయాణీకుల గ్రామాల్లో సమస్యలను వాకబు చేశారట. ఎంతయినా పార్టీ అధ్యక్షుడు కదా మరి? ఆ విధంగా పవన్ మెట్రో రైలులో ముందుకువెళ్లారన్నమాట. దుబ్బాక ఉప ఎన్నికలో పవన్ ప్రచారం చేస్తే, ‘గుర్రం ఎగురావచ్చని’ కమలనాధులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నా, ఎందుకో అది వర్కవుట్ కాలేదు.

ఇక ఎలాగూ ఏపీలో పెద్దగా పనేమీ లేదు. బీజేపీతో జత కట్టిన తర్వాత పవన్ ప్రవచిత ‘అమరావతి పోరాటం’ అటకెక్కింది. పవనన్నయ్య అమరావతి కోసమే బీజేపీతో జతకట్టానని చెబుతుంటే.. బీజేపీ నేతలు మాత్రం, అసలు అమరావతి మాటే ఎత్తరు. దానితో పాపం.. పవనన్నయ్య కష్టపడి సంపాదించుకున్న ఇమేజీకి, బోలెడంత డ్యామేజీ జరిగింది. ఎలాగూ కరోనా కాలం. ఏపీకి వచ్చి చేసేదేమీ లేదు. అందుకే రోజుకు ఒకటో-రెండో ప్రెస్‌నోట్లు, సందర్భానుసారంగా ఖండనలు, హర్షం, అభినందనల స్టేట్‌మెంట్లు. మధ్యలో ఎలాగూ షూటింగులు ఉండనే ఉంటాయి. కాబట్టి.. కాస్త గాలి మార్పు కోసం, పవనన్నయ్య మెట్రో రైలెక్కినట్లున్నారు.

అన్నట్లు.. చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో.. జూమ్ యాప్‌లో కూర్చుని మాట్లాడుతున్నారని, బీజేపీ నేతలు తెగ విసుర్లు విసురుతున్నారు. జనంలోకి రాకుండా, ప్రెస్‌నోట్లతో కాలక్షేపం చేస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. నిజమే. కమలదళాల కస్సుబుస్సులు కరక్టే. మరి తన కొత్త మిత్రుడు పవనన్నయ్య కూడా, ఇప్పుడు అదే పనిచేస్తున్నారు కదా? ఆ ప్రకారంగా.. కమలదళాలు విసిరే వ్యంగ్యాస్ర్తాలు కల్యాణ్‌బాబుకూ తగులుతున్నట్లే కదా? కొంపదీసి బీజేపీ నేతలు, యాక్టివ్‌గా లేని పవన్‌ను ఏమీ అనలేక.. చంద్రబాబు భుజంపై నుంచి, హైదరాబాద్‌లో ఉన్న కల్యాణ్‌బాబుపై గురి పెట్టలేదు కదా? జాతీయ పార్టీ కదా.. ఏం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు మరి!