బాబు బాటలో..కామ్రేడ్లు!

436

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బెంగాల్, కేరళ రాష్ట్రాలు కూడా
సీబీఐకు నో ఎంట్రీ ఇచ్చిన కేరళ సర్కారు
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలో లేకపోయినా, ఆయన ఫార్ములాను అందరూ అనుసరిస్తున్నట్లున్నారు. విచారణ సంస్థలను చేతిలో పెట్టుకుని, తనకు సరిపడని రాష్ట్రాలపై కేసుల సవారీ చేస్తున్న,  బీజేపీ సర్కారు దూకుడుకు బ్రేకులు వేసిన చంద్రబాబు నాటి ఆలోచనను.. ఇప్పుడు కమ్యూనిస్టులు, శివసేనలు, కాంగ్రెస్ పార్టీలూ అనుసరిస్తుండమే విశేషం.

సీబీఐ అంటే కేంద్రం చెప్పినట్లు పలికే చిలక. పంజరంలో చిలక. ఈ మాట అన్నది ఎవరో కాదు. ఏపీ సీఎం మన జగనన్నే!  యుపిఏ హయాంలో, ఆయనపై కేసులు బుక్కయినప్పుడు  జగన్ అండ్ అదర్స్ ఈ డైలాగే వాడేవారు.  దర్యాప్తు సంస్థలను,  కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అడ్డుపెట్టుకుని, ప్రత్యర్ధులను వేధిస్తోందని దుయ్యబట్టారు. కేంద్రం చేతిలో ఉన్న దర్యాప్తు సంస్థలకు,  విలువ-విశ్వసనీయత లేవని కుండబద్దలు కొట్టారు. బాబు సీబీఐకి పెట్టిన నో ఎంట్రీ బోర్డును, సీఎం అయిన తర్వాత  అదే జగనన్న పీకేశారనుకోండి. ఆ ప్రకారంగా పంజరంలో చిలకను ఏపీకి రానిచ్చారన్నమాట. అది వేరే విషయం!

అలాంటి సీబీఐని, తన రాష్ట్రంలోకి ప్రవేశించకుండా, చంద్రబాబు గత ఎన్నికల చివరలో నో ఎంట్రీ బోర్డు పెట్టారు. అంటే సీబీఐ ఏ కేసు నిమిత్తం  రాష్ట్రానికి వచ్చినా, సదరు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకునే వెళ్లాలన్నమాట. ఎన్నికల ముందు సంకీర్ణ కాపురంలో కలతలు వచ్చి, బీజేపీకి విడాకులిచ్చిన బాబు.. అందుకు తగిన ఫలితం అనుభవించారు. ఆ తర్వాత  సీబీఐ వేధింపుల గురించి బాగా తెలిసిన బాబు, ముందుజాగ్రత్తగా సీబీఐని రాష్ట్రంలో నిషేధించారు.

ఇప్పుడు దేశంలో కూడా… అలాంటి రాజకీయ పరిస్థితులే కనిపిస్తుండటంతో, మేల్కొంటున్న విపక్షాలు సీబీఐ దూకుడుకు చెక్ పెట్టేందుకు, చంద్రబాబు ఆలోచనను అనుసరిస్తున్నాయి. తాజాగా కేరళలోని పినరై విజయన్ సర్కారు కూడా, తమ రాష్ట్రానికి సీబీఐ రావడానికి వీల్లేదని ఫర్మానా జారీ చేసింది. ఏదైనా ఉంటే,  ముందు తన అనుమతి తీసుకోవలసిందేనని కుండబద్దలు కొట్టింది. దేశంలో సంచలనం సృష్టించిన బంగారం కుంభకోణంలో సీపీఎం పీకల్లోతు కూరుకుపోయింది. దానిపై సీబీఐ కన్నేసింది. తీగ లాగితే, కామ్రేడ్ల డొంకలే కాదు. కూసాలూ కదులుతాయి మరి. అదీ అసలు సంగతి!

స్వప్న సురేష్ అనే ఓ అమ్మడు,   కేరళ సీఎంఓ కేంద్రంగా.. ఎమిరేట్స్ నుంచి విదేశాంగ పార్శిళ్ల ద్వారా,  బంగారం స్మగ్లింగ్ చేశారన్న ఆరోపణతో కామ్రేడ్లు కలవరపడుతున్నారు. ఆరోపణలలో ఉక్కిరిబిక్కిరయిన సీఎం పినరై  విజయన్.. ఇది విదేశాంగ వ్యవహారమయినందున, దీనిపై విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరారు. దానితో ఈపాటికే ఎన్‌ఐఏ రంగంలోకి దిగగా, సీబీఐ-ఈడీ కూడా ఎంట్రీ ఇవ్వనున్నాయి.

దీనితో తమ పార్టీ ఇమేజీకి జరిగే డ్యామేజీని గుర్తించిన ఎర్రన్నలు, సీబీఐకు నో ఎంట్రీ చెప్పారు. గతంలో బాబు పాటించిన ఈ సూత్రాన్ని,  ఇటీవలే మహారాష్ట్రలో శివసేనీయులు సైతం విజయవంతంగా అమలుచేస్తున్నారు. ఫోనీలే  ఫాఫం.. బాబు ఆలోచనలు ఆంధ్రాజనాలకు ఫనికిరాకఫోయినా.. ఫరాయి రాష్ట్రాలు ఫాటిస్తున్నాయి!