అర్నబ్ అరెస్టు..అల్లరి!

277

రాష్ట్రానికో విధంగా వర్ధిల్లుతున్న పత్రికాస్వామ్యం
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఆర్నబ్ గోస్వామి పేరు తెలుసు కదా? అదేనండీ.. రిపబ్లిక్ టీవీ డిబేట్లలో అవతలివారిపై పెద్దగొంతేసుకుని, కన్నెర్ర చేస్తూ ఏకవచనంతో పిలిచి, గాయి గత్తర చేసే పేరు మోసిన జర్నలిస్టు ఆసామి. వీటికి మించి.. భారతీయ జనతా పార్టీకి విశేష సేవలందిస్తున్న రిపబ్లిక్ టీవీకి చీఫ్ ఎడిటర్. ఇప్పుడా కరసేవకుడినికి, మహారాష్ర్ట పోలీసులు అరెస్టు చేశారు. కారణం ఏమిటంటే.. ఆయన ఒకరి ఆత్మహత్యకు ప్రేరేపితులయ్యారట. అదికూడా 2018 నాటి కథ. సరే.. ఇప్పుడు మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్ సర్కారు ఉన్నందున, వారికి ఆ పాత కేసు అర్జెంటుగా గుర్తుకొచ్చింది. ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చిందంటే.. మరి మన పెద్ద గొంతు గోస్వామి అనే జర్నలిస్టు ఆసామి, బీజేపీ వ్యతిరేక పాలిత రాష్ట్రాలపై ఒంటికాలితో లేస్తున్నారు కాబట్టి! కాంగ్రెస్ అండ్ కోను దూదేకినట్లు ఏకుతున్నారు కాబట్టి!! ఆ ప్రకారంగా ఆర్నబ్‌ను ఎందుకు అరెస్టు చేశారో సింపుల్‌గా అర్ధం చేసుకోవాలన్న మాట!!!

ఆర్నబ్ అరెస్టుపై సహజంగా భాజపేయులు అగ్గిరాముళ్లలయ్యారు. పత్రికాస్వేచ్ఛ మంటకలసిపోతోందని బాధపడుతున్నారు. రైటిస్టులయిన జర్నలిస్టు లోకం కూడా ఆయన అరెస్టును ఖండించింది. అంతే సహజంగా. వామపక్ష భావ జాల జర్నలిస్టు సంఘాలు మాత్రం, అసలు మాకు సంబంధం లేదన్నట్లు మౌనంగా ఉన్నాయి. సహజంగా ఇలాంటి ‘అప్రజాస్వామ్య’ విధానాలను.. కత్తి-డాలు పుచ్చుకుని ఖండించే వీరుల్లో, మొదటి వరసలో ఉండే వామపక్ష జర్నలిస్టు సంఘాలు, మౌనంగా ఉండటానికి కారణం లేకపోలేదు. ఆర్నబ్ గోస్వామి అనే జర్నలిస్టు ఆసామి, బీజేపీ పనుపున పనిచేస్తున్నారని గట్టిగా నమ్మడమే.

సరే.. ఆర్నబ్ సారు జీతం కోసం పనిచేశారనే అనుకుందాం. మరి ఒక జర్నలిస్టుపై దాడి జరిగినప్పుడు, సాటి జర్నలిస్టు సంఘాలు ఖండించాలి కదా? అన్నది ప్రశ్న. అయితే, పాపం వామపక్ష పార్టీలకు, భావజాలానికి అనుబంధంగా ఉండే, సదరు జర్నలిస్టు సంఘాలకు కేరళ పితలాటకం ఉంది. అందుకే అవి మౌనరాజ్యంలో ఉన్నాయి. కమ్యూనిస్టులు ఏలుతున్న కేరళలో కూడా, మీడియాను అణచివేసే చట్టం తీసుకువచ్చారు కాబట్టే, మన జర్నలిస్టు కామ్రేడ్లు తేలుకుట్టిన దొంగల్లా మౌనంగా ఉన్నట్లున్నారు. పైగా గోస్వామి రైటిస్టు. ఈ ఆసాములేమో లెఫ్టిస్టులాయె! అసలు ఏ ఇష్టులూ కాని జర్నలిస్టు సంఘాలు కూడా మౌనంగానే ఉన్నాయి. అదీ ఆశ్చర్యం!

మరి ఏపీలో కూడా, కొమ్ములు తిరిగిన జర్నలిస్టు సంఘాల నాయకులున్నారు. పాలకుల పక్కనే కూర్చుని సలహాలిచ్చే, మాజీ జర్నలిస్టునేతలకూ కొదవలేదు. ఎటొచ్చీ, ఆర్నబ్ అరెస్టుపై వారి నోళ్లే మూతపడ్డాయి. బహుశా.. వేరు కేసులో అరెస్టయినందుకు, మనకేం సంబంధం అనుకున్నారేమో మరి? ఆ ప్రకారం ఆలోచించినా, ఏపీ జర్నలిస్టు నేతల మౌనం తప్పే. ఎందుకంటే, జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ సాక్షి ఆఫీసులో తనిఖీలు చేసింది. అది పత్రికాస్వామ్యానికి గొడ్డలిపెట్టని అరుస్తూ, జర్నలిస్టు నేతలు అర్ధరాత్రి కొవ్వొత్తులతో రోడ్డెక్కారు.ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగనన్న.. సదరు నాయకుడికి మంచి పదవే ఇచ్చి, ఆయన శ్రమదానానికి తగిన గుర్తింపే ఇచ్చారనుకోండి. అది వేరే విషయం. నిజానికి పత్రికాస్వేచ్ఛకు- జగన్‌పై ఈడీ కేసు తనిఖీలకు సంబంధం లేదు. కాకపోతే, జగన్ అనేవ్యక్తి ఆ మీడియా సంస్థకు ఓనరు మాత్రమే.

‘నేటి దినపత్రిక సూర్య’ పత్రిక అధిపతి, నూకారపు సూర్యప్రకాశరావు కేసూ అంతే. జగన్‌తోపాటు 16 నెలలు చంచల్‌గూడ జైలు శిక్ష అనుభవించిన నూకారపును, బ్యాంకు మోసం చేసిన కేసులో అరెస్టు చేశారు. అయితే, అది బీసీలపై జరిగిన దాడి, బీసీలను అణచివేయడానికి జరిగిన అరెస్టుగా, కొందరు నాయకులు గాయి గత్తర చేశారు. మరి ఆ లెక్కన, బ్యాంకు మోసానికి-బీసీ కార్డుకూ సంబంధం ఏమిటి? ఈనాడు అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి కేసుల విషయంలోనూ, టీడీపీ నాయకులు పత్రికాస్వేచ్ఛపై దాడిగానే గావుకేకలు పెట్టారు. అది ఆర్ధికపరమైన కేసు అని తెలిసినా, టీడీపీ నేతలు దానిని పతిక్రాస్వేచ్ఛకు ముడిపెట్టడమే, అప్పట్లో విమర్శలకు దారితీసింది. టీవీ9 సీఈఓ రవిప్రకాష్ అరెస్టు సందర్భంలో.. కొన్ని సంఘాలు ఖండించగా, మరికొన్ని సంఘాలు మౌనం వహించాయి. ఆయన కూడా ఆర్ధికపరమైన ఆరోపణలతోనే అరెస్టయ్యారు.

నిజంగా.. మీడియాలో వృత్తిపరంగా రాసిన కథనాలపై అరెస్టు జరిగినా, వేధింపులకు పాల్పడితే మాత్రం అంతా ఖండించాల్సిందే. పాపం ఎటొచ్చీ.. బ్యాంకు మోసాలకు పాల్పడిన ఆరోపణపై అరెస్టయి, జైలుకు వెళ్లిన ‘డెక్కన్‌క్రానికల్ ’ అధిపతులు మాత్రమే.. కులం కార్డు గానీ, పత్రికాస్వేచ్ఛ కార్డుగానీ వాడుకోకుండా, బుద్ధిగా జైలుకెళ్లి బెయిలుపై బయటకొచ్చారు. జగన్ ఆస్తుల తనిఖీలో భాగంగా సాక్షి ఆఫీసుకు వెళ్లినందుకు, భూమ్యాకాశాలను ఏకం చేసిన జర్నలిస్టు నేతలు… అలాంటి కేసులోనే అరెస్టయిన వెంకట్రామిరెడ్డి సోదరుల విషయంలో మాత్రం నోరెత్తిన పాపాన పోలేదు.

సర్కారీ విధానాలకు వ్యతిరేకంగా.. గళం విప్పుతున్న వారి గొంతులకు చోటిచ్చిన కారణంగానే, టీవీ 5, తెలుగువన్ అధిపతులపై పోలీసులు కేసులు బనాయించారు. ఆ రెండింటినీ వృత్తిపరమైన కోణంలోనే చూడాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి వ్యక్తిగత అంశాలూ కనిపించవు. పక్కా ప్రొఫెషనల్ వ్యవహారం. పత్రికా స్వేచ్ఛను హరించడమంటే అదీ! ఇప్పుడిక ఆర్నాబ్ గోస్వామి అరెస్టును, ఏ కోణంలో.. ఏ కళ్లతో చూడాలన్నది మీరే అర్ధం చేసుకోవచ్చు.

ఆర్నబ్‌పై కేసు న్యాయమా? అన్యాయమా? అన్నది ఎలాగూ కోర్టు తేలుస్తుంది. కానీ, అరెస్టు వారెంటుతో వచ్చిన పోలీసులపై, టీవీలో మాదిరిగానే నోరు పారేసుకోవడం తప్పు కదా? వారెంటు ఏదీ అని ప్రశ్నించిన వారే, అదే వారెంటును చించేయడం కచ్చితంగా అహంకారమే. నిజానికి దేశ ంలో జర్నలిస్టులకు ప్రత్యేకంగా చట్టాలు, మినహాయింపులేమీ ఉండవు. ఉన్నాయనుకోవడం-ఉండాలనుకోవడం కేవలం భ్రమ. ఎవరైనా చట్టాన్ని గౌరవించాల్సిందే. పాలకులు చట్టాన్ని దుర్వినియోగం చేసినప్పుడు, దానిని రక్షించేందుకు ఎలాగూ కోర్టులున్నాయి.

అన్నట్లు.. మన తెలుగు మీడియాలో కూడా, ఈ మధ్య కాలంలో ఆర్నబ్ గోస్వాముల సంఖ్య పెరుగుతుందండోయ్! టీవీ డిబేట్లలో పెద్ద గొంతులతో రంకెలేయడం, ఏకవచనంతో సంబోధించి, చేతులు ఊపుతూ హడావిడి చేస్తున్న జర్నలిస్టు యాంకర్లు పుట్టుకొస్తున్నారు. ఆ చర్చలు చూస్తే స్వకుచమర్దనమే ఎక్కువగా దర్శనిమిస్తోంది. అంటే యాంకర్లు తమను తాము ప్రమోట్ చేసుకోవడం, సొంతగా ఫేసుబుక్, ట్విట్టర్లు, వాట్సాప్ గ్రూపుల హడావిడి లాంటివన్నమాట. ఈమధ్య హైదరాబాద్‌కు వస్తున్న కొందరు ఉత్సాహవంతులు, టీవీ స్టుడియోలకు వెళ్లి సాయంత్రం వేళ డిబేట్లు చేసే యాంకర్లతో, ఫొటోలు తీయించుకుంటున్న ముచ్చట్లు కూడా చూస్తున్నాం. ఫర్వాలేదు.. ఆర్నాబ్ గోస్వామి ప్రభావం, మన తెలుగు మీడియా ఆసాములకూ బాగానే వంటబట్టినట్లుంది!