దుబ్బాకలో మళ్లీ షి‘కారు’?

507

సగానికి తగ్గనన్న మెజారిటీ
రెండోస్థానంలో బీజేపీ?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)
దుబ్బాక ఉప ఎన్నికలో మళ్లీ టీఆర్‌ఎస్‌కే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈసారి గత ఎన్నికలో కంటే సగం మెజారిటీ తగ్గనుంది. గత ఎన్నికలో రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్.. ఈసారి మూడవ స్థానంలో, బీజే పీ రెండో స్థానంలో నిలిచే అవకాశాలున్నట్లు పోలింగ్ సరళి వెల్లడిస్తోంది.

టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన,  దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా దివంగత రామలింగారెడ్డి భార్య సుజాత పోటీ చేయగా, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ అభ్యర్ధిగా చెరుకు శ్రీనివాసరెడ్డి బరిలో నిలిచారు. అయితే.. తొలి విడత ప్రచారంలో దూసుకుపోయిన కాంగ్రెస్, ఆ తర్వాత చతికిలపడింది. మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డిపై ప్రజలకు ఉన్న అభిమానం, ఆయన తనయుడైన కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీనివాసరెడ్డికి సానుకూలంగా మారిన వాతావరణం కనిపించింది. ఆ మేరకు తొలి దశ ప్రచారమంతా,  టీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగింది.

అయితే, బీజేపీ అనూహ్యంగా పుంజుకుని, కొత్త వ్యూహాలతో ప్రచారంలోకి దిగడంతో వాతావరణం మారిపోయింది. రఘునందన్‌రావు బంధువు నివాసంపై పోలీసు దాడులు, టీఆర్‌ఎస్ నేతలు బస చేసిన హోటల్‌పై బీజేపీ కార్యకర్తల దాడులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారంతో.. పోటీ కాస్తా, టీఆర్‌ఎస్-బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు మారింది. ఈ విషయంలో కాంగ్రెస్ ఎందుకో వెనుకబడి పోయినట్లు కనిపించింది.

ఈ క్రమంలో జరిగిన పోలింగ్.. అనూహ్యంగా 82.61 శాతం నమోదుకావడం పార్టీలను కలవరపరిచింది. కరోనా కాలంలో కూడా పోలింగ్ ఆ స్థాయిలో ఓటెత్తడంతో, పెరిగిన ఆ ఓటింగ్ శాతం.. ఎవరి పుట్టి ముంచుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే పోలింగ్ సరళి పరిశీలిస్తే… టీఆర్‌ఎస్ విజయం సాధించడం ఖాయమయినప్పటికీ, గతంలో వచ్చిన మెజారిటీతో పోలిస్తే, సగం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నట్లు విశ్లేషకుల అంచనా. అంటే దాదాపు 25-30 వేల ఓట్ల మెజారిటీ మాత్రమే రావచ్చంటున్నారు. ఒక అంచనా ప్రకారం.. టీఆర్‌ఎస్‌కు 80-85 వేల ఓట్లతో మొదటి స్థానం, బీజేపీకి 50 నుంచి 55 వేలతో రెండవ స్థానం, కాంగ్రెస్‌కు 12 నుంచి 15 వేలతో మూడవ స్థానం దక్కవచ్చని తెలుస్తోంది.

అయితే, టీఆర్‌ఎస్‌కు ఏకైక ప్రచార వ్యూహకర్తగా మంత్రి హరీష్‌రావు నిలిచారు. బీజేపీ నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు, రాష్ట్ర నాయకులు ప్రచారం చేశారు. కాంగ్రెస్ నుంచి పిసిసి చీఫ్ ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇతర నేతలు విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.