సర్కారు ఉద్యోగుల స్వామి భక్తి..చూడతరమా?

576

కరోనా తగ్గేవరకూ స్థానికం వద్దట
మరి కరోనా వచ్చిన స్కూలు టీచర్ల సంగతేమిటి?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఏపీలో ఉద్యోగుల సంఘాల స్వామి భక్తిని చూసి.. పరాయి రాష్ర్టాల పాలకులు ఈర్ష్యతో కుళ్లుకుంటున్నారట. అలాంటి నాయకులు తమ రాష్ట్రంలో లేనందుకు, రోజుకు డజనుసార్లు తీరికూర్చుని బాధపడుతున్నారట. ఏపీ సీఎం జగనన్నకు పట్టిన అదృష్టాన్ని చూసి తెగ ఈర్ష్యపడుతున్నారట. జగనన్న ప్రభుత్వంపై, ఈగ వాలితేనే సహించలేని వైసీపీ వీరాభిమానులు సైతం, ఉద్యోగ సంఘ నేతల విశ్వాసం చూసి అసూయతో రగిలిపోతున్నారట. అవును మరి.. ఏ పాలకుడయినా తన గళాన్నే, తన వైఖరినే ఉద్యోగ సంఘాలు ప్రతిబింబిస్తే ఎందుకు ఖుషీ అవరు చెప్పండి? ఏపీలోనూ అంతే! ఇద్దరు ‘పెద్దారెడ్ల’ నాయకత్వంలో తరిస్తున్న ఉద్యోగుల సినిమా కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువేనట!!

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కోర్టుకు వెల్లడించారు. ఆ సందర్భంగా ఆయన, తన ఈతిబాధలేమిటో కోర్టుకు మొరపెట్టుకోగా, సీఈసీని సతాయించకుండా ఆయన అడిగినవి సమకూర్చమని.. హైకోర్టు కూడా సర్కారును ఆదేశించింది. సరే.. ఎలాగూ అధికార వైసీపీ నేతలు- బూతుల మంత్రులూ.. కరోనా తగ్గేవరకూ స్ధానిక ఎన్నికలు నిర్వహించేది లేదని ఖరాఖండీగా చెబుతున్నారు. ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిలపక్ష భేటీకీ వైసీపీ వెళ్లలేదు. ఎలాగూ విపక్షాలు సహజంగానే, గతంలో ఏకగ్రీవాలయిన వాటిని రద్దు చేసి, మళ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఇంతవరకూ బాగానే ఉంది. ఎస్‌ఈసీ, రాజకీయ పార్టీలు ఈ విషయంలో ఎవరి ధర్మం వారు పాటిస్తున్నారని భావించవచ్చు. కానీ, విచిత్రంగా.. ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం, అచ్చు వైసీపీ పార్టీ విధానాన్నే ప్రకటించడమే ఆశ్చర్యం. కరోనా తగ్గే వరకూ ఎన్నికలు నిర్వహించవద్దని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ఎన్నికలు పెడితే, తమ ఉద్యోగులను రక్షించుకునేందుకు కోర్టుకయినా వెళతామని రెడ్డిగారు సెలవిచ్చారు.

పనిలోపనిగా.. విశాఖ రాజధానిగా వస్తున్నందున, తమ ఉద్యోగులంతా విశాఖకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, రెడ్డిగారు ఎవరూ అడగకుండానే ప్రకటించేశారు. ఉద్యోగులతో చర్చించకుండా, రెడ్డిగారొక్కరే వారి తరఫున ఎలా వకాల్తా పుచ్చుకున్నారన్నది వేరే విషయం. గానీ.. సదరు రెడ్డిగారు ‘ఉద్యోగులను రక్షించుకునేందుకు’.. అని వాడిన పదమే వింతగా ఉందన్న వ్యాఖ్యలపై ఉద్యోగవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. తమ ప్రాణాల పట్ల అంత దయ, సానుభూతి ఉన్న నాయకుడిని.. తాము ఇప్పటివరకూ చూడలేదంటున్నారు. ఆయన తమ నాయకుడు కావడం, తమ పూర్వజన్మ సుకృతమని.. కనబడని దేవుళ్లకు కృతజ్ఞతలు చెబుతున్నారు.

అయితే.. స్థానిక సంస్థలు పెడితేనే ఉద్యోగుల ప్రాణాలు పోతాయన్నట్లు తెగ బాధపడుతున్న రెడ్డిగారు… సర్కారు ఆదేశాలతో ప్రారంభమైన స్కూళ్ల దెబ్బకు.. తొలిరోజే 50 మంది టీచర్లు కరోనా బారిన పడిన విషయంపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ‘ మీరు స్కూళ్లు తెరవడం వల్లే కదా? మా ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని’.. సదరు నేతలు, ఎందుకు నోరు తెరవలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. కృష్ణా జిల్లాలోనే 50 మంది టీచర్లు కరోనా బారిన పడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం గంగలకర్రులో, పిల్లలకు అన్నం వడ్డించిన నిర్వహకురాలికి కరోనా సోకింది. తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లె గ్రామంలోని స్కూల్‌లో ఒక టీచరు, నలుగురు పిల్లలకు కరోనా సోకింది. విజయనగరం, నెల్లూరు జిల్లాల్లోని స్కూళ్లలో కూడా.. టీచర్లు, పిల్లలకు కరోనా సోకింది. ప్రభుత్వం స్కూళ్లలో అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ, కరోనా కేసులు పెరుగుతుండటం.. విద్యార్ధుల తలిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు సచివాలయానికీ కరోనా బెడద తప్పడం లేదు. సెక్షన్లకు సెక్షన్లే ఖాళీ అవుతున్నాయి.

కరోనా వైరస్ తీవ్రత తగ్గేవరకూ స్కూళ్లు తెరవవద్దని, రాజకీయ పార్టీలు మొత్తుకుంటూనే ఉన్నాయి. అయినా జగన్ సర్కారు వాటిని ఖాతరు చేయకుండా, స్కూళ్లపై ప్రారంభించిన ప్రయోగం వికటిస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి స్కూళ్లలో పనిచేసే టీచర్లవి మాత్రం ప్రాణాలు కావా? స్కూళ్లు ప్రారంభిస్తే మా ఉద్యోగుల ప్రాణాల సంగతేమిటని, ఇదే ఉద్యోగ సంఘాలు ఎందుకు నిలదీయలేదు? అప్పుడు లేని ప్రాణహాని, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితేనే వస్తుందా? అని ఉద్యోగులు నిలదీస్తున్నారు.

కరోనా కాలంలో రెండునెలలు సగం జీతం నిలిపివేసినా, ఒక్క నాయకుడూ ఎందుకు ప్రశ్నించలేదు? స్వయంగా నిలివేసిన బకాయిలకు వడ్డీ చెల్లించాలని హైకోర్టు ఆదేశిస్తే, తమకు ఆ వడ్డీ అవసరం లేదని స్వామిభక్తి ప్రకటించిన నేతలకు, మా ప్రాణాలపై ఆందోళన చెందే నైతిక హక్కు ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటిదాకా మూడు డీఏలు చెల్లించాల్సి ఉండగా, ఒక్క నాయకుడు కూడా గతంలో మాదిరిగా, సర్కారు మెడపై కత్తి పెట్టే ధైర్యం చేయలేకపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 5 డీఏలను.. నాలుగు వాయిదాల్లో ఇస్తామంటే ఉద్యోగ సంఘ నేతలు ఎగిరి గంతే శారు. పైగా అదేదో గొప్ప విజయంగా ప్రచారం చేసుకున్న తమ నేతలకు, పూర్తిస్థాయిలో డీఏ బకాయిలు ఇప్పించే ధైర్యం ఎందుకు లేదన్న ప్రశ్నలకు, జవాబిచ్చే దమ్ము ఏ ఉద్యోగసంఘ నాయకుడికి ఉంది?

అన్నట్లు.. ఏపీఎన్జీఓ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి గారు, తన పేరు చివర ఉన్న కులాన్ని తొలగించుకున్నారా? లేక సాక్షి మీడియానే మొహమాటపడి.. ఆయన పేరు చివర ఉన్న రెడ్డి అక్షరాలను ఎందుకు తొలగించిందో అర్ధం కాలేదు. ఎందుకంటే.. విశాఖ వెళ్లిన చంద్రశేఖర్‌రెడ్డి గారి ప్రెస్‌మీట్‌ను వైసీపీ మీడియా సాక్షి కవర్ చేసింది.. కానీ మరుసటిరోజు తన పత్రికలోమాత్రం, ఆయన పేరు చివరన ఉన్న రెడ్డిని తొలగించి, చంద్రశేఖర్ అని మాత్రమే పెట్టింది మరి!