కోర్టుకెళ్లిన వారి ప్రాణాలకు రక్షణేదీ?

506

విద్యుత్‌శాఖలో కొనుగోల్‌మాల్‌పై పోరాటానికి ఫలితం
ఫిర్యాదు చేసినందుకు హత్యాయత్నం
సీఎం, డీీజీపీకి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
విజయవాడలో ఓ బాధితుడి వేదన
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

అవినీతి అక్రమాలపై విచారణ కోరుతూ, కోర్టు తలుపుతట్టే వారి ప్రాణాలకు రక్షణ లేకుండా పోతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వంలోని వివిధ శాఖలలో జరిగే అవకతవకలపై.. న్యాయపోరాటం చేస్తున్న ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగినా, ఇప్పటిదాకా ఆయనకు పొలీసులు రక్షణ కల్పించలేని దుస్థితి నెలకొంది. వందల కోట్ల కుంభకోణాలను బయటపెట్టిన వ్యక్తికే.. రక్షణ కల్పించలేని వ్యవస్థలో, ఇక నిజాలు చెప్పేందుకు సామాన్యులెందుకు బయటకొస్తారన్నది ప్రశ్న.

విజయవాడకు చెందిన శాంతికిరణ్ అనే వ్యక్తి, గత కొన్నేళ్ల నుంచి విద్యుత్‌శాఖలో జరుగుతున్న అక్రమాలపై పోరాడుతున్నారు. చంద్రబాబు హయాంలో కొనుగోలు చేసిన, విద్యుత్ మీటర్ల కొనుగోల్‌పై, విజిలెన్స్ ఇచ్చిన నివేదికపై విచారణ జరపాలని ఆయనే ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దానిపై స్పందించిన కోర్టు, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖ కార్యదర్శిని ఆదేశించింది. దానికి స్పందించిన ఇంధన శాఖ కార్యదర్శి, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుని, వారి నుంచి రెవిన్యూ రికవరీ యాక్టు ప్రకారం డబ్బులు వసూలు చేయాలని ఎస్‌పీడీసీఎస్ ఎండీని ఆదేశించారు. కానీ, ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వారికి షోకాజ్ ఇచ్చి చేతులు దులిపేసుకుని, కేసును మరికొంత కాలం సాగదీసే చర్యలపై విమర్శలూ వెల్లువెత్తాయి.

సదరు శాంతికిరణ్ అనే వ్యక్తి.. చాలా ఏళ్ల నుంచి వివిధ అంశాలపై హైకోర్టులో ఫిర్యాదు చేస్తున్నారు. ప్రధానంగా.. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 49 కోట్ల విద్యుత్‌మీటర్ల కొనుగోల్‌మాల్ వ్యవహారాన్ని, బయట ప్రపంచానికి వెలుగులోకి తెచ్చింది శాంతికిరణ్ కావడం ప్రస్తావనార్హం. దానితో నాటి ఎస్పీడీసీఎల్‌లో వివిధ స్థాయిలో పనిచేసిన 22 మందిపై క్రిమినల్ చర్యలతోపాటు, రెవిన్యూ రికవరీ చట్టం ప్రకారం వారి నుంచి ఆ డబ్బును రాబట్టాలని, కోర్టు కూడా ఆదేశించిన వైనం.. ఇంకా విద్యుత్ శాఖలో ప్రకంపనలు రేపుతూనే ఉంది. అంతకంటే ముందు.. ఎస్పీడీసీఎల్ సీఎండి దొర హయాంలో జరిగిన, 131 కోట్ల కవర్డ్ కండక్టర్ల కొను‘గోలుమాల్’ కథనూ.. బయటకు తెచ్చింది కూడా శాంతికిరణ్ కావడం విశేషం.

అంతకుముందు.. నాలుగేళ్ల క్రితం, అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, గన్నవరం మండలం బుద్దవరం ధాన్యం కొనుగోలు కేంద్రంలో, సుమారు 90 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దానికి సంబంధించి శాంతికిరణ్, తన వద్ద ఉన్న ఆధారాలను కృష్ణా జిల్లా కలెక్టరు, పౌరసరఫరాల శాఖకు అందించి ఫిర్యాదు చేశారు. దానితో విచారణకు దిగిన అధికారులకు, ఆ ఫిర్యాదు నిజమని తేలింది. అయితే ఆ విచారణ నివేదికను అమలు చేయాలని కోరుతూ, శాంతికిరణ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం అది పెండింగ్‌లో ఉంది. అయితే, ఈ కుంభకోణం బయటపెట్టారన్న అక్కసుతో.. తెరవెనుక చక్రం తిప్పిన నేతలు, శాంతికిరణ్ ఆఫీసు ఎదుట డ్వాక్రా మహిళల ముసుగులో ధర్నా చేయించారు. ఆ సమయంలోనే ఆయన కారు అద్దాలు పగులకొట్టారు. ఓ ప్రజాప్రతినిధికి ఈ విషయాన్ని ఫిర్యాదు చేసి, వస్తుండగా ఆయనపై దాడి జరిగింది. దానిపై ఎఫ్‌ఐఆర్ నమోదయినా ఇప్పటివరకూ చర్యల్లేవు.

తాజాగా నవంబర్ 1న.. విజయవాడ నుంచి గన్నవరం వెళ్లే సమయంలో, బుడమేరు వంతెన సమీపంలో, రెండు ద్విచక్రవాహనాలపై ఇద్దరు వ్యక్తులు వచ్చి దాడికి ప్రయత్నించారు. ఆ ఘటనపై శాంతికిరణ్ గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈవిధంగా పలు అంశాలపై స్పందిస్తూ, వివిధ స్థాయిలో జరుగుతున్న అవినీతిని ప్రభుత్వం-కోర్టుల దృష్టికి తీసుకువస్తున్న తనపై దాడులు జరుగుతున్నందున, తనకు రక్షణ ల్పించాలని శాంతికిరణ్ ప్రభుత్వానికి లేఖ రాశారు.

12-10-2020న సీఎం, హోం మంత్రి, డీజీపీ, విజయవాడ కమిషనర్‌కు లేఖ రాసినట్లు శాంతికిరణ్ వెల్లడించారు. విద్యుత్ మీటర్ల కొనుగోలు, అంతకుముందు విద్యుత్ శాఖ కవర్ కండక్టర్ల కొనుగోలు, అవినీతి, ధాన్యం కొనుగోలు అక్రమార్కులపై.. తాను న్యాయపోరాటం చేస్తున్నందునవల్లనే, తనపై హత్యాప్రయత్నం జరుగుతున్నట్లు శాంతికిరణ్ అనుమానం వ్యక్తం చేశారు. దీన్నిబట్టి.. అవినీతి-అక్రమాలను ప్రశ్నిస్తూ కోర్టుకెళుతున్న వారికి, రక్షణ కరువయినట్లు స్పష్టమవుతోంది.ఇది కూడా చదవండి .. ‘అవనీర్’ మీటర్ల కొను‘గోల్‌మాల్’పై..విజిలెన్స్ నివేదికకు విలువేదీ?