రాజు గారు బయటపెట్టిన ‘గజపతికోట రహస్యం’

1
46

సంచయత తండ్రి పేరు మరోమారు తెరపైకి
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

కథ పాతదే. కాకపోతే ఇప్పటి తరానికి తెలియదు. ఇప్పటి తరమంటే.. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ బ్యాచ్చన్న మాట. అందుకే నర్సాపురం యుశ్రారైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు కాస్తంత కొత్తగా పాతకథ చెప్పారు. మీడియాలో రచ్చగా మారిన, ‘గజపతుల కోట రహస్యం’ తెలియని వారికి,  ఎంపీ రాజుగారు చెప్పిన ‘పాతదయిన కొత్త కథ’ ఏమిటో  తెలియనివారికి, ఆసక్తి కలిగించేదే. అదొక్కటే కాదు. హిందూ వారసత్వం, సంస్కృతి సంప్రదాయాలపై ఏ మాత్రం గౌరవాభిమానాలున్న ఎవరికయినా, సంచయత అనే ఆధునిక మహిళ, గజపతులకు వారసులు కాదనిపించక మానదు. ఇప్పుడు నర్సాపురం రాజు గారు చెప్పిన కథ కూడా అదే!

మాన్సాస్ ట్రస్ట్ పేరు విన్నారు కదా? అదేనండీ.. మొన్నటివరకూ, కేంద్ర మాజీ  మంత్రి అశోక్‌గజపతిరాజు కుటుంబం ఏలుబడిలో ఉన్నదే..  ఆ ట్రస్టే ఈ ట్రస్టు!  జగనన్న సర్కారు వచ్చిన తర్వాత ఆయన తొలగించేసి.. గజపతుల వారసురాలని తెరపైకి  తెచ్చి,  సంచయత అనే మహిళకు ఆ మాన్సాస్ ట్రస్టు  అప్పగించింది. సరే..అది ఆమెపై అభిమానంతో ఆ పదవి ఇచ్చారా? లేక ఆ ట్రస్టు అధీనంలో ఉన్న వేలాది ఎకరాలపై ఉన్న, ప్రేమతో ఇచ్చారా అన్నది వేరే కథ.

పైగా సంచయత బీజేపీ సభ్యురాలట. మరి బీజేపీ వ్యక్తికి అంత పెద్ద ట్రస్టు ఎలా ఇచ్చారు? అంత విశాల హృదయం,  ఒక్క మాన్సాస్‌కే ఎందుకు? మిగిలిన వాటికీ వర్తింపచేయవచ్చు కదా అని ప్రశ్నిస్తే, వైసీపీ-బీజేపీ మధ్య ఉన్న బాదరాయణ సంబంధాల గురించి చెప్పాల్సివస్తుంది. పైగా ఇప్పుడు ఏపీ బీజేపీలో ‘అతి పెద్ద’ పోస్టులో ఉన్న ఒకాయనే ఈ పుణ్యం కట్టుకుని, యుశ్రారైకాపా కీలకనేత దగ్గర పైరవీ చేశారన్నది తెరవెనుక కథ. సదరు బీజేపీ-యుశ్రారైకాపా నాయకులను, విశాఖ సాములోరు..  టీడీపీ-బీజేపీ కలసి కాపురం చేస్తున్న రోజుల్లోనే జతకలిపారట. అది మరో బహిరంగ రహస్యం.

ఇక ఇప్పుడు మళ్లీ గజపతుల కోటలోకి వెళదాం. నర్సాపురం రాజు గారు, ఇప్పుడు సదరు సంచయత పుట్టుపూర్వోత్తరాల విప్పిన గుట్టు, యమా ఇంట్రస్టింగుగా ఉంది. ఆనందగజపతి రాజు భార్య పేరు ఉమాగజపతిరాజు. ఆ తర్వాత ఆనంద గజపతి రాజు నుంచి విడాకులు తీసుకున్న సదరు ఉమా.. ఢిల్లీలో  రమేష్ శర్మ అనే జర్నలిస్టును పెళ్లిచేసుకున్నారు. ఆ వెంటనే  ఆనందగజపతి రాజుల వారు కూడా, సుధా రాజును పెళ్లిచేసుకున్నారు.  అంటే చట్ట ప్రకారం ఆనందగజపతి నుంచి వేరు పడి, మారు మనువు చేసుకున్న ఉమాకు.. భర్త-కులం రెండూ మారాయన్నమాట. ఆ తర్వాతనే ఇప్పటి మాన్సాస్ ట్రస్టు చైర్మన్ సంచయత జన్మించిదట.

ఆ ప్రకారం తన స్కూలు రికార్డులలో కూడా, సంచయత తండ్రి రమేష్ శర్మ అనే రాశారట. ఇవన్నీ ఒక ఎక ఎత్తయితే, సంచయత  2013లో రాసిన ఓ ఆర్టికల్‌లో కూడా, తన నేపథ్యం ఏమిటో వివరించారట. అంటే ఇది కూడా చట్టప్రకారం.. సంచయత అనే మహిళ రమేష్ శర్మ కూతురనే నిర్ధారిస్తుందని, మెడ మీద తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుందన్నమాట. మరి పాలకులకు అర్ధం కాలేదా అని మాత్రం అడక్కండి. ఎందుకంటే.. ఇది మెడమీద తల ఉన్న వారికి సంబంధించిన ప్రశ్నలు కాబట్టి!

మరి గజపతుల కుటుంబం నుంచి వేరు పడి, రమేష్ శర్మ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టిన సంచయత.. గజపతుల కుటుంబానికి, ఎలా వారసురాలవుతారన్నది ప్రశ్న. చట్ట ప్రకారం రెండోపెళ్లి చేసుకున్న, సుధారాజు కుమార్తెలే కదా నిజమైన వారసులయ్యేది? మరి రమేష్ శర్మ కూతురుగా  రికార్డుల్లో ఉన్న సంచయత, గజపతుల కుటుంబానికి ఎలా వారసురాలవుతుంది? ఆ కుటుంబం నుంచి ట్రస్టుకు ఎలా ప్రాతినిధ్యం వహిస్తుందని, ఎంపీ రాజుగారు తీసిన లాపాయింటు రైటే కదా మరి? అయినా.. ఎంపీ రాజు గారి  పిచ్చికాకపోతే… ఎవరి ట్రాప్‌లో పడవద్దని చెబితే, సంచయత వింటారనుకోవడం ఏమిటి? ఆల్రెడీ అది ముగిసిన కథే కదా? రాజు గారూ.. ఆశ మంచిదే. అత్యాశే పనికిరాదండీ.. ఆయ్!

1 COMMENT