‘ధరణి’కి బ్రేకులు..

417

కేసీఆర్ దూకుడుకు కోర్టు స్టే
పాపం గ్లోబరీనా కంపెనీ
కోర్టుకెళ్లిన బీజేపీ నేత కరుణాకర్
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

తెలంగాణలో ఆస్తుల వివరాలకు సంబంధించి… కేసీఆర్ సర్కారు రూపొందించిన ధరణి దూకుడుకు, పోర్టల్‌కు హైకోర్టు బ్రేకులు వేసింది. వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదుపై స్టే విధించింది. అసలు ఒక ప్రైవేటు సంస్థకు, ఆస్తుల వివరాలు ఎలా ఇస్తారన్న ప్రశ్నలు ఈ పోర్టల్ ప్రారంభం నుంచే మొదలయ్యాయి. పైగా పాలకులతో సన్నిహిత సంబంధాలున్న గ్లోబరీనా సంస్థకు, ఈ సైట్ నిర్వహణ అప్పగించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో.. ధరణి పోర్టల్‌పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో, పాపం గ్లోబరీనా నిరాశ చెందాల్సి వచ్చింది.

అంతా ఆందోళన చెందినట్లే.. హైకోర్టు కూడా ధరణి పోర్టల్ భద్రతపై ఆందోళన, సందేహాలు వ్యక్తం చేయడం విశేషం. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ధరణిని డౌన్‌లోడ్ చేసుకునే సందర్భంలో.. అచ్చం అలాంటి మరో నాలుగు యాప్స్ ఉన్నందున, పౌరులు ఏది అసలైన యాప్ అన్నది గుర్తించడం కష్టమని కోర్టు వ్యాఖ్యానించింది. అసలు ధరణి యాప్‌పై అనుసరిస్తున్న భద్రతా ప్రమాణాలేమిటో చె ప్పాలని ఆదేశించింది. ఇప్పటివరకూ సేకరించిన వివరాలు ఎవరికీ ఇవ్వవద్దని ఆదేశించింది.

ధరణి ఏర్పాటు ప్రక్రియపై, హైకోర్టు చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే.. దానిపై ప్రజలకున్న సందేహాలను, న్యాయస్థానం గుర్తించినట్లు స్పష్టమవుతోంది. అసలు ఏ చట్టం ప్రకారం ఆధార్, కులం వివరాలు సేకరిస్తున్నారని నిలదీసింది. వ్యక్తిగత వివరాలకు ఎలా భద్రత కల్పిస్తారని ప్రశ్నించింది. కొత్త రె విన్యూ చట్టంలో, వ్యవసాయేతర భూముల ప్రస్తావన ఎక్కడ ఉందని సూటిగా ప్రశ్నించింది. అందులో డేటా భద్రత ప్రస్తావనే లేదని గుర్తు చేసింది. అసలు దానికి ఉన్న చట్టబద్ధత-డేటా.. భద్రత వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.

నిజానికి ధరణి పోర్టల్ ప్రక్రియ ప్రారంభం నుంచే, దానిపై రాజకీయ పార్టీలు-ప్రజల్లో సందేహాలు, ఆందోళన మొదలయింది. తమ ఆస్తుల వివరాలు ఎందుకివ్వాలన్న ప్రశ్న, ప్రజల నుంచి వ్యక్తమయింది. పైగా అసలు ధరణి పోర్టల్ ప్రభుత్వానిదా? ప్రైవేటు సంస్థదా? వివరాలు ఇవ్వాలని ఏ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయన్న ప్రశ్నలకు, ఇప్పటివరకూ ఏ ఒక్క శాఖ సమాధానం ఇవ్వలేదు. పైగా ఒకరిపై మరొకరు బాధ్యత నెట్టేసుకున్నాయి. దానితో జనంలో ఆందోళన మరింత పెరిగింది.

పైగా దాని నిర్వహణ గ్లోబరీనా సంస్థకు అప్పగించారన్న వార్తలు, ప్రజలను మరింత ఆందోళనకు గురిచేశాయి. గతంలో ఇంటర్ మూల్యాంకన బాధ్యత తీసుకున్న సదరు సంస్థ తప్పిదాల వల్ల, తెలంగాణలో 25 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. దానితో ఆగ్రహించిన తలిదండ్రులు, ఇంటర్ కార్యాలయాన్ని విడతల వారీగా ముట్టడించడం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు అదే సంస్థ చేతికి ధరణి పోర్టల్ నిర్వహణ అప్పగించడం ప్రజల ఆందోళనకు కారణమయింది. సదరు సంస్థ యజమాని, సర్కారుకు దగ్గరివారిగా పేరుంది.

తాజాగా హైకోర్టు ఇచ్చిన స్టేతో, ప్రజలు ఊరట చెందారు. దీనిపై ప్రజాందోళనను తొలుత గుర్తించి, న్యాయపోరాటం చేసిన ఘనత బీజేపీకే దక్కుతుంది. ఈ ప్రక్రియ ప్రారంభం కాకముందే, బీజేపీ సీనియర్ నేత జి.ఆర్.కరుణాకర్.. ప్రజల్లో నెలకొన్న సందేహాలపై కోర్టుకెళ్లారు. అయినా, ప్రభుత్వం పోర్టల్‌ను ప్రారంభించింది.

‘ అసలు ధరణి పోర్టల్ అనేది ప్రభుత్వానిదా? ప్రైవేటుదా? ఒకవేళ ప్రభుత్వానిదయితే, ఏ శాఖ నుంచి ఆమేరకు ఉత్తర్వులొచ్చాయి? ఒకవేళ ప్రభుత్వం కాకుండా, ప్రైవేటు సంస్థ దానిని నిర్వహిస్తే, పౌరుల వ్యక్తిగత భద్రత, గోప్యతకు భంగం కలిగితే, దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? అంటే కేసీఆర్ ఏది చెబితే అది చట్టమయిపోతుందా? అధికారులు వాస్తవాలు చెప్పరా? వారి మెదళ్లు ఏమైపోయాయి? ఒక ప్రైవేటు సంస్థకు ఆస్తుల వివరాలు ప్రజలు ఎందుకు ఇవ్వాలని అధికారులు చెప్పలేరా? ధరణిపై కోర్టు స్టే ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం’ అని, కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ సీనియర్ నేత జి.ఆర్.కరుణాకర్ వ్యాఖ్యానించారు. విచిత్రంగా.. సీఎస్ స్వయంగా హాజరయిన సెంటర్‌లోనే, తొలిరోజు పోర్టల్ మొరాయించిన వైనంపై విమర్శలు వెల్లువెత్తాయి.