కమలం-కోడిగుడ్డు కథ!

778

కరుణించని కాంట్రాక్టర్లు
టీడీపీ నుంచి వైసీపీ వరకూ అదే కథ
(మార్తి సుబ్మ్రహ్మణ్యం- 9705311144)

కమలం పార్టీలో ఇదో ఆసక్తికర కహానీ. ఏపీ కమలదళాలకు-కోడిగుడ్లకూ ఏదో అవినావ సంబంధం ఉన్నట్లుంది. ఈ కథ ఇప్పటిది కాదు. చంద్రబాబు నుంచి మొదలయి, జగనన్న వరకూ కొన‘సాగుతోంది’. ఏపీలో బీజేపీ పెద్దాయన ఒకరు.. సందర్భం ఏదయినా గానీ, సమయం ఏదయినా గానీ.. అంటే అది తుపానయినా కావచ్చు. కరవయినా కావచ్చు. కానీ ఆయనకు గుర్తుకు వచ్చేది మాత్రం కోడిగుడ్ల కథే. అంటే పేరు కోడిగుడ్డుదయినా.. తీరు మాత్రం ఆవుకథ అన్నమాట! ఆయనకు అది ఎవర్‌గ్రీన్!!

అంగన్‌వాడీ కేంద్రాల్లో చదివే పిల్లలకు పౌష్టికాహారం కోసం, ప్రభుత్వం కోడిగుడ్లు సరఫరా చేస్తుంటుంది. దానికి వందల కోట్లు కేటాయిస్తుంది. నిబంధనల ప్రకారం 50-60 గ్రాముల సైజు ఉండే, కోడిగుడ్లు మాత్రమే కాంట్రాక్టర్లు సరఫరా చేయాలి. కానీ పాపం.. సదరు కాంట్రాక్టర్లు ప్రభుత్వంలో ఉండే పెద్ద తలలు, చిన్న తలలతోపాటు, రాజకీయ పార్టీలనూ తృప్తి పరుస్తుండాలి. వీరుకాకుండా, స్థానిక విలేకరులు, విద్యార్థి సంఘాల నేతలనూ ‘చూసుకోవాలి’ మరి! కాబట్టి.. సర్కారు చెప్పిన సైజు కోడిగుడ్డు సర ఫరా చేస్తే, వచ్చే ఆదాయం సున్నకు సున్నా, హళ్ళికి హళ్లి. అందుకే ‘కాస్తంత చిన్నసైజు’ కోడిగుడ్లు సరఫరా చేస్తుంటారు. ఇదంతా రహస్యమేమీ కాదు. బహిరంగమే.

ఈ చిదంబరహస్యం తెలిసిన ఓ కమలదళ మేధావి.. పాపం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నుంచీ, జగన్ వరకూ ఇప్పటిదాకా కోడిగుడ్డు కాంట్రాక్టర్లపై మనసుపారేసుకుంటూనే ఉన్నారట. అప్పటి నుంచీ వీలు దొరికినప్పుడల్లా.. ‘ఆ కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్న కోడిగుడ్లలో నాణ్యత లేదు. దాని సంగతి తేల్చమని’ తెగ పోరాడుతూనే ఉన్నారు. అప్పుడప్పుడూ అదే అంశంపై, సీఎంలకు లేఖ రాస్తుంటారు. వీలు దొరక్కపోయినా, దొరికించుకుని మరీ చట్టసభలో కోడిగుడ్డనే ఆవుకథను వినిపిస్తూనే ఉన్నారు. అయినా.. అక్క ఆర్భాటమే తప్ప, బావబతికుంది లేదన్నట్లు.. ఎవరూ పట్టించుకోరు. అందుకే.. సదరు నాయకుడు, తన పార్టీ వేదికలపైనే కోడిగుడ్ల కథను వినిపిస్తుంటారు.

అసలు ఇంతకూ ఈ ఆవు కథ.. సారీ… కోడిగుడ్డు కథేమిటంటే.. గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టరును, సదరు నాయకుడు ఓసారి వచ్చి తనను కలవమన్నారట. పెద్ద నాయకుడు. పైగా గవర్నమెంటులో భాగస్వామిగా ఉన్న నోరున్న నాయకుడాయె! పిలిచిన వెంటనే వచ్చి వాలిపోయిన కాంట్రాక్టరుకు, సదరు బీజేపీ నాయకుడు.. ‘అసలు’ విషయం చెప్పారట. ‘మమ్నల్నీ చూసుకోండనేది’ ఆయన కవి హృదయమన్నమాట! అయితే, ఆ కాంట్రాక్టరు అస్సలు భయపడకుండా.. ఇప్పటికే మేం ఉద్యమాలు చేసే పార్టీకి క్రమం తప్పకుండా నెలవారీ చందాలిస్తున్నాం. పైన ఉన్న ఉన్నవాళ్లకూ ఇస్తున్నాం. ఇక మీకూ ఇస్తే దివాళా తీస్తామని, చావుకబురు చల్లగా చెప్పి వెళ్లిపోయారట. దానితో బాగా హర్టయిన ఆ నాయకుడు, అప్పటి నుంచీ, కోడిగుడ్ల కథను, ఆవుకథ మాదిరిగా వినిపిస్తున్నారన్నది కమలదళాల్లో వినిపిస్తున్న చర్చ.

ఈ కోడిగుడ్డు కథకూ ఓ నేపథ్యం ఉందట. గతంలో ఉద్యమాలు చేసే పార్టీలో పనిచేసి, అంగన్‌వాడీలో యానిమేటర్‌గా పనిచేసిన ఓ మహిళా నేత బీజేపీలో చేరారు. ఆమె ‘ప్రతిభ’ తె లుసుకున్న సదరు బీజేపీ నేత, ఆమెను పార్టీలో బాగా ప్రోత్సహించారట. పనిలోపనిగా ఉద్యమాలు చేసే పార్టీకి అంగన్‌వాడీల నుంచి చందాలు ఎలా వస్తున్నాయన్న దానిపై పరిశోధన చేసి, ఆమె ద్వారా ఆ వివరాలు సేకరించారట. ఆ ప్రకారంగా.. ఒక్కో సెంటర్ నుంచీ వెయ్యి రూపాయలు, ఉద్యమాలు చేసే పార్టీకి విరాళాలుగా వెళతాయని తెలుసుకున్నారట. ఇక ఆ తర్వాత కథ తెలిసిందే కదా? అదే ఈ కోడిగుడ్ల కథ!