కేంద్రాన్ని అడ్డంగా ఇరికించిన కేసీఆర్

65

పెన్షన్ పైసలపై రాజీనామాకు సవాల్
రుజువు చేస్తేనే బీజేపీకి విలువ
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

పెన్షన్లపై తరచూ సవాళ్లు విసురుతున్న బీజేపీ నేతలకు, తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుగులేని సవాల్ విసిరారు. కేంద్రం.. రాష్ర్టానికి పెన్షన్ల కింద ఏడాదికి ఇచ్చే సొమ్ము కేవలం 107 కోట్లు మాత్రమేనని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. దీనిని కాదని నిరూపిస్తే, రాజీనామా చేసేందుకు సిద్ధమేనన్న సవాల్ విసిరి, కమలనాధులను ఆత్మరక్షణలో నెట్టడం చర్చనీయాంశమయింది.

కొంతకాలం నుంచి, తెలంగాణ బీజేపీ నేతలు పెన్షన్లపై చర్చను విస్తృతం చేస్తున్నారు. పెన్షన్లలో సింహభాగం సొమ్ము, నరేంద్రమోదీ సారధ్యంలోని కేంద్రం ఇస్తోందని ప్రచారం చేస్తున్నారు. ఆ సొమ్ముతో కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. దీనిపై దమ్ముంటే చర్చకు రావాలని.. బండి సంజయ్ నుంచి, రాష్ట్ర నేతల వరకూ టీఆర్‌ఎస్‌కు సవాళ్లు విసురుతున్నారు. ఇటీవల ఆర్ధికమంత్రి హరీష్‌రావు.. కేంద్ర నిధుల విడుదలపై చేసిన సవాలుకు, బీజేపీ నేతలెవరూ నేరుగా స్పందించలేదు. అసలు లెక్కలను బయటపెట్టలేదు.

తాజాగా.. కేసీఆర్ రంగంలోకి దిగి, ఈ సవాళ్లను కొత్తమలుపు తిప్పారు. తెలంగాణలో.. 38 లక్షల 64 వేల 751 మందికి అన్ని రకాల పెన్షన్లు ఇస్తుంటే, అందులో కేంద్రం కేవలం 7 లక్షల మందికే, అది కూడా మనిషికి 200 రూపాయలు మాత్రమే పెన్షన్లు ఇస్తోందన్నారు. అవన్నీ కలిపితే 105 కోట్లు మాత్రమేనని బట్టబయలు చేశారు. కానీ తన ప్రభుత్వం, 10 నుంచి 11 వేల కోట్లు ఖర్చు పెడుతోందంటూ తన వద్ద ఉన్న కాగ్ రిపోర్టును చూపించారు. ఇది కాదని రుజువు చేస్తే, తాను ఒక్క నిమిషంలోనే రాజీనామా చేసి వెళ్లిపోతానని సవాల్ విసరడం సంచలనం సృష్టించింది.

సహజంగా కేసీఆర్ అనేక సందర్భాల్లో అనేక సవాళ్లు విసిరినా, రాజీనామా అంశాన్ని ప్రస్తావించలేదు. గతంలో తాను సీఎం పదవి దళితుడికి ఇస్తానని చెప్పడంతోపాటు, అనేక అంశాల్లో తాను చెప్పిన హామీలకే విరుద్ధమైన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. కానీ ఇప్పుడు పెన్షన్ల అంశాన్ని బీజేపీ యాగీ చేస్తుండటంతో, ఆయన హటాత్తుగా కేంద్ర నిధులపై తాడోపేడో తేల్చుకునేందుకు, ఎదురుదాడి ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆయన వైఖరి బీజేపీ బండారాన్ని తేల్చాలన్నట్లుగానే కనిపించింది. కాగ్ రిపోర్టు ఆధారంగా, ఆయన సంధించిన అస్త్రం.. సహజంగానే బీజేపీని సంకటంలో పడేసింది.

ఇక ఇప్పుడు పెన్షన్ల బంతి బీజేపీ కోర్టులోనే ఉంది. కేసీఆర్ చేసిన సవాలుకు, నిర్దిష్టమైన జవాబు ఇవ్వడంపైనే, ఆ పార్టీ విశ్వసనీయత ఆధారపడిఉంది. ఇప్పటికే సవాళ్లు విసిరి, పారిపోతున్నారన్న విమర్శను మూటకట్టుకున్న బీజేపీ.. కనీసం తాను చేసిన పెన్షన్ల అంశం ఆరోపణలకయినా, కట్టుబడి ఉండక తప్పదు. ఒకవేళ కాదని తప్పించుకుని తిరిగే మార్గాలు ఎన్నుకుంటే.. బీజేపీ బురద రాజకీయాలకే పరిమితమవుతుందన్న విమర్శను, స్థిరం చేసుకోవలసి వస్తుంది.

తాము కేసీఆర్ చెప్పిన దానికంటే, ఎక్కువగా రాష్ర్టానికి పెన్షన్లు ఇస్తున్నామని నిరూపించుకునే బాధ్యత, కచ్చితంగా కమలదళానిదే. బీజేపీ నేతలు, తమ వివరణ పత్రంలో కేసీఆర్ చెప్పినట్లే లెక్కలు చూపిస్తే మాత్రం, ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబడక తప్పదు. ఒకవేళ అంతకుమించి చూపిస్తేనే, కేసీఆర్ సర్కారు బోనెక్కే అవకాశం ఉంటుంది. నిజానికి ఇది కమలదళానికి, కేసీఆర్ ఇచ్చిన అపూర్వ అవకాశం. ఇద్దరూ సవాళ్లు విసిరినందున, ఎవరి మాట నిజమో, ఎవరి వాదన అబద్ధమో తెలుసుకునే హక్కు ప్రజలకూ ఉంది.

నిజంగా బీజేపీ నాయకత్వానికి.. కేసీఆర్ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ను, జనం ముందు ముద్దాయిగా నిలబెట్టాలన్న లక్ష్యం ఉంటే, కేసీఆర్ విప్పిన కాగ్ నివేదిక చిట్టా తప్పని నిరూపించాల్సిందే. ఆమేరకు వాస్తవ గణాంకాలు విడుదల చేయాల్సి ఉంటుంది. లేకపోతే.. కమలం పార్టీ నాయకులు, కేవలం కాగితం పులులన్న ముద్ర నిజం చేసుకునే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటిదాకా కేసీఆర్‌వి.. జూటా మాటలని ధ్వజమెత్తుతున్న కమలదళాలు, వాటిని నిరూపించుకోవాలి.

కేసీఆర్ విప్పిన కాగ్ లెక్కలన్నీ టీఆర్‌ఎస సర్కారు సొంతగా సృష్టించినవి కాదు. ఏ రాష్ర్టానికి కేంద్రం ఎంత ఇస్తుందో, ఆ సంస్థ నివేదిక రూపంలో ఇస్తుంది. ఒకవేళ కేసీఆర్ మాటలు అబద్ధమని తేల్చాలన్నా, కమలదళం మళ్లీ కాగ్ లెక్కలే బయటపెట్టాలి. చూడాలి ఏం జరుగుతుందో? సరే.. ఇంతకూ మరి, పెన్షన్ల గుట్టు విప్పే బాధ్యత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీసుకుంటారా? లేక అధ్యక్షుడు బండి సంజయ్ తీసుకుంటారా అన్నదే చూడాలి.