దుబ్బాకలో దుమ్ము రేపేదెవరు?

54

అందరికీ అగ్నిపరీక్ష
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

మరో ఏడాదిలో జమిలి ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈలోగా జరిగిన నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. ఆ తర్వాత దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్ని జరగనుంది. ఈ ఉప ఎన్నిక అన్ని ప్రధాన పార్టీలకూ అగ్నిపరీక్షగా మారింది. ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్‌పై.. ప్రజల్లో ఉన్న నమ్మకానికి, ఆ పార్టీ నాయకత్వ ధీమాకు, హరీష్‌రావు సత్తాతోపాటు.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు సంజయ్ నాయకత్వానికి, అసలు సిసలు పరీక్షగా పరిణమించింది.

టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, రామలింగారెడ్డి మృతి కారణంగా జరగనున్న ఉప ఎన్నిక.. టీఆర్‌ఎస్-కాంగ్రెస్-బీజేపీలకు అగ్నిపరీక్షగా మారింది. దేశంలోనే అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌గా ఉందని ప్రచారం చేసుకుంటున్న, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నిక గెలవడం ప్రధానం. ఈ ఎన్నికలో గెలిస్తే, ప్రజలు టీఆర్‌ఎస్‌పై భరోసాతో ఉన్నారన్న సంకేతం వెళుతుంది. ఓడిపోతే, రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. ఎందుకంటే దుబ్బాకలో ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే, ఆ ప్రభావం గ్రేటర్ ఎన్నికలపై కచ్చితంగా ఉంటుంది.

పైగా హరీష్‌రావు వ్యక్తిగత ప్రతిష్ఠకూ ఇది అగ్నిపరీక్షనే. ఎందుకంటే ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు, ఆయనే స్టా ర్ క్యాంపెయినర్. హరీష్ ఒంటిచేత్తో ప్రచారం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్ధి గెలిస్తే, అది హరీష్ ఖాతాలోకే వెళుతుంది. ఒకవేళ ఓడిపోతే అది హరీష్ వ్యక్తిగత ఓటమిగానే భావించాలి. అది ఇప్పటివరకూ ట్రబుల్‌షూటర్‌గా పేరున్న హరీష్‌కు పార్టీలో ఇబ్బందికర పరిణామమే. అయితే, అభ్యర్ధి ఎంపికపై టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొందరు మండల స్థాయి నేతలు, కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీనివాసరెడ్డికి లోపాయకారీ మద్దతు ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

ఇక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వానికీ ఇది సవాలే. ఇప్పటికే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో, బీజేపీ ఓటర్లను పోగొట్టుకుంది. ఎంపీగా ఉంటూ, సొంత కరీంనగర్ కార్పొరేషన్‌లో కూడా.. సొంత పార్టీ కార్పొరేటర్లను కాపాడుకోలేకపోయారన్న, అపప్రద మూటకట్టుకున్నారు. దుబ్బాక బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావుకు స్థానికంగా మంచిపేరు ఉంది. పైగా ఆయన టీవీ చర్చల ద్వారా, అందరికీ పరిచయమే.

స్వతహాగా న్యాయవాది అయిన రఘునందన్‌రావుకు ఇమేజ్ ఉన్నప్పటికీ, సంస్థాగతంగా అక్కడ బీజేపీ బలహీనమే. ఇటీవల జరిగిన డబ్బుల పంపిణీ వ్యవహారం, కొంతమేరకు ఆ పార్టీ వైపు చూసేలా చేయగలిగింది. అంతకుమించి, కాంగ్రెస్‌తో పోలిస్తే, సంస్థాగతంగా బీజేపీకి పెద్దగా బలం లేదంటున్నారు.

మరోవైపు కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డికీ, ఈఎన్నిక ప్రతిష్ఠాత్మకమే. ఆయన మంత్రి అయిన తర్వాత, జరుగుతున్న తొలి ఉప ఎన్నిక ఇది. ఈ ఎన్నికలో గెలిస్తే, కిషన్‌రెడ్డి పలుకుబడి పెరుగుతుంది. ఓడిపోతే, మంత్రిపదవి ఇచ్చినా, పార్టీకి ఉపయోగం లేదన్న సంకేతాలు వెళతాయి. ఇప్పటికే కేంద్రనిధులపై, హరీష్ విసిరిన సవాలుకు బీజేపీ నేతలు జవాబు ఇవ్వలేదు. బీజేపీ నేతలు జనంలోకి వెళ్లడం కంటే, మీడియా-సోషల్‌మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తున్నారన్న అభిప్రాయం లేకపోలేదు.

ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి, చెరుకు శ్రీనివాసరెడ్డి ప్రచారం కూడా టీఆర్‌ఎస్‌కు పోటా పోటీగానే ఉంది. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ప్రచారం కాకరేపుతోంది. బీజేపీ-టీఆర్‌ఎస్ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నారన్న ప్రచారాన్ని, ఆయన కిందిస్థాయి వరకూ తీసుకువెళ్లగలిగారు. ఆయన సభలకు జనం బాగానే హాజరయ్యారు. పైగా దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డికి, నియోజకవర్గంలో మంచిపేరుంది. మూడుదశాబ్దాల రాజకీయ చరిత్రలో, మచ్చలేని నేతగా పేరుంది. ఆ సానుభూతితోపాటు, పార్టీ క్యాడర్ దన్ను కూడా శ్రీనివాసరెడ్డికి ఉన్నట్లు కనిపిస్తోంది.

ఒకవేళ ఈ ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే, ఇక తెలంగాణలో ఆ పార్టీ ప్రభంజనం ప్రారంభమయినట్లే లెక్క. ఓడిపోతే, అది పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వానికి మరో అప్రతిష్ఠ. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలతోపాటు, భార్య పోటీ చేసిన ఉప ఎన్నికలో పార్టీని గెలిపించలేని నేతగా, అపవాదు మూటకట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికలో కూడా ఓడిపోతే, ఆయన పదవికి ఎసరు తప్పదు.

ఇప్పటివరకూ ఉన్న ప్రచారసరళి చూస్తే… టీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్యనే పోటీ తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కాకపోతే ఇటీవల డబ్బుల పంపిణీ వ్యవహారం రచ్చ కావడంతో.. ఆ రెండురోజుల వాతావరణం, టీఆర్‌ఎస్-బీజేపీ మధ్య పోటీ అన్నట్లు కనిపించిందని, రాజకీయ విశ్లేషకుల అంచనా.