భలేవాడికి అన్నయ్య.. ఏపీ సీఎం జగనన్నయ్య!

659

లిక్కర్, బదిలీలపై రివర్స్ గేర్
తత్వం తెలుసుకుంటున్న ఏపీ సీఎం
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

సహజంగా మనం అతను భలేవాడని అంటుంటాం. కానీ ఏపీ సీఎం జగనన్న మాత్రం.. ఆ భలేవాడికి అన్నయ్యలా ఉన్నాడన్న కొత్త సామెత ఒకటి, ఇప్పుడు వాడుకలోకి వచ్చింది. ముందు కాదనడం, ఆ తర్వాత దానినే తూచ్ అవుననడం అలవాటయిపోయింది. బహుశా అందుకే ఈ పద ప్రయోగం ప్రచారంలోకి వచ్చినట్లుంది. మొన్నటికి మొన్న సీఎస్ రేసులో ఉన్న ఓ సీనియర్ ఐఏఎస్‌ను బదిలీ చేసి, మళ్లీ రెండోరోజునే పోస్టింగు ఇచ్చి హాశ్చర్యపరిచారు.

నిన్నటికి నిన్న లిక్కర్ పాలిసీపై అసెంబ్లీలో దంచికొట్టి చేసిన ప్రసంగాలన్నీ, తాజా రేట్ల తగ్గింపుతో.. తస్సాదియ్యా తుస్సుమన్నట్లయింది. ఫర్వాలేదు. పాలకులు వెనకడుగు వేసినంత మాత్రాన విమర్శించకూడదు. ఆలస్యంగానయినా తత్వం బోదపడినందుకు సంతోషించాలి. ఇప్పుడు మొండివాడిగా పేరున్న ఏపీ సీఎం జగనన్నను, ఆ మేరకు అఖిలాంధ్రులు
అభినందించాలి.

మద్యం మాన్పించేందుకు.. షాక్ కొట్టేలా మందు ధరలు పెంచామన్నారు. మద్యాన్ని దశల వారీగా నిషేధించే క్రమంలోనే, వాటి రేట్లు కావాలనే పెంచామని.. జగన్ అండ్ ‘పెద్దగొంతు’ అంబటి రాంబాబు సభలో సెలవిచ్చారు. పెంచిన ధరలు, ప్రపంచంలో ఎక్కడా లేని మందు బ్రాండ్లు చూసిన జనం కూడా, జగనన్నయ్య అండ్ అంబటి అన్నయ్యలు చెప్పింది నిజమే కామోసనుకున్నారు.

చంద్రబాబులా తమకు, మద్యం నుంచి ఆదాయం సంపాదించే ఖర్మ లేదన్న మాటనూ జనం నమ్మేశారు. దానిని మద్యనిషేదానికి ఏర్పాటుచేసిన, కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మణరెడ్డి కూడా సమర్ధించారు. అది చాలదన్నట్లు.. కోట్ల రూపాయలు పెట్టి పత్రికల్లో ప్రకటనలూ ఇచ్చారు. ఇంతమంది మహానుభావులు, మహనీయులు చెప్పింది ఎవరు మాత్రం తప్పనుకుంటారు చెప్పండి? పైగా ఈ జన్మలో.. గాంధీ గారి అంశలో పుట్టిన, జగనన్నయ్య చెప్పిన తర్వాత ఇక తిరుగే ఉండదు కదా?!

కానీ, విచిత్రంగా.. మద్యం మాన్పించేందుకే కొండెక్కించిన మందు ధరలను, కొండ కిందకు దించేశారు. పైగా పిచ్చి బ్రాండ్లతో పాటు, ప్రీమియం బ్రాండ్ల రేట్లపైనా దయదలిచారు. యస్. నిజంగా ఇవన్నీ మొండివాడుగా పేరున్న, మన అఖిలాంధ్రకోటి జగనన్నయ్య తీసుకున్న నిర్ణయాలే. సంతోషం. మందు తాగనివారికి ఈ గోలతో ఎలాగూ సంబంధం ఉండదు. కానీ కొన్న నెలల తరబడి, పిచ్చి బ్రాండ్లు తాగలేకపోతున్న మందుబాబుల దృష్టిలో, జగనన్నయ్య దేవుడయిపోయారు. బాగానే ఉంది. మందు అలవాటు పూర్తిగా మార్పించి, ద శలవారీ మద్యనిషేధంలో భాగంగానే… మందురేట్లు పెంచామని భాష్యం చెప్పిన.. ఒక అంబటి రాంబాబు, ఇంకో బొత్స సత్తిబాబు, మరో శ్రీకాంత్‌రెడ్డి అండ్ అదర్స్.. తగ్గించిన రేట్లపై ఏం భాష్యం ఇస్తారో చూడాలి.
పక్క రాష్ర్టాల నుంచి, మద్యం స్మగ్లింగ్ జరుగుతున్నందున మందు ధరలు తగ్గించామని, సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. బాగుంది. ఈ విషయం అంతకుముందు తెలియదా? సరిహద్దు రాష్ర్టాల పక్కనే ఉన్న వైన్‌షాపులో.. వెయ్యి రూపాయలకు బ్రాండెడ్ మందు దొరుకుతుంది. కానీ సొంత రాష్ట్రంలోని పిచ్చి బ్రాండ్ల రేట్లు దానితో పోలిస్తే మూడింతలు ఎక్కువ. అప్పుడు బుద్ధి-బుర్ర ఉన్న ఎవరైనా, సరిహద్దు దాటి తీసుకుంటాడన్న అంచనా, అధికారులకు అప్పుడు లేదా? మరిప్పుడు ధరలు తగ్గించారు కాబట్టి.. బ్రాండెడ్ మందుతో జనం ఆరోగ్యం పదికాలాల పాటు చల్లగా, తమ ఖజానా వెచ్చగా ఉండేందుటే పెంచామని చెబుతారా? అన్నవి ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలు. హేమో… చెప్పినా చెప్పగల సమర్ధులు మరి?!

సరే.. జగనన్నయ్య తన నిర్ణయం వాపసు తీసుకున్నందుకు, ఆయననేమీ తప్పు పట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే తప్పులు చేయడం మానవ సహజం. సజ్జల, చల్లా రామకృష్ణారెడ్డి చెప్పినట్లు.. జగనన్నయ్య ఆధునిక గాంధీ మహాత్ముడు అయినప్పటికీ, మహాత్ములు కూడా తప్పులో కాలేస్తుంటారు. కాబట్టి, జగనన్నయ్యను నిందించాల్సిన పనిలేదు. కాకపోతే.. ఈ 17 నెలల పరిపాలనా కాలంలో తత్వం తెలుసుకుంటున్నందుకు, ఆయనను అభినందించాలి.

తగులుతున్న ఎదురుదెబ్బలే, ఆయనకు గుణపాఠాలుగా మారుతున్నాయి. ఏది మంచి, ఏది చెడు? ఏది ఆదాయం? ఏది వృధా అన్న వాస్తవాలు, అనుభవంలో తెలిసివస్తున్నట్లు కనిపిస్తోంది. యువకుడు, పులివెందుల బిడ్డ.. పైగా రాజారెడ్డి మనువడు ప్లస్ 151 మంది ఎమ్మెల్యేల బలం.. వీటికి మించి రాజకీయ ప్రత్యర్థుల కుట్రకు బలయి, 16 నెలలు జైల్లో మగ్గిన నాటి జ్ఞాపకాలు! ఇవన్నీ కలసి వెరసి, జగనన్నయ్యను అలా తయారుచేశాయని అనుకోవడంలో తప్పు లేదు. అనుభవాలు-ఎదురుదె బ్బలే గుణపాఠాలయినప్పుడు, ఏ మనిషి మారినా స్వాగతించడమే గొప్పతనం. అందుకు జగనన్నయ్య కూడా మినహాయింపు కాదు.

కాబట్టి మందు రేట్ల తగ్గింపుపై.. జగనన్నయ్యను కాకుల్లా పొడవకుండా, మారిన జగన్‌బాబును, ఈ విశాల ప్రపంచంలోకి ఆహ్వానించండి. పనిలో పనిగా మారిన జగనన్న.. పోస్టింగులివ్వకుండా, అధికారుల పట్ల అనుసరిస్తున్న వేధింపు పర్వానికి తెరదించితే, ఆయనను నిజంగానే ఈ విశాల ప్రపచంలోకి ఆహ్వానిస్తారేమో? కానీ.. ఆ సీఎంఓ సైంధ వుడు ఇక్కడ కూడా అలవాటు ప్రకారం, అడ్డం పడితే చేసేదేమీ లేదు!