సారీ చెబితే సరిపోతుందా..సారూ?

331

రైతులకు బేడీలు వేసిన పోలీసులపై సస్పెన్షన్లు ఎత్తవేత
రైతులని తెలియక బేడీలు వేశారట
మరి తెలియక పోస్టింగులు పెట్టారంటే కేసులు ఎత్తివేస్తారా?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

పోలీసులు అమాయకులు. వారికి ఏ పాపమూ తెలియదు. ఏదో పాపం తెలియక.. రైతుల చేతికి జస్ట్ బేడీలు వేశారు. అంతే. వారి అమాయకత్వంపై ప్రాధమిక విచారణ జరిపి సస్పెన్షన్లు ఎత్తేశారు. ఇదీ అమరావతి రైతుల చేతికి, బేడీలు వేసిన పోలీసులపై విధించిన సస్పెన్షను ఎత్తవేస్తూ.. పోలీసు బాసులు ఇచ్చిన ప్రకటన.

అమరావతి రైతుల ఉద్యమానికి పోటీగా.. అధికార వైసీపీ నేతలు రంగంలోకి దించిన, పెయిడ్ ఆటో బ్యాచ్‌ను రైతులు అడ్డుకున్నారు. వారి ఆధార్ కార్డులు చూపమని నిలదీశారు. దానితో ఆ పెయిడ్ బ్యాచ్‌ను అడ్డుకున్న రైతులపై, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. కేసులు బనాయించిన వారిలో ఎస్సీ, ఎస్టీలు కూడా ఉండటం మరో విచిత్రం. అంటే ఎస్సీలే ఎస్సీలపై కేసులు పెట్టడం తమాషా అన్నమాట. ఈ ప్రకారంగా.,. దళితులకు బాసటగా నిలవాల్సిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చ ట్టం, రాజకీయుల చేతిలో ఏవిధంగా దుర్వినియోగం అవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

రైతుల చేతికి బేడీలు వేసిన వైనం, రాష్ట్రంలో ఆందోళనకు దారితీసింది. దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన పోలీసుల తీరు, రైతాంగం గుండెను రగిలించింది. వారి ఆత్మాభిమానం దెబ్బతీసింది. అయినా.. ఇప్పటివరకూ సర్కారు ఆ ఘటనపై, కనీసం విచారం వ్యక్తం చేయలేదు. ప్రభుత్వాలకు రైతులపై ఉన్న ప్రేమ అదన్నమాట! సరే.. దానిపై మీడియా విరుచుకుపడటంతో, ఎస్కార్టుగా వచ్చిన పోలీసులను, జిల్లా ఎస్పీ సస్పెన్షన్ వేటు వేశారు. మళ్లీ అంతలోనే సదరు పోలీసులంతా అమాయకులని సర్టిఫికెట్ ఇచ్చి, అది తెలియక చేసిన తప్పిదంగా అభివర్ణించారు.
అంటే వారంతా దోపిడీదొంగలు, హంతకులనే భావించి, ఎస్కార్టు పోలీసులు రైతుల చేతికి బేడీలు వేశారన్నది అధికారుల కవిహృదయం!

ఫర్వాలేదు. కింది స్ధాయి సిబ్బందిపై, పోలీసు బాసులకు ఆపాటి సానుభూతి ఉండటం మెచ్చతగిందే. కింది వారు చేసిన తప్పులను, మాఫీ చేసే ధైర్యం కూడా అధికారులందరికీ సాధ్యం కాదు. కానీ, శాఖాపరమైన విచారణ జరుగుతుందని మాత్రం సెలవిచ్చారు. ఎలాగూ, తెలియక బేడీలు వేశామని చెప్పిన వారిని మన్నించారు కాబట్టి.. మళ్లీ శాఖాపరమైన విచారణలెందుకు? సమయం వృధా తప్ప!

సరే.. పాపం ఏదో తెలియక చేసిన తప్పు అని, సస్పెన్షన్లు ఎత్తేసిన ఖాకీ కామందుల వారు .. మరి తెలియక సోషల్ మీడియాలో, పోస్టింగులు పెడుతున్న చిరంజీవులపై మాత్రం ఎందుకు కేసులు పెడుతున్నారు? వారిని రాష్ర్టాల సరిహద్దులు దాటి మరీ వెతికి పట్టుకొచ్చి, ఎందుకు కేసులు నమోదు చేస్తున్నారు? ఆ చర్యలు కూడా, ఏదో తెలియక చేసిన తప్పులుగానే భావించాలి కదా?ఆ మేరకు రైతుల చేతికి బేడీలు వేసిన పోలీసులపై సస్పెన్షన్లు ఎత్తివేసినట్లే.. పోస్టింగులు పెట్టిన వారిని, షేర్ చేసిన వారిపై కేసులు ఎత్తివేయాలి కదా? ఎవరో అన్న మాటలను టెలికాస్టు చేసి, ఎవరో అధికారి ఇచ్చిన ఉత్తర్వునే ప్రసారం చేసిన జర్నలిస్టులను.. సీఐడి పోలీసులు విచారణ పేరిట వేధించకుండా, కేసులు తొలగించాలి కదా? అదే కదా చట్టం? న్యాయం-చట్టం అందరికీ సమానమైనప్పుడు, మళ్లీ ఈ వివక్ష ఎందుకు సారూ?

చట్టం కళ్లతో కాకుండా పాలకుల కళ్లతో చూడటం వల్లే.. బుద్ధిజీవులకు ఈ సందేహాలు వస్తున్నాయి. ధర్మం-చట్టం-న్యాయం నాలుగుపాదాల నడుస్తున్న ఆంధ్రాలో.. ఈ ప్రశ్నలకు బదులిచ్చే పోలీసు పెద్దసార్లు ఎవరున్నారు? పనిలో పనిగా, మానవ హక్కులు దివ్యంగా వెలిగిపోతున్న ఏపీలో, ఇలాంటి అమాయక పోలీసులు ఉన్న విషయం, మానవ హక్కుల కమిషన్ చెవిన పడేస్తే బాగుండేది. రైతుల చేతికి బేడీలు వేసిన పోలీసులను, వారిపై సస్పెన్షన్ ఎత్తివేసిన అధికారులకు.. మానవ హక్కుల కమిషన్‌తో సన్మానం చేయించుకునే, గొప్ప అవకాశాన్ని పోలీసు బాసులు వదులుకోవడమే ఆశ్చర్యం. ఈ లెక్కన కొంపదీసి.. హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా, సోషల్‌మీడియాలో పోస్టింగులు పెట్టిన వారంతా.. అమాయకులనే నిర్ణయించి, అరెస్టు చేయకుండా వదిలేశారా?.. ఏమో? ఏపీలో ఏదైనా సాధ్యమే.