అర్జున విషాదయోగము-2

697

సంజయ ఉవాచ:

  1. దృష్ట్వా తు పాణ్ణవానీకం వ్యూడం దుర్యోధనస్తదా

ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||

ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ కుమారుడు అయిన దుర్యోధనుడు, యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తున్న, తన సైన్యాన్ని, పాండవుల సైన్యాన్ని ఒక్కసారి తేరి పార చూచాడు. తన బలం ఎంతో ఎదుటి బలం ఎంతో అంచనా వేసుకున్నాడు. తన సైన్యం ఏయే వ్యూహములు రచించారో, పాండవుల సైన్యముల యొక్క వ్యూహరచనను గమనించాడు. వెంటనే తన రథమును తన గురువుగారు ద్రోణాచార్యుల వద్దకు పోనిమ్మన్నాడు. ద్రోణునితో ఇలా అన్నాడు.

వద్దకు ఎందుకు వెళ్లాడు? భీష్ముని మీద నమ్మకం లేదా! భీష్ముడు, పాండవులు తన మనుమలు అనే మమకారంతో, సరిగా యుద్ధం చేయడు అనే సందేహం కలిగిందా! లేక భీష్ముని కంటే ఆచార్య ద్రోణుడు పరాక్రమవంతుడా! ఇది అందరి మనసులో తొలిచే ప్రశ్న. ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది. “పాండవులు నా మనుమలు. నేను పాండవులను తప్ప అందరినీ చంపుతాను” అని ఇదివరకే ప్రకటించాడు భీష్ముడు. ద్రోణుడికి అటువంటి నియమం లేదు. ఎందుకంటే ద్రోణుడికి అందరూ శిష్యులే! ఎవరి మీదా అధిక ప్రేమ లేదు. కాకపోతే అర్జునుడు అంటే ప్రత్యేకమైన అభిమానము. అంతవరకే. ఆ కారణం చేత ద్రోణుని పాండవుల మీదికి రెచ్చగొడదామని వెళ్లి ఉండవచ్చు. దుర్యోధనుడిది కుటిల బుద్ధి. ఎప్పుడూ సక్రమంగా ఆలోచించడు. వక్రంగానే ఆలోచిస్తాడు.

పాండవుల సైన్యాధ్యక్షుడు ధృష్టద్యుమ్నుడు. అతడు పాండవుల భార్య ద్రౌపదికి అన్నగారు. అతడి తండ్రి ద్రుపదుడు ద్రోణాచార్యుని అవమాన పరిచాడు. దానికి అర్జునుడి ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాడు ద్రోణుడు. ద్రోణుని చంపే కుమారుడు కావాలని తపస్సు చేసాడు ద్రుపదుడు. దాని ఫలితంగా ధృష్టద్యుమ్నుడు అగ్నిలోనుండి జన్మించాడు. కాబట్టి ధృష్టద్యుమ్నుడు కేవలం ద్రోణుని చంపడానికే పుట్టాడు అన్నది అందరికీ తెలుసు. ఈ విషయం తెలిసి కూడా ద్రోణుడు ధృష్టద్యుమ్నుడుకి విలువిద్య నేర్పించాడు. అస్త్ర శస్త్రముల ప్రయోగ ఉపసంహారములు నేర్పించాడు. కాబట్టి ఎదుటి పక్షాన సైన్యాధ్యక్షుడుగా ఉన్న ధృష్టద్యుమ్నుడు ద్రోణుడికి శిష్యుడు.

తనను చంపడానికే పుట్టిన ధృష్టద్యుమ్నుడిని ద్రోణుడు చంపుతాడా? లేక శిష్యుడు అని ఉపేక్ష వహిస్తాడా అన్న సందేహము దుర్యోధనుడిలో మొలకెత్తింది. ఈ విషయం తేల్చుకోడానికే నేరుగా ద్రోణాచార్యుల వద్దకు వెళ్లి ఇలా అంటున్నాడు.

  1. పశ్యేతాం పాండుపుతాణా మాచార్య మహతీం చమూమ్|
    వ్యూడాం ద్రుపద పుత్రేణ తవ శిష్మణ ధీమతా||

గురువుగారూ! నమస్కారం. ఒక్కసారి పాండవుల వైపు ఉన్న సేనాసముద్రాన్ని చూడండి. ఆ సైన్యం ముందు లీవిగా నిలబడి ఉన్న పాండవుల సర్వసైన్యాధ్యక్షుడు ధృష్టద్యుమ్నుని చూడండి. ఆయన ఎవరో కాదు! తమరి శిష్యుడే. తమరే అతనికి విలువిద్య నేర్పించారు. తమరే ధృష్టద్యుమ్నుని మహా బుద్ధిమంతుడు అని పొగిడేవారు. కాని ఆచార్య! ఆయన మీ బద్ద శతువు దుపదుని కుమారుడు అని మరిచిపోకండి. మీరు తనకు చేసిన అవమానాన్ని భరించలేక, కేవలం మిమ్ముల్ని చంపడానికే తపస్సుచేసి, ధృష్టద్యుమ్నుని కుమారుడిగా పొందాడు. ధృష్టద్యుమ్నుడు మీ శిష్యుడు, బుద్ధి మంతుడు అని ఉపేక్షచేస్తారో, మీ బద్ధశత్రువు ద్రుపదుని కుమారుడనీ, మిమ్మల్ని చంపడానికే పుట్టాడనీ అతని పట్ల కఠినంగా వ్యవహరిస్తారో, మీ ఇష్టం అనే అర్థం వచ్చేటట్టు నర్మగర్భంగా మాట్లాడాడు దుర్యోధనుడు. తన రాజకీయ చతురత నంతా ఇక్కడ మాటల్లో చూపించాడు దుర్యోధనుడు.

దుర్యోధనుని పక్షాన 11 అక్షౌహిణీల సైన్యం ఉంది. పాండవుల పక్షాన కేవలం 7 అక్షౌహిణీల సైన్యం మాత్రమే ఉంది. కాని పాండవుల పక్షాన ధర్మము, ధర్మానికి ప్రతినిధి అయిన శ్రీకృష్ణుడు ఉన్నాడు.

కాని దుర్యోధనుడి పక్షాన అధర్మం ఉంది. భీముడికి బాలుడుగా ఉండగానే విషం పెట్టాడు. వారిని లక్క ఇంట్లో పెట్టి సజీవదహనం చేయాలని చూచాడు. అక్రమంగా పాండవుల రాజ్యం లాక్కోవడమే కాక, వారి భార్యను అవమానించాడు. అడవులకు పంపాడు. తిరిగి వచ్చి వారు తమ రాజ్యం తమకు ఇమ్మని అడిగితే సూదిమొన మోపినంత భూమికూడా ఇవ్వను అన్నాడు. ఇవన్నీ అధర్మాలనీ, అధర్మం తన పక్షాన ఉందనీ దుర్యోధనుడికి తెలుసు. అందుకే దుర్యోధనుడు అభద్రతా భావంతో ఉన్నాడు. తమ కంటే చిన్నదైన పాండవుల సైన్యం పెద్దభూతంలాగా కనపడుతూ ఉంది. అందుకే “మహతీంచమూమ్” అంటే గొప్పదైన పాండవుల సైన్యం చూడండి అని అన్నాడు. మనలో కూడా ఎంత ఎక్కువ ధనం, ఆస్తి, పదవులు ఉంటే అంత అభద్రతా భావం ఉంటుంది. ముందు వెనుక సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటారు. ప్రతి చిన్న విషయానికీ భయపడతాడు. ఏమీ లేని వాడు నిర్భయంగా, హాయిగా కులాసాగా ఒంటరిగా తిరుగుతాడు. అందుకనే ఎక్కువ సైన్యం ఉన్నప్పటికీ సుయోధనుడికి అభద్రతాభావం పోలేదు.

దుర్యోధనుని మాటలతో ఒళ్లు మండింది ద్రోణుడికి. దుర్యోధనుని వంక తీక్షణంగా చూచాడు. దుర్యోధనుడు సర్దుకున్నాడు. అందరి మాదిరే ధృష్టద్యుమ్ముని గురించి కూడా అడిగాననే అర్థం వచ్చేటట్టు ఇతర వీరుల గురించి ఇలా అన్నాడు.

  1. అత్ర శూరా మహేష్వాసా భీమార్జున సమా యుధి!
    యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ:!!

5. ధృష్టకేతు శ్చేకితాన: కాశిరాజశ్చ వీర్యవాన్
పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః|

6. యుధామన్యుశ్చ విక్రా ఉత్తమౌజాశ్చ వీర్యవాన్
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథా:!!

తనలో తాను సర్దుకున్న దుర్యోధనుడు ద్రోణాచార్యులతో ఇలా అన్నాడు. “ఆచార్యవర్యా! ముందు కేవలం పాండవ సైన్యాధ్యక్షుని గురించి చెప్పాను అంతే. అయినా తమరికి తెలియనిది కాదు. ఏదో నా తృప్తి కొరకు పాండవుల సైన్యములో ఉన్న మహారథుల గురించి చెబుతున్నాను. శ్రీకృష్ణుడు తమ్ముడు సాత్యకి, మహారథి అనే పేరుగాంచిన విరాట మహారాజు, ధృష్టకేతుడు, చేకితానుడు, మహా పరాక్రమశాలి అయిన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు, మహాపరాకమ వంతుడైన యుధామన్యుడు, మహావీరుడు అభిమన్యుడు, ఇంక ద్రౌపదీ కుమారులైన ఉపపాండవులు, వీరంతా మహారథులు. వీరి ధనుస్సులు చాలా పటిష్ఠమైనవి. వీరందరూ ధనుర్విద్యాపారంగతులు. వీరంతా భీముడు, అర్జునుడితో సమానంగా యుద్ధం చేయగల సమర్థులు. (మహారథి అంటే ఒకే సమయంలో పదివేల మంది సైనికులతో యుద్ధం చేయగల సామర్థ్యం ఉన్న వాడు అని ఒక అర్థం. వేరు వేరు చోట్ల వేరు అర్థాలు ఉన్నాయి.) మరి వీళ్ల సంగతి ద్రోణుడికి తెలియదా! తెలుసు. కానీ ఎదుటి బలమును, తన బలమును అంచనా వేయడం యుద్ధనీతి. అందుకే ఈ వివరాలు చెప్పాడు. ఇంక తన పక్షానున్న వీరుల గురించి కూడా చెబుతున్నాడు దుర్యోధనుడు.

7.అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ!
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బవీమి తే||

ఆచార్యవర్యా! తమకు తెలియదు అని కాదు. మన పక్షంలో ఉన్న మహా రథుల గురించి కూడా చెప్పుకుంటే నా మనసుకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా! అందుకని కేవలం తమరి గుర్తుకోసం మన వైపు ఉన్న యోధానుయోధుల గురించి చెబుతాను వినండి.

ఈ శ్లోకంలో ద్విజోత్తమ అని గురువుగారు ద్రోణాచార్యుని సంబోధించాడు దుర్యోధనుడు. దిజోత్తమ అంటే బ్రాహ్మణాత్మమా! అని అర్థం. బ్రాహ్మణుడు గురువుగా తన శిష్యులకు సమస్త విద్యలు నేర్పవచ్చు. విద్య అంటే ధనుర్విద్య, యుద్ధవిద్యకూడా వస్తాయి. కాబట్టి యుద్ధవిద్యలు బాహ్మణుడు నేర్పవచ్చు కానీ యుద్ధం చేయకూడదు. ఎందుకంటే యుద్ధం హింసతో కూడుకున్నది.

బ్రాహ్మణుడికి హింస చేయడం ధర్మం కాదు. అందుకని వ్యాసులవారు ఎత్తిపొడుపుగా ఈ పదం వాడి ఉండవచ్చు. కాని దుర్యోధనుడికి ఆ భావన ఉన్నట్టు కనిపించదు.

రచన:మొదలి వెంకట సుబ్రహ్మణ్యం(రిటైర్డు రిజిస్ట్రార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు)

1 COMMENT