మనిషి ఒక చోట..మనసు మరొక చోట!

722

ఇంకా పూర్తి కాని టీచర్ల బదిలీ కష్టాలు
మనసులేని తెలుగు ముఖ్యమంత్రులు
తెలంగాణ సీఎంఓలో మగ్గుతున్న బదిలీల ఫైల్
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఆమె జగ్గయ్యపేటలో టీచరు. కానీ కుటుంబం నిజామాబాద్‌లో ఉంటుంది. ఆయన కరీంనగర్‌లో టీచరు. కుటుంబం మాత్రం శ్రీకాకుళంలో ఉంటుంది. వీరు కలిసేది ఏ పండుగలు, పబ్బాలకో. లేదా చావులు పెళ్లిళ్ల సందర్భాల్లోనే. పుట్టిన చోట ఉద్యోగం చేసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు? పరస్పర బదిలీలకు రెండు రాష్ర్టాల ఉద్యోగులు సిద్ధంగానే ఉన్నారు. కానీ పాలకులు తలచుకుంటే అది పెద్ద సమస్య కాదు. కానీ పాలకులు తలచుకోకపోవడమే ఇప్పుడు పెద్ద సమస్య.

తమను తమ సొంత రాష్ట్రాలకు బదిలీ చేయమంటూ, ఏళ్ల కిత్రం ఇచ్చిన దరఖాస్తులకు ఇంతవరకూ మోక్షం కలగలేదు. ఆ మధ్యలో పాపం పాలకులు, కొద్దిమేరకు కరుణించి ఇచ్చిన ఉత్తర్వులకూ ఇప్పటిదాకా దిక్కూ మొక్కూ లేదు. దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించనట్లు.. కేసీఆర్ కరుణించినా, తెలంగాణ సీఎంఓ అధికారులకు మాత్రం దయకలగడం లేదు. ఫలితంగా.. రెండు తెలుగు రాష్ర్టాల ఉపాధ్యాయుల బదిలీ ఫైలు, ఎక్కడి వేసిన గొంగళి అక్కడే వేసినట్లుంది. ఇదీ ఆంధ్రా-తెలంగాణ టీచర్ల అంతర్రాష్ట బదిలీ సినిమా కష్టాలు.

రాష్ట్ర విభజన చట్టం అన్ని విభాగాల్లో ఇంకా పూర్తి కాక, ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నట్లే… రెండు తెలుగు రాష్ట్రాల టీచర్లు , తమ అంతర్రాష్ట బదిలీ సమస్యల పరిష్కారం కోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రా నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేందుకు 200 మంది టీచర్లు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్లేందుకు 650 మంది టీచర్లు సిద్ధంగా ఉన్నారు. వీరిలో ఉత్తరాంధ్రకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఏపీ సీఎం జగన్ విపక్ష నేతగా పాదయాత్ర చేసిన సందర్భంగా, ఆయనను తెలంగాణలో పనిచేస్తున్న, ఏపీ టీచర్లు కలసి వినతిపత్రం ఇచ్చారు. దానికి స్పందించిన జగన్.. తాము అధికారంలోకి వస్తే, తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులను ఏపీకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

ఆ తర్వాత ఆయన ఆ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్ర విభజన తర్వాత, 2017 ఆగస్టు7న.. సర్క్యులర్ మెమో నెంబర్ 9940/ఎస్పీఎఫ్ అండ్ ఎంసి.2015/డేటెడ్ 7-8-2017న, ఆంధ్రా-తెలంగాణ ప్రభుత్వాలు ఒక ఉత్తర్వు ఇచ్చాయి. ఆరు (కె) పాయింట్ ప్రకారం.. కేవలం భార్యాభర్తలు, పరస్పర ఒప్పంద బదిలీలకు కొన్ని షరతులతో అంగీకరించారు. ఒకే మేనేజ్‌మెంట్-ఒకే సబ్జెక్ట్-నేటివిటీ ప్రాతిపదికన అనుమతించారు. అయితే అప్పటి ఉత్తర్వు అంశానికి అనుగుణంగా బదిలీ అయిన వారు కేవలం 20 మంది మాత్రమే.

మిగిలిన వందలాది టీచర్లకు ఈ మార్గదర్శకాలు ప్రతిబంధకాలుగా మారాయి. దానితో వారంతా ముఖ్యమంత్రుల నుంచి- ఎమ్మెల్యేల వరకూ తిరిగి, రెండు ప్రభుత్వాలు ఇచ్చిన ఉత్తర్వుల్లో, తమ బదిలీకి ప్రతిబంధకంగా ఉన్న ఉత్తర్వులను సవరించాలని కోరారు. అంటే నేటివిటీ-మేనేజ్‌మెంట్-సబ్జెక్ట్ షరతులు లేకుండా.. హెడ్ టు హెడ్ బదిలీ చేయాలని కోరారు. దానితో జీఓ ఆర్‌టి నెంబర్ 1096 డేటెట్ 19-5-2018న, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు.. ఈ అంశాలన్నీ సున్నితంగా పరిష్కారమయ్యేలా చూడాలంటూ‘ ఒక కమిటీ వే శాయి. అందులో ఇరు రాష్ర్టాల సీఎస్‌లు కూడా సభ్యులుగా ఉన్నారు.

దానిమీద కమిటీ, 2018 జూన్‌లో తొలివిడత భేటీ అయింది. నేటివిటీ-సబ్జెక్ట్-మేనేజ్‌మెంట్‌పై చర్చించింది. ప్రధానంగా తెలంగాణలో మున్సిపల్ స్కూళ్లు లేనందున, ఏపీ నుంచి వచ్చే టీచర్లను ఏవిధంగా సర్దుబాటు చేయాలన్న అంశంపై చర్చించారు. మళ్లీ ఇప్పటివరకూ ఆ కమిటీకి అతీగతీ లేదు. అసలు సదరు కమిటీ ఏ నిర్ణయం తీసుకుంది? ఏ సిఫార్సులు చేసిందో ఎవరికీ తెలియదు. ఈ విషయాన్ని రెండు రాష్ర్టాల టీచర్ల ఎమ్మల్సీలు, సంఘాలకూ పట్టిన దాఖలాలు లేవు. అయితే.. ఈ కమిటీ చేసిన కొన్ని సిఫార్సులు జీఏడీకి వెళ్లి, అక్కడి నుంచి 7824/2018 నెంబరుతో, తెలంగాణ సీఎఓంకు చేరినట్లు తెలుస్తోంది. కానీ సీఎంఓ అధికారులు ఇప్పటిదాకా, వాటిని పరిష్కరించకుండా నాన్చుతున్నట్లు చెబుతున్నారు. ఈ బదిలీల వల్ల ప్రభుత్వానికి ఆర్ధికంగా వచ్చే నష్టం గానీ, ప్రమోషన్లలో ఇతరులకు వచ్చే సమస్యలు గానీ ఏమీ ఉండవని స్పష్టం చేస్తున్నారు. వివిధ వర్గాలకు వరదానాలు ఇస్తున్న, రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు.. టీచర్ల సమస్యలు మాత్రం పరిష్కరించకపోవడమే ఆశ్చర్యం.