( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

 తిరుపతి పార్లమెంటు స్ధానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో, బీజేపీ అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్ అధికారి,  దాసరి శ్రీనివాసులు పేరు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానికుడయిన దాసరి, ఈపాటికే క్షేత్రస్థాయిలో ఆలయాల అభివృద్ధి, అనాధ బాలురను ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చేర్పించే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. బీజేపీలో చేరిన ఆయనకు, ప్రస్తుత నాయకత్వం ఎలాంటి పదవి ఇవ్వకపోయినా.. ప్రతిష్టాత్మక సమరసత సేవా  ఫౌండేషన్ బాధ్యతలలో బిజీగా ఉన్నారు.

స్థానికుడయినందున,  తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉన్న దాసరి శ్రీనివాసులుకు, గత ఎన్నికల్లోనే తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది. కానీ బీజేపీ-సంఘ పరివారం అంతా,  వైసీపీని గెలిపించాలన్న భావనతో ఉండటంతో, ఆయన పోటీ చేసే యోచన విరమించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత సమరసత సేవా  ఫౌండేషన్ బాధ్యతలు అప్పగించడంతో, ఆయన దానిపై పూర్తి స్థాయి దృష్టి సారిస్తున్నారు.

 ప్రస్తుతం ఈ ఫౌండేషన్ ఆధ్వర్యాన.. తీరప్రాంతాలు, దళిత-గిరిజన వాడల్లో దాదాపు 500 దేవాలయాలు నిర్మించారు. మత్స్యకారులు, దళితుల లక్ష్యంగా మతమార్పిళ్లు జరుగుతున్న నేపథ్యంలో.. వాటిని  అడ్డుకుని, వారిలో హైందవ మత సంప్రదాయాలు పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నారు. అంటే సూటిగా చెప్పాలంటే, హిందూమతమే దళిత-బడుగువాడల వద్దకు వెళుతోంది.

అందులో భాగంగా మత్స్యకారులు-దళిత-గిరిజనులకు వేదం నేర్పించే, బృహత్తర బాధ్యతను ఫౌండేషన్ నిర్వహిస్తోంది. ఆ ప్రకారంగా.. అర్చక శిక్షణ పూర్తి చేసుకున్న బీసీ-దళిత యువకులను, వారి ప్రాంతాల్లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించే దేవాలయాలకు అర్చకులుగా నియమిస్తున్నారు. ఆలయాల్లో వారి ఆధ్వర్యానే ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి. ఆ రకంగా ఇప్పటివరకూ, రాష్ట్రంలో 500 దేవాలయాలు నిర్మించడం విశేషం. అంటే 500 మంది ఎస్సీ-ఎస్టీ-బీసీలను  అర్చకులుగా  నియమించారన్న మాట. రాష్ట్రంలో అసలు దేవాలయాలు లేని ప్రాంతాలను గుర్తించి, ప్రధానంగా.. తీరప్రాంతాలు-దళిత-గిరిజన వాడల్లో దేవాలయాలు నిర్మించడం ఈ ఫౌండేషన్ లక్ష్యమని చెబుతున్నారు.

టీటీడీ ఇచ్చే నిధులను,  దేవదాయ శాఖ ద్వారా సమరసత ఫౌండషన్‌కు వస్తుంది. ఒక్కో దేవాలయానికి 5 లక్షల చొప్పున కేటాయిస్తున్నారు.  ఆవిధంగా ఇప్పటిదాకా ఇలాంటి ధార్మిక కార్యక్రమాలకు, 25 కోట్లు కేటాయించినట్లు చెబుతున్నారు. గతంలో ఈ బాధ్యతను దివంగత మాజీ ఏఐఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ విజయవంతంగా నిర్వర్తించగా, ఇప్పుడు ఆ బాధ్యతలను దాసరి శ్రీనివాసులు నిర్వహిస్తున్నారు.

ఆ కార్యక్రమాలు సమీక్షిస్తున్న దాసరి.. మరోవైపు తిరుపతి పార్లమెంటు పరిథిలో, పేద-అనాధ-వీధి బాలలను గుర్తించి, వారిని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చేర్పించే కార్యకమ్రాలు చేపడుతున్నారు. దళిత-బీసీ విద్యార్థినీ, విద్యార్ధుల తలిదండ్రుల వద్దకు వెళ్లి, వారిని ఒప్పించి ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వేల మంది పిల్లలను ఆయన, గురుకుల పాఠశాలలో చేర్పించడం విశేషం.

కాగా ప్రస్తుతం బీజేపీ-జనసేన కలసి పనిచేస్తుండటం, టీడీపీ బలహీనపడుతుండటం, ప్రభుత్వ వ్యతిరేకత ఉండటం వల్ల… ఈసారి తిరుపతిలో బీజేపీ, అధికార వైసీపీకి బలమైన పోటీ ఇవ్వగలదన్న భావన ఉంది. పైగా గతంలో అక్కడ,  వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు మాజీ ఏఐఎస్ వెంకటస్వామి బీజేపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. వైసీపీ నుంచి పదవీ విరమణ చేసిన మాజీ అధికారి వరప్రసాద్ కూడా, తిరుపతి నుంచే గెలవడం విశేషం.

అంతకుముందు రిటైర్డు పోలీసు అధికారి వర్ల రామయ్యను, టీడీపీ నాయకత్వం చివరి నిమిషంలో సీటిచ్చినా, ఆయన బలమైన పోటీ ఇచ్చారు. దీన్నిబట్టి తిరుపతి స్థానంలో ప్రజలు పదవీ విరమణ చేసిన అధికారులను,  ప్రజలు ఆదరిస్తున్నారన్న విషయం అర్ధమవుతుంది. బహుశా అదే అంచనాతో,  దాసరి శ్రీనివాసులుకూ ఎంపీ సీటు ఇచ్చేందుకు బీజేపీ యోచిస్తున్నట్లు కనిపిస్తోంది.

By RJ

One thought on “తిరుపతి బీజేపీ అభ్యర్ధిగా దాసరి శ్రీనివాసులు?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner