కోడెల శివరాం పెత్తనం మాకొద్దు ‘బాబూ’…

340

సత్తెనపల్లిలో మరోసారి తమ్ముళ్ల తిరుగుబాటు
నాయకత్వానికి ఫిర్యాదు చేయనున్న కమ్మ వర్గ నేత లు
( మార్తి సుబ్రహ్మణ్యం-  9705311144)

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో.. తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య మరోసారి ఆధిపత్యపోరు మొదలయింది. నియోజకవర్గ పార్టీపై కోడెల శివరాం పెత్తనంపై, పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఎలాంటి పదవి లేని శివరాం, నియోజకవర్గ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని  సీనియర్లు మండిపడుతున్నారు.

ఇప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గ పార్టీ, శివరాం రాకతో గందరగోళంగా మారిందన్న ఫిర్యాదుతో నాయకత్వం వద్దకు వెళ్లనున్నారు. గత ఎన్నికల ముందు కోడెలను వ్యతిరేకించిన కమ్మ వర్గ నాయకులే, ఇప్పుడు శివరాంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుండటం ప్రస్తావనార్హం. అధికారంలో ఉన్నప్పుడు, కోడెల కుటంబ చర్యలతో ఘోరంగా దెబ్బతిన్న పార్టీ పరువు,  ఇప్పుడిప్పుడే తిరిగి తేరుకుంటున్న సమయంలో, శివరాం రాకతో మళ్లీ ఐదేళ్లు వెనక్కి వెళ్లే ప్రమాదంలో పడిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, కోడెల కుటుంబ సభ్యుల చర్యల వల్ల పార్టీ దెబ్బతింది.  స్పీకర్ స్థాయి నేతయినా నేతలు భయపడలేదు.  కోడెలకు టికెట్ ఇవ్వవద్దని డిమాండ్ చేస్తూ.. చంద్రబాబు సమక్షంలోనే, గుంటూరు పార్టీ ఆఫీసులో టీడీపీ సీనియర్లు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. అయినా పట్టించుకోని నాయకత్వం.. కోడెలకు టికెట్ ఇవ్వడం, పార్టీ ఓడిపోవడం, ఆ తర్వాత అసెంబ్లీలో ఫర్నిచర్ ఎత్తుకెళ్లిన కేసు, ఎక్కువ అద్దెకు తన సొంత భవనాన్ని ప్రభుత్వానికి ఇవ్వడం, ఆ తర్వాత శివరాం తమ వద్ద డబ్బులు తీసుకున్నారంటూ పలు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు, తర్వాత ఆయన కోర్టును ఆశ్రయించడం, కోర్టులు కండిషన్ బెయిల్ ఇవ్వడాన్ని సత్తెనపల్లి నియోజకవర్గ నేతలు గుర్తు చేస్తున్నారు.

గత ఎన్నికల్లో సులభంగా గెలవాల్సిన సత్తెపల్లి సీటు నుంచి, పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి కారణం.. కోడెల కుటుంబసభ్యుల వ్యవహారశైలేనని స్పష్టం చేస్తున్నారు. కోడెల ఆత్మహత్య తర్వాత, ఇప్పటివరకూ నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొనని శివరాం.. ఇప్పుడు మళ్లీ కార్యకర్తలను పిలిపించుకోవడం, సొంత కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా.. గత ఎన్నికల్లో కోడెల కుటుంబసభ్యుల వల్ల నష్టపోయిన కార్యకర్తలకు ఏం సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా కోడెల మృతికి శివరాం ఒత్తిళ్లే కారణమని, కోడెల శివప్రసాద్ బావమరిని సాయి అప్పట్లో డీఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదును టీడీపీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. కోడెల ఆత్మహత్య చేసుకోలేదని, శివరామే హత్య చేశారని సాయి చేసిన ఆరోపణ అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఐదేళ్ల కాలంలో ఒక్కరికీ న్యాయం చేయకుండా, ఆర్ధికంగా ఎదిగేందుకే  కాలం వెచ్చించి.. ఇప్పుడు మళ్లీ తమపై పెత్తనానికి రావడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నుంచి నియోజకవర్గ ఇన్చార్జిని నియమించకపోవడంతో, స్థానిక నేత అబ్బూరి.. వ్యయ ప్రయాసలకోర్చి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరిస్తున్నారు.  కోడెల కుటుంబసభ్యుల చర్యల వల్ల దూరమైన పార్టీని, తిరిగి జనంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారని చెబుతున్నారు.

ఈ సమయంలో.. తిరిగి కోడెల శివరాం రంగంలోకి దిగి హడావిడి చేయడం వల్ల, ఆ కుటుంబం వల్ల నష్టపోయిన కార్యకర్తలు, ప్రజలు పార్టీని ఎందుకు అభిమానిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తన మేనేజర్ చేసిన పొరపాట్ల వల్ల నష్టం జరిగిందని, ఇకపై అలా జరగకుండా అండగా ఉంటానన్న హామీపై, సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. యువనేత ప్రమేయం-ఆదేశాలు లేకపోతే, ఒక సాధారణ మేనేజర్ రెచ్చిపోవడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. ఐదేళ్ల పదవీ కాలంలో శివరాం, గుంటూరు షోరూం కేంద్రంగా చలాయించిన హవా, తమకు చేసిన అవమానాలు మర్చిచపోలేమని సీనియర్లు ఖరాఖండీగా చెబుతున్నారు. మెత్తగా మాట్లాడే ఆయన మాటలకు-చేతలకు పొంతన ఉండదని చెబుతున్నారు.

ఇప్పుడిప్పుడే జనంలోకి వెళుతున్న పార్టీలో.. శివరాం మళ్లీ ప్రవేశించడం వల్ల, లాభం కంటే నష్టమే ఎక్కువంటున్నారు. ఐదేళ్ల కాలంలో సాగించిన హవా వల్ల నష్టపోయిన వర్గాలు-వ్యక్తులు-నేతలు- ఆ కుటుంబాన్ని మర్చిపోతున్న సమయంలో,  మళ్లీ అదే వ్యక్తి రావడం వల్ల, ఇప్పుడు ఉన్న కార్యకర్తలు కూడా వెళ్లిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పైగా ఆయన మీద కేసులు కూడా కొట్టివేయలేదని, కేసులున్న వ్యక్తులకు నాయకత్వం అప్పగిస్తే, ప్రజల్లో ఎలాంటి సంకేతాలు వెళతాయో నాయకత్వమే ఆలోచించుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

నిజానికి కోడెల కుటుంబానికి.. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇంకా సానుకూల పరిస్థితి రాలేదు. సూటిగా చెప్పాలంటే ఆ కుటుంబంపై వ్యతిరేకత పూర్తిగా తొలగిపోలేదు.  పైగా ఆ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు సాగించిన హవా, తీసుకున్న నిర్ణయాలు-చర్యలను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై.. రెడ్లలోని ఒక వర్గానికి తప్ప, మిగిలిన ఏ వర్గంలోనూ వ్యతిరేకత లేదు. ఆయన సోదరుడి జోక్యంపైనే  విమర్శలున్నాయి. అయితే, కోడెల హయాంలో జరిగిన వ్యవహారాలతో పోలిస్తే, అది చాలా తక్కువేనన్న అభిప్రాయం ఉంది. ఇటీవల కోర్టుకెక్కిన క్వారీ వ్యవహారం కూడా వైసీపీ అంతర్గతమే. అది కూడా అంబటి స్వయంకృతమేనంటున్నారు. ఇవి తప్ప, ప్రజలకు గానీ-వివిధ కులాలకు గానీ, అంబటితో వచ్చిన సమస్యలంటూ కనిపించడం లేదు.

ప్రస్తుతం సత్తెనపల్లిలో వైసీపీని ఎదుర్కొనే శక్తి టీడీపీకి లేకపోయినా, కొంతమేరకు ఆ పార్టీకి ఓటు బ్యాంకు స్థిరంగానే ఉంది. బలమైన కమ్మ సామాజికవర్గ దన్ను ఉంది. అయితే గత ఎన్నికల్లో ఆ వర్గం కోడెల కుటుంబంపై వ్యతిరేకతతో,  పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడమే టీడీపీ ఓటమికి ప్రధాన కారణమన్నది బహిరంగ రహస్యం. కొడుకు-కూతుళ్లు ఎవరినీ ప్రశాంతంగా ఉండనివ్వడం లేదన్న ఫిర్యాదులను, చంద్రబాబు అప్పుడే పరిష్కరించి ఉంటే,  పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు. ప్రధానంగా గ్రామాల్లో ఇప్పటికీ ఆ పార్టీ అంత బలహీనంగా ఏమీ లేదు.

ఈ సమయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న శివరాం.. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశిస్తే.. పార్టీకి ఉన్న సానుకూలత కూడా, వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందన్నది మెజారిటీ కార్యకర్తల వాదన. దివంగత కోడెల శివప్రసాద్ స్థానంలో, శివరాంను చూసేందుకు కార్యకర్తలెవరూ ఇష్టపడటం లేదు. సత్తెనపల్లి-నర్సరావుపేటలో కుటుంబసభ్యుల జోక్యం లేకపోతే, కోడెల జీవించి ఉండేవారన్న అభిప్రాయం ఇంకా తొలగిపోలేదు. ముఖ్యంగా కమ్మ సామాజికవర్గమే, శివరాం రాకను వ్యతిరేకిస్తుండటం ప్రస్తావనార్హం. సంపాదనే ప్రధానంగా, ప్రజలతో ఆత్మీయత- మానవ సంబంధాలు కోల్పోయిన వారి వల్ల,  పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు. పైగా వ్యక్తులపై పడిన బురద, పార్టీ తనంతనట తాను అంటించుకున్నట్లవుతుందని స్పష్టం చేస్తున్నారు.

కాగా, నియోజకవర్గ పార్టీలో శివరాం.. వర్గ విబేధాలు సృష్టిస్తున్నారన్న ఫిర్యాదుతో,  పార్టీ నాయకత్వం వద్దకు వెళ్లేందుకు సీనియర్లు సిద్ధమవుతున్నారు. దీనికి కమ్మ వర్గ నేతలే నాయకత్వం వహిస్తుండటం విశేషం. కోడెల జీవించినప్పుడే, ఆయనకు భయపడకుండా.. ఎన్నికల్లో ఆయనకు ఇకెట్ ఇవ్వవద్దని, ఫిర్యాదు చేసేందుకు వెళ్లామని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పార్టీలో ఎలాంటి పదవి లేని శివరాం వ్యవహారశైలిపై, ఫిర్యాదు చేసేందుకు భయమెందుకని ప్రశ్నిస్తున్నారు. అసలు ఏ హోదాలో శివరాం నియోజకవర్గంలో కార్యకమ్రాలు నిర్వహిస్తున్నారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.

తమకు శివరాం నాయకత్వం వద్దని, ఆయన ఉంటే తాము పార్టీలో కొనసాగడం కష్టమని, నాయకత్వానికి స్పష్టం చేయనున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో పార్టీని బతికించాలన్న ఆసక్తి-చిత్తశుద్ధి చంద్రబాబుకు ఉంటే, ఎవరైనా మాజీ ఎమ్మెల్యేల స్థాయి, లేదా జిల్లా స్థాయి  నాయకులకు పార్టీ పగ్గాలివ్వాలని సూచించనున్నారు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అంటే ఇదే కామోసు? అధికారం శాశ్వత మనుకుని విర్రవీగే.. ఇప్పటి తరం యువ నాయకులకు, సత్తెనపల్లి పరిణామాలు  ఓ కనువిప్పు!