కేసీఆర్..శహభాష్!

206

మొక్కజొన్నల కొనుగోలుకు గ్రీస్‌సిగ్నల్
రైతులను గట్టెక్కించిన కేసీఆర్ నిర్ణయం
ప్రత్యర్ధి పార్టీతో సైతం ప్రశంసలు
కేసీఆర్ రూటే వేరు
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అంచనా వేయడం దుర్లభం. ఆయన ఎప్పుడు ఆగ్రహిస్తారో, ఎప్పుడు అనుగ్రహిస్తారో నర మానవుడూ అంచనా వేయలేడు. పట్టుపడితే విడిచిపెట్టే వ్యక్తి కాదు. పట్టువిడుపులు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తాయి. 50 రోజులపైగా నడిచిన ఆర్టీసీ సమ్మెను ఏ మాత్రం ఖాతరు చేయని కేసీఆర్.. ఆ తర్వాత అదే ఆర్టీసీ కార్మికులను,  తన ఇంటికి పిలిచి షడ్రశోపేత భోజనం పెట్టి పంపించిన నేత. నామినేటెడ్ పదవుల నుంచి టికెట్ల వరకూ, ఎవరూ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకునే కేసీఆర్.. తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం రైతుల పెదవులపై చిరునవ్వులు పూయించింది. దానితో మొన్నటి వరకూ సర్కారుపై ఆగ్రహించిన అదే రైతు.. ఇప్పుడు తమను కేసీఆర్ కరుణించటంతో,  మహదానందపడుతున్నాడు. ఈ అంశంలో ఒక్క రైతు మాత్రమే కాదు. కేసీఆర్‌ను నిరంతరం తూర్పారపట్టే,  బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం ఆయనకు కృతజ్ఞతలు చె ప్పారు. దటీజ్ కేసీఆర్!

తెలంగాణలో తాము పండించిన, మొక్కజొన్న పంటను సర్కారు కొనుగోలు చేయకపోవడంతో, రైతు కుమిలిపోయాడు. దానిపై పెట్టిన పెట్టుబడి సంగతి అటు ఉంచితే, కనీసం ఖర్చులయినా వస్తే చాలన్న ఆశతో ఉన్నాడు. సర్కారు హెచ్చరికను పెడచెవిన పెట్టినందుకు, తనను తాము నిందించుకున్నాడు. రైతుల పక్షాన బీజేపీ-కాంగ్రెస్-టీడీపీ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. ప్రధానంగా నిజామాబాద్ ప్రాంతంలో, ఈ పంట ఎక్కువగా పండిస్తారు. దానితో ఆందోళన అక్కడే కేంద్రీకృతమయింది. నిజానికి మొక్కజొన్న పంట వేయవద్దని, కేసీఆర్ సర్కారు గతంలో కూడా రైతులకు సూచించింది. దీనివల్ల 845 కోట్లు సర్కారు ఖజానాకు నష్టం వాటిల్లింది. అయినా కేసీఆర్ పెద్దమనసుతో, సర్కారు ధర చెల్లించింది.

ప్రస్తుతం దేశంలో మక్కలకు డిమాండ్ లేకపోవడం, కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతుధర ప్రకటించకపోవడం, విధానాలు మారడం వంటి కారణాలతో ఈ సీజన్‌లో.. అంటే వానాకాలంలో మొక్కజొన్నల పంట వేయవద్దని స్వయంగా, కేసీఆర్ అనేకసార్లు రైతులకు సూచించారు. నిజానికి కేంద్రం మొక్కలపై.. 50 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 15 శాతానికి తగ్గించిన ఫలితంగా, మక్కల ధర పడిపోయింది. ఈ పరిణామాలు పరిశీలించిన తర్వాతనే,  ప్రభుత్వ నిబంధనలు పాటించిన వారికే రైతుబంధు పథకం వర్తింపచేస్తామని, సైతం ఒక దశలో హెచ్చరించారు. ఎందుకంటే.. మక్కజొన్న పంట వేయవద్దని,  గతంలో హెచ్చరించినా వినని రైతుల నుంచి కొనుగోలు చేసిన సర్కారుకు.. క్వింటాలుకు 850 రూపాయల నష్టం వచ్చింది. అదీ కేసీఆర్ పట్టుదలకు కారణం.

అయినా ఖాతరు చేయని రైతులు, ఈ సీజన్‌లో కూడా మొక్కజొన్న పంట వేశారు. పైగా సర్కారు తమ  పంట కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. దీనితో ఆగ్రహించిన కేసీఆర్, వారి ఆందోళనను పట్టించుకోలేదు. వాస్తవ పరిస్థితులు వివరించినా, రైతులు ఖాతరు చేయకుండా మొక్కజొన్న పండించి.. తర్వాత ఇప్పుడు మళ్లీ సర్కారు మెడపై,  రాజకీయ పార్టీలపై కత్తి పెట్టించడమే కేసీఆర్ ఆగ్రహానికి అసలు కారణం. రైతుల పక్షాన రాజకీయ పార్టీలు ఆందోళనలు నిర్వహించడం, మీడియా కూడా రైతుల సమస్యలను ప్రముఖంగా ప్రస్తావిస్తుండటంతో, కేసీఆర్ మనసు మార్చుకోవలసి వచ్చింది.

దానితో ఈ ఒక్క సీజన్‌కు మాత్రమే.. క్వింటాలుకు 1,850 రూపాయల చొప్పున మార్క్‌ఫెడ్ ద్వారా, మొక్కజొన్న కొనుగోలు చేస్తామని చల్లని కబురు చెప్పారు. అయితే, అది కూడా ఈ ఒక్కసారి మాత్రమేనన్న షరతు విధించారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని..  నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం అభినందించి, కృతజ్ఞతలు చెప్పారు. ఇక రైతుల ఆనందానికి అవధుల్లేవు. సర్కారు తమ పంట కొనదన్న భావనకు వచ్చిన వారిపై కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తే, వారికి మహదానందమే కదా? అంటే ప్రత్యర్ధులతో సైతం,  ప్రశంసలు కురిపించుకోవడం కేసీఆర్‌కే సాధ్యమయిందన్నమాట!