ఏపీ బీజీపీలో..వేటు పడ్డ యువనేతదే హవా!

403

ఆ ‘అగ్ర నేత’ దగ్గర ఆయనదే పలుకుబడి
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఏపీ బీజేపీలో.. వాయువేగంతో కొనసాగుతున్న సస్పెండ్ల పర్వంలో, ఇదో హాశ్చర్యమైన కుదుపు. కన్నా లక్ష్మీనారాయణ హయాంలో, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన ఓ నాయకుడిని సస్పెండ్ చేశారు.అయితే, ఆయన ఇప్పుడు బీజేపీ రాష్ట్రశాఖ ‘పెద్దతలకాయ’ వద్ద హవా సాగిస్తున్న తీరు కమలదళాలను విస్మయానికి గురి చేస్తోంది. ఆ అగ్రనేతతో ఫోన్‌లో మాట్లాడాలంటే ముందు ఈ సస్పెండయిన నాయకుడికే ఫోన్ చేయాలట. కన్నా హయాంలో పార్టీలో చేరిన వారిని, సస్పెండ్ చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న ప్రస్తుత నాయకత్వం.. అదే కన్నా హయాంలో సస్పెండయిన నేతను మాత్రం, తమ కొలువులో చేరదీయడంపై పార్టీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ బీజేపీ యువనేత, అప్పటి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్టీ అనుబంధసంస్థలో పనిచేసే సదరు యువ నేత తీరుపై ఆగ్రహించిన రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ, ఆయనపై వేటు వేసింది. తర్వాత గత ఎన్నికల్లో ఆయన పాలకొల్లు వైసీపీ అభ్యర్ధి డాక్టర్ బాబ్జీ వద్ద చేరి, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు పర్యవేక్షించారు.
సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు ఆ తెనాలి నాయకుడు, ప్రస్తుత బీజేపీ ‘రాష్ట్ర ప్రముఖ నేత’ వద్ద చేరటం, పార్టీలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పార్టీ నుంచి సస్పెండయిన నేతను తన పక్కనే పెట్టుకోవడం ద్వారా, సదరు అగ్ర నేత ఇచ్చే సంకేతాలు ఏమటన్న చర్చ, బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. సదరు తెనాలి నేత, గతంలో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ పట్ల అసభ్యంగా వ్యవహరించడంతోపాటు, మెయిల్స్ రూపంలో అసభ్యపదజాలంతో సందేశాలు పంపుతున్నారన్న ఫిర్యాదుపై.. 2014 అక్టోబర్ 27లో, సైబరాబాద్ పోలీసులు అరెస్టు అవడం, అప్పట్లో సంచలనం సృష్టించింది.

బీజేపీ అనుబంధ విభాగంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కావడంతో, పార్టీ కూడా అప్పట్లో ఇబ్బంది పడింది. ఇదే కేసులో సదరు నేత అంతకుముందు ఏడాది కూడా అరెస్టయి, జైలుకు వెళ్లారట. అయితే, మహిళల రక్షణ పట్ల పెద్ద పెద్ద కబుర్లు- ఉపాన్యాసాలు ఇచ్చే బీజే పీ నాయకులు… మహిళలను వేధించే వారికి, పార్టీలో పెద్ద వేయడాన్ని భరించలేని ఆ మహిళా బాధితురాలు ఆత్మహత్యా ప్రయత్నం చేయడం విషాదం.

ఇలాంటి ఘనత వహించిన నేతపై ఒక నాయకత్వం వేటు వేస్తే.. అదే పార్టీకి చెందిన మరొక నాయకత్వంలోని ప్రముఖ నేత, తమ పక్కనే పెట్టుకోవడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై పార్టీకి చెందిన ఓ సీనియర్ కార్యకర్త.. పార్టీ జాతీయ అధ్యక్షుడు నద్దాతోపాటు, జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని, రాష్ట్ర సంఘటనా కార్యదర్శికి మాత్రం ఫిర్యాదు చేయకపోవడం విశేషం. ఆయన క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని, ఒక వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారం ఉన్నందుకే, బహుశా ఆయనకు ఫిర్యాదు చేయనట్లు కనిపిస్తోంది.

గతంలో కూడా బీజేపీకి చెందిన ఓ కీలక నేతపై ఇదే విధంగా, మహిళలకు సంబంధించిన వ్యవహారశైలిపై మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఫిర్యాదులూ వెళ్లాయి. ఆయనను ‘మహిళా నాయకుడిగా’ పార్టీ వర్గాలు అభివర్ణించేవి. ఆ తర్వాత ఆయనను తొలగించారు. అది వేరే విషయం. సదరు నాయకుడి ఆశీస్సులతోనే, కొత్త నాయకత్వం తెరపైకి వచ్చిందన్న ప్రచారం బీజేపీ వర్గాల్లో వినిపించింది. ఏదేమైనా.. మహిళలను గౌరవించే పార్టీలో అదే మహిళలను వేధించిన వారిని పక్కన ఉంచుకుంటున్న వైనమే విస్మయపరుస్తోంది. మరి బీజేపీ అంటే భిన్నమైన పార్టీ కదా? అందుకు!

2 COMMENTS

  1. ఇప్పుడైనా AP బీజేపీ కళ్ళు తెరుచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో NOTA కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ, తిరిగి పుంజుకోవాలంటే, ఏ విధంగా పని చెయ్యాలో, వాళ్ళు అర్ధం చేసుకోవటం లేదు….
    నా ఉద్దేశ్యం, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పని అయిపోయింది unless some miracle happens….