రాష్ట్ర ప్రభుత్యం విఫలమైంది:విష్ణువర్ధన్‌రెడ్డి

645

వరద ముంపు నివారణ, ముంపుతో ఏర్పడ్డ సమస్యలు, ప్రజల రక్షణ కల్పించడం, ఆదుకోవడం విషయాల్లో రాష్ట్ర ప్రభుత్యం తీవ్రంగా విఫలమైందని భాజపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 9 రోజులుగా రాష్ర్టంలో భారీ వర్షాలు కురవడంతో చెరువులు, వాగులు, కాలువలు, నదులు వరద నీటితో పొంగి గ్రామాలను ముంచేయడంతో నివాసం కోల్పోయి ప్రజాజీవనం అస్తవ్యస్తమైపోయిందన్నారు. కాపులో ఉన్న పంటలు వరద నీటితో మునిగి నీటిపాలైపోయాయన్నారు. ఈ పరిస్తితుల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులను అన్నివిధాలుగా ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయిందన్నారు. వరద ముంపు నివారణ సమస్యలు పరిష్కరించడంలో తీవ్ర అక్ష్యం ప్రదర్శించిందన్నారు. మంత్రులు వారి ప్రాంతాల్లో పర్యటించకపోవడాన్ని విష్ణువర్దన్‌రెడ్డి తప్పుపట్టారు. ముఖ్యమంత్రి ఉన్నత స్ధాయి సమావేశాలు నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం కూడా చేయలేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ,హోంమంత్రి అమిత్‌షాలు వరదల విషయంపై ఆరా తీసి ఆదుకుంటామని హామీ ఇచ్చిన తర్వాతే ముఖ్యమంత్రి జగన్ మేల్కొని నష్టపరిహారానికి అంచనాలు పంపి తన పనైపోయినట్లు చేతులు దులుపుకున్నారన్నారు. వరదలు ఈ రాష్ట్రానికి కొత్తకాదని, వరద సమస్యల నివారణలో పనిచేసిన నిష్ణాతులైన అధికారులు ఎందరో ఉన్నారన్నారు. వాతావరణ శాఖ, కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా హెచ్చరించినా పట్టించుకోలేదని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే వరద ప్రాంతాల్లో విహారయాత్రకు వెళ్లినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కనీసం మీడియాకు కూడా ముఖ్యమంత్రి సమాచారం ఇవ్వడం లేదని విమర్శించారు.

రాజ్యాంగ వ్యవస్తలపై ముఖ్యమంత్రికి నమ్మకం లేదని, రాజకీయ కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రభుత్వం ఒక లిమిటెడ్ కంపెనీలా కనిపిస్తోందని విమర్శించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యేపై ఎన్నికల సమయంలో పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా చట్టం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని ప్రభుత్వాన్ని విమర్శించారు. రంపచోడవరంలో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై కేసులు పెట్టారని ఆక్షేపించారు. ప్రతిపక్షాలు, వ్యవస్థ, కోర్టులంటే ఏ మాత్రం లెక్కలేకుండా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. పనిచేసుకోడానికి తమకు నిధులివ్వలేదని ఎన్నికల కమిషనర్ కోర్టుకు వెళ్తేగాని నిధులివ్వలేదనే విషయాన్ని గుర్తుచేశారు. వారం మునిగితే, నిండా లేదా సగం మునిగితే, లేదా నేరుగా చూసిగాని సహాయం చేస్తామనడం దుర్మార్గమన్నారు. రాష్ర్ట ఆదాయాన్ని పెంచకుండా, అప్పులు తీసుకురావడం, తెచ్చిన నిధులు పంచిపెట్టడం, వ్యక్తిగత ప్రచారానికి ఆర్భాటంగా ఖర్చుచేయడం తప్ప భావి తరాల అభివృద్ది గురించి ఈ ప్రభుత్వం ఏం ఆలోచించడం లేదన్నారు. రోజూ రాష్ర్ట, జాతీయ మీడియాలో సంచలన చర్యలకు ప్రాధాన్యత ఇస్తూ సమస్యలను గాలికి వదిలేస్తున్నారని దుయ్యబట్టారు.