హరీష్ సవాలుకు సంజయ్ జవాబేదీ?

694

కేసీఆర్‌ను చర్చకు రమ్మన్న అరుణక్క
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

దుబ్బాక ఉప ఎన్నిక కేంద్రంగా, టీఆర్‌ఎస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు ఆ దశ కూడా దాటి సవాళ్ల స్థాయికి చేరింది. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై, ఇప్పుడు తెలంగాణలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. దీనిపై రాష్ట్ర ఆర్ధిక మంత్రి, దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ప్రచార సారథి హరీష్ విసిరిన సవాల్ చర్చనీయాంశమయింది.

రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీలున్నా, ఒక్కరు కూడా తెలంగాణకు నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని హరీష్ విరుచుకుపడుతున్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, డబుల్ బెడ్‌రూము, రైతుబంధు వంటి పథకాలు.. బీజేపీ పాత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉంటే చూపించాలని, హరీష్‌రావు చేస్తున్న సవాళ్లకు బీజేపీ నుంచి ఎక్కడా సమాధానం వినిపించడం లేదు. తాజాగా కేంద్ర నిధులపై చర్చించేందుకు, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను, పాత బస్టాండు వద్దకు రావాలన్న హరీష్ సవాల్ ఆసక్తి రేపుతోంది.

కేంద్రం ఏం ఇవ్వలేదో చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తాను చెప్పినది అబద్ధమని రుజువుచేస్తే ..తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న సవాల్, ఎన్నిక ప్రచారంలో సంచలనం సృష్టింస్తోంది. రుజువు చేయకపోతే సంజయ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేసి, ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. ప్రధానంగా బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్‌లో 1600 రూపాయలు కేంద్రమే ఇస్తోందన్న సంజయ్ మాటలపై హరీష్  ఈ సవాల్ విసిరారు. మోదీ సొంత రాష్ట్రంలో 500 రూపాయలు మాత్రమే పించను ఇస్తున్నారని వెల్లడించారు.

అయితే, సంజయ్ నుంచి ఇప్పటివరకూ దానికి సంబంధించి జవాబు రాలేదు. నిజానికి గత కొన్ని నెలల నుంచి ఆయన, కేంద్ర నిధులను కేసీఆర్ సర్కారు ఖర్చు పెట్టడం లేదని ఆరోపించడం ద్వారా, మీడియాను ఆకర్షిస్తున్నారు. తాజాగా హరీష్  సవాల్‌పై జవాబు లేని సంజయ్ స్థానంలో, ఆ పార్టీ జాతీయ నేత డి.కె.అరుణ తెరపైకి వచ్చారు. కేంద్ర నిధులపై చర్చించేందుకు, సంజయ్‌తో సీఎంకేసీఆర్ చర్చకు రావాలన్న కొత్త సవాల్ విసిరారు. అంటే, సంజయ్‌ది …కేసీఆర్ స్థాయి అని చెప్పడం, అరుణక్క ఉద్దేశంలా కనిపిస్తోంది.

దీన్నిబట్టి.. ఈ సవాళ్లన్నీ మీడియా ద్వారా ప్రజలను ఆకట్టుకునేందుకే తప్ప, అసలు ఎవరూ చర్చించేందుకు ముందుకు రానన్నది, మెడ మీద తల ఉన్న ఎవరికయినా స్పష్టమవుతుంది. సంజయ్‌కు హరీష్ సవాల్ చేస్తే.. ఆయన జవాబివ్వకుండా, అరుణక్క సమాధానం ఇవ్వడమే విచిత్రం. పోనీ, చర్చకు వచ్చే ఆలోచన అధ్యక్షుడికి లేకపోతే, కనీసం ఏయే పథకాలకు.. ఎన్ని నిధులిచ్చారన్న జాబితా అయినా విడుదల చేసి ఉంటే బాగుండేది. ప్రధానంగా.. హరీష్‌రావు ప్రస్తావిస్తున్న  అంశానికి సంబంధించిన నిధుల వివరాలను, కేంద్రం ద్వారానే విడుదల చేయించి ఉంటే, హరీష్‌కు గట్టి జవాబు ఇచ్చినట్లయ్యేది.

ఇవేమీ కాకుండా.. కేసీఆర్  తమతో చర్చకు రావాలని  ప్రతిసవాల్ విసరడం ద్వారా.. అసలు విషయాన్ని పక్కదారి పట్టించడంగానే జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కాకపోతే, సంజయ్ తన వద్ద ఉన్న సమాచారాన్ని చర్చలో బయటపెట్టడం ద్వారా, టీఆర్‌ఎస్‌ను ఇరికించే అశకాశం కోల్పోయారు. నిజంగా హరీష్ ఆరోపణ అబద్ధమని సంజయ్ దుబ్బాకలో నిరూపించి ఉంటే, అది బీజేపీ అభ్యర్ధి విజయానికి సైతం దోహదపడి ఉండేదని బీజేపీ వర్గాలు అభిప్రాయపడతున్నాయి.

రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల మధ్య.. చర్చల సవాళ్ల పేరిట, ఇలాంటి కామెడీలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కానీ అవి ఎప్పుడూ జరగవన్నది అందరికీ తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో కొత్తపల్లి సుబ్బారాయుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, విద్యుత్ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత రోశయ్యకు సవాల్ విసిరారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌కు రావాలని సవాల్ చేశారు. అందుకు రోశయ్య కూడా సై అన్నారు. ఈ సవాళ్ల వార్తలు పత్రికల్లో రావడంతో, బాబు .. మంత్రి సుబ్బారాయుడును పిలిపించి, రోశయ్యతో పెట్టుకోవద్దని మందలించారు. దానితో ఆ సవాళ్ల చర్చలకు తెరపడింది. ఆ తర్వాత తలసాని శ్రీనివాసయదవ్ కూడా, అప్పటి కాంగ్రెస్ నేత దివంగత పిజెఆర్‌పై సవాల్ విసిరారు. కానీ పిజెఆర్ అక్కడికి రాలేదు. కాబట్టి.. ఈ సవాళ్లు- ప్రతి సవాళ్లన్నీ పత్రికల్లో చదవడానికీ, టీవీల్లో చూడ్డానికే బాగుంటాయి.