దేవతకు ఓ న్యాయం..నేతలకు మరో న్యాయమా?

200

దుర్గామాత విగ్రహానికి నో పర్మిషన్
పోలీసులే నిమజ్జనం చేసిన వైనం
కరోనాయే కారణమట
మరి మంత్రుల ర్యాలీల మాటేమిటి?
శివమెత్తిన శివస్వామి
కనిపించని కమలం పార్టీ నేతలు
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

కరోనా నిబంధనలు ఇంకా అమలులోనే ఉన్నాయి. లాక్‌డౌన్ తొలగించినప్పటికీ, సామాజిక దూరం పాటించాలన్న నిబంధనయితే అమలులోనే ఉంది. ఇది దేశవ్యాప్తంగా అమలులో ఉన్న రూలు. ఆ ప్రకారంగా ఎవరూ పెద్ద సంఖ్యలో గుమికూడకూడదు. ఇది మంత్రులు-ఎమ్మెల్యేలు-రాజకీయ పార్టీల నాయకులకూ వర్తించే సూత్రం. కానీ ఏపీలో అధికార పార్టీ నాయకులెవరూ ఆ నిబంధనలు పాటించడం లేదు. జనంతో జాతరలు, విజయోత్సవాలు చేసుకుంటున్నారు. పాలాభిషేకాలు చేస్తున్నారు. అప్పుడు మాత్రం అధికారులకు, కరోనా నిబంధనలు గుర్తుకురావు. కానీ దసరా సందర్భంగా.. గ్రామస్తులు అమ్మవారు విగ్రహం ఏర్పాటుచేసుకుంటే మాత్రం, కరోనా నిబంధనలు-అనుమతులూ గుర్తుకు వస్తాయి. దానితో పోలీసులే రంగంలోకి దిగి, పండుగకు ముందే అమ్మవారి విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేస్తారు. ఇదీ ఆంధ్రాలో కనిపిస్తున్న పక్షపాతం.

దసరా సందర్భంగా కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం, లక్ష్మీపురం గ్రామస్తులు.. దుర్గాదేవి విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. నవరాత్రులు పూజలు నిర్వహించిన తర్వాత, విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ఆ మేరకు వారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, హటాత్తుగా పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లి నదిలో నిమజ్జనం చేశారు. దీనితో మనోభావాలు దెబ్బతిన గ్రామస్తులు, ఆందోళన నిర్వహించారు. ఇది తెలిసిన శివస్వామి అక్కడికి వెళ్లి, గ్రామస్తుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు.

నిజానికి లక్ష్మీపురం అనే గ్రామంలో, ఇప్పటిదాకా మతకలహాలు జరిగిన ఘటనలు లేవు. అది నందిగామకు దూరంగానే ఉంటుంది. పోనీ ఆ విగ్రహ ఏర్పాటుపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారా అంటే, అదీ లేదు. అయినా కరోనా ఉన్నందున, భక్తులు వస్తే ప్రమాదం కాబట్టి, పోలీసులే అత్యుత్సాహం ప్రదర్శించి విగ్రహాన్ని ముందుగానే నిమజ్జనం చేశారు. ఇది విశ్వహిందూపరిషత్, ఇతర హిందూ సంఘాలకు ఆగ్రహం కలిగించింది. ‘మసీదుల్లో గుంపులు గుంపులుగా వెళుతుంటే ఆపడం లేదు. చర్చిలకు గుంపులు గుంపులుగా వెళుతుంటే ఎవరూ ఆపరు. మంత్రుల కార్యక్రమాలకు గుంపులుగా వెళుతుంటే, కరోనా నిబంధనలు గుర్తుకు రావు. కానీ అమ్మవారి విగ్రహ ఏర్పాటులోనే మీకు నిబంధనలు గుర్తుకు వస్తాయా? ఇది అసలు హిందూదేశమేనా? హిందువులంతా ఇంకో దేశంలో ఉన్నారా? దీనికి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాల’ని శివస్వామి డిమాండ్ చేశారు. ఆ సందర్భంగా ఆయన పోలీసులపై కురిపించిన ప్రశ్నల వర్షానికి వారి నుంచి జవాబు లేదు.

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువులపై పక్షపాతం- దేవుళ్లకు-ఆలయాలకు భద్రత లేకుండా పోయిందనడానికి.. చందర్లపాడు ఘటనే నిదర్శనమని, హిందూ మహాసభ ఏపీ చీఫ్ వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ విరుచుకుపడ్డారు. ఇదేవిధంగా పోలీసులు చర్చిలు, మసీదుల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించే ధైర్యం ఉందా, అని ఆయన ప్రశ్నించారు. గత 17 నెలల నుంచి రాష్ట్రంలో, దేవాలయాలపై జరిగిన దాడులకు బాధ్యులైన నిందితులను ఎందుకు శిక్షించలేదని ప్రశ్నించారు. హిందువులపై జరిగే దాడులను, హిందూ మహాసభ చూస్తూ ఊరుకోదని వెలగపూడి హెచ్చరించారు.


సీన్ కట్ చేస్తే… జగన్ సర్కారు, భారీ సంఖ్యలో బీసీ కార్పొరేషన్లు ప్రకటించింది. మంచిదే. దానిపై బీసీలంతా సంతోషం వ్యక్తం చేశారు. తటస్థులు కూడా జగన్ చర్యను అభినందించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, వైసీపీ నాయకులంతా రాష్ట్రంలో దానిని ఒక పండుగలా నిర్వహించారు. వాటికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయి, వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఒకరు కాదు. ఇద్దరు కాదు. డజన్లు, వందల సంఖ్యలో క్యూలు కట్టి, సామాజిక దూరం పాటించకుండా పోటీలు పడి, తోసుకుని వెళ్లి మరీ వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఫొటోలు మీడియాలోనూ దర్శనమిచ్చాయి. ఈ విషయంలో మంత్రులు-ఎమ్మెల్యేలు-అధికార పార్టీ నాయకులే కోవిడ్ నిబంధనలు అడ్డగోలుగా ఉల్లంఘించారు. అయినా ఒక్కరిపైనా కేసులు పెట్టిన దాఖలాలు లేవు.

చివరకు ముఖ్యమంత్రి జగన్.. విజయవాడ కనకదుర్గ ఆలయంలో, పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చినప్పుడూ, నిబంధనలు ఉల్లంఘించినట్లు ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి కూడా మాస్కు లేకుండానే, అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి పోలీసు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు మరి. మాస్కు లేకపోతే, చలాన్లు వేస్తున్న పోలీసుల అత్యుత్సాహం.. అధికార పార్టీ వారి ముందు మాత్రం, ఎందుకో కనిపించడంలేదు మరి!

అధికార పార్టీ నేతలు … కోవిడ్ నిబంధనలు అడ్డగోలుగా ఉల్లంఘిస్తున్న దృశ్యాలు, కళ్లకు కనిపిస్తూనే ఉన్నాయి. అయినా వాటికి లేని అభ్యంతరాలు-ప్రమాదం, ఒక్క దేవతా విగ్రహాల ఏర్పాటులోనే ఎందుకు కనిపిస్తున్నాయన్నది, హిందూ సంఘాల ప్రశ్న. చందర్లపాడు వద్ద అమ్మవారి విగ్రహం తొలగింపు అంశంపై అంత రాద్ధాంతం జరిగినా, అక్కడికి ఒక్క బీజేపీ నాయకుడు కూడా వెళ్లకపోవడం మరో ఆశ్చర్యం. స్థానికులే చొరవ తీసుకుని, శివస్వామికి సమాచారం ఇచ్చారు. పోనీ తర్వాతయినా ఈ ఘటనపై, బీజేపీ ఆందోళన నిర్వహించిందా అంటే అదీ లేదు.

వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేయాలంటే, బహుశా.. ముందు, సోము వీర్రాజు- విష్ణువర్దన్‌రెడ్డి అనుమతి తీసుకోవాలన్న నిబంధన ఉంది కామోసు. అందుకే టీటీడీ నిధుల మళ్లింపు, బ్యాంకు డిపాజిట్ల వ్యవహారంపై కమలదళాలు మౌనంగా ఉన్నట్లున్నాయి. మంత్రి కొడాలి నాని, బీజేపీని కరోనాతో పోల్చినా గమ్మున కూర్చున్న తమ పార్టీ నాయకత్వం నుంచి, అంతకుమించిన స్పందన ఆశించడం కూడా అత్యాశేన న్నది ఆ పార్టీ వారి అంతరంగం. అయినా.. జగనన్న పాలనలో దేవుళ్లు కూడా.. తాము వైసీపీ నేతలుగా ఎందుకు పుట్టలేదా? అని, చందర్లపాడు ఘటన చూసిన తర్వాత వాపోయే పరిస్థితి. ఓ మై గాడ్!