ఆ రోజు అక్టోబర్ ఇరవై అందరు అనుకుంటుంటే విన్న అమరుడైనాడని మా నాన్న! అమరుడంటే అర్థం కాక అదేపనిగా గుచ్చి గుచ్చి అడిగితిని అమ్మను నోటమాట రాక నాన్న ఫోటో వంక చూస్తూ చతికిలబడి పోయింది అమ్మ!  కంటికీ మంటికీ ఏకధారైంది కన్నీరు. గాలి ఆగిపోయింది …చెట్లూగలేదు… పక్షులెగుర లేదు… పొయ్యి రాజుకోలేదు… పచ్చి మంచినీళ్లు ముట్టుకోలేదు! అమ్మ అడుగులో అడుగేసుకుంటూ ఇంట్లోనే ఉన్న! ఇవరమడిగితే అంత బాధైతే ఇంకోసారి అడుగొద్దనుకున్న! మరుసటి రోజు అక్టోబర్ ఇరువయ్యొకటి పోలీసు బ్యారకుల ప్రక్కన పరేడు గ్రౌండు తురగ పదాతి దళములతో పటాలములన్నీ పయనమై వచ్చినాయి సూర్యోదయ సమయాన! సైరన్ మోతలు పైలట్ కూతలు విని నేనూ పరిగెడితిని పరేడు గ్రౌండుకు ముఖ్యమంత్రి, గృహ మంత్రి, డిజిపి తదితర ఉన్నత పోలీసు అధికారులు అగుపించిరక్కడ! అందరి ముఖాల్లో ప్రస్ఫుటమైనై విషాదఛాయలు భారమైన హృదయంతో చదివిరెన్నో పేర్లు తెలియజేశారు రక్షకులు అమరులైనారని అక్షరులై ఉన్నారని! బాధ్యతలను గుర్తు చేసుకొని వారి ఆశయ సాధనకై పునరంకితం కావాలని ముక్తకంఠంతో పూనారు ప్రతిన! చదివిన పేరులందు స్పష్టంగానే వింటి మా నాన్న పేరు హోదా కానిస్టేబులు! వివరణ స్పష్టం! విషదీకరణ సుస్పష్టం!! ధర్మ భూమి జనరక్షణ సమరాంగణమందు సర్వశక్తులను ఒడ్డి దేశద్రోహులను మట్టి గరిపించుటకై చేశారట సాహసోపేతమైన పోరాటం ! శత్రువు మాటువేసి చాటునుండి వేసిన దొంగదెబ్బకు అబ్బా! అనకుండ అధైర్యపడకుండ ముందుకు సాగుతూ అలజడి మూకలను మట్టిగరిపించి పరలోకాలకు పారిపోతున్న దేశద్రోహశక్తులను చివరంటా తరిమి తరిమి నరకలోకాన పాతెనట! ఆపై అమరలోకం ఆహ్వానంపై అచటికేగుతూ తన సహచరులకు ఆదర్శప్రాయుడై సందేశ ప్రదీప్తియై పసితనంలోనే పండుటాకయినాడంట! సందర్భోచిత నిర్ణయాలతో మా నాన్న ప్రదర్శించిన వీరోచిత పోరాట పటిమ గురించి విని గర్వించి అది పర్వంగా భావించాను నేను! ఆయన జీవితపుటద్దంలో దర్శించానిపుడు స్వచ్ఛమైన వీరత్వాన్ని అచ్చమైన అమరత్వాన్ని అందుకే ఈ పర్వదినాన ప్రతినబూనితినిదిగో నాన్నా! నేనూ పోలీసునౌతాను వెలుగులు నిండిన నీ అమరత్వాన్ని అష్టదిక్కులకూ చాటుతాను! నీవు మిగిల్చిన కార్యభారాన్ని మోయడానికై కర్తవ్యపరాయణ దీక్షా కంకణాన్ని ధరించాను! నీ ఆశయ సాధనను వరించాను, అడుగు ముందుకు వేశాను!

అమరులందరి ఆత్మలకు శాంతిని చేకూరుస్తాను! అవుతాను భారతదేశ పోలీసుల్లో కలికితురాయిని! అమరలోకం నుండి ఆశీర్వదించు నాన్నా! ఆనందించు నాన్నా!!

– పెద్దిరెడ్డి తిరుపతి రెడ్డి ,
విశ్రాంత పోలీసు అధికారి.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner