అర్జున విషాదయోగము-1

368

భగవద్గీత
మొదటి అధ్యాయము: అర్జున విషాదయోగము.

ధృతరాష్ట్ర ఉవాచ:

1.ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవం మామకా: పాణ్ణవాశ్చైవ కిమకుర్వత సంజయ||

ఓ సంజయా! ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధము చేయవలెనని కోరిక బలంగా కలిగిన వాళ్లు అయిన నా కుమారులు, మరియు నా తమ్ముడు పాండురాజు కుమారులు, ఏమి చేస్తున్నారు. వివరంగా చెప్పు అని ధృతరాష్ట్రుడు సంజయుని అడగడంతో గీతా శాస్త్రము ప్రారంభం అవుతుంది.

వ్యాసుల వారు భగవద్గీతను ధర్మ అనే పదంతో మొదలుపెట్టారు. ధర్మము అందరూ ఆచరించవలసినది. ధర్మాచరణము అందరికీ అత్యంత ఆవశ్యకము. ధర్మం రక్షింపబడిన నాడు ఆ ధర్మం మనలను రక్షిస్తుంది. అందుకే ధర్మో రక్షతి రక్షిత: అని ఆర్యోక్తి. గీతలో కృష్ణపరమాత్మ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఉద్ఘాటించారు. ధర్మమును స్థాపించడానికి ప్రతియుగంలో నేను జన్మిస్తాను అని చెప్పారు. కాబట్టి ధర్మము మానవాళికి అత్యంత ముఖ్యమైన సంపద. అందుకే ఈ భరతభూమి ధర్మక్షేత్రమై విలసిల్లింది. అటువంటి భరతభూమిలో కురుక్షేతము ఉంది. కురు మహారాజు పేరిట కురువంశము వర్ధిల్లింది. ఆ కురుమహారాజు యజ్ఞం చేయడానికి ఆ క్షేత్రమును దున్ని చదునుచేసాడు. అందుకని ఈ ప్రదేశమునకు కురుక్షేత్రము అని పేరు వచ్చింది అని చెబుతారు. క్షత్రియ కులమును సమూలంగా నిర్మూలించిన పరశురాముడు, వారి రక్తముతో ఇక్కడే తన తండ్రికి తర్పణము విడిచాడనీ, ఆ క్షత్రియుల రక్తం ఐదుపాయలుగా పారిందనీ, దాని పేరే శమంతక పంచకము అనీ అది ఈ కురుక్షేత్రములో ఉందని చెబుతారు. అటువంటి కురుక్షేత్రములో పాండవులు, కౌరవులు రాజ్యం కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులయ్యారు.

ఈ శ్లోకం ధృతరాష్ట్రుడు సంజయుని అడగడంతో మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రమును ధరించిన వాడు. అంటే కురు సామ్రాజ్యమునకు రాజు. ఈ కురు సామ్రాజ్యము ధృతరాష్ట్రుడు సంపాదించలేదు. అది అతని పిత్రార్జితము. తనది కాని దానిని తనది అనుకునే స్వభావము కలవాడు. ఈ గుణము మనలో చాలా మందికి ఉంది. మనం పుట్టక ముందు ఈ భూమి ఉంది. మనం పోయిన తరువాత కూడా ఈ భూమి ఉంటుంది.

కాని మనం ఈ భూమి మీద బతికిన 100 సంవత్సరాల పాటు ఈ భూమి నాది అని అనుకుంటున్నాము. మనది కాని భూమి మీద విపరీతమైన మమకారము పెంచుకుంటాము. ఉన్న భూమిని కాపాడుకోడానికి, లేని భూమిని ఆక్రమించడానికి నానా తంటాలు పడుతుంటాము. అనేకమైన అడ్డదార్లు తొక్కుతుంటాము. సెంటు భూమి కొరకు అయిన వారిని కూడా కడతేర్చేవాళ్లు ఉండటం మనం చూస్తున్నాము. వింటున్నాము. అదే అజ్ఞానము. ఈ అజ్ఞానము పోగొట్టేదే భగవద్గీత.

ఇంక సంజయుడు ధృతరాష్ట్రునికి సారధి, ఆంతరంగికుడు,జ్ఞాని. సమ్యక్ జయతి సంజయ: అని అంటారు. అంటే ఇందియములను మనసును జయించిన వాడు. నువ్వు, నేను అనే భేదబుద్ధిలేని వాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగిన ధైర్యశాలి. వ్యాసుని అనుగ్రహమును పొందిన వాడు. అందుకే సంజయునికి శ్రీకృష్ణుని ముఖతా గీతను వినే మహద్భాగ్యం కలిగింది. విశ్వరూపదర్శనమును పొందగలిగాడు.
కురుక్షేత్రము అంటే కురు రాజుల యొక్క అధీనంలో ఉన్న విశాలమైన కురుభూమి. అక్కడ ఎంతో మంది మునులు, ఋషులు తమ ఆశమాలు నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నారు. పూర్వము బ్రహ్మగారు, ఇంద్రుడు, అగ్ని ఇక్కడ తపస్సు చేసారనీ, కురు వంశ మూల పురుషుడు అయిన కురుమహారాజు ఈ ప్రదేశములో ఎన్నో ధర్మకార్యాలు చేసాడని ప్రతీతి. ( ప్రస్తుతము ఇది పంజాబు రాష్ట్రంలో ఉంది.)

ఇప్పుడు పాండవులు, కౌరవులు, వారి మిత్రపక్షరాజులు అందరూ కలిసి యుద్ధం చేయడానికి ధర్మక్షేత్రము అయిన కురుక్షేత్రంలో సిద్ధం అయ్యారు. వారి సైన్యములు అంతా కలిపి 18 అక్షౌహిణీలు. ఒక అక్షౌహిణి అంటే 21,870 రథములు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రములు, 1,09,350 సైనికులు వీరంతా కలిసి ఒక అక్షౌహిణి అంటారు. ఇటువంటి అక్షౌహిణీలు పాండవుల పక్షాన 7, కౌరవుల పక్షాన 11 నిలిచి ఉన్నాయి.మరి ఇన్ని లక్షల మంది యుద్ధం చేయాలంటే విశాలమైన భూమి కావాలి కదా. దాని కొరకు ఈ కురుభూమిని ఎన్నుకున్నారు. అప్పటివరకు హెమ ధూమముతోనూ, వేదఘోషలతోనూ, పర్ణకుటీరములతోనూ శోభిల్లిన కురుభూమి యుద్ధఘోషలతో, ఆయుధ విన్యాసాలతో, అస్త్ర శస్త్ర ప్రయోగాలతో, సైనికుల అరుపులతో కురుక్షేత్రంగా మారి పోయింది.

మన శరీరం కూడా ఒక కురుక్షేత్రమే. అందులో మంచి ఆలోచనలు పాండవుల సైన్యం అయితే, దుర్మార్గముతో కూడిన ఆలోచనలు కౌరవ సేనలు. వాటి మధ్య జరిగే ఘర్షణే కురుక్షేత్ర సంగ్రామము.
అసలు మనిషి పుట్టగానే అతడి లేక ఆమె మనసు నిర్మలంగా, ప్రశాంతంగా, అమాయకంగా ఉంటుంది. పెరిగి పెద్ద అయ్యేకొద్దీ ఇది నాది, అది నీది అనే స్వార్ధము, నీవు వేరు నేను వేరు అనే భేదబుద్ది, ఇది అంతా నాకే కావాలి, నీకు ఇవ్వను అనే లోభత్వము, నువ్వంటే నాకు పడదు అనే ద్వేషము, నీకు అంత ఉంది, నాకు ఇంతే ఉంది అనే అసూయ క్రమక్రమంగా మన మనసులను, బుద్ధిని కురుక్షేత్రంగా మారుస్తాయి. ఈ మంచి చెడుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి మంచి గెలుస్తుంది. మరో సారి చెడు గెలుస్తుంది. దాని వలన సుఖము దు:ఖము ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. ఇదే సంసారము అనే సాగరము. ఈ సాగరము నుండి బయటపడాలంటే ఒక గట్టి పడవ కావాలి. అదే భగవద్గీత. దానికి చుక్కాని పట్టేది గురువు. భగవద్గీత అనే పడవ ఎక్కి, శ్రీకృష్ణుడు అనే గురువు సాయంతో ఈ సంసారము అనే సముద్రమును దాటవచ్చు.

ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డి. పాండురాజు అరణ్యములకు పోయినప్పటి నుండి తానే రాజు. అయినా రాజ్యకాంక్ష తగ్గలేదు. తన తరువాత తన కుమారులైన కౌరవులకు రాజ్యం కట్టబెట్టాలనే కోరిక బలంగా ఉంది. నిజానికి పాండవులు, కౌరవులు ఇద్దరూ తన కుమారులే. కాని ధృతరాష్ట్రుని భేదబుద్ధి వారిని సమానంగా చూడనివ్వదు. అందుకే నా వాళ్లు, పాండవులు ఏమి చేస్తున్నారు అనే భేదబుద్ధి చూపించాడు. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సంజయుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు.

రచన:మొదలి వెంకట సుబ్రహ్మణ్యం(రిటైర్డు రిజిస్ట్రార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు)

1 COMMENT