హైదరా‘బాధ’లకు కారకులెవరు?

567

కబ్జాలను తొలగించే దమ్ము కేసీఆర్ సర్కారుకు ఉందా?
ప్రభుత్వం-ప్రజలదే ఈ పాపమా?

( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

సాగరమయమయిన రాజధాని నగరం ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలకు కారకులెవరు? రోజుల తరబడి జనం బతుకు, నీళ్లలోనే నానడానికి మూలమెవరు? కళ్ల ముందే తమ కుటుంబ సభ్యులు వరద ప్రవాహం, డ్రైనేజీల్లో పడికొట్టుకుపోవడానికి కారణమెవరు? ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రజలతో బూతులు తిట్టించుకునే పరిస్థితికి కారణమేమిటి? గోడ కూలి కొందరు, ఇళ్లు కూలి మరికొందరు, ఇలా డజన్ల సంఖ్యలో మృతి చెందడానికి కారకులెవరు? ఈ పాపం ఎవరిది? ప్రభుత్వాలదా? ప్రజలదా?.. లేక ఇద్దరూనా? ఇవీ.. ఇప్పుడు మహానగరాన్ని ముంచెత్తుతున్న ప్రశ్నలు.

అవును. ఈ ఉత్పాతానికి కారకులెవరన్న చర్చ జరుగుతోంది. గత చరిత్ర- పాలకుల నిర్ణయాలు- వైఫల్యాలు-అధికారుల అవినీతి-ప్రజాప్రతినిధుల ఓట్ల కోణంతోపాటు.. ప్రజల అత్యుత్సాహం- అత్యాశ- బలహీనతలు కలసి వెరసి, మహానగరాన్ని ముంచేశాయన్నది సుస్పష్టం. ఈ మహానగరం బాగుపడాలంటే 11 వేల కోట్లు కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తొలినాళ్లలో చెప్పారు. ఆ తర్వాత 25-30 కోట్లు అయితే తప్ప నగరం బాగుపడదన్నారు. కేసీఆర్ అధికారంలోకి రాకముందు, నగర సమస్యలపై చాలా ఆందోళన చెందారు. గత పాలకులపై అనేక విమర్శలు చేశారు. ఇదంతా వారి పుణ్యమేనని ఆరోపించారు. తానొస్తే డల్లాస్‌లా మార్చేస్తానన్నారు. ఇప్పటికి కేసీఆర్ సీఎం అయి ఆరేళ్లు దాటుతోంది. నగర ప్రజలు ఆయన పార్టీకే పట్టం కట్టారు. మేయర్ పీఠం సహా మెజారిటీ కార్పొరేటర్లనూ, ఆయన పార్టీకే కట్టబెట్టారు. అయినా ఇప్పటివరకూ చేసింది శూన్యమన్నది జనం నుంచి వినిపిస్తున్న పెదవి విరుపు.ఇది కూడా చదవండి: డల్లాస్..ఖల్లాసాయె!

ఎవరు పాలకులుగా వచ్చినా, మహానగర సమస్యల మూలాన్ని విస్మరిస్తూ వచ్చారు. కీలెరిగి వాతపెట్టే బదులు, తాత్కాలికంగా పూతపూసే విధానాలు అవలంబించారు. అదే ఇప్పటి విషాదానికి అసలు కారణమన్నది నిష్ఠుర నిజం. నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించేందుకు ఏ ప్రభుత్వమూ ప్రయత్నించలేదు. నిజాం కాలం నాటి జనాభాకు, ఇప్పుడు వందరెట్ల జనాభా పెరిగింది. కానీ అదే డ్రైనేజీ వ్యవస్థ కొనసాగుతోంది. ఫలితంగా పెరుగుతున్న ఒత్తిడే ఈ విషాదానికి కారణం. కుంటలు, చెరువులు, నాలాలు కబ్జాలపాలవడం, చెరువుల్లో నీటి సామర్థ్య నిలువలు తగ్గిపోవడం వంటి కారణాలతో.. చిన్న వర్షానికే కాలనీలు చిత్తడయిపోతున్నాయి. నాలాల ఆక్రమణలను నెలరోజుల్లో తొలగిస్తామని చెప్పిన బల్దియా అధికారులు, వానలు తగ్గిన తర్వాత ఆ మాటే మర్చిపోయారు. కొత్తగా కట్టిన ఫ్లైఓవర్లు, మెట్రో రైల్ నిర్మాణ సమయంలో ఇంజనీరింగ్ సూత్రాలు ఉల్లంఘించడంతో, అక్కడ రోడ్లు ఇంకా నీటికిందనే కనిపిస్తున్నాయి.

కొన్ని దశాబ్దాలుగా నగరం, శివారు ప్రాంతాల్లో జరుగుతున్న ఘటనలకు సర్కారే దోషిగా కనిపిస్తోంది. ఎఫ్‌టిఎల్ పరిథిలో ఇళ్లు నిర్మించడం, కింది ప్రాంతాలకు నీరు ప్రవహించకుండా.. అడ్డంగా అపార్టుమెంట్లు నిర్మించడం వంటి ఉల్లంఘనలకు, అధికారుల అవినీతి- ప్రోత్సాహమే కారణం. అక్రమ నిర్మాణాలు చేస్తున్నప్పుడే కొరడా ఝళిపించకుండా, పూర్తయిన తర్వాత నోటీసులివ్వడం ద్వారా, కబ్జాదారులకు కోర్టులకు వెళ్లే అవకాశం ఇస్తున్నారు. శివారు ప్రాంతాల్లోని చాలామంది టౌన్‌ప్లానింగ్ అధికారులు, కోట్లకు పడగలెత్తడానికి కారణం ఇదే. ఏసీబీకి పట్టుబడే వారిలో, మున్సిపల్-రెవిన్యూ సిబ్బందే ఎక్కువ కనిపిస్తున్నారు. వారికి కార్పొరేటర్లు-నేతల సిఫార్సులూ అంతే కారణం.

చాలాచోట్ల.. అక్రమంగా నిర్మించిన అపార్టుమెంట్లలో ప్రజాప్రతినిధులు, ఒక ఫ్లాట్‌ను బహుమతిగా తీసుకుంటున్నారన్నది నిజం. శివారు ప్రాంతాలు, గ్రేటర్ పరిథిలోని స్థానిక విలేకరులకు, అక్రమ నిర్మాణాలే జీవనాదాయంగా మారిందన్నదీ అంతే నిజం! ఇప్పుడు చాలామంది స్థానిక విలేకరులు, టౌన్‌ప్లానింగ్ సిబ్బంది కంటే ముందే రోడ్డెక్కి, ఈ అక్రమ నిర్మాణాల వ్యవహారాన్ని అనధికారికంగా పర్యవేక్షిస్తున్నారు. యాజమన్యాలు జీతాలివ్వకపోవడమూ దానికి ఒక కారణం.

అసలు ఈ విషయంలో సర్కారే దోషిగా మారింది. హయత్‌నగర్ -2 ఆర్టీసీ డిపో నిర్మాణమే అందుకు నిలువెత్తు నిదర్శనం. కాల్వంచ, సామనగర్ మీదుగా వచ్చే, వరద నీటికి అడ్డంగా ఆ డిపోను కట్టారు. దానివల్ల నష్టమేమిటో ప్రతి భారీ వర్షమే వేలెత్తి చూపిస్తోంది. పాతబస్తీలో ఇమ్లిబన్ బస్టాండ్, మెట్రో కోసం.. ప్రభుత్వమే మూసీ నదిని ఆక్రమించింది. ప్రజలకు బుద్ధులు చెప్పే ప్రభుత్వమే నిబంధనలు ఉల్లంఘిస్తే, ఇక ప్రజలు నిబంధనలు ఎందుకు పాటిస్తారన్నది ప్రశ్న. అసలు ఎఫ్‌టిఎల్ పరిథిలో ఇళ్లు, అపార్టుమెంట్లతోపాటు.. ఏకంగా కాలనీలకు కాలనీలే వెలుస్తుంటే, అధికారులు గుడ్డిగుర్రానికి పళ్లు తోముతున్నారా?

అధికారుల పాపం-నేతల అవినీతి పుణ్యాన, ఇప్పుడు శివారు ప్రాంతాల్లో చెరువుల గట్లను కొట్టడంపై కాలనీల మధ్య యుద్ధం జరిగే పరిస్థితి వచ్చింది. దశాబ్దాల నుంచి నగరం నరకంగా మారుతున్నా.. హైడ్రాలాజికల్ మ్యాప్‌ను సూచించే మాస్టర్‌ప్లాన్ రూపొందించాలన్న తెలివి ఇప్పటివరకూ ఏ పాలకుడికీ లేకపోవడం దురదృష్టం. ఇప్పుడు డబుల్‌బెడ్‌రూములు, అప్పుడు రాజీవ్ ఆవాస్ యోజన వంటి గృహనిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, నిరుపేదలకు ఇచ్చి ఉంటే ఇప్పుడు వారు నాలాలను కబ్జా చేసుకుని గుడిసెలు నిర్మించుకునే వారు కాదు. ప్రభుత్వానికి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ లేకపోవడం జనం ఎదుర్కొంటున్న సమస్యలకు మరో కారణం.

ఇప్పటికయినా నాలాలు, చెరువుల ఆక్రమణపై.. కేసీఆర్ సర్కారు ఉక్కుపాదం మోపితేనే, భవిష్యత్తు తరాలకు భద్రత. దానికి దమ్ము-ధైర్యం-చిత్తశుద్ధి కావాలి. అది కేసీఆర్ సర్కారుకు ఎంతవరకూ ఉందన్నదే ప్రశ్న. గతంలో బెంగళూరు నగరం కూడా, ఇలాంటి సమస్యే ఎదుర్కొంది. అప్పుడు సుప్రీంకోర్టు రంగంలోకి దిగి, చెరువులు-నాలాల కబ్జాలపై కన్నెర్ర చేసింది. ఫలితంగా వాటి ఆక్రమణలను కర్నాటక సర్కారు తొలగించింది. ఆ స్ధాయి ధైర్యం కేసీఆర్ సర్కారుకు ఉంటుదనుకోలేం. కారణం… ప్రస్తుత కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలంతా ఆ పార్టీకి చెందిన వారే. అదీ అసలు విషయం. కబ్జాదారుల్లో తమ పార్టీ వారున్నా సహించేది లేదని కేటీఆర్ హెచ్చరించడం వరకూ బాగానే ఉంది. కానీ అది ఆచరణలోనే కష్టం.

మళ్లీ గ్రేటర్‌లో పాగా వేయాలని టీఆర్‌ఎస్ పరితపిస్తోంది. ఇప్పటికే మంత్రులు,ఎమ్మెల్యేలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లారు. కొత్త హామీల చిట్టా తెరుస్తున్నారు. అందువల్ల ఈ సమయంలో ఆక్రమణలు తొలగిస్తే, బాధితులయిన ప్రజలు సర్కారు పార్టీకి ఓటేయరు. అందుకే పాలకులు చెప్పే కబుర్లన్నీ, నీటిమీద రాతలవుతున్నాయి. అటు జనంలో కూడా.. కారుచౌకగా భూమి లభిస్తే చాలు, అది ఎంత ప్రమాదకర ప్రాంతమయినా ఇల్లు కట్టుకుంటే చాలన్న బలహీనత పోవాలి. ఎఫ్‌టీఎల్ సహా, చెరువుల కింద వెంచర్లు వేస్తున్న రియల్టర్లను, అన్ని రాజకీయ పార్టీలు భుజానికెత్తుకుంటున్నారు. అసలు చాలామంది ప్రజాప్రతినిధులే ఇప్పుడు రియల్టర్లు. ఇప్పుడు పాలకులను నిలదీస్తున్న ఈ రాజకీయ పార్టీలే, ఒకప్పుడు అక్రమార్కుల కొమ్ముకాశారన్నది విస్మరించడమే ఆశ్చర్యం. ఇందుకు ఏ ఒక్క పార్టీ మినహాయింపు కాదు.