తమ్ముళ్లూ…దూసుకుపోండి…

475

టిడిపి సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
పాల్గొన్న 175నియోజకవర్గాల టిడిపి బాధ్యులు, ప్రజాప్రతినిధులు
పోలిట్ బ్యూరో, కేంద్ర కమిటీల ఎంపికపై టిడిపిలో సర్వత్రా హర్షం
చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన టిడిపి కమిటీల సభ్యులు
టిడిపి నూతన కమిటీలకు ఎంపికైనవారికి చంద్రబాబు అభినందనలు

నూతన కమిటీలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగం:

‘‘ కొత్త బాధ్యతలను మరింత చురుగ్గా నిర్వర్తించాలి. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి. పార్టీ శ్రేణులను, కార్యకర్తలను సమన్వయం చేయాలి. వైసిపి బాధిత ప్రజానీకానికి టిడిపి కమిటీలు అండగా ఉండాలి.
ఇవి పదవులు కాదు, బాధ్యతలుగా గుర్తుంచుకోవాలి. ప్రజల పట్ల మీ బాధ్యతలను సమర్ధంగా నిర్వహించాలి.
ఈ రోజు మనం చేసుకునే సంస్థాగత నిర్మాణంతో టిడిపి మరో 30ఏళ్లు ప్రజాదరణ పొందాలి.
టిడిపి పోలిట్ బ్యూరోలో 60% బడుగు బలహీన వర్గాలకే..40% బిసిలకే టిడిపి పోలిట్ బ్యూరోలో సభ్యత్వం.
గతంలో కొన్ని కుటుంబాలకే పరిమితమైన రాజకీయం.. టిడిపి వచ్చాకే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం. సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా గుర్తింపు.
వరద బాధితులను ముఖ్యమంత్రి జగన్, వైసిపి మంత్రులు పట్టించుకోలేదు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా టిడిపి నాయకులు వరద బాధితులకు అండగా ఉన్నారు.
విపత్తు బాధితులను ఎలా ఆదుకోవాలో టిడిపి ప్రభుత్వం చేసిచూపింది. హుద్ హుద్, తిత్లి బాధితులను టిడిపి ప్రభుత్వం ఎలా ఆదుకుంది..? ఇప్పుడీ వరదలు, భారీవర్షాల బాధితులపై వైసిపి నిర్లక్ష్యాన్ని ప్రజలే ప్రశ్నిస్తున్నారు.
గాల్లో ప్రదక్షిణ చేసి చేతులు దులుపుకున్న జగన్మోహన్ రెడ్డి. ఎక్కడికెళ్లినా మంత్రులను చుట్టుముట్టి నిలదీస్తున్న బాధిత ప్రజానీకం.
విపత్తుల్లో వైసిపి ప్రభుత్వం చేతులెత్తేసింది. రూ 500 ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ‘‘ఇల్లు వారం రోజులు మునిగితేనే’’ నిత్యావసరాలు ఇస్తామని అనడం కన్నా దుర్మార్గం ఇంకోటి లేదు.
ఇన్నిరోజులు మునిగితేనే సాయం చేస్తామన్న ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం. ముంపు నష్టానికి, ప్రభుత్వ సాయానికి తూకం వేయడం దారుణం.
ఏడాదిన్నరగా వరుస వరద విపత్తులతో పంటలు దెబ్బతిని రైతులకు తీవ్రనష్టం. జీవనోపాధి కోల్పోయి చేతివృత్తులవారిలో నైరాశ్యం.
టిడిపి అధికారంలోకి వస్తే ఈ పాటికి పోలవరం పూర్తయ్యేది. మరో 10-15ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేవాళ్లం.
పోలవరం పనులు ఎందుకని రద్దు చేశారు..? వాటిని రద్దు చేయకపోతే ఈ పాటికి పూర్తయ్యేది..రాయలసీమ జిల్లాలకు, దుర్భిక్ష ప్రాంతాలకు నీరు ఇచ్చేవాళ్లం. దీనిపై ప్రజలను చైతన్యపర్చాల్సిన బాధ్యత టిడిపి నాయకులదే..
కరోనా నియంత్రణలో విఫలం, వరద నీటి నిర్వహణలో విఫలం, బాధితులకు సహాయ చర్యల్లో విఫలం, రైతులను ఆదుకోవడంలో విఫలం, చేతివృత్తులవారికి అండగా ఉండటంలో విఫలం..‘‘ఇంత విఫల ముఖ్యమంత్రిని రాష్ట్ర చరిత్రలో చూడలేదు’’.
దుర్మార్గుల పాలనలో మంచివాళ్లకు అన్నీ ఇబ్బందులే.. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, ముస్లిం మైనారిటీల భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. బలహీన వర్గాలపై ఈవిధంగా దాడులు, దౌర్జన్యాలు రాష్ట్ర చరిత్రలో చూడలేదు.
6, 7 ఏళ్ల ఆడబిడ్డలపై అత్యాచారాలు అమానుషం. రంపచోడవరంలో, పూతలపట్టులో, విజయవాడలో ఆడబిడ్డలపై కిరాతక చర్యలను ఖండిస్తున్నాం.
చివరికి అంబేద్కర్ విగ్రహాలను కూడా వదలకుండా ధ్వంసం చేస్తున్నారు. దేవుళ్ల విగ్రహాలు, మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా వైసిపి చోద్యం చూస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా రాజోలులో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నాం.
రాష్ట్రంలో వైసిపి ఇసుకాసురుల ఆగడాలు పేట్రేగాయి. అటు ఇసుక దొరక్క, ఇటు పనులు కోల్పోయి, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు. అయినా జగన్మోహన్ రెడ్డిలో మార్పు లేదు.
రాజధాని శంకుస్థాపన జరిపి 5ఏళ్లు అయ్యింది, అమరావతి పరిరక్షణ ఉద్యమం ప్రారంభమై 300రోజులు దాటింది, మరో 50రోజుల్లో ఏడాది అవుతోంది. రైతులు,మహిళలు, రైతుకూలీల ఉసురు తీస్తున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత పోరాడితే ప్రజల్లో అంత ఆదరణ పెరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి నాయకుడు ప్రజల్లో ఆదరణ పొందాలి.
భేషజాలకు పోవడం నాయకత్వ లక్షణం కాదు, ప్రజాసేవలో భేషజాలకు తావులేదు. అందరితో సమన్వయం చేసుకోవాలి, రెట్టింపు స్ఫూర్తితో ముందుకు సాగాలి.
మనం చేసిన మంచిపనులు ఇప్పుడు గుర్తొస్తాయి. వైసిపి చెడ్డపనులతో, టిడిపి మంచి పనులను బేరీజు వేస్తున్నారు.
టిడిపి ప్రభుత్వం మరో 5ఏళ్లు ఉంటే రాష్ట్రంలో అభివృద్ది పనులన్నీ ఒక కొలిక్కివచ్చేవి. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, ఇతర ప్రాజెక్టుల పనులన్నీ చాలావరకు పూర్తయ్యేవి.
నిర్మాణాలన్నీ సగంలో ఉండగా ప్రభుత్వం మారడం పనులన్నింటికీ ప్రతిబంధకం అయ్యింది. ఒక పార్టీపై అక్కసుతో, పనులను నిలిపేసిన ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదు.
వరదల్లో మునిగిపోయిన ఇళ్లస్థలాలను టిడిపి నాయకులు సందర్శించాలి. భూసేకరణలో వైసిపి అవినీతిని బట్టబయలు చేయాలి.
బిసి,ఎస్సీ,ఎస్టీ మైనారిటిలపై దాడులు-దౌర్జన్యాలను నిరసించాలి. వైసిపి బాధిత ప్రజలకు అండగా ఉండాలని’’ టిడిపి నూతన కమిటీలకు, పార్టీ నాయకులు, శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

అచ్చెన్నాయుడు(ఏపి టిడిపి అధ్యక్షులు): రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు.
ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో నాపై గురుతర బాధ్యత పెట్టారు. ఈ బాధ్యతను ఒక సవాల్ గా తీసుకుంటున్నాను. నాపై ఉంచిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను.
పార్టీ ఆవిర్భావం నుంచి మా కుటుంబం పార్టీ అభివృద్దికి, పేదల సంక్షేమానికి కృషి చేశాం. ఎర్రంనాయుడిని మరిపించేలా పని చేస్తాం, శక్తివంచన లేకుండా పార్టీ బలోపేతానికి పాటుబడతాం.
వైసిపి పాలనలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అప్రదిష్ట పాలైంది. 16నెలల్లోనే వైసిపి పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వైసిపికి తగిన గుణపాఠం ప్రజలే చెబుతారు.
నేనేమీ తప్పు చేయలేదు, తప్పు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. అలాంటి నాపై జగన్మోహన్ రెడ్డి కత్తికట్టాడు. నేను భయపడే వ్యక్తిని కాను.
అధికారంలో ఉన్నప్పటి కన్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీ నాయకుల బాధ్యత రెట్టింపు. పార్టీ ఇచ్చిన బాధ్యతకు 100% న్యాయం చేస్తాం.

కళా వెంకట్రావు(పోలిట్ బ్యూరో నూతన సభ్యులు): పార్టీ అధ్యక్షునిగా 2 టర్మ్ లు పనిచేసే అవకాశం కల్పించారు. సహకరించిన పార్టీ నాయకులు, శ్రేణులకు ధన్యవాదాలు. ఎన్టీఆర్ దగ్గర, చంద్రబాబు వద్ద, ప్రస్తుతం లోకేష్ లాంటి యువకులతో కలిసి పనిచేయడం అరుదైన అవకాశం. ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్టీ అధ్యక్షునిగా సేవలు అందించే అవకాశం పార్టీ కల్పించింది. పోలిట్ బ్యూరో సభ్యునిగా నియమించినందుకు కృతజ్ఞతలు.

ఆలపాటి రాజేంద్ర ప్రసాద్(గుంటూరు జిల్లా): ధాన్యం కొనుగోళ్లలో వైసిపి అక్రమాలు.. చివరికి గింజల కొనుగోళ్లలోనూ కక్కుర్తి హేయం. అటు కొన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వరు, ఇటు నీట మునిగిన ధాన్యం కొనరు, నష్ట పరిహారం ఇవ్వరు, రైతులను అన్నివిధాలా వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్లాక్ మెయిలింగ్ లో, డైవర్షన్ పాలిటిక్స్ లో జగన్ నిష్ణాతుడు. న్యాయ వ్యవస్థపై బురద జల్లడం కన్నా దుర్మార్గం ఇంకోటి లేదు.

జ్యోతుల నెహ్రూ( తూర్పుగోదావరి): గాల్లో జగన్ తిరుగుతుంటే, లోకేష్ జనంలో తిరుగుతున్నారు. భారీవర్షాల బాధితులను వైసిపి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే టిడిపి అండగా ఉంటోందని ప్రజలే అంటున్నారు.

పుట్టా సుధాకర్ యాదవ్(మైదుకూరు): మైదుకూరు వైసిపి ఎమ్మెల్యే 100ఎకరాల అటవీ భూముల కబ్జాపై నేషనల్ ట్రిబ్యునల్ స్పదించింది. వివరాలతో నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్రమ మైనింగ్ చేస్తున్నా వైసిపి ప్రభుత్వం చోద్యం చూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత వల్లే కోర్టులు జోక్యం చేసుకుని ప్రజాధనం కాపాడాల్సివస్తోంది, బాధితులకు అండగా ఉంటోంది.

కొండబాబు(మాజీ ఎమ్మెల్యే): పరిపాలనలో తాను విఫలమై, ఆ వైఫల్యాలను టిడిపిపైకి తోయాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు. తన వైఫల్యాలను టిడిపికి అంటగట్టాలనే పన్నాగాలు వేస్తున్నారు.
కాకినాడకు రక్షణ కవచం మడ అడవులు. వాటి నరికివేత వల్లే ఇప్పుడు సముద్రపు నీరు పల్లపు భూములను ముంచేసింది. ఆ రోజు టిడిపి హెచ్చరించినా లెక్కపెట్టలేదు. ఇళ్లస్థలాలకు భూసేకరణ పేరుతో మడ అడవుల నరికివేతకు తెగబడ్డారు. ఇళ్లస్థలాలు ఇవ్వకుండా టిడిపి అడ్డుకుంటోందని వైసిపి దుష్ప్రచారం చేయడం దివాలాకోరుతనం. వైసిపి చేతగానితనాన్ని కప్పిపెట్టేందుకే టిడిపిపై విమర్శలు.

నక్కా ఆనంద్ బాబు(మాజీ మంత్రి): అప్పుడు ప్రతిపక్షంలో టిడిపి పాత్ర కంటె ఇప్పుడు ప్రతిపక్షంలో టిడిపి భూమిక కీలకం. టిడిపి 15ఏళ్లు ప్రతిపక్షంలో ఎదురైన దాడుల కంటె, ఈ 15నెలల్లో వైసిపి ఘాతుకాలు అత్యధికం. భయపడటం అనేది టిడిపి నిఘంటువులో లేదు. వైసిపిపై రాజీలేని పోరాటం చేస్తాం, బాధిత ప్రజలకు అండగా ఉంటాం.

వర్ల రామయ్య(పోలిట్ బ్యూరో మెంబర్): గతంలో కన్నా బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. 60% పదవులు బిసి,ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటీలకే కేటాయించారు. రెండు ప్రధాన కమిటిల్లో స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తాను.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి(ఎమ్మెల్యే): పార్టీని ముందుకు నడిపించడానికి నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. బడుగు బలహీనవర్గాలకు అండగా ఉంటాం.
వరద ముంపు నివారణపై, జలాశయాల్లో నీటి నిర్వహణపై సిఎం జగన్మోహన్ రెడ్డికి సరైన ప్లానింగ్ లేదు. గత ఏడాది ముంపు పరిహారం ఇంతవరకు అందించలేదు. ఇప్పుడు ప్రకటించిన రూ500 కూడా ఎందుకూ కొరగానిది.
సేకరించిన భూముల్లో 60% ఇళ్లస్థలాలకు పనికి రానివి. వైసిపి తప్పుడు విధానాలను, రాష్ట్ర ప్రభుత్వ దుశ్చర్యలను ప్రజలే ఖండిస్తున్నారు.

కొల్లు రవీంద్ర(మాజీ మంత్రి): బిసిల పార్టీగా మరోసారి టిడిపి రుజువైంది. టిడిపి సామాజిక న్యాయాన్ని ఈ కమిటిలు ప్రతిబింబించాయి. 60%-70% పదవులు బిసి,ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటీలకే కేటాయించారు.
139కులాలకు కార్పోరేషన్లు పెడతానని జగన్మోహన్ రెడ్డి నమ్మించి, 56కులాలకే పరిమితం చేయడం బిసిలకు నమ్మక ద్రోహం. ‘‘ఇచ్చింది తక్కువ, ప్రచారం ఎక్కువ’’ చేస్తున్నారు.

అయ్యన్నపాత్రుడు(మాజీమంత్రి): ఏ పని చేసినా తన సొంత లాభాలే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యం. రాజకీయాలను ప్రజాసేవగా టిడిపి భావిస్తే, రాజకీయాన్ని కక్ష సాధింపు వేదికగా మార్చింది వైసిపి. బిసిల్లో చీలికలు తెచ్చి రాజకీయ లాభం పొందాలని జగన్ చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించి 16వేలమంది బీసిల పదవులు పోగొట్టారు, ఇప్పుడేదో 750మందికి పదవులు ఇచ్చానని గొప్పలు చెప్పడం జగన్మోసం.

రెడ్డివారి శ్రీనివాస రెడ్డి(కడప): జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అరాచక పాలన ప్రారంభమైంది. పేదల సంక్షేమం కోసం టిడిపి పనిచేస్తే, పేదలను పీడించడమే లక్ష్యంగా వైసిపి పెట్టుకుంది. వైసిపి అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం.

సంధ్యారాణి(విజయనగరం ఎమ్మెల్సీ): గిరిజన మహిళకు టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు. గిరిజన సంక్షేమాన్ని వైసిపి పూర్తిగా విస్మరించింది. గిరిజనుల విద్య, గిరిజనులకు వైద్యం పూర్తిగా పడకేశాయి. గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపడం కిరాతక చర్య.
రాజధాని రైతులకు వ్యతిరేకంగా కోర్టులలో వాదనలకు కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసిన వైసిపి ప్రభుత్వానికి, జీవో 3 ద్వారా గిరిజనుల ప్రయోజనాలను కాపాడేందుకు చేతులు రాకపోవడం గర్హనీయం.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో టిడిపి క్రమశిక్షణా సంఘం నూతన అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, విశాఖ ఎమ్మెల్యే గణబాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, రామాంజనేయులు, కొమ్మారెడ్డి పట్టాభి, జివి ఆంజనేయులు తదితరులు ప్రసంగించారు.

1 COMMENT