బీజేపీ… భలే భలే!

273

‘సస్పెండ్ల సోము’గా మారిన వీర్రాజు
తాజాగా లంకా దినకర్‌పై వేటు
ప్రశాంత్‌భూషణ్‌ను సమర్ధించిన విష్ణువర్దన్‌రెడ్డి
మరి సత్యపైనా వేటు వేస్తారా?
          ( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

బీజేపీ ఏపీ దళపతి సోము వీర్రాజు చాలా బిజీగా ఉన్నారట. ఎందుకు? ఏపీలో వరద సాయంలో జగన్ సర్కారు వైఫల్యం, టీటీడీలో గోల్డ్ వ్యవహారం, జస్టిస్ రమణ అంశంపై పార్టీ విధానంపై, కసరత్తు చేసే పనిలో బిజీగా ఉన్నారనుకుంటున్నారా? అబ్బే.. పార్టీలో ఇంకా ఎంతమందిని సస్పెండ్ చేయాలన్న జాబితాపై, కసరత్తు చేసే పనిలో బిజీగా ఉన్నారు. నిజం. ఇదంతా ఏదో ఉత్తుత్తిగా చెబుతున్న మాట కాదు. లంకా దినకర్‌పై వేటు తర్వాత పార్టీలో అందరికీ తెలిసిపోయిన రహస్యమిది!

ఏ పార్టీకయినా కొత్త అధ్యక్షుడు వస్తే, చేరికలు భారీ స్థాయిలో ఉంటాయి. కానీ, ఆంధ్రా బీజేపీలో పరిస్థితి అందుకు రివర్సు. పార్టీ విస్తరణ పట్ల నిబద్ధత, ‘వైసీపీపై తీవ్ర వ్యతిరేకత’, ‘టీడీపీపై  ప్రేమ’ ఉన్న సోము వీర్రాజు జమానాలో మాత్రం.. సస్పెన్షన్ల పర్వం విజయవంతంగా కొనసాగుతూ, వచ్చే వారి కంటే పార్టీ నుంచి పోయేవారి సంఖ్య కొండవీటి చాంతాడులా పెరిగిపోతుండటమే విశేషం.  ఓ.వి.రమణ అనే సీనియర్ నాయకుడితో మొదలయిన ఈ సస్పెండ్ల పర్వం.. రాజధానిలో పార్టీకి సొంత భూమిచ్చిన వెగలపూడి గోపాలకృష్ణ నుంచి,  ఇప్పుడు లంకా దినకర్ వరకూ కొనసాగుతోంది.  దీనితో పార్టీ వర్గాలుతమ నాయకుడిని  ‘సస్పెన్షన్ల సోము’ అని పిలుచుకుంటున్నారట.

పాపం.. జాతీయ స్థాయిలో పార్టీ విధానాలను సమర్ధిస్తూ గళం విప్పే, సీనియర్ నేత పురిఘళ్ళ రఘురాం ఒక్కరే ఈ వేటు నుంచి తప్పించుకున్నారు. సునీల్ దియోధర్ కూడా కన్నా హయాంలో.. పురిఘళ్ల రఘరాం, లంకా దినకర్‌పై వేటు వేయాలని ఒత్తిడి చేసినా, కన్నా పుణ్యాన అప్పట్లో అది సాధ్యం కాలేదు. అప్పటికీ, లంకా దినకర్‌కు షోకాజు ఇచ్చారు. కానీ, ఇప్పుడు ‘వైసీపీ వ్యతిరేక’ విధానాలు అవలంబిస్తున్న సోము నాయకత్వంవచ్చింది. దానితో సస్పెన్షన్ కత్తికి బాగా పదనుపట్టి, ఓ అరడజను మందిపై కస కసా వేటేశారు. అదన్నమాట సంగతి!

ఏపీ బీజేపీలో క్రమశిక్షణా రాహిత్యం బాగా పెరిగిందట. ఎవరు పడితే వాళ్లు మీడియాకెక్కి ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారట. ప్రకటనలు ఇచ్చేస్తున్నారట. వ్యాసాలు రాసేస్తున్నారట.  అది పార్టీ ప్రయోజనాలకు భంగకరమట. అందుకే అప్పుడు ఓ.వి. రమణ-ఇప్పుడు లంకా దినకర్‌పై వేటేశారు. మధ్యలో కావలి బీజేపీ మహిళా నేతపైనా సస్పెన్షన్ విధించారు. నిజానికి పాపం రమణ అనే నాయకుడు, అమరావతి అంశంపై పత్రికలో రాసిన వ్యాసంలో కొత్త ప్రస్తావన ఏమీ లేదు.  అంతకుముందు కన్నా, జీవీఎల్, సునీల్‌దియోధర్, సత్య మాట్లాడినవే. కానీ సోముకు అవి పార్టీ వ్యతిరేకంగానే కనిపించాయి.

‘అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న’ అన్నట్లు.. రమణ కూడా ఇదే ్రపశ్న వేసి, తనతోపాటు అమరావతిపై మాట్లాడిన వారందరినీ సస్పెండ్ చేయమని సవాల్ విసిరారు. మరో నాయకుడు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్, పాపం తన భూమిని పార్టీ ఆఫీసు నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఆయన ఓ సందర్భంలో అందరినీ నమ్మినందుకు తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు. అది కూడా సోము దృష్టిలో నేరంగా కనిపించింది. దానితో వీర్రాజు బౌలింగ్‌లో,  ఆయన  రెండవ వికెట్‌గా బౌల్డయ్యారు. కానీ విచిత్రంగా.. ఆయన ఇచ్చిన భూమి మాత్రం తీసుకుని, వెలగపూడిని మాత్రం గెంటేశారు.

ఇప్పుడు దినకర్ వికెట్ కూడా ఎగిరిపోయింది. సోము వీర్రాజు బౌలింగ్‌లో, దినకర్ కొట్టిన బంతిని  విష్ణువర్దన్‌రెడ్డి క్యాచ్ పట్టి, అవుట్ చేశారు. లంకా దినకర్ అనే వ్యక్తి చార్టెడ్ అకౌంటెంట్ మాత్రమే కాదు. మంచి వక్త కూడా. ఆర్ధిక-రాజకీయ అంశాలపై ఆయన చేసే విశ్లేషణల కోసమే, జాతీయ మీడియా ఆయనను ఎంచుకుంటుంది. వీర్రాజు అండ్ కోకు… దినకర్ ఎవరో తెలియకపోయినా, జాతీయ చానెళ్లు చూసే వారికి లంకా దినకర్ విజ్ఞానమేమిటన్నది  తెలుసు. కానీ, జాతీయ మీడియా కంటే,  సోము ఎక్కువ  విజ్ఞానవంతులు కాబట్టే, ఆయన సస్పెన్షన్ వేటు వేసినట్లు కనిపిస్తోంది.సరే.. పార్టీ వ్యతిరేక చర్యలంటే గుర్తుకొచ్చింది. మొన్నమధ్య వైసీపీ అధికార మీడియా సాక్షి చానెల్‌లో,  జస్టిస్ రమణ వ్యవహారంపై చర్చ పెట్టారు. అందులో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైసీపీని ‘మనసారా’,  ‘తీవ్రంగా వ్యతిరేకించే’ విష్ణువర్దన్‌రెడ్డి.. లాయర్ ప్రశాంత్‌భూషణ్‌ వ్యాఖ్యలను సమర్ధించారు. ఒక వ్యక్తి సిఫార్సు చేసే వ్యక్తులు జడ్జిలు ఎలా అవుతారని ప్రశ్నించారు. మరి ఆ ప్రకారంగా.. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఏ సీఎంలు, ఇప్పటివరకూ  ఎవరినీ జడ్జిలుగా ఎంపిక చేయడం లేదు కామోసు! సుప్రీంకోర్టు ఆదేశాలతో,  ఒక రూపాయి జరిమానా కట్టిన ప్రశాంత్‌భూషణ్‌ అనే న్యాయవాది, బీజేపీ సర్కారుపై ఒంటికాలితో లేస్తుంటారు. ఆయన బీజేపీ వ్యతిరేకి అన్నది రహస్యమేమీ కాదు. మరి అలాంటి వ్యక్తిని, జగనన్న కోసం..  విష్ణన్న సమర్థించడం,  పార్టీ విధానాలకు అనుకూలమా? వ్యతిరేకమా? వీర్రాజే చెప్పాలి.

అంతేనా? టీడీపీ సర్కారులో ‘రేరా’ పదవి అనుభవించి, బీజేపీలో చేరిన చందు సాంబశివరావు అనే మరో మేధావి.. కులాలు-మతాల విషయంలో తాను జగన్, రాజశేఖర్‌రెడ్డికి క్రెడిట్ ఇస్తున్నట్లు సెలవిచ్చారు. మరి వైసీపీ సర్కారును అభినందించడం కూడా పార్టీ వ్యతిరేక విధానమయిట్లయితే, ఆయనపైనా వేటు వేయకుండా ఎందుకున్నారో కూడా,  ‘ఇద్దరు మేధావులే’ సెలవివ్వాలి. కొత్త కమిటీలో వేసిన అధికార ప్రతినిధులెంత విజ్ఞానవంతులో, ఎంత విషయపరిజ్ఞానం ఉన్నవారో చెప్పడానికి.. తిరుమల అంశంపై టీవీ5లో జరిగిన ఒక్క చర్చ చాలు.

సోమనాధ్ ఆలయం ఎక్కడ ఉందన్న కాంగ్రెస్ నేత ప్రశ్నకు, చర్చలో పాల్గొన్న బీజేపీ మహిళా నేత నుంచి పాపం జవాబు లేదు. ఇలాంటి మేధావులు, బుద్ధిజీవుల తెలివితేటలు చూసి టీవీ ప్రేక్షకులు కూడా మురిసిముక్కలవుతున్నారట. ఇలాంటి ఆణిముత్యాలను ఏరికోరి తెచ్చుకున్న కమలదళాలను మెచ్చుకోవలసిందే.

ఓకే.. ఓవి రమణ, వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్, లంకా దినకర్లు పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడ్డారు. కాబట్టి సస్పెండ్ చేశారు. బాగానే ఉంది. మరి పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తాజాగా రాసిన వ్యాసం సంగతేమిటి? అందులో ఆయన వైసీపీ విధానాలను తూర్పాపట్టారు కదా? జడ్జిలపై జగన్ పార్టీ నేతల దాడిని కడిగేశారు కదా? జగన్ సర్కారు, ఒక కులంపై దాడి చేస్తోందని విరుచుకుపడ్డారు కదా? మరి ఆయన రమణ, దినకర్ మాదిరిగా.. సోము వీర్రాజు అండ్ విష్ణువర్దన్‌రెడ్డి పర్మిషను తీసుకునే ఆంధ్రజ్యోతికి వ్యాసం రాశారా? ఒకవేళ అలా పర్మిషన్ తీసుకోకపోతే, మరి సత్యకుమార్‌నూ సస్పెండ్ చేయాలి కదా? సోముకు మరి అంత ధైర్యం ఉందా? అన్నది ఇప్పుడు కమలదళాల ప్రశ్న.కన్నా హయాంలో టీడీపీ నుంచి చేరిన వారంతా,  ఆ పార్టీ కోవర్టులేనన్నది ఇప్పటి నాయకత్వం అనుమానం. ఆవిధంగా టీవీ చర్చల్లో పాల్గొనే వారందరినీ తప్పించారట. టీడీపీ అనుమానితుల జాబితాను ముందు పెట్టుకుని, ఒక్కోరిపై ఇలా వేటు వేస్తూ పోతారట. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న చర్చ ఇది. ఆ ప్రకారంగా మరి సుజనాచౌదరితోపాటు చేరిన ముగ్గురు ఎంపీలు, మాజీ మంత్రులపైనా ఇలాగే పొమ్మనకుండా పొగబెడతారేమోనన్నది, ఇప్పుడు పార్టీలో వినిపిస్తున్న గుసగుస. మరి.. సునీల్‌దియోధర్, సంఘటనా కార్యదర్శి మధుకర్‌రెడ్డిజీ వంటి మార్గదర్శకుల జమానాలో ఏదైనా సాధ్యమేనేమో?!