‘కమలవనం’లో చేరిన కొత్త పుష్పం!

586

ఖుష్బూ రాకతో హిందుత్వ పవిత్రత పెరిగిందా?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

నజత్‌ఖాన్ బీజేపీలో చేరారు. ఆమెకు ఆ పార్టీ అగ్రనేతలు కండువా కప్పి, విశాల హిందూ సంస్కృతీ-సంప్రదాయ పరిమళం  వెదజల్లే  ‘కమలవనం’లో ఆహ్వానించారు. ఎవరో నజత్‌ఖాన్ పార్టీలో చేరితే ఏందిట? ఇంకా కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే.. ‘ అయితే ఇప్పుడేం జేద్దామంటవ్ మరి’? అని వ్యంగ్యంగా అడగనూవచ్చు. నిజమే. ఏ నజత్‌ఖానో, ముమైత్‌ఖానో పార్టీలో చేరితే దానికింత ఉపోద్ఘాతం ఎందుకన్న అనుమానం, బుద్ధిజీవులకు రావచ్చు. కానీ చేరింది అగ్రనటి ఖుష్బూ కాబట్టి, ఆ మాత్రం ఉపోద్ఘాతం ఇవ్వక తప్పదు. అసలు నజత్‌ఖాన్ ఉరఫ్ ఖుష్బూ బీజేపీలో చేరితే మీకెందుకు అంత కడుపుమంట అని ప్రశ్నించవచ్చు. ఖుష్బూ బీజేపీలో చేరితే హిందుత్వ సిద్ధాంత బలం పెరిగిందని, ఏకంగా పార్టీనే పవిత్రమయిపోయిందని సంతోషించక, అదేదో హిందూత్వ సిద్ధాంతం మైలపడిందన్న ఆ గావుకేకలేమిటని నిలదీయవచ్చు. తప్పులేదు. ఎవరి దృష్టి కోణం వారిది!

అవును. నిజమే. మామూలు నజత్‌ఖాన్..  అదే ఖుష్బూ బీజేపీలో చేరితే, ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఎందుకంటే దేశంలో చాలామంది ముస్లిములు, ఆ పార్టీలో చేరుతున్నారు కాబట్టి! మరి మన నజత్‌ఖాన్ గురించే ఎందుకింత గొడవ చేస్తున్నారన్న ప్రశ్నలు సహజంగానే ఉదయిస్తాయి. అందుకు కారణాలు వివరించడం అవి తెలిసిన వారి ధర్మం!  ముందే చెప్పినట్లు.. మన నజత్‌ఖాన్ అందరిలాంటి మహిళ కాదు. అదేదో సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పినట్లు ‘సింహం గడ్డం గీసుకోదు. నేను గడ్డం గీసుకుంటా. మిగతాదంతా సేమ్ టు సేమ్’ వంటి పవర్‌ఫుల్ లేడీ ఆమె. ‘అంత లావు’ మహిళా నాయకురాలు  చేరితే..  బీజేపీ ఏదో అపవిత్రమవుతుందన్నట్లు, హిందుత్వవాదులు చేస్తున్న గోల వెనుక కారణమేమిటో చూడాలి కదా? మరి ఆ ముచ్చట కూడా వినేద్దాం.

ఇప్పుడు కమలతీర్థం తీసుకున్న ఖుష్బూ.. ఒకప్పుడు డిఎంకె నుంచి బయటకువచ్చి, అలా కాంగ్రెస్ వీధిలో నడుచుకుంటూ, ఇప్పుడు ‘కమల విహార్’ ముందు నిలిచింది. ఒకప్పుడు ఆమె బీజేపీని దూదేకినట్లు ఏకేశారు. అదన్న మాట సంగతి!  మీకు తెలుసు కదా.. బీజేపీ అంటే హిందూత్వకు, ఇంకా భారతీయ సంస్కృతీ సంప్రదాయానికి  పూర్తి హక్కుదారు! కాకపోతే మనం కొనే వస్తువుల ‘షరతులు వర్తిస్తాయి’ అన్న మాట మాత్రం ఆ పార్టీలో ఎక్కడా ఉండదు. ఏది తనకు అవసరం అనుకుంటే, ఆ రకంగా ముందుకు వెళుతున్నందన్నమాట! అలాంటి ఖుష్బూ అనే పెరియార్ వారసురాలయిన, ఈ  విప్లవ నారీమణి చివరాఖరకు మన ప్రధాని నరేంద్రుడినీ విడిచిపెట్టలేదు.

మోదీ గారు కూడా తెలుసుకదా? భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు పరిరక్షించేందుకే, కళ్లు తెరచిన కమలం పార్టీకి పెట్టనికోట. అలాంటి మోదీ మొన్నామధ్య, అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణ శంకుస్థాపనకు వెళ్లారు. దానిని వామపక్షాలు ఆక్షేపించాయి. సరే వామపక్షీయులంటే నిఖార్సయిన సెక్యులరిస్టులు కాబట్టి, వారికి ఒక మతంపై.. ప్రత్యేకించి హిందూమతంపై కొంచెం ‘ఎక్కువ అభిమానం’ కాబట్టి, వారు ఆవిధంగా ఆక్షేపించడంలో పెద్ద వింతేమీ లేదు.

కానీ, వారిని మించి… మన ఖుష్బూ, అదే మన నజత్‌ఖాన్ మాత్రం,  మోదీగారి అయోధ్య సందర్శనపై ఒక టన్ను వ్యంగ్యాస్త్రాన్ని ట్వీటారు. ‘వావ్.. ఇప్పుడు దేవుడైన రాముడి కంటే, మోదీ పెద్దవాడయ్యాడన్నమాట. కలియుగం మరి’ అని బోలెండంత వ్యంగ్యాన్ని కుమ్మరించారు. అంతకముందు.. తమిళనాట బీజేపీ, దొడ్డిదారిన అధికారం హస్తగతం చేసుకోవాలన్న కల కలగానే మిగిలిపోతుందని, ఇదే ఖుష్బూ జోస్యం చెప్పారు. ఓసారి ఉత్తరాది నటులంతా మోదీని కలిశారు. అప్పుడు ఈ నాయకీమణి తమిళులు గుర్తుకురాలేదా అని అవహేళన చేశారు. ఇక మోదీ అండ్ అమిత్‌షా నానా కష్టాలు పడి, ప్రాంతీయ పార్టీలను ప్రసన్నం చేసుకుని మరీ పాస్ చేయించిన, పౌరసత్వ బిల్లుపైనా ఈ నజత్‌ఖాన్ చెలరేగిపోయారు. తమిళ బీజేపీ నేత రాజాపై కత్తులుదూశారు. బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోందని విరుచుకుపడ్డారు.


ఖుష్బూ అక్కయ్య చేసిన అన్నేసి దూషణలను మర్చిపోయి, సాదరంగా తన ‘కమలవనం’లోకి ఆహ్వానించిన బీజేపీ విశాల హృదయానికి జోహారులర్పించాల్సిందే. డిఎంకె నుంచి కాంగ్రెస్‌లో చేరిన  ఇదే కుష్బూ.. ఇప్పుడు నా సొంత ఇంటికి వచ్చినట్టుందని సంతోషపడ్డారు. నిజమే. సదరు నజత్‌ఖాన్ ఆ ప్రకారం,  సొంతిల్లయిన కాంగ్రెస్ నుంచి, ఇప్పుడు బీజేపీ అనే అద్దె ఇంటికి చేరారన్న మాట. అది వేరే విషయం. బాగానే ఉంది. కానీ, భారతీయ సంస్కృతి, వైవాహిక వ్యవస్థ, మహిళల వేషధారణపై తనకంటూ కొన్ని సిద్ధాంతాలున్న భాజపా-దాని మూలవిరాట్టయిన సంఘ్.. ఇప్పుడు ఖూష్బూ తమ పార్టీలో చేరినందున, ఆ సిద్ధాంతాలు  మార్చుకుంటాయా? లేక ఖుష్బూ నమ్మిన పెరియార్ సిద్ధాంతాన్నే మార్చుకోమని చెబుతాయా? అన్నదే ప్రశ్న. అంటే.. పెళ్లి కాకపోయినా మహిళలు గర్భం దాల్చవచ్చని ప్రవచించిన ఖుష్బూ సిద్ధాంతాన్ని, ఆమెను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కమలదళాలు అంగీకరించినట్టే కదా?  రేపు బీజేపీ గళధారులకు, ఏ మీడియానో ఇదే ప్రశ్న వేస్తే ఏం జవాబిస్తారన్నదే ఆసక్తికరం!

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడమే తమ ఊపిరిగా పనిచేస్తున్న సంఘ్‌పరివారంలో , బీజేపీ  ఒక సభ్యురాలు.   ఇప్పుడు అదే సంస్కృతీ సంప్రదాయ విలువల వస్త్రాపహరణం చేసిన.. కుష్బూ అనే మహా సంస్కరణవాదికి, బీజేపీ మోతుబరులు కండువా కప్పి రెడ్‌కార్పెట్ వేయడమే హాశ్చర్యం. బాలికలు యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి కాకుండానే, తమకు నచ్చిన వారితో కలసి ఉంటూ గర్భం దాల్చినా తప్పులేదని వాదించిన ఈ విప్లవ పుష్పం..ఇప్పుడు ‘కమలవనం’లో చేరింది. కాబట్టి ఇక ఆ ‘కమలవనం’, సంప్రదాయబద్ధంగా శోభిల్లడం ఖాయం!

అంతేనా? మహిళలు పొట్టి దుస్తులు వేసుకోవచ్చని, సంప్రదాయం-సంస్కృతి అనే పాతచింతకాయ కబుర్లు చెప్పి, మహిళల స్వాతంత్య్రాన్ని హరించవద్దన్న నజత్‌ఖాన్ ఇప్పుడు ‘కమలవనం’లో చేరినందున.. బహుశా భాజపా కూడా తన సిద్ధాంతాన్ని మార్చుకోవాలనే,  కొత్త విప్లవాన్ని తీసుకువచ్చినా ఆశ్చర్యం లేదు. హిందుత్వవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించే పెరియార్ వారసురాలినని సగర్వంగా ప్రకటించుకున్న ఖుష్బూ చేరికతో.. తమిళనాట అధికారం చేపట్టాలన్న కల నెరవేరటం సంగతి ఎలా ఉన్నా.. భారతీయ సంస్కృతి-సంప్రదాయాలకు బీజేపీ ఒక్కటే పెద్ద పీట వేస్తుందని భావిస్తున్న వారి భ్రమలు పటాపంచలు చేసి, తానూ ‘ఆ తానుముక్కనే’నని ముసుగుతీసి నిరూపించుకున్న భాజపా రాజకీయాన్ని అభినందించాల్సిందే. అయినా… ముంతాజ్‌మాస్మా ఖాటూన్.. ఉరఫ్ మమతాబెనర్జీకి సంకీర్ణ సర్కారులో కొలువిచ్చినప్పుడు లేని మొహమాటం, ఇప్పుడు తమిళ నజత్‌ఖాన్‌ను పార్టీలో చేర్చుకున్నప్పుడు ఎందుకంట? మరి అంతేగా.. అంతేగా?!

కొసమెరుపు: భాజపా సిద్ధాంతాలంటే వల్లమాలిన గౌరవం-నమ్మకం  ఉన్న,  ఓ తెలుగు మహిళా పారిశ్రామికవేత్త.. ఖుష్బూ బీజేపీలో చేరిక తర్వాత వ్యక్తం చేసిన సందేహాలు, అవసరాలకు అనుగుణంగా మార్చుకునే ఆ పార్టీ సిద్ధాంతాలు- రాజకీయావసరాలపై వ్యక్తీకరించిన ఏహ్యభావమే  ఈ కథనానికి స్ఫూర్తి. అందుకే ఈ కథనం ఆమెకే అంకితం.