(అనిల్)
-అన్నివర్గాలకు టిడిపి పొలిట్‌బ్యూరో, కేంద్రకమిటీల్లో స్థానం
-సమీకరణాల సమతుల్యంతో తెలుగుదేశంలో నూతనోత్తేజం
అపరచాణుక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబు.. తన 40 ఏళ్ల రాజకీయానుభవాన్ని రంగరించి మరీ తెలుగుదేశం పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ కార్యవర్గాలను ఎంపిక చేశారు. టిడిపి కేంద్ర కమిటీలో 27 మందిలో బీసీ,ఎస్టీ,ఎస్సీ, మైనారిటీలు 49 శాతం, ఓసీలు 51 శాతం వుండేలా నియామకాలు జరిపారు. కేంద్ర కమిటీలోకి తీసుకున్న ఏడుగురు బీసీలలో ఒకరు పోలినాటి వెలమ, యాదవ ఇద్దరు, నాయీబ్రాహ్మణ ఒకరు, ముదలియార్ ఒకరు, పద్మశాలీ ఒకరు, ముదిరాజ్ ఒకరు, మాల ఒకరు, మాదిగ నుంచి ఒకరు, ఎస్టీ(కోయ) ఒకరు, ఇద్దరు మైనారిటీలకు కేంద్రకమిటీలో స్థానం కల్పించారు.
ఓసీలకొచ్చేసరికి కాపు 3, వైశ్య 1, కమ్మ 5, రెడ్డి 4 (ఇద్దరు ఏపీ, ఇద్దరు తెలంగాణ) , బ్రాహ్మణ ఒకరికి కేంద్ర కమిటీలో అవకాశం కల్పించారు. తెలుగుదేశం పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పొలిట్ బ్యూరోలో కూడా సమర్థులైన అన్నివర్గాల వారినీ తీసుకున్న చంద్రబాబు తన రాజకీయ చాణక్యాన్ని మరోమారు ప్రదర్శించారు. అన్ని సామాజికవర్గాలు, మతాలు, ప్రాంతాలకు సమప్రాధాన్యం కల్పించేందుకు వీలుగా పార్టీ విభాగాల పునర్ నిర్మాణంలో భాగంగా పొలిట్ బ్యూరోని 12 మంది నుంచి 22 మందికి విస్తరించారు. 22 మందికి ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకుని 25 మంది వుంటారు.
మొత్తం 25 మంది పొలిట్ బ్యూరో సభ్యుల్లో 60 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలున్నాయి. పది మంది బీసీ పొలిట్ బ్యూరో సభ్యులలో గౌడ ఇద్దరు, కొప్పల వెలమ ఇద్దరు, యాదవ ఒకరు, బోయ ఒకరు, శెట్టి బలిజ ఒకరు, అగ్నికుల క్షత్రియ ఒకరు, తూర్పుకాపు ఒకరు, పద్మశాలీ ఒకరున్నారు. మాల ఒకరు, మాదిగ ఇద్దరు, గిరిజన ఒకరు, ముస్లిం మైనారిటీ నుంచి ఒకరిని పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలిలో స్థానం కల్పించారు. మిగిలిన 40 శాతం సభ్యులలో రెడ్డి ముగ్గురు, కమ్మ నలుగురు, కాపు ఇద్దరు, క్షత్రియ ఒకరిని తీసుకున్నారు.
పేరుకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అయినా కార్యవర్గం అంతా రెడ్డి సామాజికవర్గానికి చెందిన జగన్‌రెడ్డి బంధువులతో నిండి వుంటుంది. బడుగు, బలహీనవర్గాల అండగా తెలుగుప్రజల సంక్షేమం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీకి అన్నివర్గాల మద్దతుతో గతంలో చాలాసార్లు అధికారం చేపట్టింది. అలాగే పార్టీ పదవుల్లోనూ అన్నివర్గాలకూ సముచిత స్థానం కల్పించడం ద్వారా పార్టీ జాతీయ అధ్యక్షుడు పార్టీ కేడర్ నుంచి లీడర్ల వరకూ అందరిలోనూ నూతనోత్తేజం నింపారు. ఇటీవలే ప్రకటించిన పార్లమెంటరీ టిడిపి, తెలుగు మహిళ కమిటీలలోనూ అందరికీ అవకాశం ఇవ్వడం, తాజాగా పొలిట్బ్యూరోని విస్తరించి మరీ అన్నివర్గాలకు సముచిత స్థానం కల్పించడం ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.