డల్లాస్..ఖల్లాసాయె!

104

తెరాస నేతలపై జనం తిరుగుబాటు
సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు
         ( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

‘‘ఇయ్యాల హైదరాబాద్‌ల వానపడితే లోతట్టు ప్రాంతాల్ల నీళ్లు. అసెంబ్లీ ముందట నీళ్లు. ముఖ్యమంత్రి ఇంటిముందట నీళ్లు. గవర్నర్ ఇంటి ముందట నీళ్లు. ఇదంతా ఎవరి పుణ్యమండి? హైదరాబాద్‌ల వానపడగానే కార్లన్నీ బోట్లయిపోతయని చెప్పిన. పడవలయిపోతయని చెప్పిన. నేను ఒక్కటే చెబుతా ఉన్న. హైదరాబాద్‌లో వానకాలంల పేదల ఇళ్లకు, బస్తీలకు నీళ్లు రావద్దంటే ఖర్చు పెట్టాల్సిన సొమ్ము 11 వేల కోట్ల రూపాయలు. 25 నుంచి 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప, ఈ నగరం బాగుపడే పరిస్థితి లేదు. ఇది ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం చేయాల. కేసీఆర్ గానీ, టీఆర్‌పార్టీ గానీ వందశాతం పట్టినపట్టు విడవకుండా పనిచేసే పార్టీ. ఇయ్యాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గల్లీ గల్లీ తిరిగిన్రు. మీ సమస్యలు తెలుసుకొన్నరు. అన్నీ క్రోడీకరించిన్రు. నేను కంటున్నది ఒకటే కల. ఆ కల చేసి తీరతానని చెబుతున్న. మేం కనే హైదరాబాద్ ఒక విశ్వనగరం కావాలె. అద్భుతమైన పట్టణం కావాలె. అమెరికాలో డల్లాస్ కంటే గొప్పనగరం కావాలె. కేసీఆర్ ఏం చెప్పినా మొండోడని మీకు తెలుసు. పానం పోయినా సరే, ఈ జంటనగరాలను బ్రహ్మాండంగా చేస్తానని మనివి చేస్తా ఉన్నా’’- ఇవి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాఏళ్ల క్రితం చేసిన ప్రసంగం.

అలాంటి డల్లాస్ ఇప్పుడు బురద నీటితో ఖల్లాసయిపోయింది. జంట నగరాల్లో పడుతున్న భారీ వర్షాలతో, జనజీవనం అతలాకుతలమవుతోంది. నగరం నరకమవుతున్న దృశ్యాలు, రాదార్లు గోదార్లవుతున్న చిత్రాలు జనంలో కేసీఆర్ సర్కారుపై, వ్యతిరేకతను పెంచుతున్నాయి. అపార్టుమెంట్ల సెల్లార్లలో వచ్చి చేరిన నీటిలో.. అనకొండలు పాకుతుంటే, మధ్యలో మొసళ్లు కూడా జలకాలాడుతున్న దృశ్యాలు నగర జనంలో సర్కారుపై ఆగ్రహాన్ని పెంచుతున్నాయి.

మనిషి ఎత్తు మునిగిన కాలనీలు, మురికివాడలు, బస్తీలను చూసి ఉంటే కేసీఆర్.. బహుశా ఈ మహానగరాన్ని డల్లాస్‌తో పోల్చి ఉండేవారు కాదేమో?!  ప్రజలు తమ కష్టాలు తీర్చలేని తెరాస సర్కారుపై ఆగ్రహంతో, అంత బాధల్లోనూ సోషల్‌మీడియాలో విడుదల చేస్తున్న..  కేసీఆర్, కేటీఆర్ పాత హామీల వీడియోలు.. జనం నిలదీతతో బిక్కచచ్చిపోతున్న తెరాస ప్రజాప్రతినిధుల దృశ్యాలు.. మంత్రులను సైతం ఖాతరు చేయకుండా మహిళలు  నిగ్గదీస్తున్న ఫొటోలు పరిశీలిస్తే.. తెరాసపై ప్రజల ఆగ్రహజ్వాల ఏ స్థాయిలో ఉందో ఆ వీడియోలే చెబుతున్నాయి.

తాజాగా మళ్లీ కురుస్తున్న భారీ వర్షాలతోపాటు, మొన్నటి వర్షాలకు చేదుజ్ఞాపికంగా  నిలిచిన నీళ్లు-  బురద,  కలసి వెరసి.. తెరాస నేతలపై ప్రజల తిరుగుబాటుకు కారణమవుతోంది. తమ వద్దకు పరామర్శకో, ఫొటో సెషన్‌కో వస్తున్న ప్రజాప్రతినిధులను, ప్రజలు గుక్కతిప్పుకోకుండా నిలేసి నిగ్గదీసి, ప్రశ్నల వర్షం కురిపిస్తున్న తీరు.. తెరాసకు రాజకీయ శరాఘాతమే!  తమ వద్దకు ఎవరూ రాలేదని కొందరు, పాలు-నీళ్లు లేకుండా అలమటించిపోతున్నామని ఇంకొందరు, మా కష్టాలను పట్టించుకోకుండా ఇప్పుడెందుకు వస్తున్నారని మరికొందరు,  తెరాస నేతలను ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ తరహా నిలదీతలో మహిళలే ముందున్నట్లు సోషల్‌మీడియాలో వస్తున్న వీడియోలు స్పష్టం చేస్తున్నాయి.

ఇటీవల ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, బోటులో స్థానికులను పరామర్శించేందుకు ఓ కాలనీకి వెళ్లారు. అక్కడ అపార్టుమెంటు పైఅంతస్తులో చిక్కుకున్న మహిళలు సంధించిన ప్రశ్నలకు ఎమ్మెల్యే వద్ద జవాబు లేదు. ఇక్కడ ఎవరు ఇల్లు కట్టుకోమని చెప్పారని ఎమ్మెల్యే స్థానికులను ఎదురు ప్రశ్నిస్తే.. పర్మిషన్ ఎవరిచ్చారు? దీన్ని మేం కట్టుకున్నామా? ఓట్లు అడిగేటప్పుడూ ఇట్లనే వచ్చి వెళతారా? అని శరపరంపరగా ప్రశ్నల వర్షం కురిపించిన వీడియో, ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

అటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తలసాని కూడా సందర్శన సందర్భంగా స్థానికుల ఆగ్రహానికి గురయ్యారు. ఇక పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై మహిళలు సైతం.. రాయలేని విధంగా దుర్భాషలాడి, అక్కడికి వచ్చిన మునిసిపల్ కమినర్‌పై విరుచుకుపడ్డారు. బూతులు లంకించుకున్నారు. అయినా పాపం కమిషనర్ మౌనంగా వాటిని భరించాల్సి వచ్చింది. వర్షంలో కొట్టుకుపోయిన తన కుటుంబసభ్యుడిని,  నాలుగురోజులైనా గాలించలేని అసమర్ధ ఎమ్మెల్యే పదవి ఎందుకంటూ స్థానికులు బూతులు మాట్లాడుతూ, తాము తీసిన వీడియోను ఎమ్మెల్యేకే పంపించారు. అది ఇప్పుడు సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

దీన్నిబట్టి.. సహాయ కార్యక్రమాలలో సర్కారు వైఫల్యాన్ని,  ప్రజలు తెరాస ప్రజాప్రతినిధులపై ఆగ్రహ రూపంలో తీర్చుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. బహుశా.. ప్రజాగ్రహాన్ని చూసిన తర్వాతనే.. గ్రేటర్ ఎన్నికల విజయంపై,   ఒక్క తెరాస నాయకుడు కూడా.. మునుపటి మాదిరిగా ధీమా వ్యక్తం చేస్తూ ప్రకటనలివ్వడం మానేసినట్టుంది. ఈ సందర్భంగా.. సోషల్‌మీడియాలో నెటిజన్లు వ్యంగ్యంగా రూపొందించిన ఓ  పోస్టింగ్ ఆసక్తికలిగిస్తోంది. గత ఎన్నికల ముందు ఇంటింటికీ నీరు ఇవ్వకపోతే మళ్లీ ఓట్లు అడిగేది లేదన్న కేసీఆర్ హామీ.. ఈ విధంగా నెరవేరిందంటూ, తమ ఇళ్లలో చేరిన వాన నీటి ఫొటోలు పెట్టి వైరల్ చేస్తున్న పరిస్థితి.

 

1 COMMENT