కవితక్కకు మినిష్టరు గిరీ అస్తుందా?

152

మరి ఆ త్యాగధనుడెవరో?
విమర్శలపై కేసీఆర్ వెనుకడుగు వేస్తారా?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

కల్వకుంట్ల కవిత. పరిచయం అవసరం లేని పేరిది. పొలిటికల్ ఎంట్రీకి తండ్రి కేసీఆర్ పేరు అక్కరకొచ్చినా.. మిగిలినదంతా ఆమె స్వయంప్రతిభే. ఒక్క కవిత మాత్రమే కాదు. అన్న కేటీఆర్ కూడా సేమ్ టు సేమ్. వారి ప్రస్ధానానికి స్వయంకృషి ప్రధాన కారణమన్నది నిర్వివాదం. ఆ తర్వాత కేసీఆర్ వారసత్వం, మరింత ఎదుగుదలకు అక్కరకు రావచ్చు. అది వేరే విషయం. తెలంగాణ ఉద్యమంలో కవిత ఊరకనే కూర్చోలేదు. ఆమె కూడా ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు. పల్లెలకే పరిమితమయిన బతుకమ్మను పట్టణాలకు విస్తరింపచేశారు. ఎంపీగా గెలిచినా, తర్వాత ఓడినా అది స్వయంకృతమే.

అలాంటి కవిత.. పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి- తర్వాత ఓడి, ఇప్పుడు మళ్లీ రాష్ట్ర శాసనమండలిలో అడుగిడనున్నారు. ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో, కవిత అద్భుత విజయం సాధించారు. ఆమె ప్రత్యర్ధులెవరికీ ధరావతూ దక్కలేదు. మరిప్పుడు ఆమె ఎమ్మెల్సీ! ఓ 13 నెలలు ఆమె ఆ పదవిలో కొనసాగుతారు. అంతా బాగానే ఉంది. పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న ఆమె, ఇప్పుడు చట్టసభలో కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో… కేసీఆర్ కుటుంబం అంతా ఇప్పుడు చట్టసభల్లో సభ్యులే. మేనల్లుడు హరీష్, తనయుడు తారకరామారావు ఇద్దరూ రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రులు. ఇప్పుడు కుమార్తె కవిత ఎమ్మెల్సీ. మరొకరు సంతోష్. ఆయన రాజ్యసభ సభ్యుడు. ఇప్పుడాయన కేసీఆర్‌కు ఆత్మలాంటివారు. కాగలకార్యం ఆయనే సాధిస్తున్నారు. ఇలా కుటుంబ సభ్యులంతా చట్టసభల్లో ఉండటం అరుదు. దానిని కేసీఆర్ సొంతం చేసుకున్నారు.

ఇంతవరకూ బాగానే ఉంది. మరి ఎమ్మెల్సీగా గెలిచిన కవితను ఖాళీగా ఉంచుతారా? మంత్రి పదవి ఇవ్వాలి కదా! అప్పుడే నిజామాబాద్, కరీంనగర్ ఎమ్మెల్యేలు కవితక్క మంత్రవుతుందని.. ఎన్నిక ఫలితాలకు ముందు- తర్వాత నుంచీ జోస్యం చెబుతూనే ఉన్నారు. అదీగాక.. హరీష్, కేటీఆర్‌కు మంత్రి పదవి ఇచ్చినందువల్ల, ఇంటి ఆడపిల్లకు మంత్రి పదవి ఇవ్వకపోతే అదొక పితలాటకం. ఇన్ని కోణాల్లో పరిశీలిస్తే… కవితక్కకు మంత్రి పదవి లభించడం సులభంగానే కనిపిస్తుంది. పైగా ఆమె పార్టీలో క్రియాశీలకంగానే పనిచేస్తున్నారు.

కానీ.. ఇక్కడే పెద్ద చిక్కొచ్చిపడింద ని, గులాబీదళాలు చెబుతున్నాయి. ఆమెకు మంత్రి పదవి ఇస్తే, ఇప్పుడు ఉన్న మంత్రుల్లో ఒకరిపై వేటు వేయకతప్పదు. ఎందుకంటే మంత్రిమండలి తగిన సంఖ్యలోనే ఉంది. ఒకవేళ కవిత కోసం ఎవరినయినా తొలగించాలి. లేదా ఆమె కోసం ఎవరో ఒకరు, తన పదవిని త్యాగం చేయాలి. కేసీఆర్ కోరితే త్యాగధనుల జాబితా పెద్దగానే ఉంటుంది. ఆవిధంగా త్యాగం చేసినా, లేక ఎవరినయినా తొలగించినా అది చెడు సంకేతాలకు దారితీస్తుంది. ఎవరినయినా తొలగిస్తే.. కూతురు కోసం, ఏదో ఒక సామాజికవర్గానికి చెందిన వారిపై, వేటు వేశారన్న అపకీర్తి మూటకట్టుకోక తప్పదు. అది విపక్షాలకు, సహజంగానే ఆయుధమవుతుంది.

ఎందుకంటే.. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు, ఉద్యోగాలివ్వలేని కేసీఆర్ తన కుటుంబసభ్యులకు మాత్రం, ఉద్యోగాలిచ్చుకున్నారంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మళ్లీ ఇప్పుడు కవితక్కకు మంత్రి పదవి ఇస్తే, ఆ విమర్శను మరింత బలపరిచినట్లవుతుంది. ఆవిధంగా.. పదవి ఇస్తే ఒక ఇరకాటం. ఇవ్వకపోతే మరొక ఇరకాటం. నిజానికి కేసీఆర్ ఆమెకు మంత్రి పదవి ఇస్తే, పార్టీలో అడిగేవారెవరూ ఉండరు. దానిపై పెద్ద చర్చ కూడా ఉండదు. ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు, కేసీఆర్ అన్ని కోణాల్లో ఆలోచించే తీసుకుంటారు. దానికి సంబంధించి ఎన్ని విమర్శలొచ్చినా, దానిని ఎదుర్కొనేందుకు ముందస్తుగా సిద్ధంగానే ఉంటారు. మరి కవితక్క విషయంలోనూ అలా సన్నద్ధమయితే.. ఆమె మంత్రి అయినపోయినట్లే లెక్క.

నిజానికి కవిత అద్భుతమైన నాయకురాలు. మంచి వక్త. లోక్‌సభలో అది రుజువయింది కూడా. లోకజ్ఞానం-విషయ పరిజ్ఞానమూ ఎక్కువే. ఆమె మంత్రి పదవికి అర్హురాలు కాదని ఎవరూ అనలేరు. ఎందుకంటే, ఇప్పుడు క్యాబినెట్‌లో ఉన్న వారి విజ్ఞానంతో పోలిస్తే, ఆమె ప్రతిభ వందరె ట్లు ఎక్కువ. అయితే.. పార్టీ నేతలు మాత్రం ఈ విషయంలో భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ 13 నెలల కాలం కోసం.. ఆమెకు మంత్రి పదవి ఇచ్చి, విమర్శలు కొనితె చ్చుకోక పోవచ్చంటున్నారు. నిజానికి, మంత్రి పదవి ఇచ్చినా-ఇవ్వకపోయినా.. పార్టీ-ప్రభుత్వంలో ఆమె పలుకుబడికి వచ్చిన నష్టమేమీ లేదంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఒకరిని తొలగించి.. కూతురుకు పదవి ఇచ్చారన్న అపప్రదను, అనవసరంగా మూటగట్టుకునేందుకు, కేసీఆర్ సిద్ధపడకపోవచ్చుంటున్నారు.

అందుకే.. ఎలాగూ జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున, మళ్లీ పార్లమెంటుకే పోటీ చేయించవచ్చని విశ్లేషిస్తున్నారు. ఈ 13 నెలల పదవీకాలం అనుభవం, పార్టీ ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలకు అక్కరకు వస్తాయని విశ్లేషిస్తున్నారు. చూడాలి. కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో? ఎందుకంటే ఆయన ఇలాంటి కీలక నిర్ణయాలపై, ఎవరితో చర్చించరన్నది బహిరంగ రహస్యం. కాబట్టి బాసు మనోగతం ఎవరికీ తెలియదు. ఇవన్నీ అంచనాలు.. ఊహాగానాలు.. నేతల మనోగతమే!

1 COMMENT