రాజకీయ…‘ప్రేమాభిషేకం’!

402

బలపడుతున్న వైసీపీ-బీజేపీ బంధం
రఘురామకృష్ణంరాజు పదవికి ఎసరు
ఏపీలో మూగబోయిన బీజేపీ గళం
అమిత్‌షా పేరుతో అణచివేస్తున్నారన్న ఆగ్రహం
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

అవును వాళ్లిద్దరు ఇష్టపడ్డారు.. అయినా వారిద్దరూ ఇప్పటికే రహస్య ప్రేమికులే. ఒకరి కాలిలో ముల్లు గుచ్చుకుంటే, మరొకరు నోటితో దానిని తీసేంత అపూర్వ బంధం వారిది. అందుకే ఒకరి ఉన్నతి కోసం మరొకరు పనిచేస్తున్నారు. వారి ప్రేమ బంధం ఈనాటిది కాదు. ఏనాటిదో? విశాఖ చినముషిడివాడ పీఠం నుంచి విక సించిన ప్రేమ.. ఢిల్లీలో పరిమళించి, ఇప్పుడు పువ్వులయి విరబూస్తోంది. వైసీపీ-బీజేపీ బంధం ఆ రకంగా ఫెవికాల్ మాదిరిగా బలపడుతోంది. కమలం తోటలో ఎప్పుడో పూసిన కొత్త పుష్పం, నత్వానీ పౌరోహిత్యంలో ఇద్దరూ ఆరకంగా ముందుకువెళుతున్నారు.

నిజం.. బీజేపీ-వైసీపీ బంధం కమలం రేకుల మాదిరిగా వికసిస్తోంది. తాజాగా యుశ్రారైకా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును,  స్టాండింగ్ కమిటీ నుంచి తొలగించి, ఆ స్థానంలో తాను అనుకున్న బాలశౌరిని ప్రతిష్ఠించిన తర్వాత కూడా.. ఆ రెండు పార్టీల మధ్య ఏమీ లేదనుకునేవారు, అమాయకుల కిందే లెక్క. ఇప్పటికే బీజేపీ చెలికాడు అంబానీ భాగస్వామి పరిమళ్ నత్వానీని వైసీపీలో చేర్చి, ఆయనకు రాజ్యసభ ఇప్పించిన అపూర్వబంధం వారిది. బీజేపీలో సభ్యురాలిగా ఉన్న సంచయితకు మాన్సాస్ చైర్మన్ పదవి ఇప్పించిన ఉమ్మడి బంధం వారిది.అయినా సరే ఆ రెండు పార్టీల మధ్య ఏమీ లేదనుకున్న వారు,వెర్రివెంగళప్పల కిందే లెక్క అన్నది బుద్ధిజీవుల వ్యాఖ్య.

ఎంపీ రఘురామకృష్ణంరాజుకు,లోక్‌సభ స్పీకర్ తన విచక్షణాధికారాల కింద స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చారు. అప్పుడాయన జగనన్నపై ఇంకా తిరుగుబాటు చేయలేదు.  రోజూ రచ్చబండ పెట్టి జగన్ అండ్ అదర్స్‌ను ఉతికి ఆరేస్తున్న రాజును, వైసీపీ రాచమార్గంలోనే ఆ పదవి నుంచి దించేసింది. మరి భాజపేయుల అదృశ్యహస్తం లేకుండానే, రాజుగారికి పదవీవియోగం కలిగిందని భావించలేం కదా? అలాగైతే మరి రాజుగారికి 13 మందితో భద్రత కల్పించారు కదా? అన్న సందేహం రావచ్చు. నిజమే. అదొక ఆట!  మరెందుకు ఆయనను ఆ పదవి నుంచి తొలగించారన్న, ఇంకో సందేహం రావచ్చు. ఇదొక ఆట!!  ప్రధాని-హోంమంత్రి మద్దతు లేకుండానే, జగనన్న సుప్రీంకోర్టు-హైకోర్టు జడ్జిలపై లేఖ రాశారా? అన్న మరో డౌటనుమానం కూడా రావచ్చు. అది నిజమూ కావచ్చు. కాకపోనూ వచ్చు. అది ఇంకో ఆట!!! ఇప్పటి దేశరాజకీయాలను ఆడించేది ‘ఆ ఇద్దరయితే’, ఆడేవారు మాత్రం  అమాయక చక్రవర్తులు. ఇదీ నిజం!

అందుకే.. ఏపీలో తన ‘కమలవనం’ నీరు లేక ఎండిపోతున్నా సరే.. ఎదురుగా ఉన్న ‘పచ్చవనం’ పూర్తిగా కాలిపోతే, సరిపోతుందని సంబరపడుతోంది. ఏపీ లాంటి చిన్న చిన్న మొక్కలు ఎండిపోయినా, ఢిల్లీలోని తన మహావృక్షానికి ‘ఫ్యాను’గాలి తగిలితే, బతికిపోతామనుకునే విశాల హృదయం దానిది. అందుకే రాష్ట్రంలో ఏం జరిగినా కమలం కళ్లు కనిపించవు. చెవులు వినిపించవు. అర్జునుడికి చెట్టుపై ఉన్న పిట్ట మాత్రమే కనిపించినట్లు.. ఏపీ కమలదళాలకు ఒక్క తెలుగుదేశమే కనిపిస్తుంది. అదో ‘పచ్చ’పాతం మరి! బహుశా.. ఎలాగూ రాష్ట్రంలో ‘పాయింట్ ఎయిట్’ పార్టీనే కాబట్టి, ఇప్పట్లో కొత్తగా సాధించేది లేదు. అందుకే రాజ్యసభలో ప్రాణవాయువయిన ‘ఫ్యాను’తో కలసి ఉంటేనే మంచిదన్న,ముందుచూపే దానికి కారణమేమో?!

ఏపీలో మతమార్పిళ్లు, హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని.. భాజపా గురువులయిన సంఘపరివారం కోడై కూస్తుంటుంది. కానీ అదే భాజపా తన ట్వీట్లు,ప్రకటనల్లో మాత్రం, జగనన్న సర్కారును పల్లెత్తు మాట అనదు. పైగా.. యుశ్రావైకాపాకు భాజపాలోని అదృశ్యమిత్రులు, అను‘కుల’భిమానులు ‘ఆ ఒక్కటీ తప్ప’ అన్నట్లు..అన్నీ ట్వీటుతుంటారు! విగతజీవిగా మారిన టీడీపీ అనే సగం చచ్చిన పార్టీపై, విరుచుకుపడుతున్న విచిత్ర బంధం కనిపిస్తుంది. అంతర్వేది ఊసులు, బెజవాడ అపచారం, గుళ్లలో విగ్రహాలు విరిగినప్పుడు వినిపించిన వీరావేశం,ఇప్పుడు బీజేపీలో భూతద్దం వేసి వెతికినా కనిపించదు.వినిపించదు.కారణం ‘మామూలే’.. ఆ రకంగా రెండు పార్టీలూ ముందుకువెళున్నాయన్న మాట!

ఇక బీజేపీ స్వరం ఇటీవలి కాలంలో,ఎక్కడా వినిపించకపోవడం మరొక చర్చనీయాంశమయింది. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. పురిఘళ్ల రఘురాం,విల్సన్,లంకా దినకర్,ఓవి రమణ,యామిని వంటి పెద్ద గొంతులు టీవీ చానళ్ల చర్చల్లో గళమెత్తేవి.అటు వైసీపీని-ఇటు టీడీపీని ఏకిపారేసేవి.వీరిలో ఓవి రమణను అసలు పార్టీ నుంచే వెలివేయగా,మిగిలిన వారి గొంతులు నులిమేసినట్లు కనిపిస్తోంది.అసలిప్పుడు టీవీ చర్చల్లో భాజపా మొహాలేవీ కనిపించకపోవడం, ఆ పార్టీ నేతలను ఆశ్చర్యపరుస్తోంది. జాతీయ అంశాలపై అవగాహన ఉన్న లంకాదినకర్ వంటి నాయకులు, పార్టీ పేరు లేకుండా పత్రికల్లో వ్యాసాలు రాసుకోవలసిన దుస్థితి ఏర్పడింది.

పైగా హైదరాబాద్‌లో ఉండే నేతలకు పదవులివ్వవద్దని ఒక నియమం పెట్టుకున్నారట. మరి అదే హైదరాబాద్‌లో ఉండే ఓ ప్రముఖురాలి ఇంటికి.. ఇప్పటి రాష్ట్ర ప్రముఖుడితోపాటు, అప్పటి సంఘ ప్రముఖుడూ వెళ్లి ఒత్తిడి చేసి మరీ పార్టీలో తీసుకున్నారు కదా? ఆ తర్వాత ఆ ప్రముఖురాలికి కన్నా కమిటీలో పెద్ద పదవే దక్కి,ంది కదా? వారంతా గత ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు కదా? మరి.. అప్పుడు పనికొచ్చిన వాళ్లు, ఇప్పుడు పనికిరానివాళ్లెలా అయ్యారన్నది కమలనాధుల ప్రశ్న. అధికార ప్రతినిధులుగా ఎంచుకున్న వారిని చూస్తే.. వైకాపాపై బీజేపీ విధానం ఏమిటన్నది స్పష్టమవుతూనే ఉందన్న వ్యాఖ్యలు ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.

కాగా ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రముఖులు.. అంతా అమిత్‌షా ఆదేశాలతోనే నిర్ణయం తీసుకున్నామని చేస్తున్న ప్రచారంపై, పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అమరావతిపై మాట్లాడవద్దని అమిత్‌షా ఆదేశించినట్లు, ఏపీ వ్యవహారాల్లో అత్యుత్సాహం ప్రదర్శించే ఎంపీ ఒకరు ప్రచారం చేశారు. ఇప్పుడు నేతలను టీవీ చర్చలకు వెళ్లకుండా, అమిత్‌షానే ఆదేశిచ్చినట్లు చేస్తున్న ప్రచారంపై, నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమిత్‌షా పేరు చెప్పి, కొందరు రాష్ట్ర నేతలు తమ సొంత అజెండాను అమలుచేస్తున్నట్లు కనిపిస్తోందన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో వైసీపీ-టీడీపీపై పార్టీ విధానం ఏమిటన్నది.. ఇప్పటివరకూ అటు నద్దా గానీ, ఇటు అమిత్‌షా గానీ రాష్ట్ర పార్టీ ప్రముఖుల సమక్షంలో స్పష్టంచేయకపోవడం వల్లనే, ఈ గందరగోళం-అవకాశవాదం ఏర్పడిందని సీనియర్లు చెబుతున్నారు.

రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్మహత్యలే ఉంటాయన్న దానికి, తమ పార్టీ అనుసరిస్తున్న ‘అదృశ్య విధానాలే’ ఉదాహరణ అని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ వ్యవహారమే దానికి నిదర్శనమంటున్నారు. కేంద్రనిధులతో కట్టిన ఆ ఫ్లైఓవర్ నిర్మాణ ఖాతాను, అటు వైకాపా-ఇటు టీడీపీ తమ ఖాతాలో వేసుకునేందుకు, ఆ రెండు పార్టీలు మాటల యుద్ధం చేస్తున్నాయి. కానీ, అందులో కేంద్రంలోని బీజేపీ వాటా ఎంతన్నది చెప్పి.. అది బీజేపీ వల్లే పూర్తయిన ప్రాజెక్టని చెప్పేందుకు, కమలదళాలు తెగ మొహమాట పడుతుండటమే ఆశ్చర్యం.

కొద్దిరోజుల క్రితంవరకూ.. వైకాపా సర్కారుపై, తమ పార్టీ కనీస బంతిపూల యుద్ధం చేసినట్టయినా కనిపించేదని, ఇప్పుడు కనీసం మల్లెపూలతో కూడా కొట్టలేకపోతోందన్న వ్యాఖ్యలు, ఆపార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తమ పార్టీ అగ్రనేతలు చేస్తున్న ప్రకటనలు-ట్వీట్లు చూస్తే.. గతంలో టీడీపీకి ‘బీ’ టీముగా ఉన్న తాము, ఇప్పుడు వైకాపాకు ‘కమలసోదరుడి’లా మారామన్న భావన ప్రజల్లో బలపడుతోందంటున్నారు. ఫాఫం..కమలదళాలది కంఠశోషనే.

1 COMMENT