‘ఆమె’కు విలువేది?

413

(సుజాత.కె)

ఆమెకు కావాలి న్యాయం..
ఆమెకు కావాలి ఆహారం..
ఆమెకు కావాలి ఆరోగ్యం..
ఆమెకు కావాలి స్వేచ్ఛ..
ఆమెకు కావాలి అధికారం..
ఆంక్షల.. ఆధిపత్య.. కంచెల్లో
ఆమె ఆక్రోశిస్తోంది..
ఇప్పుడు చేయాల్సింది శోకించడం కాదు.
వివక్షపై గొంతెత్తాలి.. హింసను ప్రతిఘటించాలి..
ఈ నేపథ్యంలో స్త్రీ ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ప్రత్యేక కథనం..

‘కోవిడ్‌ 19తో దేశంలో మహిళలు మరింత వివక్షకు గురయ్యారు. వారి జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి..” అని ఐక్యరాజ్య సమితి స్వయంగా పేర్కొంది. కరోనా ప్రభావంతోనే దిగజారిన ఆర్థిక పరిస్థితులతో రాబోయే ఐదేళ్లలో బాల్య వివాహాలు కోట్ల సంఖ్యలో పెరుగుతాయని కొన్ని సర్వేల అంచనా. ఐపిసి, సిఆర్‌పిసిలతో పాటు ఎవిడెన్స్‌ చట్టాల్లోనూ తెస్తానంటున్న మార్పు చెప్పకపోయినా మనుస్మృతి మార్గదర్శకంలో అవి రూపుదిద్దుకోబోతున్నాయని వినిపిస్తోంది. అత్యాచారాలు, కులదురహంకార హత్యలు నిత్యకృత్యమయ్యాయి. డిజిపి స్థాయి అధికారే తన భార్యపై చేసిన దాడి వీడియోల్లో వెలుగులోకి వచ్చింది. ఇదీ, ఈనాడు మహిళలకు లభిస్తున్న ‘రక్షణ’కు ఒక సాక్ష్యం. కనపడని ఇలాంటి గృహహింస ఉదంతాలు దేశంలో ప్రతిరోజూ ఎన్నో ..!
మహిళల ఆరోగ్యం గురించి పరిశీలిస్తే.. కుటుంబంలో ఆమెది ఆఖరి ప్రాధాన్యమే. ఇంటెడు చాకిరీ చేసినా ఆమె శ్రమకు విలువలేని దుస్థితి. కరోనా కాలంలో ఆమెపై ఇంటిపని భారం రెట్టింపు అయింది. ఆమె చుట్టూ ఆంక్షలు, ఆధిపత్య కంచెలు లెక్కకు మించి అల్లుకుని ఉన్నాయి.

అంతులేని పనిభారం

ఇంటా బయటా స్త్రీలపై పనిభారం కోవిడ్‌ తెచ్చిన మరో ఉపద్రవం. భర్త, పిల్లలు ఇంట్లోనే ఉండటంతో వంట మాత్రమే కాక అన్నీ సమకూర్చే పని. అదనపు రుచులు, సౌకర్యాలు, సంతృప్తి పరచాల్సి రావడం.. వెరసి స్త్రీలపై పెరిగిన ఇంటి పనిభారం. మధ్య తరగతి కుటుంబాల్లో కరోనా వేళ ఇంటిపనివారిని ఆపడంతో ఇంటిపని మరింత భారమైంది. కొన్ని కుటుంబాల్లో పురుషులు ఇంటిపని బాధ్యత తీసుకున్నారు. అమెరికాలో జరిగిన ఓ సర్వేలో 2,200 మంది మహిళలు పాల్గొన్నారు. అందులో 70 శాతం మంది ఇంటిపని బాధ్యత అంతా తమదేనని చెప్పారు. 88% మంది తమ భర్తల కన్నా తామే పిల్లల చదువులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నామని చెప్పారు. 46 శాతం మంది పురుషులు తాము అదనపు బాధ్యతలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కానీ 3 శాతం మంది మహిళలు మాత్రమే ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. ఇంటి పని పురుషులు 52 నిముషాలు చేస్తే స్త్రీలు 360 నిముషాలు ! ఆరు రెట్లు ఎక్కువగా స్త్రీలు పనిచేస్తున్నారు. ఇంటి నుండే పని చేసే ఐటి రంగం మహిళల నుండి ఇతర ఉద్యోగినులు వరకూ అదనపు పని చేస్తున్నారు. క్షేత్రస్థాయికి పనికి వెళ్లేవారు రవాణా సౌకర్యాలు లేక నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. ప్రధానంగా అత్యవసర సర్వీసుల్లో పనిచేసే ఆశా, నర్సింగ్‌ స్టాఫ్‌, జర్నలిస్టులు, వైద్యులు, పారిశ్రామిక కార్మికులపై పనిభారం పెరిగింది.

అధికమవుతున్న ఒత్తిడి

ఇంటా బయటా శ్రమ అధికమే కాక, ఆర్థిక పరిస్థితులు ఆమెను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఉపాధి కోల్పోవడం, అత్యల్ప వేతనాలు పొందడం వంటివి మహిళల్లో మానసిక కుంగుబాటు కలిగిస్తున్నాయి. ఆర్థిక సమస్యలతో కుటుంబం నడపడం ఆమెపై మరింత ఒత్తిడిని కలిగిస్తోంది. కరోనా కాలంలో మధ్యాహ్న భోజనం లేకపోవడంతో అటు కార్యకర్తలకు పనిలేదు, ఇటు పిల్లలకు తిండి పెట్టడం తల్లులకు కష్టమవుతోంది. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక అయోమయ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్‌కు గురైతే ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకూ పాల్పడుతున్న సంఘటనలున్నాయి. వలసలు ఆగిపోవడంతో ఎక్కడి వారక్కడే ఉండవలసి వచ్చింది. దానితో గ్రామాల్లో పని ఒత్తిడి పెరిగింది. వలస కార్మికులకు పని కల్పించటానికి కేంద్రం ‘గరీబ్‌ కళ్యాణ్‌ అభియాన్‌’ పథకం పెట్టింది. కానీ మన రాష్ట్రంలో ఈ పథకంలో ఒక్క జిల్లానూ చేర్చలేదు. అనంతపురం, విజయనగరం లాంటి కరువు జిల్లాలనూ ఎంపిక చేయలేదు. మిర్చి, చింతపండు, ఆక్వా సమస్త పనులు సగానికి పడిపోయాయి. వీటన్నింటిలో ఎక్కువగా మహిళలే పనిచేసేది. ఫలితంగా పని లేక, వేతనాలు లేక ఒత్తిడికి గురవుతున్నారు.

స్వయం సహాయక గ్రూపులకు కోవిడ్‌ ప్యాకేజీని ప్రకటించిన ఆర్థిక శాఖా మంత్రి రూ. 20 లక్షలకు రుణం పెంచుతున్నట్లు ప్రకటించారు. వడ్డీ రాయితీ నయాపైసా లేదు. 98 శాతం అప్పులు తిరిగి బ్యాంకులకు చెల్లిస్తున్నవారు డ్వాక్రా మహిళలే. వారికి నెలవారీ కిస్తీలను మూడు నెలలు వాయిదా వేసినా చక్రవడ్డీ భయం వారిని వెన్నాడుతోంది. ఇది వారిపై మరింత మానసిక ఒత్తిడిని పెంచుతోంది. ఆరు నెలలు వాయిదా వెయ్యాలని, చక్రవడ్డీలను మినహాయించాలని మహిళా సంఘాలు ఆర్‌బిఐని కోరాయి. మైక్రోఫైనాన్స్‌ సంస్థల, అప్పు చేసి కొన్నవాటికి ఇఎంఐల ఒత్తిడి ప్రస్తుత పరిస్థితిలో తలకు మించిన భారమైంది. పచ్చళ్లు, పిండి వంటలు అమ్మకాలు లేక డ్వాక్రా మహిళల పరిస్థితి దయనీయంగా మారింది. వీటికితోడు నిత్యావసర ధరల పెరుగుదల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపి, మహిళలు మానసిక అనారోగ్యాలకూ లోనవుతున్నారని సర్వేలు తెలుపుతున్నాయి.
ఇలా అనేక సమస్యలతో నిత్యం సతమతమవుతున్నారు నేటి మహిళలు, యువతులు. నిర్భయ సంఘటన జరగగానే నిర్భయ చట్టం, దిశ చనిపోగానే దిశ చట్టం అంటూ చట్టాలు చేసి, చేతులు దులుపుకుంటే సరిపోయిందా? ఇంకా మహిళలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ, సరైన ఆహారం పొందలేక పోతున్న దుస్థితి. దీనికి ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. గృహహింస, లైంగిక వేధింపుల చట్టాలున్నా ఆచరణలో అవి అంతంత మాత్రంగానే అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో హక్కుల సాధన కోసం, పరిస్థితుల్లో మార్పు కోసం మహిళలు ఐక్యంగా గొంతెత్తాలి. ప్రశ్నించి, ప్రతిఘటించి మహిళలకు ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా గొప్ప భరోసానిచ్చే సమాజాన్ని సాధించుకోవాలి.

అత్యాచారాల పరంపర

ఉత్తరప్రదేశ్‌లో హథ్రాస్‌ దారుణం.. 19 ఏళ్ల దళిత అమ్మాయిపై నలుగురి సామూహిక హత్యాచారానికి పాల్పడి, నాలుక తెగ్గోశారు. ఈ దుర్ఘటనపై ఇప్పుడు దేశం మొత్తం దద్దరిల్లిపోతుంది. ఆ తర్వాత ప్రభుత్వం, అధికారులు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయంగా ఉంది. మనుస్మృతి పాలనలో కులం, మతం ముందుకుతెచ్చి, నేరస్తుల పక్షాన వకాల్తా పుచ్చుకోవడం ప్రమాదకర ధోరణి. రోజుకు మూడు అత్యాచారాలు.. ఆరు హింసలు.. రీతిన కోవిడ్‌ కాలంలో స్త్రీలపై దారుణాలు పేట్రేగిపోయాయి. హథ్రాస్‌ ఘటనలో ప్రభుత్వం, అధికారులు సాక్ష్యాలను నిలువునా కాల్చి బూడిద చేశారు. ఇదీ నేరమే. దీనిపైనే 40 మంది మహిళా న్యాయవాదులు సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ ప్రభుత్వంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనే డిమాండ్‌ ముందుకొచ్చింది. ఆ తల్లి పోలీసులు అబద్ధాలు చెప్తున్నారని నెత్తీనోరూ మొత్తుకుంటోంది. మరోవైపు బాధితురాలు అత్యాచారం జరిగిందని చెప్పినట్లు వీడియోలూ బయటకు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై కరోనాలో కూడా పెల్లుబికిన నిరసన, ప్రతిపక్షాల పర్యటనలు పాలకులపై ఒత్తిడిని తెస్తున్నాయి. మరోవైపు సుప్రీంలో అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం చెప్పే సమాధానాలు సహేతుకంగా లేవు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోంది. రూ.50 లక్షలతో ఆ కుటుంబం చేత అబద్ధాలు చెప్పించడానికీ ప్రభుత్వం తెగబడుతోందంటే ఆ పాలకులు ఎవరి పక్షం వహిస్తున్నట్లు? ఈ ఘటన జరిగిన తెల్లారే ఆ రాష్ట్రంలో మరో చోట, మన పొరుగు రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఇంకో సంఘటన జరిగాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో.. రాజమండ్రి, తెనాలి, నెల్లూరు, వెలిగొండ, నకిరేకల్‌, ఒంగోలు, అనంతపూర్‌లలో మైనర్‌ బాలికల మీద సాగిన దుశ్చర్యలు అందుకు నిలువెత్తు నిదర్శనాలు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు సైతం అత్యాచారాలకు పాల్పడిన సంఘటనలు శ్రీకాకుళంలో, అమరావతిలో వెలుగులోకి వచ్చాయి. దిశ చట్టాన్ని తెచ్చామని, 21 రోజుల్లో నిందితులను విచారించి, శిక్షిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదమూ పొందలేదు. కానీ దిశ చట్టం పేరిట కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటనలు చేస్తున్నారు. వాస్తవానికి ఏమిటి అమలు జరుగుతుంది? నిందితుల పట్ల తీసుకుంటున్న చర్యలు ఎక్కడీ వరుస సంఘటనలు ఆడపిల్లల పట్ల సమాజం, ప్రభుత్వం తీరును వేలెత్తి చూపిస్తున్నాయి. వెలుగులోకి రాని సంఘటనలు ఇంకెన్నో ఉంటాయి.

అందని పోషకాహారం

కోవిడ్‌ కాలంలో పోషకాహారమే ప్రధానం అని చెప్తున్నారు. కానీ ఈ కాలంలో ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారాయి. సహజంగానే కుటుంబంలో ఆహారం విషయంలోనూ అందరి తర్వాతే ఆమె. ఇక పోషకాహారం ఆమెకు అందేది ఎక్కడీ కరోనా కాలంలో అంగన్‌వాడీలు, రేషన్‌ ద్వారా ప్రభుత్వం అందించేదీ నాసిరకంగానే ఉంది. ఇంటిపని కార్మికులు సుమారు నాలుగు లక్షల మంది ఉండవచ్చని అంచనా.! వీళ్లందరూ కరోనా వేళ పనులు కోల్పోయారు. ఈ సంఖ్య ఒక్క విశాఖ నగరంలోనే 40- 50 వేల మంది ఉండొచ్చని అంచనా. వారిలో 90% మంది లాక్‌డౌన్‌ వల్ల పని నుంచి నిలిపివేయబడ్డారు. ఈ మధ్యనే కొందరిని పనులకు పిలుస్తున్నారు. షాపు వర్కర్లు, ఒంటరి మహిళలు పరిమిత సమయంలోనే పనిచేస్తున్నారు. వారు అత్యల్ప వేతనాలు పొందుతూ పోషకాహారం ఎలా తీసుకుంటారు? ప్రజా రవాణా సదుపాయాలు లేక ఆటో ఛార్జీలు పెరగడమూ మహిళల పనికి ఆటంకాలుగా మారాయి. ప్రైవేటు టీచర్లు, భవన నిర్మాణ కార్మికులు, చేతిపనివారు, చింతపండు వలిచేవారు, మిర్చి తొడాలు తీసేవారు, వ్యవసాయ పనులకు వెళ్లేవారు… ఇలా లక్షలాది మహిళలు పనులు కోల్పోయారు. అర్ధాకలితో ఆహారమే ఏర్పాటు చేసుకోలేని పరిస్థితులుంటే ఇక పౌష్టికాహారమెక్కడీ దీనికి ప్రభుత్వాలు పూనుకున్నది ఎక్కడీ ఒక్క కేరళ రాష్ట్రం మాత్రమే ఈ కాలమంతా ఇంటికి పూర్తిస్థాయి నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేసింది.

అధికార నిర్బంధం

ప్రజల, స్త్రీల సమస్యలపై ఉద్యమిస్తున్న వారిపై కేసులు పెట్టి, అరెస్టులు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్సాహంగా ఉన్నాయి. భీమా కోర్‌గావ్‌ కుట్ర కేసులో సుధా భరద్వాజ్‌, సోమాసేన్‌ను అరెస్టు చేసి, ఏళ్లు గడుస్తున్నాయి. ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోమని జరిగిన ఆందోళనల్లో పాల్గన్న నటషా దేవాంగనాను అరెస్టు చేశారు. ఇటీవల బృందాకరత్‌ తదితర నేతలకు నోటీసులు అందాయి. కాశ్మీరీ స్త్రీల పరిస్థితి నిర్బంధంలో ఉన్నట్లే. మనరాష్ట్రంలోనూ లాక్‌డౌన్‌ సమయంలో మద్యం షాపులు మూసేయాలని, ఉపాధి చూపించాలని, కోవిడ్‌ కాలంలో భృతిని ఇవ్వాలని, విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని, ఎల్‌జీ పాలిమర్స్‌ను తరలించాలని చేసిన అనేక ఉద్యమాలపై పాలకులు ఉక్కుపాదం మోపారు. ఈ ఉద్యమాల్లో అనేకమంది మహిళలూ పాల్గొన్నారు. పోలవరం ఏజన్సీలో భూముల కబ్జాను ప్రతిఘటించినందుకు సోడెం దుర్గ తదితరులను నిర్బంధించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, తమ భూములకు కౌలు చెల్లించాలని కోరుతున్నవారినీ అక్రమంగా నిర్బంధించి కేసులు పెడ్తున్నారు.

ఆరోగ్యం ఆఖరు ప్రాధాన్యం..

ఆరోగ్యం విషయం వచ్చేసరికి ఇంట్లో ఆమె స్థానం ఆఖరునే. ఎలాంటి పరిస్థితులు చుట్టుముట్టినా.. స్త్రీల ప్రసవం వాయిదా వేయడానికి వీలులేదు. అందుకు సంబంధించి ఆసుపత్రుల్లో సక్రమ ఏర్పాట్లు లేవు. సామాజిక వైద్య కేంద్రాల్లో క్లిష్ట సమయంలో అందించే చికిత్స లేకపోవడం.. ఒకవేళ సర్జరీ అవసరమైతే చేసే సౌకర్యాలు లేకపోవడం.. వెళ్లడానికి తగిన రవాణా ఏర్పాట్లు, వైద్యులు లేనందున జిల్లా కేంద్రంలోనే నానా అవస్థలు పడాల్సిన దుస్థితి. కోవిడ్‌ పరీక్షల్లో కనీసం గర్భవతులకు ప్రాధాన్యత లేకపోవడం.. దీనివల్ల మార్గమధ్యంలోనే మరణించడం దారుణ స్థితి. గర్భవతులకు, పసిబిడ్డల తల్లులకు కోవిడ్‌ సోకితే హైరిస్క్‌ రోగులుగా గుర్తించి, ఆసుపత్రుల్లో చేర్చుకుని వైద్యం చేయాలి. మన రాష్ట్రంలోనే గుంటూరు జిల్లాలోని వేమూరు మండలం నుంచి వచ్చిన ఓ గర్భిణీ కోవిడ్‌ పాజిటివ్‌ అని తెలిసీ ఇంటికి పంపినట్లు వార్తలచ్చాయి. కరోనా వేళ అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిలిపివేశారు. ఫలితంగా ప్రైవేటు ఆసుపత్రులకు సామాన్యులు పైతం రూ. 20 వేల మించి ఖర్చుపెట్టాల్సిన వస్తుంది. అవాంఛిత గర్భాలు వచ్చి అదనపు సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ సమయంలో పురుషులకు వేసెక్టమే పరిష్కారం. దాన్ని ప్రచారం చేసి ప్రోత్సహించాలి. సహజంగానే స్త్రీ సాధారణ ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. ఇలాంటి వాటికీ వైద్యం నిరాకరించబడటం గర్హనీయం. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది సంఖ్యా అవసరాలకు తగినట్టుగా లేదు.

ఆగని కులదురహంకార హత్యలు

ప్రణరు అమృత ఉదంతం మరిచిపోలేదింకా.. ప్రణరుని అత్యంత దారుణంగా అమృత కళ్ల ముందే హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. కూతుర్ని నడిరోడ్డుపై కొబ్బరి బోండాం కత్తితో నరికిన ఒక మనోహరాచారి ఘటన పట్టపగలే జరిగింది. ఆధునిక యుగంలోనూ కులానికి ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నామో ఇటీవల జరిగిన హేమంత్‌ అవంతి సంఘటన మరోసారి రుజువు చేసింది. ఇద్దరినీ కిడ్నాప్‌ చేసి, హేమంత్‌ను కిరాతకంగా చంపేశారు. పలమనేరులో నిండు చూలాల్ని చంపిన తండ్రీ, మంచిర్యాల, గుంటూరు, ప్రకాశం ఇలా హర్యానా ఖాఫ్‌ పంచాయితీలు తెలుగు రాష్ట్రాల్ని, దేశాన్ని కమ్మేశాయి. ఇవి పరువు హత్యలే మాత్రం కావు. మూర్ఖత్వపు మూఢాచారాల పెంచి పోషించే వారందరూ ఈ హత్యలలో భాగస్తులే. ”కులాల పేరుతో హత్యలు చేసుకోవద్దు, కులాంతర వివాహాలూ సమర్దనీయం” ఈ విషయాన్ని 1955లో హిందూ కోడ్‌ బిల్లు ద్వారా అమోదించుకున్నాం. గత రెండు దశాబ్దాల్లో 44,412 హత్యలు ప్రేమ-పెళ్ళి వ్యవహారాల్లో జరిగాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. గ్రామాల్లో 30 శాతం, పట్టణాల్లో 20 శాతం కుటుంబాలు అంటరానితనాన్ని పాటిస్తున్నాయి. మొత్తం వివాహాల్లో కులాంతర వివాహాలు ఐదు శాతంలోపేనని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. బయటపడని కేసుల్ని లెక్కేస్తే వాస్తవ సంఖ్య అంతకన్నా ఎక్కువే !

అదుపులేని హింస

మధ్యప్రదేశ్‌కు చెందిన డిజి స్థాయి అధికారి పురుషోత్తం శర్మ వేరొక మహిళతో అభ్యంతకరమైన స్థితిలో ఉండటం భార్య చూశారు. దీంతో భార్యాభర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. అంతే ఆ అధికారి పనివాళ్ల ముందే ఆమెను అత్యంత దారుణంగా కొట్టారు. ఈ దృశ్యాలు సీసీ కెమేరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియోను వాళ్ల కుమారుడు పార్థ్‌ గౌతమ్‌ (ఐఆర్‌ఎస్‌) సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీనిపై హోంమంత్రి, ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులకు తండ్రిపై చర్యలు తీసుకోవాలనీ ఫిర్యాదు చేశారు. ఈ వీడియో వైరల్‌

కావడంతో ప్రభుత్వం స్పందించి, శర్మను తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయినా ఆ పెద్ద మనిషి బేఫికర్‌గా మీడియాతో మాట్లాడుతున్నాడు. నేను అంత హింసకు పాల్పడితే ఆమె నాతో ఇన్నేళ్లు ఎలా ఉండగలిగేదంటూ మీడియాకే ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు. పౌరుల రక్షణ బాధ్యత చూడాల్సిన ఆయనే భార్యపై హింస నేరం కాదంటూ సమర్ధించుకోవటం దారుణం. పురుషాధిక్యత, స్త్రీలపై హింస ఏ స్థాయిలో ఉందో, ఏ భావాలతో వర్థిల్లుతుందో చెప్పటానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణ. మహిళలపై గృహహింస కరోనా కాలంలో రెట్టింపయ్యాయని అనేక సర్వేలు ఇప్పటికే పేర్కొన్నాయి. అంతర్జాలం, మద్యం లైంగిక విశృంఖలతను పెంచి పోషిస్తున్నాయి.